Thursday, June 27, 2013

నీడ పై దాడి - 1

వదనంబునకంటిన స్వేదంబును వసనంబునకనుగుణమౌ కౌనునకు నాదేశంబు గావించుచు నలుదెసలం బరికించెను విట్టోరియో.

అల్జీర్స్ పట్టణంబునందున్న అనామికా బజారు అతనిటఁ దిరుఁగు కూటమితోడనూ, రహదారుల పార్శ్వంబందున బెరగిన దుకాణ సముచ్చయంబులన్ గుమిగూడిన యాత్రికుల తోడనూ, జనబంధురమై, గహనదురంధరమై భాసించుచున్నది.

ఆతఁడు కరిదంతంబుల నెరపిన వస్తుసముచ్చయంబుల విక్రయంబు జేయునొక విక్రయశాలను వినిమితము గావించి, నాలుగు యడుగులనద్దిశ వైపుగాఁ గదిలించి, ఐదవ యడుగు మోపునెడ - కలకలమను నొక్క కోలాహలమచ్చోటఁ బెచ్చరిల్లెను.

"ఓరి భగవంతుఁడా! నా ధనము...నా ధనంబునెవరో యపహరించిరి ...రక్షకభటులను రావింపుడీ" యను ఎలుగు ఱాపడునట్టు స్వరంబు వికస్వరంబుగా వినిపించుచుండనొక స్త్రీ దుకాణాంగనమున పఱుగున నఱుదెంచెను.

మ్రోయు యడుగునుపసంహరించి వెడవెడ నడక సాగించుచు అచ్చోటి నుండి దవ్వునకరిగెను విట్టోరియో.

యాత్రికురాలి రావంబులకు జాగరూకమైన బజారునకొకింత దవ్వున మూలగానొక్క తేనీటి యంగడి యందు ఉల్లాసంబుగ సల్లాపంబుల మఱగిన రక్షకభట చయము యల్లన రంగంబునన్ డిగ్గి మాయమైపోయిన ధనంబును శోధింపబూనుకొనిరి.

ఆ గడబిడ గడవకయే తానా యెడ నడుగిడిన ముడుసులు వెడలునని ఎఱిఁగి విట్టోరియో చేజారిన యమూల్యావకాశంబును తలఁచి శంకించుచు, ఖిన్నుడై నొక మూలనున్న తిన్నెను జేరి విశ్రమించెను.

ఆ సందర్భమున "ఏమోయీ! ప్రియమిత్రుఁడా విట్టోరియో!" యనుచు వచ్చిన మిత్రుడొకడాతనిని పలుకరించి, "త్వదీయాననమవనతమైన కారణంబెయ్యది సోదరా? ఇంతవరకునూ యారంభమవలేదొకొ??" యని అపహాస్యపూరితభాషణంబొనర్చి వెన్నుపై చరచి నిచ్చంబోయెను.

ఆతని వెనుక నెడనే బోయి ముఖనాసికాద్వయమునేకమొనర్చవలెనను కౌతుకమునడగించుకొని తానున్న యెడనే విశ్రమించెను విట్టోరియో.

ఆ మిత్రుని యుత్ప్రాసంబున నొక్క ప్రల్లదమును లేదు. వేకువ తొడరిన కడ నుండీ శక్తికి వెరవక ప్రయత్నము సాగించుచున్ననూ, విధివిలాసంబున నాటంకములు సంభవించుచున్నవి. తన వదనంబవనతంబు గాక మరేమగు?**************************************

ఎసాల్ట్ ఆన్ షాడో - అను మధుబాబు నవలకు గ్రాంథికీకరణము. మధుబాబు గారికి, పరవస్తు చిన్నయసూరి గారికీ క్షమాపణలతో..

10 comments:

 1. అరసున్నలు కనీసం నాలుగు చోట్ల మిస్సయినై :)

  Just kidding. It is brilliant.

  ReplyDelete
  Replies
  1. :) కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్....అవి ఎక్కువైతే పాఠకులు చదవరేమోనండి. :)

   Delete
 2. Rofl. I knew its madhubabu, did not know which one. ;)

  ReplyDelete
 3. మొగలాయి దర్బారు లాంటి పుస్తకాలు చదువుకున్న రోజులు గుర్తుచేసారు. బాల్యం.

  ReplyDelete
 4. భళీ! మీచే చెప్పంబడిన ఇక్కథంజదివి యమందానంద కందళిత హృదయారవిందుడనైతి. షాడో సాహసంబుల శుద్ధాంధ్రమున జదువగోరు మాబోంట్ల యభీష్టము నేటికిఁగదా యీడేరె! ద్వితీయభాగంబు పఠియింప బ్రతీక్షించుచున్నాడను. :)

  ReplyDelete
 5. త్వదానము... సందర్భాన్ని బట్టి ముఖమని అర్ధం అయింది కానీ... ఈ పదం తెలీలేదు. లేక.. అప్పు తచ్చా?

  ReplyDelete
 6. త్వత్ ఆననము (ఆననము = ముఖము) = త్వదాననము
  త్వదాననము + అవనతము = త్వదాననమవనతము

  ReplyDelete
 7. సంస్కృతంలో వ్రాసేటప్పుడు త్వదాననమ్‌ సరయిన ప్రయోగమే. కాని తెలుగు రచనలో త్వదాననము అనరాదనుకుంటాను. త్వదీయాననము అని అనవలసి యుంటుంది సంప్రదాయం ప్రకారం.

  ReplyDelete
  Replies
  1. మార్చాను. త్వదాననం - తుల్య ప్రయోగాలు తెలుగు పద్యకవితలో ఉన్నాయి. అయినా పర్వాలేదు.

   త్వత్, త్వదీయ - రెంటికీ తేడా చెప్పగలరా? నాకు నిజంగా తెలియదు. శ్రీవైష్ణవ సాంప్రదాయంలో తదారాధన, తదీయారాధన అని విన్నాను. రెంటికి తేడా తెలుస్తుందని అడుగుతున్నాను.

   Delete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.