Sunday, June 23, 2013

సంకేతపదనిర్మాణతరుణోపాయన(స)ము

అనగనగా ఒక రోజు - నాలుగు సార్లు ఫ్రెండ్స్ తో బాటు కేంటీన్ కు వెళ్ళి కాఫీ తాగి సీటు దగ్గరకు వచ్చి, ఫేసుబుక్కూ, ప్లస్సూ, కూడలి, యూట్యూబూ, మరో నాలుగు కిటికీలు తెరిచి ఆఫీసులో చాలా బిజీగా పనిచేసుకుంటూ ఉన్నాను.

తెర మీదకు ఒక మిస్సైల్లా  ఒక డబ్బా వచ్చింది. దాని మీద ఉన్న సారాంశం ఇది.

"మీ యంత్రం తాలూకు సంకేతపదం ఆరునెలలుగా పాచిపోయి కంపు కొడుతూ ఉంది. దానిని మార్చండి."

ఓస్ అంతే కదా అనుకుని "సరే" అన్న పోకముడిని ...ఛ ఛ .. బొత్తామును నొక్కాను. ఒక భయంకరమైన విషవలయంలో అడుగుపెట్టబోతున్నానని నాకా క్షణం తెలీదు.

అదివరకు ఇలాంటి బెదిరింపులను చూసి ఉన్నాను. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు గ్రామసింహం ..ఛ ఛ ..సీమసింహం బెదరదు అని సంకేతపదం ఇలా టంకించాను. -

"వెధవ123"

ఇక్కడో మినీ ఫ్లాష్బాకు. ఇలా సంకేతపదాలు మార్చమని మూడు నెలలకో మారు మాకు విన్నపం వస్తుంది. "వెధవ123", "చవట123" - ఈ రెండు సంకేతపదాలనే నేను మార్చి మార్చి వాడటం అలవాటు. మా మిత్రులు ఇలాంటివే ఏవో పద్ధతుల్లో తమ సంకేతపదాలను గుర్తుంచుకోవడానికి వీలుగా తీర్చిదిద్దుకోవడం నాకు తెలుసు.

తెరపైకి ఒక డబ్బా, దాంట్లో తిట్టు లాంటిది కనిపించింది - "మూర్ఖుడా, నీ సంకేతపదం లో వరుసగా మూడు నంబర్లను పెట్టావు. మార్చు." బేక్ గ్రవుండ్ లో చిన్న సైజు వికటాట్టహాసం.

ఈ తతంగాన్ని రేపటికి పోస్ట్ పోన్ చేయడం తక్షణ కర్తవ్యం అని, కేన్సిల్ నాడా ...అదే బొత్తామును నొక్కాను. మరో డబ్బా. "కేన్సిల్ నొక్కి ఫేస్బుక్ కు వెళ్ళిపోదామనుకుంటున్నావా? కుదరదోయ్. సంకేతపదం మార్చేదాకా వదలను. వదల బొమ్మాళా వదల, రీస్టార్ట్ చేసినా వదల"

నా మనసు కాస్త కీడు శంకించింది. ఇలాంటిది ఇదివరకెప్పుడూ రాలేదు

సరే అని కాస్త ఆలోచించి ఇలా మార్చాను. "వెధవ321". ఫలితం ఇది.

"ఒరే కోడి బుర్ర వెధవా, వరుసగా అన్నాను. అది వెనుకనుండైనా కావచ్చు"

"వెధవ007"

"హమ్మా? ఆశ దోశ అప్పడం వడ! ఒకటే నంబర్ రెండు సార్లు రాకూడదోయ్".

తల వేడెక్కింది. కాస్త ఆలోచించాను. నేను మొట్టమొదటిసారి యాహూ అకవుంటు తెరిచినప్పుడు నా ప్రియతమ నాయిక సోనాలీ బేంద్రే స్మృత్యర్థమై ..అదే ఆమె గుర్తుండడానికి సోనాలి1 లాంటిది వాడినట్టు గుర్తు. ఇప్పుడు ఆమె, నా యాహూ ఖాతా రెండూ పదవీవిరమణ చేశాయ్. ఇప్పుడు దాన్ని వాడితే ఎలా ఉంటుంది? ఆచరణలో పెట్టాను.

"ఒరే! సంకేతపదంలో ప్రత్యేక చిహ్నం లేకుంటే ఒప్పుకోను" సందేశం, బేక్ గ్రవుండ్ లో తొడకొట్టిన సవుండూ వినిపించాయ్.

అప్పుడు సన్నగా వెన్నెముక క్రింది భాగాన చల్లటి అనుభూతి. చిన్న వణుకు.

తొడకొట్టిన సౌండు విన్నప్పుడల్లా నా హృదయం బలహీనమవుతుంది. ఎందుకంటే అదేదో సినిమాలో హీరో తొడకొట్టగానే కుర్చీ తనంతట తాను జరుక్కుంటూ హీరో దగ్గరకు వెళ్ళిపోతుంది.

అలా కుర్చీలు జరగటం గతితార్కిక భౌతికవాదులు, హేతువాదులూ నమ్మరు. నేను కేవలం అవకాశవాదిని కాబట్టి దేన్నైనా నమ్ముతాను. ఇప్పుడు నా కుర్చీ కూడా జరుగుకుంటూ నాతో సహా ఐటీ డిపార్ట్ మెంటు కు వెళ్ళిపోతే?. అలా వెళితే ఆ "ట్రావెల్" ను ఎంజాయ్ చేయడానికి ఇబ్బందేమీ లేదు కానీ ఐటీ వాళ్ళది రెండో అంతస్తు., నేనున్నది ఐదవది. ఐటీ మేనేజర్ మంత్రశక్తిని కుర్చీ అపార్థం చేసుకుంటే మెట్లపైనుండి నేను క్రిందపడతాను.అంత రిస్కు చేయలేను.

అందుకని మరింత దీక్షగా ఈ సమస్యపై దృష్టిని కేంద్రీకరింది F1 గంటును ..సారీ... బొత్తామును నొక్కాను. అక్కడ సంకేతపదం మార్చడానికి నియమాలు వ్రాసి ఉన్నాయి.

1. సంకేతపదం లో కనీసం ఎనిమిది అక్షరాలు ఉండాలి.
2. కనీసం ఒక పెద్ద అక్షరం, ఒక చిన్న అక్షరం, ఒక అంకె, ఒక చిహ్నం ఉండాలి.
3. వరుసగా అంకెలు రాకూడదు.
4. వరుసగా అక్షరాలు రాకూడదు.
5. ఒకే అక్షరం లేదా అంకె తిరిగి తిరిగి రాకూడదు.
6. మీ సంకేతం మీ జీవితం లో ఎప్పుడూ ఉపయోగించనిదై ఉండాలి. ఒకవేళ పాతది కనుక్కోలేరు అనుకుని మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఫలితం దారుణంగా ఉంటుంది.
7. టంకించే ముందు కాళ్ళు కడుక్కుని వచ్చి ఉండాలి.
...
...
ఇలా అనేక సూచనలు పొందుపర్చబడి ఉన్నాయ్.

ఒక పదిహేను ఇరవై విఫల ప్రయత్నాల తర్వాత ఒక భయంకరమైన పాస్ వర్డ్ నిర్ణయించాను. అది ఎలానూ గుర్తుండి ఛావదు కాబట్టి దాన్ని మొబైల్ ఫోను లోనూ, పర్సులో ఉన్న ఒక పుస్తకం లోనూ రాసి పెట్టుకున్నాను.

అయితే అది అంతం కాదు ఆరంభం మాత్రమే. మరుసటి రోజు మా సంస్థ అంతఃజాలం (intranet) సంకేతపదం కూర్చటానికి మరో యజ్ఞం చేయవలసి వచ్చింది. ఆ తర్వాత మరొకదానికి. ఇలా సమస్య తీవ్రతరమయ్యేటప్పటికి ఒక బ్రహ్మాండమైన మీటింగు పెట్టి సమస్యను చర్చించారు అందరూ.

చివరికి కనుక్కున పరిష్కారం ఇది.
- ప్రతి ఉద్యోగికి రెండు యంత్రాలుంటాయి. మొదటి దానిలో సురక్షిత వ్యవస్థ ఉంటుంది. మరొకటి సాధారణమైనది. రోజు సాదా యంత్రంలో పని చేసి రోజు చివరన, వ్యవస్థీకృతమైన యంత్రంలోకి డేటాను తర్జుమా చేస్తారు.

ఇలా కనుక్కున్న పరిష్కారంతో సమస్య కొలిక్కి వచ్చింది.

14 comments:

 1. రచ్చ రచ్చ! ఇంతకీ మీరు నిర్ణయించిన ఆ భయంకర సంకేతపదమేంటి? :)
  నిజంగా అలాంటి తెలుగులో, అలాంటి శైలిలో కంప్యూటరు మనతో (మాట)ఆడుకుంటే బతుకు మరింత వర్ణాత్మకంగా (అదే colourfulగా) మారుతుంది!

  ReplyDelete
  Replies
  1. ఆ సంకేతపదం గుర్తు లేదండి. రాసిపెట్టుకోవడానికి మాత్రమే పనికొచ్చే పదం అది. :)

   Delete
 2. హహహ...

  మాకైతే మీరు చెప్పినవాటికి అదనంగా ఇంకొన్ని పిచ్చి రూల్సు ఉన్నాయి. వాటిలో ఒకటి: నా పూర్తి పేరులో గానీ, మా కంపెనీ పేరులో గానీ ఉండే అక్షరాలను సంకేతపదంలో ఎక్కడా వాడకూడదు. ఇంకా నా పుట్టినరోజులోని అంకెలను కూడా వాడకూడదు. ఉండే పది అంకెల్లో సగానికి పైగా ఇలాగే పోతే ఇంకేం మిగులుతాయి నా మొహం?

  ReplyDelete
 3. నాయనా, ఈ సంకేతాలు అనేవి రామాయణ మహాభారత కాలం నుంచీ గూడా, జనాల్ని చికాకు పెడుతూనే ఉన్నాయి, ఇబ్బందులు కలిగిస్తూనే ఉన్నాయి. హనుమంతులవారు రాములవారిచ్చిన స‍ంకేతాన్ని నోటగరుచుకుని ఎగురుకుంటూ వచ్చి సీతమ్మ వారికి క్షేమంగా అందించాడు కాబట్టి సరిపోయింది కానీ, మధ్యలో ఏ ఆవలింతో వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించు నాయనా. అలాగే, శకుంతల దుష్యంతుడిచ్చిన సంకేతాన్ని (అభిజ్ఞానం) జారవిడుచుకున్నాక మళ్ళీ ఆ పాస్ వర్డ్ అన్ లాక్ అవడానికి ఎంత ఇబ్బందయిపోయిందో గ్రహించు నాయనా... కాబట్టి, పురాణపురుషులకే ఈ సంకేతాలతో ఇబ్బందులు తప్పనప్పుడు తుచ్ఛమానవులం మనమెంతవాళ్ళమని గ్రహించి , ఈ అయిటీ వాళ్ళనే దుర్వాసో మహర్షుల ఆగ్రహానికి గురి అవకుండా సర్దుకుపోవడం నేర్చుకో నాయనా..

  ReplyDelete
 4. Too good అండి :-)

  అమ్మయ్య ఇలాంటి బాధితుల్ని చూసి సంతోషం గా ఉంది :-) త్రివిక్రమ్ గారు చెప్పినట్లు ఎస్ పేరు లో అక్షరాలు రూల్ మాకు కూడా ఉండింది . ఏదో దేవుడి దయ వల్లా ఆ నంబర్ల రూల్ లేదు Thank god !!!!!

  ReplyDelete
 5. https://twitter.com/ItsTheGrumpyCat/status/295317424469860354

  ReplyDelete
 6. సంకేతపదాలు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి (లేదా సులభంగా గుర్తుపెట్టుకోగలిగే సంకేతపదాలు ఎంచుకోవడానికి) ఒక చిట్కా ఉందండీ.

  పాస్‌వర్డ్ లో మొదటి భాగం మీకు బాగా నచ్చిన పదం లేక పేరు (ఉదా: గర్ల్ ఫ్రెండ్ పేరు ;-)) పెట్టుకోండి. ఏం ఫర్వాలేదు. దీన్ని ఎప్పటికీ మార్చనవసరం లేదు, రాదు.
  ఇక రెండవ భాగం @June2013 అనో #JUNE13 అనో మీకు అనువుగా ఉండే కాంబినేషన్ ను మొదటిభాగానికి తోకలాగ తగిలించండి. ఇంకో నెలో మూణ్నెల్లో అయ్యాక మార్చాల్సివస్తే తోకలోని నెల పేరును మాత్రం మారిస్తే సరిపోతుంది. ఏదైనా అక్షరం రెండుసార్లు వస్తే ఒకసారి lower case, ఇంకొకసారి UPPER CASE వాడండి. రెండుకంటే ఎక్కువసార్లు వస్తే దాన్ని వదిలేయండి. ఉదాహరణకు నా పాస్వర్డ్ trivikram@APRIL2013 అని వచ్చినప్పుడు trivIkram@APRL2013 అని పెడతాను.

  ReplyDelete
 7. బొత్తాము : పోకముడి, నాడా, గంటు... మూడు పర్యాయ పదాలే... తెలుగును బహుబాగా బతికించేస్తున్నారుగా..
  సాదా యంత్రము, వ్యవస్థీకృత యంత్రము... అబ్బో అబ్బో
  అంత:జాలముకూ అంతరజాలమునకూ తేడా ఎలా తెలిసేది...
  అవునూ... అంతశ్చక్షువులు అన్నట్టు అంతశ్జాలము అంటే ఎలా ఉంటుందీ... సంధి అలా కాదంటూ వ్యాకరణ పాఠం చెప్పకుండా ఒప్పేసుకోండి.
  అద్భుత:

  ReplyDelete
 8. సంకేత పదాలు నాలాంటి సామాన్యుడికి కొరుకుడు పడవు కంప్యూటర్ illiterate గా ఉండటం ఇష్టం లేక కొద్దికొద్దిగా స్వయంగా స్వాధ్యయనంతో నేర్చుకుంటున్నాను!ఇందులో నేను slow learner ని!సప్తతికి దగ్గర పడుతున్నవాన్ని ఎవర్నయినా ఏదయినా అడగడానికి ఒకరకమయిన సిగ్గు!మధ్యలో నాలుగయిదు ఏళ్ళు కంప్యూటర్ సన్యాసం తీసుకున్నాను దానికి addict గా బానిసగా మారుతున్నానేమోననే భయం వేసి!మళ్ళీ ఈమధ్య దానిని ధరించాను!computer పుస్తకాలు చదివి స్వయంగా స్వంతగా కంప్యూటర్ నేర్చుకోవడం కష్టం అని అనుభవం మీద చెప్తున్నాను!సాంకేతిక పదాలు నాకు కొరుకుడుపడవు!ఈ కంప్యూటర్ పిచ్చివల్ల నా నిరంతర గ్రంధపటనానికి కొంత అంతరాయం కలుగుతున్నమాట మాత్రం పరమ వాస్తవం!

  ReplyDelete
 9. హ్హహ్హ... బావుంది బావుంది.. ప్రస్తుతానికి మావాళ్ళు ఇంకా ఇంత భయపెట్టడం లేదు కాబట్టి, వెధవ123 లాంటిదాన్నే అటు తిప్పి ఇటు తిప్పి వాడుతూ ఉన్నాం.. ఇలాంటి రూల్స్ వస్తేనా, అంతే సంగతులు.. పాస్‌వర్డ్‌ని ప్రక్కనే బోర్డ్ మీద వ్రాసుకోవాలి...!!!

  ReplyDelete
 10. Rofl. I use iamgreat#1 type of ego satisfying ones ;)

  ReplyDelete
 11. mee *sanketha pada nirmana...nu 18.08.13 aadivaram andhrajyothi sanchikalo prachuristhunnamu
  -editor, andhrajyothi

  ReplyDelete
 12. mee *sanketha pada nirmana...nu 18.08.13 aadivaram andhrajyothi sanchikalo prachuristhunnamu
  -editor, andhrajyothi

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.