Monday, September 16, 2013

మృచ్ఛకటికం - కొన్ని ఆలోచనలు


రచయితకు గొప్ప ఉదాత్తత (sensibility) అన్నది ఉన్నప్పుడు, ఆ ఉదాత్తతను ప్రతిబింబిస్తూ ఒక పాత్ర వెలువడినప్పుడూ, రచయిత యొక్క sensibilities కు తగిన పాఠకుడు ఆ రచనను చదవడం తటస్థించినప్పుడు ఆ రచయితకూ ఆ పాఠకుడికి మధ్య జరిగే ఏకాంతమైన అవగాహన సద్యఃపరనిర్వృతి అని నా అభిప్రాయం. దీన్నే రసనిష్పందం అనవచ్చునేమో. రాళ్ళపల్లి వారు ఒకచోట అన్నట్టు రసం అంటే తొమ్మిది భేదాలతో మాత్రమే నిర్వచింపదగిన emotion మాత్రమే కాదు. అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఏదో అనుకూలం కోసం రసాలను నవవిధాలుగా వింగడించుకున్నప్పటికీ రసనిష్పందం యొక్క ఖచ్చితత్వం ఆ వింగడింపులో మాత్రమే లేదు.

సద్యః పరనిర్వృతి కలిగించే రచయితను కవి అని, ఆ పాఠకుడిని సహృదయుడని అనవచ్చునేమో.

వ్యక్తి వ్యక్తికీ సున్నితత్వపు తేడాలు సహజం. అదే స్థాయిలోనూ పాఠకుల సహృదయత కూడా మారుతుంది. అభిమాన రచయిత కూడా మారుతాడు. శాశ్వతంగా అందరికీ నచ్చే రచయిత కానీ, నచ్చే రచన కానీ ఉండవలసిన అవసరం లేదు. కాబట్టి ఫలానా రచన నా అభిమాన రచన, ఫలానా రచయిత నా అభిమాన రచయిత అన్నది వ్యక్తిగత అభిప్రాయం అవుతుంది. అభిప్రాయాలకంటే రచన తాలూకు sensibilities గురించి మాట్లాడుకోవడం మంచిది.

వర్షాకాలం గురించి అనుకోగానే నాకు శూద్రక మహాకవి, మృచ్ఛకటికకావ్యం, అందులో వర్షర్తు వర్ణనా గుర్తొస్తాయి. అలాంటి వర్ణన అంతకన్నా గొప్పగా ఇతర కావ్యాలలో ఉండవచ్చు గాక. అయితే మృచ్ఛకటికం తాలూకు ఉదాత్తత కేవలం వర్ణనలో లేదు. అది దృశ్యకావ్యమవడం మూలాననూ, అక్కడ కవి కల్పించిన సన్నివేశం వల్లనూ, వసంతసేన పాత్ర యొక్క ఉదాత్త స్వరూపం నేపథ్యంగానూ ఆ వర్ణన యొక్క సౌందర్యం వ్యక్తమవుతుంది.

వసంతసేన ఒక గణిక, క్షత్రియ. ఈమె దరిద్రుడూ, అప్పటికే భార్య, పుత్రుడు ఉన్న ఒక సార్థవాహుణ్ణి (బ్రాహ్మణుడు/వైశ్యుడు) ప్రేమించింది. ఒకానొక రాత్రి తన ప్రియుని ఇంటికి బయలుదేరింది. ప్రియుణ్ణి మొదటి సారి చూడబోతున్న తరుణం. ఆమె చిత్తం లోపల ఉద్వేగమూ, ఆనందమూ పెనవేసుకుని ఉన్నాయి.

ఇక్కడ ఒక ప్రశ్న. గణిక - అంటే ఒక వేశ్యకు - అంటే పురుషసంగమం అలవాటైన ఒక యువతికి - ఒక మొగవాని పట్ల అలాంటి భావాలు ఉండటం ఎలా సంభవం? సరిగ్గా ఇక్కడే పాత్ర ఉదాత్తత - సహృదయునికి తెలుస్తుంది. శీలం వేరు, స్వచ్ఛత వేరు. శీలం సామాజికం అయితే స్వచ్ఛత మానసికం. రెండూ పరస్పర వ్యతిరేకాలు కావు, దోహదకారులూ కానవసరం లేదు. సందర్భమో కాదో తెలియదు కానీ ఈ మధ్య మరోసారి చదివిన యండమూరి నవల అష్టావక్ర గుర్తొస్తుంది. అందులో ప్రతిమా అగర్వాల్ పాత్ర ఇదే పాయింట్ మీద నడుస్తుంది. అలాగే హంపి నుండి హరప్పా దాక లో బసివి నాగమ్మ గురించి రామచంద్రగారు వివరిస్తారు. ఆ పాత్ర గురించి చదివిన తర్వాత పాఠకుడికి సానుభూతే తప్ప ఏ విధమైన వికారమూ కలుగదు. వసంతసేన కూడా అలాంటి ఒక ఉదాత్తమైన పాత్ర.

వసంతసేన ఉద్వేగానందాలను ప్రతిబింబిస్తూ బయట వాతావరణం. కుండపోతగా వర్షం. ఆ వాతావరణంలో వసంతసేనకు తోడుగా గొడుగు పట్టి వెంట వస్తున్న విటునికి, వసంతసేనకూ మధ్య వర్షం గురించిన సంభాషణ.

ఇందులో ఓ రెండు పద్యాలు.

గర్జంతి శైలశిఖరేషు విలంబిబింబా మేఘా వియుక్తవనితా హృదయానుకారాః |
యేషాం రవేణ సహసోప్తతితైః మయూరైః ఖం వీజ్యతే మణిమయైరివ తాళశృంగైః ||

వసంతసేనా! చూడు!చూడు! శైలశిఖరాల మీద గర్జిస్తున్న ఆ మేఘాలు విరహిణుల హృదయాల లాగా ఎలా భారంగా ఉన్నాయో! వాటి చప్పుడుకు ఒక్క ఉదుటున పైకెగిరిన నెమళ్ళ పింఛాలతో ఆకాశం మణిమయమైన వింజామరలచేత వీయబడుతున్నట్టుగా లేదూ!

మూఢే ! నిరంతర పయోధరవా మయైవ కాంతః సహాభిరమతే యది కిం తవాత్ర!
మాం గర్జితైరితి ముహుర్వినివారయంతీ మార్గం రుణద్ధి కుపితేవ నిశా పత్నీ ||

‘ఓసి మూర్ఖురాలా! వసంతసేనా! దట్టమైన మబ్బులున్న (ఇఱుకు పయోధరాలు) ఉన్న నేను నా కాంతుడితో రమిస్తూంటే, మధ్యలో నీకేంటి?’ అని ఉరుములతో మాటిమాటికీ నివారిస్తూ (నాపై ఉరుముతూ) ఈ నిశ, సవతి లా మారి, నా దారిని అడ్డగిస్తూంది కదా!
(సవతి ఎందుకంటే, తనను తన ప్రియుడి వద్దకు చేఱుకోనీకుండా అడ్డుపడుతున్నది కాబట్టి) అని వాపోతుంది. పయః అన్న సంస్కృతపదానికి నీరు, పాలు అని రెండు అర్థాలు. నిరంతర పయోధరములు అన్నది శ్లేష. దట్టమైన మబ్బులు అని ఒక అర్థం, (నిర్ + అంతర) ఇఱుకు పయోధరాలని మరొక అర్థం.

********************************************
ఇక్కడ మరో సారి అనంతకృష్ణశర్మ గారిని గుర్తు తెచ్చుకుంటాను. యే ఉదాత్త రచన అయినా రచయిత యొక్క శాంతస్వభావం మూలం కావాలి. ధిషణాహంకారాలూ, పాండిత్యప్రగల్భా వాచ్యార్థాల ప్రాభవం పెంపు చేయవచ్చును, కానీ ఉదాత్తమైన భావం కవి అంతః కుహరాల్లోనుంచి రావాలి. అందుకు శాంతమే ఆలంబన. నిజమైన శృంగార వర్ణన - అది నిజంగా సున్నితత్వాన్ని నింపుకొన్నదైతే ఉద్రేకాన్నీ, ఆవేశాన్నీ కలిగించరాదు. అది చిత్త ఆహ్లాదకారకం కావాలి. అంతమాత్రమే కాదు, రంజింపజేయాలి. కవి తాలూకు దార్శనికత సహృదయుడైన పాఠకుడికి దారి చూపాలి.

మృచ్ఛకటికం కావ్యంలోని ఈ ఘట్టం నిజంగానే వర్షంలో తడుస్తున్న అనుభూతి కలిగిస్తుంది. అనుభవైకవేద్యం. సన్నివేశం, పాత్రలూ, వాటి ఉదాత్తతా నేపథ్యంగా ఔచిత్యశోభితంగా ప్రావృట్వర్ణన అనే వస్తువును వర్ణించిన అపూర్వమైన ఘట్టం. వ్యక్తిగతంగా నాకు నచ్చిన గొప్ప వర్ణన.

19 comments:

 1. >సార్థవాహుణ్ణి (బ్రాహ్మణుడు/వైశ్యుడు) ప్రేమించింది.
  సార్థవాహుడు అంటే వైశ్యుడే. బ్రాహ్మణుడికి అన్వయం కాదు ఆ మాట.

  ReplyDelete
  Replies
  1. శ్యామలీయం గారు, "సార్థవాహుడు" - ఈ శబ్దం వైశ్యులకే అన్వయిస్తుందని మీరన్న మాట గురించి పుస్తకాలు చూస్తున్నాను.

   మృచ్ఛకటికం కేవలం ఒక ప్రతిభాసమన్వితమైన సాహిత్యం మాత్రమే కాదు, సమాజాన్ని చిత్రించిన నాటకం. సార్థవాహత్వం - ఈ వృత్తిని బ్రాహ్మణులు కూడా చేశారని, ఈ కావ్యంలో - చారుదత్తుడు బ్రాహ్మణుడు అని చెప్పడానికి ఆధారాలున్నవనిన్నీ పరిశీలకులు అంటున్నారు. సార్థవాహ శబ్దానికి మీరు చెప్పే సంజ్ఞాసూచకమైన అర్థం మాత్రమే కాక, ఆ రచనలో నిరూపించబడిన రూఢ్యర్థాన్ని, దాని వెనుకనున్న సామాజిక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

   Delete
  2. రవిగారు,
   నిఘంటువులు సార్థవాహ శబ్దానికి వర్తకుడు అన్న అర్థాన్నే చెబుతున్నాయి.
   పూర్వం వర్తకులు ఒంటరిగా కాక గుంపులుగా ప్రయాణం చేసేవారు. తరచుగా వారితో ఇతర వర్ణస్థులూ కలిసి దూరప్రయాణం చేసేవారని అనుకోవచ్చును. జట్టుగా ఉంటే దొంగలబెడద వంటి వాటిని ఎదుర్కోవటం సులభం కావటమే వాణిజ్యవృత్తిలో వారి గుంపు ప్రయాణంలో అంతరార్థం. ఐతే దూరప్రయాణాలు కాబట్టి అవసరమైన ఇతరవృత్తులవాళ్ళూ ఆ గుంపులో ఉండే వారు (ఉదా: వంట బ్రాహ్మణులు, క్షురకులు, పనివారు), అలాగే వ్యాపారం వృత్తితో‌ సంబంధంలేని ఇతరులూ అవసరార్థం అలాంటీ చనుపలతో కలిసి ప్రయాణాలు చేసేవారు.

   Delete
  3. అవును. నిఘంటువు ప్రకారం సార్థవాహుడంటే వణిజుడే. మీరన్న మాటా నిజమే. సార్థవాహ బృందం లో ఇతరులూ ఉండేవారు. అయితే మృచ్ఛకటికపరిశీలకుల అభిప్రాయం ప్రకారం బ్రాహ్మణులు తమ బ్రాహ్మణ వృత్తి మాత్రమే కాక ఇతర వృత్తులను చేపట్టారని, అందులో భాగంగా వారు వాణిజ్యం చేశారని కొన్ని ప్రమాణాలు చూపిస్తున్నారు. ఆ సందిగ్ధతతో నేను బ్రాహ్మణుడు/వైశ్యుడు అని వ్రాశాను. (ఆ విషయం పెద్దది కాబట్టి బ్లాగులో వివరించలేదు).

   Delete
  4. > మృచ్ఛకటికపరిశీలకుల అభిప్రాయం ప్రకారం బ్రాహ్మణులు తమ బ్రాహ్మణ వృత్తి మాత్రమే కాక ఇతర వృత్తులను చేపట్టారని, అందులో భాగంగా వారు వాణిజ్యం చేశారని కొన్ని ప్రమాణాలు చూపిస్తున్నారు.

   బ్రాహ్మణధర్మాలుగా చెప్పబడ్డ యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహణ వృత్తులు ఆరూ తప్ప మిగతా వృత్తులు స్వీకరించటం చేసేవారని చెప్పటం, మృఛ్ఛకటిక కథాకాలానికి అవ్యాప్తిదోషం అవుతుందని నా అభిప్రాయం. ఐనా ఈ విషయం ఇప్పుడు చర్చకు పెట్టవలసిన అవసరం లేదు.

   Delete
  5. శ్యామలరావు గారు: చారుదత్తుడి విషయం వదిలేద్దాం కాసేపు. అదే నాటకంలో బ్రాహ్మణుడైన శర్విలకుడు చోరవృత్తిని స్వీకరించాడు కదండీ? అతడు బ్రాహ్మణుడని ఆ నాటకంలో స్వయానా తనే చెబుతాడు కూడా. (యజ్ఞోపవీతం నామ బ్రాహ్మణస్య మహదుపకరణం ద్రవ్యమ్. విశేషతోऽస్మద్విధస్య..)

   Delete
  6. చతుష్షష్షికళల్లో ఒకటైనా, చౌర్యం సామాజిక గౌవవం గల వృత్తి యెన్నడూ కాదు కదా.
   చోరులైన వాళ్ళలో అన్ని సామాజిక వర్గాలవాళ్ళూ ఉంటారు.

   Delete
 2. WOW!
  I agree with every word you wrote in the intro part of this post.

  ReplyDelete
 3. అప్పుడెప్పుడో తెలుగు నాన్ డీటేల్ లో చదివిన కధ మళ్ళీ ఇప్పుడు మీ వలన....థ్యాంక్యూ.

  ReplyDelete
 4. బాగున్నాయండి మీ ఆలోచనలు..
  "శీలం వేరు, స్వచ్ఛత వేరు. శీలం సామాజికం అయితే స్వచ్ఛత మానసికం. రెండూ పరస్పర వ్యతిరేకాలు కావు, దోహదకారులూ కానవసరం లేదు. " good point!

  ReplyDelete
 5. చాలా బాగున్నది రవీ.. !!

  ReplyDelete
 6. శీలం ఎన్నడూ సామాజికం కాదు. అదొక సామాజిక దృష్టి మాత్రమే! ఇదీ, స్వఛ్ఛతా రెండూ మానసికమేనండీ! ఇక్కడ శీలం అనేదాన్ని మీరు శారీరకమూ సామాజికమూ అనే కోణంలో (పైగా వసంత సేన వేశ్య కాబట్టి) చూశారని నాకనిపిస్తున్నది.

  ReplyDelete
  Replies
  1. మీరన్నది నిజమే. అక్కడ 'సామాజికం' అన్న మాట అతికినట్లు లేదు. నేను చెప్పదల్చుకున్నదేమంటే - బాగా డబ్బు సంపాదిస్తూ, భోగాలనుభవిస్తూ, పరపురుషుల పట్ల యాంత్రికమైన భావాలున్నప్పటికీ వాళ్ళ వద్ద చనువుగా ఉన్నప్పుడు సిగ్గులొలికిస్తూ కులవధువు లాగా ప్రవర్తించే (లోకం దృష్టిలోని) ఒక యువతి. (వసంతసేన ఇలా ప్రవర్తిస్తుందని "నా" అభిప్రాయం కాదు, ఆ నాటకంలో ఒకచోట ఆమె గురించి ఇలాంటి అభిప్రాయాన్ని ఒక పాత్ర చెబుతుంది. వసంతసేన పాత్ర పట్ల నాకు సానుభూతి మాత్రమే ఉంది.)

   పై ఎక్స్ప్రెషన్ కు సరైన పదం దొరకలేదు. పైగా ఈ మధ్య కొన్ని సెన్సేషనల్ యండమూరి నవలలు చదివి ఉండడం ఒక సైడ్ ఎఫెక్టు.:)

   "శీలం" - అంటే ఆమె లోకుల దృష్టిలో ఆమె ప్రవర్తన - అది యాంత్రికం. ఆమె మనసులో నిజంగా ఉన్నది స్వచ్ఛత.

   Delete
 7. mottam meeda blogaadinchaaru. simply superb
  http://www.googlefacebook.info/

  ReplyDelete
 8. This comment has been removed by the author.

  ReplyDelete
 9. సాహితీవేత్త, విమర్శకులు , వాగ్గేయకారులు అయిన శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారిని సంస్మరించడం చాలా ముదావహం.నా బాల్య మిత్రుని మాతామహులైన వారిని నా చిన్న తనంలో దర్శించు కున్న భాగ్యం నాది.

  ReplyDelete
 10. బావుంది వ్యాసం చక్కని కొటేషన్లతో. ధన్యవాదాలు
  Telugu Cinema News

  ReplyDelete
 11. Hello Dear! Your blogsite is really beautiful! Even if I can't read your language, your sense for design is awesome! :)

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.