Tuesday, February 24, 2009

తరుణ శశాంక శేఖర మరాళమునకు ....

శివరాత్రి పర్వదినం సందర్భంగా, (దాటిపోయిందనుకోండి, అయినా పరమేశ్వరుణ్ణి తలుచుకోటానికి వేళా పాళా అవసరమా ఏమిటి?) శివుణ్ణీ, పనిలో పనిగా శ్రీనాథుడినీ తలుచుకున్నారు ఇద్దరు బ్లాగ్మిత్రులు. ఉభయతారకంగా అటు పుణ్యము, పురుషార్థమూ. శుభం! ఇదే పని నేనూ చేద్దామని, తెలిసిన పద్యాలూ, వాటి గురించి ఆలోచిస్తే, చప్పున తోచిన పద్యం ఇదీ. తెనాలి రామకృష్ణ .... కాదు కాదు తెనాలి రామలింగకవిది.

తరుణ శశాంక శేఖర మరాళమునకు
సార గంభీర కాసారమగుచు
కైలాస గిరినాథ కలకంఠ భర్తకు
కొమరారు లేమావి కొమ్మయగుచు
సురలోక వాహినీధర షట్పదమునకు
ప్రాతరుద్బుద్ధ కంజాతమగుచు
రాజరాజప్రియ రాజకీరమునకు
మానిత పంజర స్థానమగుచు

ఉరగవల్లభ హార మయూరమునకు
చెన్ను మీఱిన భూధర శిఖరమగుచు
లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి
అద్రినందన బొల్చె విహారవేళ

నిండు యవ్వనంలో ఉన్నాడు మన రామలింగడు. చక్కని భార్య (కమల), ముచ్చటైన ఒక్కగానొక్క సంతానం, మాధవుడు. అప్పటికి తన కేరాఫ్ అడ్రెస్ తెనాలే. తెనాలి రామలింగేశ్వర స్వామి వరప్రసాదం కాబట్టి ఆయన పేరే కొడుక్కు పెట్టుకుని మురిసిపోయాడు గార్లపాటి రామన్న మంత్రి (తెనాలి రామలింగడి తండ్రి). స్వతహాగా శైవుడు. నందవరీకుల నియోగి బిడ్డ. చిన్నవయసు లోనే అపరిమిత పాండిత్యం సాధించేడు. కుమారభారతి అనిపించుకున్నాడు. సరే, అంతా బావుంది, అయితే అప్పటికి తన కష్టాలింకా గట్టెక్కలేదు. ఇంట్లో నూకలు నిండుకున్నాయి. తనేమో ఓ కావ్యం వ్రాయాలని పట్టుబట్టి అహోరాత్రాలు కృషి చేస్తున్నాడాయె. కావ్యం పూర్తయ్యే వరకూ ఎటూ కదలరాదని పంతం. అయితే సంసారం నడవాలిగా. ఇక తల్లి కలుగజేసుకుంది. "నాయనా, రామయ్య, తాటాకులు తేరగా వచ్చాయని ఎడతెరిపి లేకుండా అలా రాస్తూ కూర్చుంటే ఎలారా? పెద్ద పండుగ దగ్గరవుతుందిరా అబ్బాయ్. నీకు పట్టకపోతే మానె, కనీసం బిడ్డకైనా కొత్తబట్టలు పెట్టాలి కదరా. నీ కవిత్వాన్ని ఊరి పెద్ద రావూరి రంగారావు గారికి వినిపించి, సంసారం గట్టెక్కించరా" అంది. ఇక తప్పనిసరై, తన కావ్యం "ఉద్భటారాధ్య చరిత్రం" లో పై పద్యాన్ని ఏరి వినిపించాడు రంగారావు గారికి. రంగారావు గారేమో పాపం ఈ పద్యం లో వర్ణనలు జీర్ణించుకోలేకపోయాడేమో, " బాబూ నలుగురూ మెచ్చని రకంగా ఇలా వర్ణనలు గుప్పిస్తూ, సమాస భూయిష్టంగా రాస్తే వ్యర్థం" అని తేల్చేసేడు. అదే మంచిదయ్యింది రాముడికి. విద్యానగరానికి ప్రయాణం కట్టేడు. లింగడు కాస్తా కృష్ణుడయ్యేడు. రాయల వారి సభలో ఓ జటిలమైన సమస్యకు పరిష్కారం సూచించి, రాయల ప్రాపకం సంపాదించేడు. ఇన్ని వందల యేళ్ళ తర్వాత కూడా తెలుగు వాళ్ళ (తెలుగేమిటి, మొత్తం భారతదేశం అంతానూ) నోళ్ళలో నానుతున్నాడు.

ఆ పద్యం అర్థం ప్రయత్నిద్దామా?

శివపార్వతులిద్దరు హిమగిరి సానువులలో విహరిస్తున్నారు. ఆ విహార సమయంలో, లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి, పార్వతీ దేవి, పరమేశ్వరుడి పక్కన ఎలా (ఒప్పి) ఉన్నదంటే -పున్నమి చంద్రుని వంటి శేఖరమనే హంసకు మంచి నీటితో కూడిన లోతైన సరస్సు లాగా, కోకిల కూజితం లాంటి కంఠస్వరం ఉన్న భర్తకు, లేమావి కొమ్మ లాగా, సురలోకవాహిని - అంటే గంగ - గంగాధరమనే భ్రమరానికి, ప్రాతః కాలంలో పూచిన తామర లా (పొద్దున పూచిన పూలలో తేనె మెండుగా ఉంటుంది కదా), రాజరాజు (చంద్రుడికి రాజు) అనబడే రామచిలుకకు తనై తను ఒప్పుకుని చేరుకున్న పంజరంలా (మానిత పంజర స్థానము), ఉరగాన్నే హారంగా ధరించిన ఈశ్వరుడనే నెమలికి ఎత్తైన పర్వత సానువు లాగా (నెమళ్ళు పర్వత సానువులనే ఎక్కువ ఆశ్రయిస్తాయి కాబోలు).....ఇలా ఉందట.

(పైన అర్థం లో పొరబాట్లు విజ్ఞులు సవరించగలరు)

మామూలుగా మనం, ఔచిత్యం అనే పదం వాడుతుంటాం. ఆ ఔచిత్యం అంటే ఏమిటో బాగా అర్థం అవుతుంది ఈ పద్యం ద్వారా. మామూలుగా శివుడి రంగు తెలుపట, కాబట్టే తరుణ శశాంక శేఖర మరాళమయ్యాడు. ఆ తెలుపు రంగు శివయ్యకు కంఠం మాత్రం నలుపు. విషం మింగాడుగా. మరందుకే కైలాస గిరినాథ కలకంఠ భర్త అయ్యాడాయన. ఇక అమ్మవారో - లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి. భర్త కు తగిన ఇల్లాలు. అందుకే కాబోలు చిఱ్ఱు బుఱ్ఱులాడే ప్రియురాలిలాగా కాకుండా - అంటే - కలహంసకు కాసారంలా, కోకిలకు లేమావికొమ్మలా, తేనెటీగకు కంజాతంలా, రామచిలుకకు ఇష్టపడి బంధించుకున్న పంజరంలా ...ఇలా అందంగా, అనుకూలంగా ఉన్నది భర్త పక్కన.

ఆ శివయ్యా, లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి అమ్మవారు - బ్లాగ్లోకానికి శుభములు చేకూర్చు గాక!

(తెనాలి రామకృష్ణ సినిమాలో దృశ్యానికి, ముత్తేవి రవీంద్రనాథ్ గారు తెనాలి రామకృష్ణ కవి మీద వ్రాసిన సమగ్ర గ్రంథంలో కొన్ని అంశాలని జోడించి, కొంత ఊహతో రాసిన టపా ఇది)

16 comments:

 1. ఆ శివయ్యా, లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి అమ్మవారు - బ్లాగ్లోకానికి శుభములు చేకూర్చు గాక!
  .... దేవుళ్ళందరూ ప్రత్యేకంగా బ్లాగ్లోకానికి శుభాలు కలుగ చేయక్కరలేదు. కలుపు మొక్కల్ని వేరేస్తీ అంతే చాలు. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న మన తెలుగు బ్లాగ్లోకాన్ని పాతాళ లోకంలోకి అనగదోక్కకుండా ఉంటె అదే 20 వేలు.

  ReplyDelete
 2. ఎంతో చక్కగా వివరించారు. దన్యవాదములు.

  సురేష్

  ReplyDelete
 3. శివయ్య మీద మూడు అద్భుతమైన పద్యాలు భావాలతో చదివించారు. చంద్రమోహన్‌ గారికీ, కామేశ్వరరావుగారికీ, మీకూ.. ఇక్కడే కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.

  గిరిని పెకలించేటి పెంకితనమే ప్రీతి కలిగించెనా...
  నిన్ను కదిలించెనా
  పెనగులాడు కిరీటి సింగాణి శిరమంటి మురిపించెనా...
  మైమరపించెనా...
  నాకేవి పది తలలు ... లేవు గాండీవములు...
  దయచూపమంటూ కైమోడ్చి ఏడ్చే భక్తి
  పనికిరాదా మౌనమూర్తి...
  శివయ్య మీఅందరితోపాటు నన్నుకూడా కరుణిస్తే బాగుణ్ణు.

  ReplyDelete
 4. చక్కటి వివరణని ఇచ్చారు రవిగారూ. బావుంది.

  కానీ, ఈ పద్యానికి సీసం అంత అతకలేదేమో అనిపించింది!

  ReplyDelete
 5. చక్కటి వర్ణనతో కూడిన పద్యాన్ని ఎంపిక చేసి వివరించినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 6. రాఘవ గారు,

  అవునండీ. ఏదో చిన్న వెలితి. ఈ పద్యమే కాదు, రామకృష్ణ కవి పద్యాల్లో ఎక్కడో ఓ చోట ఓ చిన్న వెలితి అలా కనిపిస్తూ వచ్చింది. అయితే దీని మీద వ్యాఖ్యానించేంత (కనీసం ఎందుకీ వెలితి అని అర్థం చేసుకుందుకు కూడా తగిన) పాండిత్యం లేకపోవడంతో, ఇది నా ఊహ కాబోలు అనుకుంటున్నాను.

  ఇదే భావాన్ని మరో రకంగా, ఇంకా అద్భుతంగా చెప్పి ఉండవచ్చునేమో అని అనిపించింది మీ వ్యాఖ్య చూసాక.

  ReplyDelete
 7. తరుణ శశాంక శేఖరుడు అంటే నెలవంకని తలపై ధరించినవాడు, శివుడు అని అర్థం. శివుడనే హంసకి అని మొదటి పాదానికి అర్థం.
  రెండవపాదం మీరు చెప్పిన అర్థం సరిపోతుంది. మరొక అర్థం, "కల కంఠము" అంటే కోయిల. "కలకంఠ భర్తకు" అంటే మగకోయిల అని అర్థం వస్తుంది. "కైలాస గిరినాథ కలకంఠ భర్తకు" అంటే కైలాస గిరినాథుడు (మళ్ళీ శివుడే) అనే మగకోయిలకి అని అర్థం వస్తుంది. శివుడనే కొయిలవంటి భర్తకి అని కూడా అనుకోవచ్చు. కాని అప్పుడు మిగతా పాదాల కూర్పుతో సమత్వం కుదరదు. మిగతా పాదాల్లో అన్నిటా రూపకాలంకారం, ఇందులో మాత్రం ఉపమ అవుతుంది కాబట్టి.

  రాఘవగారు ఈ పద్యానికి సీసం ఎందుకతక లేదనుకున్నారో?

  ReplyDelete
 8. కామేశ్వరరావు గారు,

  "తరుణ శశాంక శేఖరుడు అంటే నెలవంకని తలపై ధరించినవాడు, శివుడు అని అర్థం. శివుడనే హంసకి అని మొదటి పాదానికి అర్థం."

  తరుణ శశాంక - అంటే పౌర్ణమి నాటి చంద్రుడు కదా - శివుడి నెత్తిపై ఉన్నది నెలవంక (తరుణ శశాంకం కాదు) కదా అని అనుమానం వచ్చింది, రాసేప్పుడే. తరుణ అన్న పదానికి మరో అర్థమేదయినా ఉందా? లేదా నెల వంక అంటే తరుణ శశాంకుడేనా?

  ఇదేదో చాలా లోతయిన పద్యం ఉన్నట్టుంది, మీరు అలంకారాల గురించి చెబుతుంటే.

  ReplyDelete
 9. రవిగారండోయ్... తెనాలివారు వ్రాసినవాటిలో ఏదో ఒకటో రెండో పద్యాలు ఇంకా బాగా వ్రాసి ఉండవచ్చు అని అనిపించినంత మాత్రాన రామకృష్ణయ్య కవనం గురించి అంత మాట అనేసారేంటండీ!!! ఉదాహరణకి ఏ సీసమో అనుకోండి ఏ శ్రీనాథుడితోనో లేదా ఏ రామరాజభూషణుడితోనో పోల్చుకున్నామనుకోండి అప్పుడు తేడా తెలుస్తుంది. అప్పుడు కూడా అది శ్రీనాథుడికి లేదా రామరాజభూషణుడికి సీసంపై ఉన్న పట్టు అవగాహన ప్రతిభ అనుకుంటాము కదా!

  ReplyDelete
 10. మన్నించాలి, వ్యాఖ్యగా వ్రాద్దామనుకుంటే అది వ్యాసంలా తయారైందని నా బ్లాగులో ప్రచురించాను... చూడండి. నెనరులు.

  ReplyDelete
 11. "ఈ పద్యమే కాదు, రామకృష్ణ కవి పద్యాల్లో ఎక్కడో ఓ చోట ఓ చిన్న వెలితి అలా కనిపిస్తూ వచ్చింది."
  ఈ స్టేట్మెంటు చాలా వింతగా ఉంది. ప్రబంధ రచన వెల్లి విరిసిన రాయల కాలానికి కొద్దిగా తరవాతి వాడు తెనాలి రామకృష్ణకవి. ఆయన పాండురంగ మహాత్మ్యం ప్రబంధాల్లోనే ప్రొఊఢమైన వాటిల్లో ఒకటని పండితుల అభిప్రాయం. ఉద్భాటారాధ్య చరిత్ర సాధకావస్థలో ఉన్నప్పుడు రాశాడు కాబట్టి పరిపక్వత రాలేదేమో అనుకునే ఆస్కారం ఉంది గానీ ఆయన మొత్తం కవిత్వం మీద ఇటువంటి ఆరోపణ ఇదే వినడం.

  ReplyDelete
 12. కొ.పా గారు, రాఘవ గారు, నా వ్యాఖ్యనేదో స్టేట్మెంట్ లా తీసుకొని, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇది ఆరోపణ కాదు, అక్షేపణ అంతకన్నా కాదు. నాకు అనిపించిన చిన్న ఫీలింగు మాత్రమే. (దీనికి కారణం ఈ సారి ఎప్పుడైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను). ప్రస్తుతానికి మాత్రం నా వ్యాఖ్యను వెనక్కి తీసేసుకుంటున్నాను.

  ReplyDelete
 13. రవిగారు,

  తరుణ అంటే లేత అనే అర్థం కూడా ఉంది. లేతగా ఉండే చంద్రుడిది నెలవంక రూపమే కదా.
  ఈ పద్యంలో మరీ లోతులేమీ లేవులెండి.
  కొత్తపాళిగారు, మీరన్నట్టు ఉద్భటారాధ్య చరిత్ర సాధకావస్థలోది కాబట్టి ఈ పద్యంలో అంత ప్రౌఢత్వం కనిపించదు. పాండురంగ మాహాత్మ్యం ప్రౌఢకావ్యమే అయినా (కాబట్టి), అందరికీ నచ్చకపోవచ్చు!

  ReplyDelete
 14. రవి గారు,

  మీ సీస పద్య పరిచయానికి చాలా నెనర్లు. దీనిని వేంటనే నా సీస పద్యాల పుస్తకంలో కాపీ పేస్టు చేసుకోవాలి :) అదీను నా పుస్తకంలో శివుని మీద సీసాలు లేని వెలితిఁ దీర్చారు.

  పద్యం అద్భుతంగానుంది. పాదానికో అలంకారం గుప్పారు కవిగారు. అదీ ఒకటి రూపకం ఇంకోకటి ఉపమా మార్చిమార్చి. అలా మొదటి పదిలైన్లలో పదలంకారాలు గుప్పించారు. అద్భుతం. (కొందరికి ఉపమా లేదని అనిపించవచ్చు, అన్నీ రూపకాల్లా. నా దృష్టిలో ముందు శివుడే హంస అన్నాడు కాబట్టి రూపకం, హంసకు సరస్సుకు ఉన్న సంబంధం శివపార్వతుల సంబంధం వంటిది అన్నాడు కాబట్టి ఉపమా. అయినా పేరులోనేముంది లెండి.) ఈ పద్యం రెండు విధాలా అద్భుతంగా వుంది. అటు పద్యశిల్పనైపుణ్యంలోనూ ఇటు అలంకారసౌందర్యంలోనూ.
  నా దృష్టిలోనిది మోస్ట్ పెర్పెక్ట్ సీసం :)

  పద్యం అర్థమవ్వడానికి చాలా సేపు పట్టినా, మీ మఱియు భైరవభట్ల వారి వలన బాగా అర్థమయ్యింది.

  నేనూ శివరాత్రికి ఒక శివపద్యం వ్రాద్దామనుకున్నాను కానీ ఏవో పెళ్ళిపనుల్లోనుండి వ్రాయలేదు. అంతే శివుడి భాగ్యం అనుకొని వదిలేశాను ;)

  ఇంకొకటి - బ్రౌణ్యంలో తరుణ అంటే యవ్వన (ఇంకా తరుణం మిగిలివున్న) అని అర్థం చూసి నేను 'తరుణ శశాంక' అంటే నెలవంక అని అర్థంచేసుకున్నాను.

  రాకేశ్వర

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.