Wednesday, June 5, 2013

నిత్యసౌందర్యం

అనగనగా సరస్వతీదేవికి ఒక కొడుకు పుట్టాడుట. అతని పేరు కావ్యపురుషుడు. ఓ మారు సరస్వతి ఏదో దేవతల సమావేశానికి వెళుతుంటే కొడుకు - ’అమ్మా, నేను వస్తా’నని వెంటబడ్డాడుట. అప్పుడా అమ్మ ’బాబు నీవు అక్కడికి రారాదు. నేనిప్పుడే వచ్చేస్తా, నీవిక్కడే ఉండు’ అని వెళ్ళిపోయిందట. ఈ బాబుకు కోపం వచ్చి తామున్న హిమాలయాల దిగువన ఉన్న జంబూ ద్వీపానికి బయలు దేరాడట. అతణ్ణి చూసి, స్నేహితుడైన కుమారస్వామి కూడా కెవ్వున ఏడుస్తూ నేనూ వెళతానని వాళ్ళ అమ్మ పార్వతి దగ్గర గొడవ చేశాడట.

అప్పుడు పార్వతి ఒక అమ్మాయిని సృష్టించి - అమ్మాయీ ఇదుగో ఆ వెళుతున్నతనే నీ భర్త. అతణ్ణి అనుసరించి వెనక్కి తీసుకురా అన్నదిట. ఆ అమ్మాయి సాహిత్యవిద్యావధువు. కావ్యపురుషుడు మొదట తూర్పు (గౌడ) దేశానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళగానే సాహిత్యవధువు అక్కడి వాతావరణానికి అనుగుణంగా తన ఆహార్యం మార్చుకుందిట.

ఆమెను చూసిన కావ్యపురుషుడికి కోపం తగ్గక చురచురలాడాడుట.  ఆ పద్ధతి గౌడీ రీతి అని స్థిరపడింది. గౌడీరీతి అంటే - సమాసభరితంగా క్లిష్టంగా ఉంటుంది.

ఆ తర్వాత కావ్యపురుషుడు పాంచాల రాజ్యం, ఆ చుట్టు పక్కలకెళ్ళాడు. అమ్మాయి అక్కడి వాతావరణానికనుగుణంగా ఆహార్యం స్వీకరించింది. ఈ సారి అబ్బాయి మెత్తబడ్డాడు కాస్త. అమ్మాయి వంక చూస్తున్నాడు, నవ్వకపోయినా. అప్పుడతని భావాలు, మాటలు పాంచాలీ రీతిగా పేరు పొందినయ్.

ఆ తర్వాత అతను మరింత క్రిందకు వచ్చి విదర్భకు వచ్చాడు. ఈ సారి కావ్యపురుషుడు బాగా ఐసయి పోయాడు. ఇప్పుడు అతని మాటల శైలి చాలా అందంగా, సుకుమారంగా ఉంది. అతని శైలి వైదర్భి. ఇంకా ఆయన దక్షిణ సముద్రంపైన ఉన్న వేయి యోజనాలు తిరిగాడు. అలా తిరుగుతూ కేరళకూ వచ్చినాడు. అక్కడ అమ్మాయి తన ఆహార్యం, వస్త్రమూ ఇలా చేసుకుందిట.

ఆమూలతో వలితకున్తలచారుచూడః
చూర్ణాలకప్రచయలాంఛితఫాలభాగః ||
కక్షానివేశనిబిడీకృతనీవిరేషః
వేషశ్చిరం జయతి కేరళకామినీనామ్ ||

మొదళ్ళకంటా తిప్పి కట్టిన కుంతలాలతో అందమైన ముఖం కలది, అక్కడక్కడా ముంగురులతో అలంకృతమైన ఫాలభాగం ఉన్నది, భుజం క్రింద కోకముడి బిగించి కట్టినది, అయిన కేరళ ముద్దుగుమ్మల వేషం భేషుగ్గా ఉంది!

ఇలా...
ఆమె అందంతో సాటి రాకపోయినా ఓ కందం.

కం ||

పురిసల్పి మొదల గట్టిన
నెరుల నొయారంపు మోము, నెన్నుదుట బడం
కురులు, ఎరక దిగి కోకను
నెరఁ గట్టిన కేరళ నెరి నిత్యము ముదమౌన్

నెరులు = కుంతలములు
ఎరక = భుజము

ఉహూ...మరొక ఉత్పలమాల కూడా..

ఉ||
సొమ్మగు ముంగురుల్ నొసట సోలిన మోమెలదేటి దాటులన్
బమ్మెరవోవఁ దోలు దెగబారెడు వేనలి, మూపు క్రిందుగన్
క్రొమ్ముడి, కొప్పు నందెసగు కూటపు ముత్తెములున్, సుధౌష్టము
న్నమ్మకచెల్ల ! కేరళ సునందిని నిత్యము చెన్నువొందగన్.

అందమైన ముంగురులు నుదుటన పడుతూ ఉన్న మోము,
ఎలదేటి దాటులు అంటే తుమ్మెదలు - అవి నివ్వెరపడేట్టుగా ఉన్న నిడుపాటి జడ (వేనలి = జడ), 
భుజానికి కాస్త కిందుగా కట్టిన కొత్త (రకం) కోకముడి, 
కొప్పుపైన వెలుగుతున్న ముత్యాలరాశులూ, 
అమృతం లాంటి పెదవి, 
అమ్మకచెల్ల! కేరళ అమ్మాయి నిత్యమూ అందంగా ఉండాలి (ఉంటుంది).. :) 

(ఈ పద్యం కూడా కొట్టుకొచ్చిన ఓ పెద్ద పేరడీయే ;)

ఇంతకూ కథ ఏమయిందండి అంటారా? అంత అందమైన డ్రెస్సుతో అమ్మాయి కనిపిస్తే ఐసవకుండా ఉంటాడా అబ్బాయి? సరస్వతి కొడుకూ, పార్వతి కూతురూ పెళ్ళి చేసికొని హిమాలయాల్లో కాపురం పెట్టారు. అప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్సూ, ఆమె హొయలూ ఈనాటికీ కేరళలో వ్యాపించి ఉన్నాయి.

అదండి కేరళ నిత్యసౌందర్య కథ.

10 comments:

 1. హహహ్.. బాగు బాగు.. ఆ ఉత్పల మాలకి వీలయితే ప్రతి పదార్ధమో, కనీసం అర్ధమో ఇవ్వండీ నాలాంటోళ్ళ కోసం ;)

  ReplyDelete
 2. Please visit
  http://ahmedchowdary.blogspot.in/

  ReplyDelete
 3. :)
  బాగుంది. అందుకే సుబ్రహ్మణ్య భారతీ అన్నాడు
  "సింధునదియిన్మిసై నిలవినిలే
  చేర నన్నాట్టిలం పెన్ గళుదనే
  సుందర తెలుఁగినిల్ పాట్టిసైదు
  తోనిగళ్ ఓట్టి విళైయాడి వరువోమ్"
  మరి మాయామాళవగౌళం సంగతీ?

  ReplyDelete
 4. సరిగ్గా ఈ పాటా ఇక్కడ పెడదామని ఆలోచన వచ్చింది. కానీ యూట్యూబ్ లో శివాజీ గనేషనూ, వాడి వాలకం, ఆ పాటలో కేరళమ్మాయి తమిళ అమ్మాయిలా ఉండటమూ చూసి మానేశాను.

  మాయామాళవగౌళం - ఈ మేళం ఎవరు? నాకు సంగీతం రాదు. :)

  ReplyDelete
 5. సుబ్రమణ్య బారతి పాట ఇక్కడ:
  http://www.youtube.com/watch?v=AKLzxSGhVyw

  ReplyDelete
 6. భలే బాగు బాగు.

  శివాజీని పట్టుకుని వాడి వాలకం అంటావా? సౌమ్యతో చెబుతా ఉండు!
  నాక్కూడా రహ్మాన్ చెప్పిన మాయామాళవగౌళ రిఫరెన్సు అర్ధం కాలేదు

  ReplyDelete
 7. మరి కేరళీరీతి/శైలి అన్నది కూడా ఏమన్నా ఉందా? ఎప్పుడూ వినలేదే!
  అలాగే ఇంతవరకు కావ్యకన్య గురించే తప్ప‌, కావ్యపురుషుడి గురించి వినలేదు. :-)

  ReplyDelete
  Replies
  1. క్లుప్తీకరించిన ఈ (కావ్యపురుషుని) కథ రాజశేఖరుని కావ్యమీమాంస లోనిది. అతనూ పురాణాలనుంచి, మరి కొన్ని ప్రాచీన గ్రంథాల నుండి సేకరించినట్లు ఊహిస్తున్నారు. ఆ రెఫరెన్సులు ఇప్పుడు దొరకడం లేదు, ఆనవాళ్ళు మాత్రం ఉన్నాయి.

   కేరళీరీతి లేదు. వైదర్భీ రీతి అన్నది స్థూలంగా దక్షిణాత్యుల పద్ధతి. సూక్ష్మంగా కనిపిస్తే దక్షిణాత్యుల భాషల్లో, (ఉదా: అచ్చతెనుగు, మరాఠీ, కన్నడ) దీర్ఘసమాసాలు, ఓజోభరితమైన శబ్దాలు కూర్చడం సులభంగా కుదరదు. ఇక్కడ రాజశేఖరుడు కొంత సూచించి వదిలేస్తాడు. మిగిలింది చదివే వాళ్ళే ఊహించాలి. వాళ్ల వాళ్ళ సంస్కారాన్ని, లోకజ్ఞానాన్ని బట్టి కొంత అర్థమవచ్చు. అందులో భాగంగా కేరళ అమ్మాయిలను గురించి చెప్పాడు.

   Delete
 8. బాగు బాగు

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.