Tuesday, April 22, 2008

(తెలుగు)ఉగాది నుండీ (తమిళ)ఉగాది వరకూ..

(గత టపా తరువాయి)

తెలుగు ఉగాది నాడు మొదలయిన నా సినిమా కష్టాలు మరో వారం రోజులు కొనసాగాయి. ఆ వారం రోజుల్లోనూ, రకరకాల మలుపులు. మా క్లయింటు మళ్ళీ బొక్కలు కనిపెట్టడం, వాటిని మేము మళ్ళీ ఇవి బొక్కలు కావు అనడం, ఆఖరుకు వాటిని పూడ్చడం. ఈ మధ్యలో ఆ క్లయింటు మా పాస్ పోర్ట్ లు స్వాధీనం చేసుకుని మాతో దోబూచులాడాడు.

యెట్టకేలకు 10 వతేదీ ఆ శుభముహూర్తం వచ్చింది. మా ప్రాజెక్ట్ కు అప్రూవలు లభించింది. అప్రూవల్ లెటర్ టైపు చేసిన తర్వాత, అందులో సంతకం పెట్టడానికి అక్కడి మానేజరు లేడు! వాడి కోసం సాయంత్రం వరకు చాతక పక్షుల్లా ఎదురు చూపు.

ఈ తంతు రాత్రి 11:00 కి ముగిసింది. మా టికెట్లు 13 వ తేదీ బుక్ చేయించుకున్నాం. (మా పాస్ పోర్ట్ లు మాత్రం ఇంకా వాడి వద్దే వున్నాయ్ సుమా)

2 రోజులు ఆనందం గా గడిచాయి.

ప్రయాణానికి ముందు రోజు., పాస్ పోర్ట్ ల కోసం క్లయింటు దేవుడికి ఫోను చేసాం. "ఫోను అవుట్ ఆఫ్ రీచ్ " అంటూ, అరబిక్ లో తీయని కంఠ స్వరం. మళ్ళీ చమట్లు పట్టాయ్ మాకు.

మళ్ళీ వేట మొదలయ్యింది. ఆఫీసుకు వెళ్ళాం. అక్కడ కాసేపు వెతికిన తర్వాత కనబడ్డాడతను. మీరు ఈ దేశం వదలడానికి కావలసిన ఫార్మాలిటీస్ అన్నీ ముగిసాయ్, కేవలం ఓ లెటర్ ఒక్కటి మిగిలుంది, మీరు ఇక్కడ మా కంపనీ లో పని కోసం వచ్చినట్టుగా ఓ ప్రూఫు తీస్కెళ్ళండి అన్నాడు.

ఆ లెటర్ నిండా తప్పులే. మా పాస్ పోర్ట్ నంబర్లనీ వెనుకనుండీ టయిపు చేసారు. పైగా తప్పులు. పైగా లెటర్ అంతా అరబిక్ భాష లో రాసారు!

సరే, ఎలానో ఆ లెటర్ తోటి బయట పడి, మరుసటి రోజు భారత దేశానికి తిరుగు ప్రయాణం అయ్యాం.

ఇంకా కథ కంచి కి చేరలేదు!

మేము బయలు దేరిన విమానం గల్ఫ్ ఎయిర్ సంస్థది. బహ్రైన్ అనే దేశానికి వెళ్ళి, అక్కడి నుండీ బెంగళూరు కి ఇంకో విమానం ఎక్కాలి.

బహ్రైన్ నుండీ బెంగళూరు కి ప్రయాణికులందరూ ఎక్కారు. ఐతే, ఆ ప్రయాణికుల చిట్టాలో నా పేరూ, నా మిత్రుడి పేరూ లేవు! కాస్సేపు ఎవరెవరికో ఫోన్లు చేసారు వాళ్ళు. తర్వాత తెలిసిందేమంటే, వాళ్ళ సర్వరు లో ఏదో లోపమట!

అలా ఆ ప్రహసనం ముగిసింది.

14 వతేదీ ఉదయం మా వూరికి వెళ్ళాను. ఆ రోజు రామనవమి. మా ఇంటి దగ్గర 'ఉట్ల మాను నిలబెట్టారు '. ఉట్ల పరుష అంటారు దీన్నే. ఓ కొయ్య స్థంభాన్ని నేలలో నాటుతారు. తాళ్ళతో అన్ని వైపుల నుండీ బలంగా ఆ స్థంభాన్ని కట్టి లాగి ఉంచుతారు., కింద పడి పోకుండా. ఆ స్థంభానికి బురద పూయబడి ఉంటుంది. కింద నీళ్ళతో చిన్న పూల్. కుర్రాళ్ళు ఆ కొయ్య స్థంభం పైకెక్కి పైన కట్టబడి వున్న డబ్బుల మూట చేజిక్కించుకోవాలి. అదీ ఆట. ఒకడు పైకెక్కుతుంటే ఇంకొకడు కింద నుంచీ బురద మన్ను, నీళ్ళతో కలిపి చల్లడం.. ఇలా ఎంతో ఉత్సాహంగా సాగుతుంది ఈ తంతు.

కృష్ణాష్టమి ఉట్టి కొట్టడం గుర్తొస్తుంది కదూ!

ఆ రోజే తమిళులకు ఉగాది రోజు కూడాను. మా పిన్ని ఇల్లు అటు తెలుగు, తమిళ సంస్కృతుల మిశ్రమం. రామనవమి పానకం, వడపప్పు తో పాటుగా వడలూ ఓళిగలు, మావిడి కాయ పప్పు, మునగ సాంబారు !

తెలుగు ఉగాది మిస్ అయితేనేం, తమిళ ఉగాది + రామనవమి అలా పలుకరించాయ్ నన్ను.

4 comments:

 1. హమ్మయ్య! మొత్తానికి చేరారన్నమాట.
  ఏమి ఆన్‌సైటు తిప్పలండీ బాబూ మీవి.

  ReplyDelete
 2. :)

  ఉట్లమానును తపిశమాను అనో తపస్సుమాను అనో కూడా అంటారు కదా?

  ఉట్లమానును నిలబెట్టడాలు కొన్నిచోట్ల ఇంకా జరుగుతున్నాయన్నమాట! పల్లెల్లోకి రాజకీయాలొచ్చి జనాన్ని చీల్చిన తరువాత యిట్లాంటి సంబరాలు దాదాపుగా అన్నీ మాయమైపోయాయి. :(

  ReplyDelete
 3. అటు ఉదర పోషణార్ధం విదేశ సంచార విశేషం, ఇటు ఇంటి దగ్గర చక్కట్ సాంప్రదాయ సౌరభం - చాలా బాగుంది.

  ReplyDelete
 4. ప్రవీణ్ గారూ,
  ఇక్కడ ప్రతీ ఆన్సైటు ఓ (చేదో, పులుపో, తీపో, లేక అన్నింటి మిశ్రమమో) అనుభవమే.

  రానారె గారు,
  ఉట్ల మాను నేనూ, చాలా రోజుల తర్వాతనే చూడ్డం. నా చిన్నప్పుడు ప్రతీ సంవత్సరం జరిగేది. కొన్ని యేళ్ల తర్వాత మళ్ళీ చూస్తున్నాను. మా వూరు అనంతపురం. పట్నమే. పల్లెల్లో సంగతి నాకూ అంతగా తెలీదు. ఇక తపశిమాను అనే టైటిల్ .. ఎక్కడో విన్నట్టు గుర్తు, ఖచ్చితంగా తెలీదు.

  కొత్తపాళీ గారు,
  బాగా చెప్పారు.

  ఇక జ్యోతమ్మ కి, విహారి గారికీ ధన్యవాదాలు (ఆల్ రెడీ చెప్పాను, ఇంకో సారి).

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.