Sunday, September 23, 2007

ఓ భేతాళ కథ

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు పై నుండి శవాన్ని దించి, భుజాన వేసుకుని యెప్పటి లానే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవం లో వున్న భేతాళుడు ఇలా అన్నాడు. " ఓరేయ్ దరిద్రుడా, రోజు సాయంకాలం నన్నెందుకిలా హింసిస్తావు ? చచ్చిన తర్వాత కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు కదరా. ఓ రాజ్యానికి రాజువై వుండీ నీకిదేం పోయే కాలం ? ఏం సాధించాలని నీ ఆరాటం? సరే, నువ్వెలానూ మారవు కానీ, టైం పాస్ కోసం ఒక చిన్న కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను."

రాంబాబు, రాఘవ్, మురుగన్ చిన్నప్పటి నుండీ ఒకే వీధిలో పెరిగారు. పైగా ఇరుగు పొరుగులు. వీళ్ళు ముగ్గురు మిత్రులే, కానీ చాల మంది ఇరుగు పొరుగుల్లాగే, వీళ్ళ తల్లితండ్రులకు వాళ్ళ తల్లితండ్రులకూ ఒకరంటే ఒకరికి విపరీతమయిన అసూయ, కోపం, వగైరా..అస్సలు పడేది కాదు.

రాంబాబు ఒక రూపాయ (పదహారు అణాలు) ఆంధ్రుడు. పైగా సీమ సిం హం.

రాఘవ్ వురఫ్ రాఘవేంద్ర అలియాస్ బిసిబేళా బాత్ ఓ రూపాయ పావలా కన్నడ కస్తూరి. కస్తూరి అంటే అదేదో టైపు జింక అట. జింకల గురించి పూర్తి వివరాలకు సులేమాన్ ఖాన్ , ఛ, సారీ, సల్మాన్ ఖాన్ ను అడిగి కనుక్కో.

మురుగన్ గన్ను షాట్ గా ఓ రూపాయ న్నర తమిళ పులి.

"అంటే ముగ్గురు జంతువులే అంటావ్" అన్నాడు విక్రమార్కుడు మధ్యలో కల్పించికుని, తన జోకు కి తనే మురిసి పోతూ.

"రేయ్, అష్ట దరిద్రుడా, ప్రశ్నలు వెయవలసింది నేను. అదీ కథ ఆఖరున. కాబట్టి నోరు మూసుకుని విను. " భేతాళుదు కసిరి, మళ్ళీ కంటిన్యూ చేసాడు.

మిత్రులు ముగ్గురు చదువులలో అబవ్ ఆవరేజీ నే అయినా, ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ లో మిగతా వారికంటే ఆధిక్యత చూపేవారు.

రాంబాబు గణితం లో కొద్దిగా తెలివితేటలు కనబర్చేవాడు. రాఘవ్ ఇంగ్లీషు లో. మురుగన్ మాత్రం ఎలా, ఏం చేసే వాడో తెలీదు, మిగతా ఇద్దరికంటే యెక్కువ మార్కులు సంపాదించేవాడు., అంటే ఇతని తెలివి, విషయాన్ని ప్రదర్శించడం లో కనబడేది.

ఇలా ఈ ముగ్గురు మిత్రులూ, పెరిగి, కాలేజీ వరకు వచ్చారు. రాంబాబు ఎంసెట్ కొట్టాలని ప్రయత్నించాడు, కానీ ఎంసెట్టే తిరిగి తనను కొట్టడం తో, ఏదో ఓ డిగ్రీ కాలేజీ లో చేరాడు.

రాఘవ్ డొనేషన్ సీట్ లో ఇంజినీరింగు లో చేరాడు.

మురుగన్ వాళ్ళ నాన్నకు తమిళ నాడు ట్రాన్స్ ఫర్ అవడం తో తమిళ నాడు వెళ్ళి అక్కడ ఎదో ప్రొఫెషనల్ కోర్సు లో చేరాడు.

ముగ్గురూ, వాళ్ళ చదువులు ముగించి, వుద్యోగాల వేట లో పడ్డారు. మురుగన్ వాళ్ళ నాన్న ప్రభుత్వం లో వున్నతోద్యొగి కావడం తో, మురుగన్ ను ఎలాగో, ఎదో, సర్వీసు లో ఇరికించేడు.

రాఘవ్, చదువు ముగించి, నగరానికి వెళ్ళి, ఏదో కోర్సు చేసి, అవస్థలు పడి, చివరికి, తన ఆంగ్ల భాష ప్రతిభ తో, ఓ సాఫ్ట్ వేరు కంపనీ లో చేరాడు.

అయితే రాంబాబు అవస్తలు మాత్రం బాగా కొనసాగాయి. ఆంగ్ల భాష ప్రతిభ అంతంత మాత్రం కావడం తో, ఇంటర్ వ్యూ లో, ఎక్కడ అడుగు పెట్టినా హెచ్ ఆర్ వారు, కమ్మ్యూనికేషన్ స్కిల్స్ లేవు అంటూ విదల్చి కోట్టే వారు. గణితంలో తన ప్రతిభ అపారం అయినా, గుర్తించే వారు లెక పోవడం తో, బాగ నిస్పృహ చెందే వాడు.

ఇలా 3, 4 యేండ్లు అవస్థ పడిన తర్వాత, యేదో, చిన్న కంపనీ లో డబ్బులు కట్టి ఎక్స్పీరియన్సు లెటర్సంపాదించేడు. ఆ లెటర్ తోటే, ఎడొ, అమెరికన్ కంపనీ లో, వుద్యోగం సంపాదించి, H1 ప్రాసెస్స్ చేయించుకుని, అమెరికా చెక్కేసాడు. అక్కడ వెళ్ళిన తర్వాత తన దశ తిరిగింది. తన ప్రతిభ కు గుర్తింపు వచ్చింది. అంచెలంచెలు గా ఎదిగేడు.అమెరికా లోనె సెటిల్ అయ్యడు.

మురుగన్, రాఘవ్, వాళ్ళ వాళ్ళ కంపనీలలోనే కొనసాగుతూ, సీనియర్ పొసిషన్స్ కు చేరుకున్నారు.

చాల కాలం తర్వాత ముగ్గురు మిత్రులూ, కలుసుకున్నారు, అదీ వుద్యోగ సంబధంగా. రాంబాబు కంపనీ, ఓ టెక్నాలజీ లో మోనోపోలీ. రాంబాబు కంపనీ ఇండియా వ్యవహారలు రాఘవ్ కంపనీ వారు చూస్తారు. రాఘవ్ దానికి ఇన్ చార్జి. మురుగన్ పని చేసే, ప్రభుత్వ సర్వీసుకు ఈ టెక్నాలజీ అవసరం. ఇలా ముగ్గురు కలుసుకున్నారు.

రాంబాబు, ఇద్దరినీ అప్యాయంగా పలకరించేడు. రాఘవ్ బాగ సంతోష పడ్డాదు, అయితే ఎదో మూల జెలసీ. మురుగన్ కు మాత్రం రాంబాబు ఎదుగుదల అస్సలు రుచించలేదు.

భేతాళుడు కథ ముగించి, విక్రమార్కుడిని ఇలా అడిగాడు.

"రాజా! ముగ్గురి లోనూ నిజాయితీ పరుడెవ్వడు ? ముగ్గురిలోనూ, మంచి పొసిషన్ ఎవరిది? రాంబాబు ఇలా వక్రమార్గం లో ఎదగడం తప్పు కాదా? రాఘవ్ రాంబాబు ను చూసి ఎందుకు అసూయ చెందాడు? ఈ ప్రశ్నలకు తెలిసీ జవాబు చేప్పక పొయావో, నీ తల వేయి వ్రక్కలవుతుంది"

దానికి విక్రమార్కుడిలా బదులిచ్చాడు.

"నిజాయితీ విషయానికి వస్తే ముగ్గురూ నిజాయితీ పరులు కారు. ఎందుకంటే, మురుగన్ వుద్యోగం తన ప్రతిభ తో సంపాదించింది కాదు. రాఘవ్ ప్రతిభ కు కారణం కూడా, డబ్బు. రాంబాబు సంగతి తెలిసిందే. అయితే ముగ్గురిలోకీ నిజాయితీపరుడు నిస్చయంగా రాంబాబు. ఎందుకంటే, తను వెరే మార్గం లేక ఇలా ఎదిగాడు. యెదిగిన తర్వాత తన మిత్రులను చూసి, అసూయ చెందక పోవడం అతని ఔన్నత్యానికి నిదర్శనం. రాంబాబు ఇలా ఎదగడానికి పరిస్తితులే కారణం, కాబట్టి తప్పు లేదు. ఇక రాఘవ్ అసూయ కు ఒక కారణం, ఒకే రకమయిన పని లో స్థిరపడడం, రాంబాబు లా జీవితం లో భిన్నమైన అనుభవాలను చూడలేకపోవడం, అంతే. ఇక ముగ్గురిలో వుద్యోగ పరంగా అయిటె వున్నతమయిన స్థానం మురుగన్ దె. నిలకడయిన వుద్యోగం, ఇంకా ఎన్నో అదనపు సౌకర్యాలు కూడాను."

రాజు కు ఇలా మౌన భంగం కాగానే, భేతాళుడు, వీడు మళ్ళీ రేపు సాయంకాలం నన్ను పీక్కు తింటాడు కదా అనే విసుగుతో, విక్రమార్కుడిని, అమ్మనా బూతులు తిట్టుకుంటూ, తిరిగి చెట్టెక్కాడు.

(కేవలం నవ్వుకోడానికి మాత్రమే. ఎవ్వరినీ నొప్పించడం వుద్దేశం కాదు.)

5 comments:

 1. మీ భేతాళ కథని భేతాళ కథలు చెయ్యండి. చాలా బాగుంది. ప్రస్తుత పరిస్తుతుల్ని సెటైరికల్ గా బాగా సెలవిచ్చారు. కానీ విక్రమార్కుడి సమాధానం అంతగా రుచించలా ... ఇంకొంచెం వివరం కావాలేమో.

  ReplyDelete
 2. మురళీ కృష్ణ గారు, మీ సలహా గుర్తుంచుకుంటాను. నాకు ప్రశ్నలు కూడా ఇంకా బాగా రాసుండాలేమో అని అనిపిస్తుంది. ఇక పై ప్రయత్నిస్తాను.

  ReplyDelete
 3. అవునండీ రవిగారూ, మురళీ గారు అన్నట్టు, ప్రస్తుత పరిస్థితులను వర్ణిస్తూ ధారావాహికంగా "నేటి భేతాళ కథలు" గా ప్రచురిస్తే బావుంటుంది.

  ReplyDelete
 4. రాంబాబు ఎంసెట్ కొట్టాలని ప్రయత్నించాడు, కానీ ఎంసెట్టే తిరిగి తనను కొట్టడం తో...హహ్హహహ్హ! కథలు బాగున్నాయి.

  ReplyDelete
 5. please inka continue cheyyandi. chala baga blagadistunnaru.
  ALL THE BEST

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.