Sunday, May 3, 2015

RSVP స్మృతులు....1

2010 వైశాఖ మాసం (మే నెల)
మంచినీళ్ళ గుట్ట,
రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠము,
తిరుపతి.
ఎం.ఏ ఎంట్రన్సు పరీక్షకు ముందు రోజు.

తిరుపతి లో అలిపిరి కి పోయేదారిలో రామకృష్ణా డీలక్సు అన్న బస్ స్టాప్. దానికి ఎదురుగా ఉన్న ఒక సందులోపలికి వెళితే రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం బోర్డు, ప్రవేశద్వారమూ కనిపిస్తాయి. 

లోపలికి వెళ్ళగానే బాటకు రెండువైపులా చెట్లూ, వరుసగా చిన్న చిన్న బోర్డులపై వ్రాయించిన సంస్కృత సూక్తులూ కనిపిస్తాయి. అదుగో, ఆ కాంపస్ లో ఒకానొక సిమెంటు బెంచి పైన ఆ నాడు భవదీయుని తిష్ట.

సంస్కృతంలో ఆచార్య కోర్సు చేయాలంటే డిగ్రీలో సంస్కృతం ఒక సబ్జెక్ట్ గా చదివిఉంటే ప్రవేశం మామూలుగా, ప్రవేశపరీక్ష లేకనే దొరుకుతుంది. లేదంటే ఎంట్రన్సు రాయాలి. ఆ ఎంట్రన్స్ కోసమే ఆ రోజక్కడ మకాం.. 

"భవానపి ఆచార్య ప్రవేశపరీక్షాసార్థం ఆగతవాన్ వా?"  - పక్కన ఒక గొంతు వినిపించింది. (మీరు కూడా ఆచార్య - ఎంట్రన్స్ కోసం వచ్చారా?) - సమాధానం తెలుగు, ఇంగ్లీషు, తమిళ, కన్నడ, హిందీ లలో తెలుసు. కాస్త తడుముకుంటే మలయాళ, మరాఠీల్లో కూడా. సంస్కృతంలో తెలియదు. ఆ భాషలేవీ వాడకుండా మౌనంగా తలూపాను. ఆ పలుకరింపు మెల్లగా సంభాషణ, తర్వాత స్నేహానికీ మళ్ళింది.

ఆ వచ్చినాయన తమిళాయన వెంకట్రామన్ గారు. చూస్తూనే గుర్తుపట్టవచ్చు. తమిళనాడు లో తిరునెల్వేలి వాస్తవ్యులు. ఐసీఐసీఐ బేంకులో మేనేజరుగా రిటయిర్ అవబోతున్నారు (2010 మాట. ఇప్పుడు పదవీవిరమణ చేశారు). అంతేకాదు, ఆయన గొప్ప తమిళభాషాభిమాని, కవీ కూడానూ. ఆ వివరాలు తెలియగానే నేను ఆయనతో మొహమాటం లేకండా తమిళంలోకి దిగిపోయాను. 

అంతలో తలపైన కొప్పుతో ఒక యువకుడు మా దగ్గరకు వచ్చాడు. ఆ అబ్బాయి వృత్తిరీత్యా పురోహితుడు. తమిళుడు,  బెంగళూరు నివాసి. శబరిగిరీశన్ - అతడి పేరు. చాలా వినయశీలి. తెలివితేటలు పైకి కనబర్చని వ్యక్తి. - ప్రతిభను పైకి చెప్పుకోకుండా, డబ్బా కొట్టుకోకుండా ఉండేవాడిని సంస్కృతంలో "అ-వికత్థనుడు" అంటారు. వికత్థనుడంటే - డబ్బా కొట్టుకునేవాడు. సంస్కృతకావ్యాల్లో (ముఖ్యంగా డ్రామాలలో) హీరోలను నాలుగు విధాలుగా విభజిస్తారు. అందులో మొదటి టైపు - ధీరోదాత్తుడు. ఆ ధీరోదాత్తుని లక్షణాలలో "అవికత్థనత్వం" ముఖ్యమైనది.  అందుకు ఉదాహరణ - రాముడు. 

ఎంట్రన్స్ - తర్వాతి రోజు కాబట్టి ఈ రోజుకు ఏదైనా వసతి దొరుకుతుందేమోనని ముగ్గురం కలిసి ఆ పక్కనే ఉన్న హాస్టల్ కు దారితీశాం. సెలవులు కాబట్టి విద్యార్థులు పెద్దగా లేరు. అక్కడ ఒక పెద్ద హాలులో ఉండవచ్చన్నారు. భోజనం అక్కడే. వసతీ భోజనం కలిపి రు. 50/-. 

ప్రవేశపరీక్ష నూరుమార్కులకు. అందులో రెండు సబ్జెక్టులు. ఆ సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాలను కూడా యూనివర్సిటీ వారే పంపిస్తారు.

మొదటి సబ్జెక్టు - ప్రతాపరుద్రీయం అనే పుస్తకంలో రెండు ప్రకరణాలు. కావ్యప్రకరణం, నాయకప్రకరణం. 
రెండవసబ్జెక్టు - సంస్కృతసాహిత్యచరిత్ర - ఇందులో తిరిగి రెండు ప్రకరణాలు. వైదిక సాహిత్యం, లౌకిక సాహిత్యం. 

ప్రతాపరుద్రీయం అనే లక్షణగ్రంథాన్ని రచించినది విద్యానాథుడనే ఆంధ్రకవి. ఈయనకు అగస్త్యుడు అని మరొక పేరు. ఈ క్రింది పద్యం చాలామంది తెలుగు వాళ్ళకు తెలుసు.

నానాసూనవితాన వాసనల నానందించు సారంగమే
లా నన్నొల్లదటంచు గంధఫలి బల్ కాకన్ తపంబంది యో
షా నాసాకృతి తాల్చి సర్వ సుమన స్సౌరభ్య సంవాసియై
పూనెన్ ప్రేక్షణమాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్.

తుమ్మెద తనపై వాలట్లేదని కోపంతో సంపంగిపువ్వు అడవిలో తపస్సు చేసింది. తప:ఫలంగా అందమైన అమ్మాయి ముక్కుగా అవతరించింది. ఆ ముక్కు(సంపెంగ)కు రెండువైపులా తుమ్మెదలు కళ్ళ రూపంలో బారులు కట్టాయి. 

పై పద్యానికి సంస్కృతమాతృక ఇది. 

భృంగానవాప్తి ప్రతిపన్నభేదా, కృత్వా వనే గంధఫలీతపోऽలమ్ |
తన్నాసికాऽభూదనుభూతగంధా స్వపార్శ్వనేత్రీకృతభృంగసేవ్యా ||

ఈ సంస్కృతశ్లోకం రచించిన కవి అగస్త్యుడు/విద్యానాథుడు. ఈయన కావ్యం ప్రతాపరుద్రీయం - ప్రతాపరుద్రుడిని పొగడ్డానికి రచించినట్టుగా ఉంటుంది. దాదాపు ప్రతి ఉదాహరణా - ప్రతాపరుద్రుని గుణగణాలను ప్రశంసిస్తూనే ఉంటుంది. ఇందులో నాయకప్రకరణం - సులభం. కావ్యప్రకరణం - కష్టం. 

ఇక సంస్కృతసాహిత్యచరిత్ర - ఇందులో వైదిక సంస్కృత విభాగంలో వేదాలు, అరణ్యకాలు, సంహితలూ, పురాణాలూ, ఉపనిషత్తులూ, దర్శనాలూ,  రామాయణమూ, మహాభారతమూ - వీటి సంగ్రహం. ఇది మొదటి చాప్టరు. లౌకిక సంస్కృతం లో పంచమహాకావ్యాలూ, ఇతర కావ్యభేదాలూ, కవులూ, కవిహృదయాలూ, వారి కాలాదులూ వగైరా.

వేంకట్రామన్ గారికి, శబరిగిరీశన్ కూ (ఆ మాటకొస్తే చాలామందికి) వైదిక సంస్కృతం గురించి బాగా తెలుసు. లౌకిక సంస్కృతం గురించి అస్సలు తెలియదు. నాది పూర్తిగా రివర్సు వ్యవహారం. కాళిదాసు, మాఘుడు, సంస్కృత డ్రామాలు వీటి గురించి నాకు మంచి పరిచయం ఉన్నది. మరొక విషయమేమంటే - వెంకట్రామన్ గారు, కాస్తో కూస్తో తప్పులు లేక సంస్కృతంలో అనాయాసంగా మాట్లాడగలరు, వ్రాయగలరు. ఆ రెండు యోగ్యతలూ నాకు లేవు (ఇప్పటికీ).

మేం ముగ్గురం తెలిసిన సబ్జెక్టులన్నీ తిరగేశాం. వెంకట్రామన్ గారు శుక్లయజుర్వేదం గురించీ, పురాణాలను గుర్తుంచుకోవడానికి ఉన్న శ్లోకం (పద్వయం, మద్వయం...ఇలా ఏదో) చెప్పారు. అలాగే నాయకప్రకరణం కూడా తిరగేశాం. భోజనాల వేళయ్యింది. తిరుపతి లో చాలా చోట్ల అన్నం దైవప్రసాదంగా భావిస్తారు. ఆ సంస్కృత హాస్టల్లోనూ అంతే. ఆ భావనలోని మాధుర్యమో, లేక ఆ రోజు విశేషమో తెలియదు కానీ, కేవలం ఒక నంజుడు, పప్పు, చారులతో వడ్డించిన ఆ భోజనం రుచి ఈ నాటికీ కూడా గుర్తొస్తూనే ఉంటుంది.  

కాంపస్ లో నేరెడు చెట్లెక్కువ. హాస్టల్ మధ్యలో కూడా ఒక నేరెడు చెట్టు ఉంది. విరగకాసి ఉన్నదది. విద్యార్థుల్లో ఒకరిద్దరు - ఆ చెట్టు పై చేరి కొమ్మల్ని అల్లలాడిస్తూన్నారు. నేరెడు పళ్ళు జలజల రాలుతున్నాయి. సంస్కృతంలో నేరెడు పండు పేరు జంబూ ఫలం. జంబూఫలమంటే - బాణభట్టు ఛప్పున గుర్తొస్తాడు. కాదంబరి కావ్యం గుర్తొస్తుంది.

అదొక చిలుక. ఆ చిలుక మాట్లాడగలదు. ఎవరో ఒక గిరిజన యువతి ఆ చిలుకను పట్టుకుని మహారాజు శూద్రకునికి బహూకరించింది. ఆ చిలుకకు రాజు అతిథిమర్యాదలు ఘనంగా జరిపించాడు. మరుసటి రోజు కుశలమడుగుతూ రాజు చిలుకను - భోజన కార్యక్రమాదుల గురించి అడిగేడు. ఆ చిలుక చెబుతుంది - "ఆమత్త-కోకిల-లోచనచ్ఛవిర్నీలపాటలః-కషాయమధురః-ప్రకామమాపీతో-జంబూఫలరసః" - కైపెక్కిన కోకిల కళ్ళలా నలుపూ ఎఱుపూ కలిసి, కాస్త వగరూ, తీపి కలిసిన నేరెడు పళ్ళ రసం ఇచ్ఛ వచ్చినంత సేపు త్రాగాను మహారాజా.. అంటూ సాగుతుంది. నేరెడు పళ్ళంటే "నెయ్యములల్లో నేరెళ్ళో.." అన్నమయ్యా గుర్తొస్తాడు.

సాయంత్రం మరొక యువకుడు వచ్చాడు. అతని పేరు సోను. గుజరాత్ నుంచి వచ్చాడు. ధారాళంగా సంస్కృతం మాట్లాడగలడు. అయితే పుస్తకజ్ఞానం అంతగా లేదు. అతడికి కూడా వైదిక సంస్కృత చరిత్ర బాగా తెలుసు. 

నలుగురితో ఇలా ఆ రోజు గడిచింది.  తర్వాతి రోజు దాదాపు అరవై మంది సంస్కృతప్రవేశపరీక్ష వ్రాశారు. సోనూ సంగతి తెలియదు. మిగిలిన మా ముగ్గురికీ సీటు వచ్చింది. ప్రవేశపరీక్ష మార్కులు - విశ్వవిద్యాలయం వారు చెప్పరు. అంచేత తెలియదు. తెలియకపోవడమే మంచిది. :)

విద్య - అనేది నీలో ధైర్యాన్ని, జీవితం పట్ల ఆశనూ, అనురక్తినీ పెంచాలి అని వివేకానందుడు.  డబ్బుకోసమూ, కీర్తి కోసమూ, మరే కక్కుర్తి కోసమూ కాకుండా,బిచ్చమెత్తుకు బతకవలసి వచ్చినా సరే, తనకు మనసులో ఇష్టం ఉన్న విషయం వైపుగా అధ్యయనం సాగించే అదృష్టం బహుశా చాలా గొప్పది. అదే బహుశా నిజమైన చదువు అని నా విశ్వాసం. అది ఎలానూ మనకు లేదు. 

భవదీయుడు అలా ఆ రెండు రోజులు అక్కడ ఉండటానికి - దైవప్రేరణ, సహృదయుల ప్రోత్సాహం, తోడ్పాటు, సహధర్మచారిణి ప్రోద్బలం, అక్కడ పరిచయమైన మిత్రులద్వారా అప్పటికప్పుడు నేర్చుకున్న కొన్ని ముక్కలూ - ఇవి మాత్రమే నిజమైన కారణాలు. ఇది నిజంగా నిజం. మిగిలినదంతా నిమిత్తమే.

RSVP నుంచి మరుసటిరోజు వచ్చేస్తుంటే - ఆ విశ్వవిద్యాలయం బోర్డుపై చిన్నగా ఉన్న అక్షరాలు కనిపించాయి - "తమసో మా జ్యోతిర్గమయ" - "చీకటి నుండి నన్ను వెలుగువైపుకు మళ్ళించు".

13 comments:

 1. చాలా మంచి అనుభవాన్ని మాతో పంచుకున్నారు.

  ReplyDelete

 2. చిర కాల దర్శనం ! రెండు వేల పదునాల్గు తరువాయి మళ్ళీ పునర్దర్శనం !

  చాలా బాగా వ్రాసారు . మీ మరిన్ని ఎపిసోడ్ ల కై చూస్తున్నాం !!

  చీర్స్
  జిలేబి

  ReplyDelete
 3. " డబ్బుకోసమూ, కీర్తి కోసమూ, మరే కక్కుర్తి కోసమూ కాకుండా,బిచ్చమెత్తుకు బతకవలసి వచ్చినా సరే, తనకు మనసులో ఇష్టం ఉన్న విషయం వైపుగా అధ్యయనం సాగించే అదృష్టం బహుశా చాలా గొప్పది. అదే బహుశా నిజమైన చదువు అని నా విశ్వాసం." ఎంత అదృష్టం ఉండాలి ఇలాంటి మాటల్ని చదవడానికి? Keep writing Ravi garu. Your influence is beyond the horizon. (Y)

  ReplyDelete
 4. డబ్బుకోసమూ, కీర్తి కోసమూ, మరే కక్కుర్తి కోసమూ కాకుండా,బిచ్చమెత్తుకు బతకవలసి వచ్చినా సరే, తనకు మనసులో ఇష్టం ఉన్న విషయం వైపుగా అధ్యయనం సాగించే అదృష్టం బహుశా చాలా గొప్పది. అదే బహుశా నిజమైన చదువు అని నా విశ్వాసం."

  మీరు చెప్పినది నిజమే కానీ ఈ విషయం ప్రతి వ్యక్తికీ 40 సంవత్సరాల వయసులో అర్ధం అవుతున్నది. పిల్లల చిన్నతనం లోనే తన ఇష్టాఇష్టాలు తెలుసుకునేది ఎలా అన్నది పెద్దలకి తెలియడం లేదు. పెద్దల ఇష్టాలపై ఆధారపడి బ్రతుకుతున్న పిల్లల గురించి ఆలోచించేదెవరు ? పెద్దలకి పిల్లలకీ మధ్య వైరుధ్యాలు తొలిగేదెలా ?

  ReplyDelete
 5. Watch hello brother telugu hd print
  https://www.teluguvision.com/watch-hello-brother-telugu-hd-print/

  ReplyDelete
 6. For the latest update In Tollywood visit Tollywood Media9
  celebrities profiles
  tollywood actress images

  ReplyDelete
 7. Excellent read, Positive site, where did u come up with the information on this posting? I have read a few of the articles on your website now, and I really like your style. Thanks a million and please keep up the effective work

  The Leo News - this site also provide most trending and latest articles

  ReplyDelete
 8. Usually, I never comment on blogs but your article is so convincing that I never stop myself to say something about it. You’re doing a great job Man, Keep it up.

  The Leo News - this site also provide most trending and latest articles

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.