Sunday, April 14, 2013

మాదీ హైదరాబాద్

సిటీ బస్సు మామూలుగా అన్ని ఊళ్ళల్లోలాగా కాకుండా స్టాపుకంటే కొంతదూరం ముందుకు వెళ్ళి ఆగింది. స్టాపులో ఉన్న జనం పోలో మంటూ బస్సు దగ్గరకు ఉరికారు. ఆ జనాల్లో ఒక చిన్నసైజు మహిళామండలి కూడా చీరలు కట్టుకుని రేసులో పాల్గొంటున్న పీటీ ఉష, అశ్వినీ నాచప్ప ల్లాగా పరుగెట్టారు. మా నాన్నా, నేనూ పరిగెత్తాము మందతోబాటు. మా నాన్నెలానో బస్సు ఎక్కేశాడు. నేను కాస్త వెనుకబడ్డాను. బస్సు బయలుదేరేసింది. నేను పరుగు కంటిన్యూ చేశా.

బస్సు అలా బయల్దేరి కాస్త దూరం వెళ్ళగానే స్పీడ్ బ్రేకర్ వచ్చింది. పరిగెత్తుతున్న నేను కడ్డీ పట్టుకుని బస్సులో జొరబడ్డా. పట్టు తప్పబోయి పడిపోబోతున్న నా రెండవ చేతిని బస్సులో ఒకతను పట్టుకుని పైకి లాగేశాడు.

"కాయ్ కు రే! ఛడ్ నా నహీ ఆతా?" - ఇలాంటిదేదో వినబడింది. పక్కన తెల్లటి షేర్వాణీ, గంతల టోపీ, తాంబూల చర్వణం, సెంటు వాసన - ఇత్యాది భూషణాలతో ఇద్దరు సాహెబులు నవ్వుతున్నారు. నేనూ మొహమాటంగా నవ్వాను.

పదిహేడేళ్ళ వయసులో హైదరాబాదుతో నా తొలి అనుబంధం అది. నాయన వెంట ఎమ్సెట్ కౌన్సిలింగు కోసం నగరానికి వచ్చిన రోజులు. ’బస్సులో పరిగెత్తుకుని ఎక్కని హైదరాబాదీ తాబేలై పుట్టున్’ - అని హైదరాబాదు వాళ్ళ నినాదం. వాళ్ళలా చేస్తారనే డ్రయివర్లకు కూడా స్టాపులో బస్సునాపటం ఇష్టం ఉండదు.

అంతకు ముందు చాలా సార్లు బెంగళూరికి వెళ్ళి ఉన్నాను. అయితే బెంగళూరు కు వెళ్ళినప్పుడల్లా, ఒక ఆటవికుడు మొట్టమొదటి సారి నగరానికి వెళ్ళినట్టు ఉండేది. పైపెచ్చు మనది తెలుగు మీడియం కాబట్టి, అక్కడ మా బంధువుల పిల్లకాయలందరూ ఇంగిలీసు కాబట్టి భయంకరమైన పరిస్థితి. నా వేషభాషలు చూసి అందరూ నవ్వేవాళ్ళు. వాళ్ళదీ తప్పులేదు.

"What is your name?" అంటే "I am name Ravi" అంటే నవ్వరా వాళ్ళు?

అలాంటి పరిస్థితిలో ఉన్న నాకు హైదరాబాదు ’కొత్త’గా అనిపించింది. బెంగళూర్లో అపరిచితుడు మనతో ఆంగ్ల భాషలో మాట్లాడతాడు. ఇక్కడో? ’కాయ్ కు రే?’ - హెంత తేడా అసలు? బస్సును పరిగెత్తుకుని ఎక్కుట - ఎంత థ్రిల్లూ? హైదరాబాదుకు ఎట్లైనా సరే మళ్ళీ రావాలి - ఆలోచన పీకేసింది. ఆ ఛాన్సు పది రోజుల్లోనే వచ్చింది. స్టడీ సర్టిఫికెట్ మర్చిపోవడంతోటి, కవున్సిలింగు వాళ్ళు పది రోజుల్లో తెచ్చివ్వమన్నారు. అది తెచ్చివ్వడం కోసం మా నాన్నకు నచ్చజెప్పి నేనొక్కణ్ణీ హైదరాబాదుకు వచ్చాను.  ఈ సారి హైదరాబాదు మరింత అందంగా కనిపించింది. ఉస్మానియా పరిసరాలు భలే ఉన్నాయి! సికిందరాబాదు దగ్గర ఇరానీ చాయ్, నాంపల్లి పుల్లారెడ్డి స్వీట్లూ, కరాచీ బేకరీ బిస్కట్లూ ........హ్మ్... హైదరాబాదు లో ఏదో ఉంది!

ఫ్లాష్ ఫ్రంట్: తదనంతరకాలంలో బస్సులో పరిగెత్తుకుని ఎక్కే ఆర్ట్ ను నేను మాస్టర్ చేసేశాను. ఈ మధ్య తిరిగి హైదరాబాదులో అడుగు పెట్టినప్పుడు ఆ విద్య ప్రదర్శించి, వేగంగా వెళుతున్న బస్సులో విజయవంతంగా ఎక్కి, అందరూ నన్ను ఆరాధనాపూర్వకంగా చూస్తుంటే వాళ్ళవంక ఇలా ఒక లుక్కు ఇచ్చాను.

అయితే మరుసటి క్షణంలో నా మొఖం ఇలా మొఖంలా మారిపోయింది.

నా జేబులో కొత్తగా కొనుక్కున్న HTC మొబయిల్ ఫోను ఎవరో లేపేశారు. నేను బస్సుతో బాటు సమాంతరంగా పరిగెత్తి, సరిగ్గా బస్సు ఎక్కుతున్నప్పుడు ఒకడు న్యూస్ పేపర్ ను అడ్డుపెట్టి దాని కిందుగా చేయిపోనిచ్చి నా పై జేబులో ఉన్న ఫోను ఎత్తేశాడు. బస్సు ఎక్కుతూనే ఇది మెహ్దీ పట్నం బస్సు కాదా? అని అడుగుతూ దిగిపోయాడు....

****************************************************************************

మళ్ళీ భాగ్యనగర దర్శనం ఉద్యోగరీత్యా కలిగింది. ఈ సారి దర్శనం తో బాటు జీవనం కూడా. గుండు బొచ్చు లో....అదేనండి అలాంటిదేదో ఉంది కదా...హ్మ్....గచ్చీబౌలి అని అదన్నమాట. గుండు బొచ్చు ....అదే గచ్చిబౌలి అప్పట్లో చాలా పీస్ ఫుల్ ఏరియా. వినాయక నగర్ లక్ష్మి అనెక్స్ అపార్ట్మెంట్ లో రూమ్మేట్లతో కలిసి సావాసం.

ఓ రోజు...

శ్రీదేవి థియేటర్ లో రాత్రి సెకండ్ షో "జోష్" హిందీ సినిమా టికట్లు పట్టుకొచ్చాడు నా ఫ్రెండు. సినిమా కెళితే మొదలు పెట్టటానికి బాగా లేటయ్యింది. ఇంటికి వచ్చే సరికి రాత్రి ఒకటిన్నర గంటలవుతోంది. గచ్చిబౌలి పక్కన క్వార్టర్స్ లో మా వాడి ఇల్లు. వాడి ఇంటిదగ్గర దిగిపోతే నేను నడుచుకుంటూ వస్తున్నాను. పోలీసు జీపు పక్కన వచ్చి ఆగింది.

"ఏయ్ యాడకెళ్తున్నావ్?" - ఒక అధికార స్వరం
"ఇంటికి సార్"
"యాడకెల్లి వస్తున్నవ్?"
"సినిమాకి"
"టికెట్ చూయించు"
చూపించాను. టికెట్ నూ నన్నూ తేరిపార చూశాడతను. అతని యూనిఫారమ్ మీద ఖాన్ అని రాసుంది.
"హైదరాబాదుకు కొత్తా?" - నా అవతారం చూడగానే పోల్చుకున్నాడతను.
"అవును సార్"
చూడు, నీకింకా తెలుస్త లేదు, హైదరాబాదంటే. రాత్రి పూట తిరగాకు. - కుసో..అని బండ్లో కూర్చోబెట్టుకుని కాస్త దూరంలో ఉన్న ఇంటిదగ్గర దింపాడతను. చిన్న సంఘటన. ఎందుకో అతని మొఖం, ఆ రోజూ అలా నిల్చిపోయినై.

****************************************************************************

మా రూమ్మేట్లు అమెరికాకు పారిపోవడంతోటి గచ్చి బౌలి నుండి సికిందరాబాదుకు షిఫ్ట్ అయాను. కవాడిగూడా లో అపార్ట్ మెంటు. ఆరవ అంతస్తు. ఐదుమంది జనాభా. అందరిదీ మా ఊరే. ఇద్దరు ఉద్యోగులం, ఒకడు నిరుద్యోగి, ఇంకో ఇద్దరు చదువు.

ఆ ఇంటికి వాకబుల్ డిస్టన్స్ లో అబ్బాయ్ మెస్సు.
రన్నబుల్ డిస్టన్స్ లో క్రాస్ రోడ్స్. ఒక కుప్ప సినిమా థియేటర్లు.
జాగబుల్ డిస్టన్స్ లో టాంకు బండ్.

అందరూ సినిమా పిచ్చోళ్ళే. ఇంకేం? ప్రతి శుక్ర, శనివారాలు పండగే పండగ.

అక్కడా ఓ రోజు ... (ఆగస్ట్ 21. 2000 అనుకుంటా)

రాత్రి ఆఫీస్ నుండి వస్తూ వస్తూ రోడ్డు దాటి ఒక కిలో పెరుగు కొనుక్కొచ్చాం (శతమర్కటాలు x 5 = ఐదు వందల కోతులకు సరిపోవాలి కదా). అప్పుడు వర్షం మొదలయ్యింది. అప్పుడు మొదలైన వర్షం రాత్రంతా ఒక్క ఊపు ఊపేసింది. పొద్దున్నే ఆరవ అంతస్తు పక్కన డాబాపైకెళ్ళగానే దూరంగా హుస్సేన్ సాగర్ పరవళ్ళు తొక్కుతా కనిపించింది. నేను ముందు రోజు దాటిన రోడ్డు ప్లేసులో ఆరడుగుల యెత్తులో నీళ్ళు పారుతున్నాయి. ఆ పెట్టె అంగడి లేనే లేదు. భీభత్సం. వరద.

ఆ నీళ్ళల్లో దాటుకుంటూ ఆఫీసుకు బయలు దేరితే బేగంపేట దగ్గర బ్రిడ్జుకు పైన నీళ్ళు!

సీమ నుండి బయటకు అడుగుపెట్టి మొట్టమొదటి సారి నా జీవితంలో వరద అనుభవం.

ఆ రూమూ కొన్ని రోజులకు వదిలి ఒక్కణ్ణే మరోచోటికి షిఫ్టయ్యాను.

****************************************************************************

తాజ్ బంజారాలో అదేదో కంపెనీ లో నడకలోపల ముఖాముఖులు (Walkin interviews) జరుగుతుంటే వెళ్ళాను. ఇట్లాంటి వాటికి ఇస్టార్ హోటల్ లోపలికెళ్ళడం కోసమే అటెండ్ అవడం నాకు హాబీ. అట్లాంటి హై ఫై పరిసరాలను చూస్తేనూ, కోట్లూ గట్రా వేసుకుని సూటుకేసులు పట్టుకొని హడావుడిగా తిరిగే జనాలను చూస్తేనూ నేనొక ఆటవికుణ్ణి అన్న ఫీలింగు నాకు అప్పట్లో. అది పోగొట్టుకోవాలన్న తపనతో అలాంటి రోజుల్లో అట్టాంటి హోటళ్ళ దగ్గర తచ్చాడుతా ఉండేవాణ్ణి.

లిఫ్టు ఎక్కకుండా మెట్లెక్కి పైకెళుతున్నా. (లిఫ్ట్ ఎక్కి మూడవ ఫ్లోర్ కెళటానికి రెండు నొక్కాలా, మూడు నొక్కాలా అని తెలిసి ఛస్తే కదా). అక్కడ లాబీలో ఒక యువకుడు నీలిరంగు గళ్ళ చొక్కా, జన్యువుల (జీన్స్) పంట్లామూ తొడుక్కుని కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదువుకుంటున్నాడు. అతను పేపర్ నుండి ముఖం తిప్పి నా వంక చూశాడు. ఎంత హేండ్సమ్ గా ఉన్నాడు! బాగా తెలిసిన ముఖమే. ఛప్పున గుర్తుకు రాలే. ఎక్కడ చూశాను? మెట్లెక్కి పై ఫ్లోర్ కెళ్ళిన తర్వాత బల్బు వెలిగింది.

అతను -

అప్పటికతను కొన్ని సినిమాలు తీశాడు రాజకుమారుడు, వగైరా కానీ అంత పెద్ద హిట్లు కావు. భాగ్యనగరంలో ఇలా సైన్మా హీరో మరో చిత్రమైన సందర్భంలో ఒకచోట పుణుకులు తింటూ ఉంటే అగపడ్డాడు. అది మరీ శీను వైట్ల సినిమా సీనులా ఉంటుంది కాబట్టి రాయను.

****************************************************************************

హైదరాబాదులో ఎండాకాలంలో ఒక రోజు.

ఒక లారీలో మామిడి పళ్ళు అమ్ముతున్నారు. అవి నూజివీడు రసాలట. మా వైపు అవి దొరకవు. సరే ఒక కిలో (16 పళ్ళు) తీసుకున్నా. ఇంటికెళ్ళి మింగడం మొదలెడితే పదహారు దగ్గర ఆగింది. అప్పుడే అయిపోయాయా? ఛ. మళ్ళీ దండయాత్ర జరిపి కక్కుర్తిగా మరో మూడు కిలోలు తీసుకొచ్చాను. ఆ మూడు కిలోలు వరుసబెట్టి లాగించేశాను. ఆ రోజు బానే ఉంది. మరుసటి రోజు నుంచీ శరీరం ఇస్త్రీపెట్టెలా మారింది. మా ఫ్రెండ్స్ ఎలానో కనుక్కుని వచ్చి నా బాడీని మోసుకొని పోయి వాళ్ళ రూములో పారేశారు. అక్కడే వారం తిష్ట.

****************************************************************************

అమ్చీ హైదరాబాదులో ఉండగానే మా సంస్థ వాళ్ళు డబ్బులు కట్టి నన్ను జపాను భాష వెలగబెట్టమని శ్రీనగర్ కాలనీ లో ఒక ఇన్స్టిట్యూట్ కు పంపారు. పని చెయ్యమంటే బద్ధకం కానీ, ఇలా ఉద్ధరి బేరాలు తగిలితే విజృంభించమా యేంది? జపనీసు మూడు చెర్రీ బ్లోసమ్ పూవులు, ఆరు చెర్రీ కాయలూ లాగా సాగింది. రేవంతో సాన్ తో కొన్ని అడ్వెంచర్లూ, డిబెంచర్లూ చేయటానికి అవకాశం వచ్చింది. 

ఇంకా హైదరాబాదుతో అనుభవాలు బోల్డు, మినర్వా కాఫీబార్ లో కారప్పొడి ఇడ్లీలు, జయభేరి దగ్గరున్న సీతారామాంజనేయ స్వామి దేవస్థానం, విశాలాంధ్ర పుస్తకాలూ, సికందరాబాద్ సంతోష్ సినిమా లో ఇంగ్లీషు సినేమాలు, పాతనగరం లస్సీ, ఫెలూదా, హర్ష, వెంకటరమణా, అబ్బాయి మెస్సుల్లో మీల్సూ, అభిరుచి లో జున్నూ, శ్రీనగర్ లో నెల్లూరు వాళ్ళ కారం దోసె (ఇప్పుడు లేదు).....ఇంకా మా రూమ్మేట్లు సూర్య, చక్రి గాడి సినిమా కబుర్లూ, భాగ్యనగరంలో వర్షం.....

భాగ్యనగరం - మొదటిసారి ఉద్యోగరీత్యా వచ్చినప్పుడు - నాకు సమయమూ, డబ్బూ రెండూ అవసరమైన రోజులు. అప్పుడు మా అమ్మగారి చివరి రోజులు, ఇంట్లో కొన్ని అప్పులు. మా నాన్న తర్వాత నా హయాం మొదలైన రోజులు. ’భాగ్య’నగరం - పేరు నిలుపుకుంది. ఋణపడేలా చేసుకుంది. చాలా అవసరాలలో భాగ్యనగరం నన్ను ఆదుకొనింది. భాగ్యనగరం తో వ్యక్తిగతంగా నాకు ఏదో అనుబంధం ఉంది. డవుట్ లేదు.

34 comments:

 1. చాలా బాగుంది సర్ , ఇంచు మించు నాకు కూడా ఇలాంటి అనుభవాలే ఉన్నాయి మన భాగ్యనగరం లో . నాకు జీవితాన్ని నేర్పింది మన భాగ్య నగరమె.
  మీ అనుభవాలు నన్ను గత స్మృతులు తలచుకునేలా చేశాయి

  ReplyDelete
 2. చాలా బాగా రాసారు రవి గారు . ఎందుకో తేలియదు కానీ హైదరాబాద్ అంటేనే అదో అనుభూతి :-)

  ReplyDelete
 3. :)

  మా ఫ్రెండ్స్ అంటూంటారు ’ఎవరైనా హైదరాబాద్ లో బ్రతికేయగలరు, కాని ఇక్కడ బ్రతికినోడు ఇంకోచోట బ్రతకలేడు ఏదో కోల్పోతాడు’ అని

  ReplyDelete
  Replies
  1. ఇలాంటిది పూనాకు కూడా ఉందండి. న్యాయంగా నాకు పూనా ఎక్కువ నచ్చుద్ది, అయితే ఎందుకనో భాగ్యనగరం ’మన’ అన్న ఫీలింగు.

   Delete
 4. చాలా బావుంది రవి గారు. మీరు కథలో, నవలో రాయకుండా తెలుగు భాషకి ద్రోహం చేస్తున్నారనిపిస్తుంది :)

  ReplyDelete
  Replies
  1. అంత సీను లేదండి. ఏదో ఒక విషయంలో లోతుగా ఆలోచించగలిగినవాళ్ళు, లోతైన దృక్పథమో, అవగాహనో, అనుభూతో ఉన్నవాళ్ళు కథలు రాయాలి. :)) వ్యాసాలు మాత్రం చాలా రాయాలనుంది, ముఖ్యంగా విమర్శలు. కంటెంట్ చాలా ఉంది, అయితే టెక్నికాలిటీస్ తెలియట్లేదు.

   Delete
 5. venkat, Sravya, రహ్మాన్: అమ్చీ హైదరాబాద్. :)

  ReplyDelete
 6. రవి గారు మీకు ముందుగా థాంక్స్ చెప్పాలి...ఎందుకంటే మన ఉండే హైదరాబాద్ పై ఇంత బాగా రాసినందుకు..
  అలాగే మీ 'బ్లాగాడిస్తా!' టైటిల్ బావుంది...

  ReplyDelete
 7. నాకు గుర్తు రావడం లేదు కానీ ఆయన ఒక హిందుస్తానీ రాగాన్ని కూడా సృష్టించారు..

  ప్రతి ఘటన సినిమాలో కోట అడిగినట్లు "మీరు హైద్రాబాద్ ని తిట్టారా పొగిడారా" అని అడగాలనిపిస్తోంది నాకు.

  ఏమో నబ్బా, నాకు మాత్రం హైద్రాబాద్ అంటే ఆక్సిజన్ తో సమాజం. ట్రాఫిక్ రద్దీ.. ఆ వుంటుందీ, ఎక్కడ లేదు కనుక? పొల్యూషన్... ఉంటుందీ...ఏ వూర్లో లేదు?
  ఉర్దూలో హిందీ లో మాట్లాడ్డమంటారా? ఇప్పుడు హైద్రాబాద్ లో బోల్డు మంది కోస్తా జిల్లాల వాళ్ళే. ఓల్డ్ సిటీకీ వెళ్ళినా సరే, కస్టమర్లు వీళ్ళే కాబట్టి,తెలుగు మాట్లాడే వాళ్ళు సుబ్బరంగా ఉంటారు. నేనైతే చార్మినార్ లో కూడా (హిందీ వొచ్చినా సరే) తెలుగే మాట్లాడతా..

  మా మాదాపూరు, మా కొండాపూరు, మా ఝ్ణ్టూ, అక్కడి ట్రాఫిక్కు, ఆ రైతు బజారు, మా మియాపూరు సంతా, మా హైటెక్ సిటీ, ఆ సైబర్ టవర్సూ, మా మైండ్ స్పేసు, రహేజా ఐటీ పార్కు, ఆ పైన మా ఇనార్బిట్ మాలూ, అందులో, మల్టీ ప్లెక్సూ, ఆ దుర్గం చెరువూ..., మా శిల్పా రామం, (ఎక్కడి నుంచి వచ్చే చుట్టాలకైనా సరే నేను మాత్రం పర్మినెంట్ గైడూ),మా జూబిలీ హిల్స్ చెక్ పోస్టూ....

  అబ్బ, లాభం లేదండీ, మీరు చికాగో నుంచి ఈడ్చుకెళ్ళి చిక్కడపల్లిలో పడేశారు

  ReplyDelete
  Replies
  1. నేను హైదరాబాదును తిట్టినా అది ముద్దు చేసుకున్న పద్ధతిగా స్వీకరించాలి. :) ఎలా చెప్పాలో తెలీదు కానీ, హైదరాబాదు అంటే - ఇది మాదే అన్న ఫీలింగు. మొదటి సారి ఉద్యోగానికొస్తున్నప్పుడు బెంగళూరు వదిలి హైదరాబాద్ కొస్తావా? అక్కడ సాయిబులు కదరా అని, వెదర్ బాగోదని, ఇలా ఎన్నో చెప్పారు మా వాళ్ళు. ఎలా బదులు చెప్పాలో నాకు తెలీలేదు కానీ అవలక్షణాలు ఎన్ని ఉన్నా ఇది మా హైదరాబాదు. ఇదొక ఫీలింగ్ అంతే.

   ఆ మధ్యనెప్పుడో రాత్రి పన్నెండు గంటలకు అర్జెంటుగా ఊరెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు ఒక షేర్ ఆటో, ఆపై కుకట్ పల్లిలో ఒక బండి దగ్గర ఇడ్లీలు, అక్కడి నుండి సిటీబస్సు...ఏ మాత్రం ఖంగారూ, ప్లానింగూ లేకుండా అలవోకగా జరిగాయి. ఇలా బెంగళూర్ లో అసలు ఊహించుకోలేను.

   Delete
 8. I love Hyderabad.
  BTW, was that you who had the "Bava .. chee" experience?

  ReplyDelete
  Replies
  1. Bavarchee? No, I am a vegetarian, so, donno., కానీ నిన్ననే paradise కు వెళ్ళొచ్చాను.:))

   Delete
 9. Narayana swamy garu

  who had the "Bava .. chee" experience?_________అది త్రివిక్రం గారి అనుభవం అని గుర్తు :-))

  ReplyDelete
 10. ఇది చదివి ఎంత మంది ఎంత హోం సిక్నెస్ తొ బాధ పడుతున్నారో మీరు ఊహించగలరా?
  నా వరకు - భాగ్యనగరంలో వర్షం, వర్షం లో అప్పుడే తెరిచిన కాలేజీ రోజులు, మొక్క జొన్న పొత్తులు-deadly combination. Best days of my life-
  చాలా బాగుంది.
  శారద

  ReplyDelete
 11. ఈ మధ్యన బ్లాగ్సంన్యాసం తీసుకున్నాను, కానీ ఈ టపా చూస్తే ఏదోటి వ్రాద్దామనిపించింది. ఈ టపా తెఱిచాక ఒక అరగంటకు చదవడం మొదలుపెట్టేసరికి, ఇది బ్లాగాడిస్తా అని మరచిపోయి, ఎవరో తెలియని వ్యక్తిదనుకుని చదివాను. వ్యక్తిత్వం చాలా తెలిసిన వ్యక్తిదిలాననిపించింది. పైకి వెళ్ళి చూస్తే ఓ బ్లాగాడిస్తానా అనుకున్నాను.

  ReplyDelete
 12. పుట్టింది, పెరిగింది, మెట్టింది, గిట్టాలని అనుకుంటున్న మా హైదరాబాదు తప్ప వేరే ఏ ఊరు నాకు నచ్చదేమో.. కొద్దిరోజులు వెళ్లినా తిరిగి వచ్చేయాలని ఉంటుంది.. అమెరికాలో ఉండమంటే అచ్చంగా హైదరాబాదును తీసికెళ్లి అక్కడ పెట్టమంటాను తప్ప నేన్రానంటాను..:) జైహో హైదరాబాద్..

  ReplyDelete
 13. మొత్తం మీద ఖరీదైన వస్తువు పోగొట్టుకున్నప్పటి ఏడుపుగొట్టు మొహంలా ఉంటాడు శంకరశాస్త్రి అంటారు. LOL. ఆదరాబాదరా (రాజధానికి నోరు తిరగని చిన్ననాళ్ళ ముద్దుపేరు) అనుభవాలు బాగున్నాయి.

  ReplyDelete
 14. హైద్ విషయం లో నాకు కొన్ని వేరే అభిప్రాయాలున్నప్పటికి... మీ పోస్ట్ అవి మార్చేసాలా ఉందండి
  .......
  మాదీ హైదరాబాదే :)

  ReplyDelete
 15. నేను బహిఃప్రపంచంలోకి మొదటిసారి ప్రవేశించింది హైదరాబాద్ ద్వారానే. నా స్వభావరీత్యా ఆ ఊరిమీద ఎక్కువగా చికాకే పడ్డాను. చూసేవాడి దృష్టిని బట్టే ప్రపంచం ఉంటుంది. మీ దృష్టిని మాకు కూడా రుచి చూపిస్తున్నందుకు మీకు నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి.

  ReplyDelete
 16. బాగున్నాయండీ హైడ్రాబాడీ జ్ఞాపకాలు ;)

  ReplyDelete
 17. హైదరాబాద్ నా జీవితంలో నేను చెయ్యలేనేమో అన్న ఓ గోప్ప పని చేయించింది నా చేత.సొంత ఇల్లు కొనిపించిది,మా ఫ్రెండ్స్ అందరూ అంటారు అన్నా నీ జీవితంలో నువ్వు చేసిన ఒకే ఒక్క మంచి పని ఇదే అని.జయహో హైదరాబాద్.

  మీ అనిభవాలు సూపరంతే

  ReplyDelete
 18. భలే రాసారు!! జై హైద్రాబాద్ జై జై హైద్రాబాద్. ఓసారి మా మళయాళ ఫ్రెండొకడన్నాడు...ఇది "హైద్రాగుడ్" అని. :) హైదరాబాదు లో బతినవాళ్ళకి వేరే ప్రాంతంలో ఇమడడం కష్టమే. నా స్నేహితులు వేరే రాష్ట్రాలవారు కావాలని భాగ్యనగరంలో సెటిల్ అయినవాళ్ళున్నారు.

  హైదరాబాదు....నాకు మా విజయనగరం తరువాత అంతగా నచ్చే ఊరు. ఇల్లు తరువాత ఇల్లులాంటిది. నా జీవితంలో అత్యంత ప్రధానమైన సంఘటలన్నీ అక్కడే జరిగాయి. ఓ రకం గా నా జీవితం సెటిల్ అయిపోవడానికి కారణం హైద్రాబాదు. సెంట్రల్ యూనివర్సిటీ, లింగపల్లిలో KS బేకరీ, విందు, రాజ్బేకర్స్, గీత, జ్యోతి సినిమా హాళ్ళు, BHEL లో వెంకటేశ్వరస్వామి గుడి, 216,217 బస్సులు, తరువాత్తరువాత MMTS లు, కోటి లో పాతపుస్తకాల మార్కెట్, విశాలాంధ్ర, అబిడ్స్-కోటి లో ఆదివారం సెకండ్ హ్యాండ్ పుస్తకాల మార్కెట్, అబిడ్స్ లో తాజ్ రెస్టారెంట్ (చాలా చిన్నది, సందులోపలికుంటుంది...భలే ఉంటుంది), సికిందరాబాద్ స్టేషన్ వెనకాల బజార్, కుకట్‌పల్లి లో మల్లికార్జున, భ్రమరాంబ థియేటర్లు, శిల్పారామం, మెదహీపట్నం సార్వీ, సికిందరబాద్ పారడైజ్, విద్యానగర్, RTC క్రాస్రోడ్స్ లో అస్టోరియా హొటల్, బిర్లామందిర్ పక్కన కామత్, ISB, ఇదిరానగర్ లో చిన్న బెంగాలీ హొటల్ - వేడి వేడి పుల్కాలు, గచ్చిబౌలి స్టేడియం లో ఆటలు,....మీరు జ్ఞాపకాల తుట్టు కదిపి తప్పు చేసారు :)

  ReplyDelete
 19. అన్నట్టు కోటీ సుల్తాన్ బజార్, పాతబస్తీ చుడీబజార్, ముత్యాల కొట్లు, పుల్లారెడ్డి స్వీట్లు, చార్మినార్, లింగంపల్లి జైసంతోషి పానిపూరి...ఈ ప్రవాహం ఆగేది కాదులెండి :))

  ReplyDelete
 20. "ఇలాంటిది పూనాకు కూడా ఉందండి. న్యాయంగా నాకు పూనా ఎక్కువ నచ్చుద్ది,"

  ఎంత బావుందో మీ అభిప్రాయం ! ఉన్నమాట చెప్పేరు....

  ReplyDelete
 21. బాగున్నాయండీ :)

  ReplyDelete
 22. టపా బాగుందండీ.. హైదరాబాద్ తో నా అనుబంధం పరిమితమే కానీ ఉన్న నాల్రోజులు చక్కగా అక్కున చేర్చుకుంది నన్ను.

  ReplyDelete
 23. టపా చాలా బావుందండి.హైదరాబాద్ అంటే నాకు ముందుగా గుర్తొచ్చేది మిరపకాయ బజ్జీలు,టాంక్‌బండ్,ఆర్.టి.సి.క్రాస్ రోడ్సే.

  ReplyDelete
 24. Mee blog chadavadam idhe modati sari..endukante nenu ninne blogging start chesaanu.. chaala bagundandi mee shaili. especially mee blogadistha title:)mee lanti blogs chaduvuthunte naaku kuda inka baga rayali ane inspiration vasthundandi :)

  ReplyDelete
 25. రవి: మనము తెలుగు బ్లాగరుల సమావేశంలో కలిశాము. మీ e-mail, దూరవాణి సంఖ్య తీసుకోవటం మరిచాను. అవి ఇంకా మీ facebook నామధేయంతో నాకు ఒక జాబు వ్రాస్తారా?
  cbraoin at gmail.com

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.