Wednesday, March 20, 2013

వ్యక్తివివేకం

భ్రమ ధార్మిక! విస్రబ్ధః స శునకోऽద్య మారితస్తేన |
గోదానదీకుచ్ఛకుడంగవాసినా దృప్తసింహేన ||

------------------------------

గాథాసప్తశతి లో ఉన్నట్లు చెప్పబడుతున్న శ్లోకం అది. (ఆ శ్లోకం అందులో ప్రక్షిప్తమని కొందరు) ఆ శ్లోకం గురించి నిదానంగా చెప్పుకుందాం. అది ’ధ్వని’ కి ఒకానొక ఉదాహరణ.

ఒక మాటను సూటిగా - అంటే వాచ్యంగా కాక వ్యంగ్యంగా చెప్పటం ధ్వని అని ఒక సిద్ధాంతం. ఇలా చెప్పడమే ’గొప్ప’ అని, ఉపమా, ఉత్ప్రేక్ష్య ఇత్యాది అలంకారాలు కావ్యానికి శరీరం అయితే ’ధ్వని’ అనేది కావ్యం తాలూకు ఆత్మ అని, రామాయణాది కావ్యాలలో ఉన్నది ధ్వని యేనని, అందుకే అవి ఉత్తమ కావ్యాల కోవకు చెందుతాయని ఆ సిద్ధాంతం చెబుతుంది. దీని కర్త ఆనందవర్ధనుడు. ఈయనది 9 వ శతాబ్దం. అంతకు ముందు కావ్యం తాలూకు ఆత్మ రీతి అని, అలంకారాదులని, అదని ఇదని తెగ కొట్టేసుకుని, ఈ ’ధ్వని’ కాన్సెప్టు వచ్చిన తర్వాత అందరూ సైలెంటయిపోయేరు.

ఈ ధ్వని కాన్సెప్టుకు మన మనుచరిత్రలో వరూధిని మంచి ఉదాహరణ.

పాటున కింతులోర్తురె కృపారహితాత్మక! నీవు త్రోవ ని
చ్చోట భవన్నఖాంకురము సోకె!

- ’ఇచ్చోట’ భవన్నఖాంకురము సోకె - అని ఆమె చెప్పటం ఒక ధ్వని. (ఈ పద్యం మొత్తం సారాంశం తీసుకుంటే ధ్వని కాదనుకోండి. అందుకే ఇక్కడే ఆపాం.)

’ఒరే, నన్ను ఇలా తోసేశావే, నీవు తోసేప్పుడు నీ గోరు ఇదుగో ఇక్కడ, ఇక్కడ గుచ్చుకుంది చూడు’ అని వరూధిని ప్రవరాఖ్యునికి చూపిస్తుందన్నమాట. (ఎక్కడ అని అడిగిన వాళ్ళు బెంచీ మీద నిలబడండి.) - అంటే పైకి చెప్పే అర్థం - (విధేయార్థం అంటారు దీన్ని) ఒకటి. చెప్పదల్చుకున్న ఒరిజినల్ అర్థం (ప్రతీయమానార్థం అని దీని పేరు) మరొకటి.

సాఫ్టు వేరు వాళ్ళకు అప్రైసల్ టైం లో వాళ్ళ మానేజరు ఈ ధ్వని పద్ధతిలోనే మాట్లాడతాడు. కాబట్టి వాళ్ళకు వీజీగా అర్థం అవచ్చు. ఇంకా నిత్యజీవితంలో ఎన్నో చోట్ల ధ్వని కనిపిస్తుంది. ఇది వరకటి రోజుల్లో భార్యలు కూడా భర్తలతో ముఖ్యంగా జీతాలొచ్చే సమయంలో ’ధ్వని’ పద్ధతిలో మాట్లాడేవాళ్ళట. ఆ ’ధ్వని’ కి భర్త స్పందించకపోతే ధ్వని పద్ధతిని వదిలేసి ఏకంగా ధ్వనితోనే మాట్లాడేవాళ్ళట. ఇది నిన్నటి తరం భార్యల సంగతి. నేటి భార్యల సంగతి -  ప్రస్తుతానికి - అప్రస్తుతం. :)

ఇలా ఈ ధ్వని సిద్ధాంతం - కావ్యంలో కవి భావనలను ఎలా చెప్పాలో చెప్పి తిరుగులేని బావుటా ఎగరేసింది. కావ్యం అంటే మరేమీ లేదా? ఇలా చెప్పదల్చిన దాన్ని చెప్పకుండా చెప్పటమేనా అని కొన్ని ’ముక్కుసూటిగా’ ఆలోచించే హృదయాలు గాయపడి బాధపడినయ్. ఆ గాయపడిన లిస్టులో ఒకానొక తిరుగుబాటుదారుడు - మహిమభట్టు.

ఈ మహిమభట్టు ధ్వని సిద్ధాంతాన్ని ఖండిస్తూ ఒక పుస్తకం వ్రాసినాడు. ’ఖండిస్తూ’ అని కాస్త సభ్యభాషలో చెబుతున్నాను కానీ, నిజంగా వ్యవహారం వేరేలా ఉంటది. అంకుశం సినిమాలో రాజశేఖర్ రామిరెడ్డిని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళే రేంజులో ఈయన ధ్వని సిద్ధాంతాన్ని కుళ్ళబొడుస్తూ వెళతాడు.

ధ్వని సిద్ధాంతాన్ని నిర్వచిస్తూ ఆనందవర్ధనుడు చెప్పే శ్లోకం ఇది.

యత్రార్థః శబ్దో వా తమర్థమ్ ఉపసర్జనీకృతస్వార్థౌ |
వ్యఙ్క్తః కావ్యవిశేషః సః ధ్వనిరితి సూరిభిః కథితః ||

తాత్పర్యము: ఎక్కడ (ఏ కావ్యంలోనైతే) అర్థం కానీ, శబ్దం కానీ తనను అప్రధానంగా చేసుకుని ప్రతీయమానార్థాన్ని వ్యక్తీకరిస్తుందో అది విశేషమైన కావ్యం అని పండితులచేత చెప్పబడింది.

ఈ Definition శ్లోకంలోనే మహిమభట్టు పది తప్పులు చూపెట్టాడు. ఆ తర్వాత ఇక వీరంగమే. అదంతా గొప్ప శాస్త్ర చర్చ.

మహిమభట్టు పుస్తకం పేరు వ్యక్తివివేకం. ఇక్కడ వ్యక్తి - ’అభివ్యక్తి’, ’వ్యక్తీకరణ’ - వీటిల్లో ఉన్న వ్యక్తి. Expression అన్నట్లు. ఈ ’వ్యక్తి’ తాలూకు పూర్వాపర జ్ఞానాన్ని చెప్పటమే ఈ ఈ పుస్తకం తాలూకు ముఖ్య ఉద్దేశ్యం. ఈయన ప్రధానంగా చెప్పేదేమంటే - పొగ లేకుండా నిప్పు లేదు. ధూమవత్ అగ్నిః. ఎంతటి అవివేకి కూడా వాచ్యార్థాన్ని మాత్రమే పట్టించుకోడు. అనుమానప్రమాణంతోటి ఎదుటివాడు ఏం చెబుతున్నాడోనని కనీసం ఆలోచిస్తాడు. ఇందాక వరూధిని ’ఇచ్చోట’ అనగానే ఓహో అలాగనా అని అమాయకంగా అడిగేవాడు అవివేకి. వివేకి అయితే వరూధిని ఏమి చెబుతున్నదని గ్రహిస్తాడు. ఎలా గ్రహిస్తాడు? అనుమానప్రమాణం తోటి. అంటే ధ్వని అని ఏదయితే అంటున్నారో అది అనుమానంలో అంతర్భాగమే తప్ప ’ధ్వని’ అని కొత్తగా ఏదీ లేదన్నమాటే కదా?

ఇది ఈయన లాజిక్.

ఈ మహిమభట్టుది, ఆ పెద్దాయన ఆనందవర్ధనునిది ఇద్దరిదీ కాశ్మీరదేశమే. ఇద్దరూ కాశ్మీరశైవులే. అయితే మహిమభట్టు నైయాయికుడు. (న్యాయ దర్శనాన్ని అనుసరించే వారిని నైయాయికులు అంటారు. వీళ్ళు ఒక టైపు నాస్తికులు. అంటే దేవుడు అనే quadratic expression ను - నమ్మకంతో కాక - అనుమానంతో సాధిస్తారన్నమాట). దానికి తోడు ఈ మహిమభట్టు కాస్త బౌద్ధాన్ని వంటబట్టించుకున్నట్టున్నాడు.

ఒక వస్తువును - ఇది ’ఫలానా’ అని బౌద్ధులు నిర్వచించరు. ఎందుకంటే ఫ - లా - నా అని పలికేలోపు ఆ వస్తువులో ఎంత సూక్ష్మపరిధిలోనైనా సరే మార్పు వచ్చేసుంటుంది. వీడు ’రాముడు’ - అనే లోపలే సదరు రా-ము-డు గారికి మూడు క్షణాల ఆయుష్షు పెరిగింది. అతని తలలో వెంట్రుక ఒక మైక్రాను పరిమాణంలో నెరిసి ఉంటుంది. అంటే ఇందాకటి, మూడు క్షణాల క్రిందటి రాముడు, ఇప్పటి రాముడు వేరు. ఇవతల చూసేవాడిలోనూ మార్పొచ్చీసింది. బయట ప్రపంచంలోనూ మార్పొచ్చేసింది. ఒక క్షణంలో గోదావరిలో కొన్ని గేలన్ల నీరు సముద్రం చేరేసింది. రాముడు లేడు. రాముడిలో 'మార్పు' మాత్రమే ఉన్నాది. అంటే ’మార్పు’ మాత్రమే real. మరేదీ కాదు. మరి - ఇందాకటి రాముణ్ణి రాముడు ++ లాంటిదేదో అనాలికానీ రాముణ్ణి - రాముడు అనే అనడం తప్పు కదూ? - ఇది బౌద్ధుల - దిమ్మ తిరిగింపజేసే లాజిక్.

మహిమభట్టు లో ఆ ఛాయలు గోచరిస్తాయి. శబ్దానికి అభిధ, లక్షణ, వ్యంజన అని మూడు రకాల స్వరూపాల అర్థాలున్నయని మనవాళ్ళు పాపం ఏదో కాస్త సమాధానపడ్దారు. ఈ మహిమభట్టు ప్రకారం శబ్దానికి ’అభిధ’ మాత్రమే ఉంటుంది. అని అడ్డం తిరుక్కుని వాదిస్తాడు. ఇదీ చాలా గొప్ప వాదన.

ఇలా ఈయన ధ్వని సిద్ధాంతాన్ని మూలమట్టంగా విమర్శిస్తూ పోతాడు. ఇదంతా చాలా గొప్పగా ఉంటుంది, చాలావరకూ అర్థం కాదు కూడా. పన్లోపనిగా ఈయన కుంతకుడనే మరొక అలంకారికుణ్ణి (అతని సిద్ధాంతం వక్రోక్తి - అంటే చమత్కారంగా చెప్పుట) తన్ని తగలేస్తాడు.

------------------------------

ఈ బేక్ గ్రవుండ్ తోటి మొదట స్టార్టింగులో చెప్పిన శ్లోకం, దాని అర్థం, దాని కథాకమామీషు చెప్పుకుందాం. ఇది మహిమభట్టు లాజిక్ లా ఉండదు, భయపడకండి. నిజానికి లడ్డూ లాంటి శ్లోకం ఇది.

భ్రమ ధార్మిక! విస్రబ్ధః స శునకోऽద్య మారితస్తేన |
గోదానదీకుచ్ఛకుడంగవాసినా దృప్తసింహేన ||

ఈ శ్లోకానికి ఒక బేక్ గ్రవుండు ఉంది. ఇదీ -

మాంచి పరువంలో ఉన్న నాయిక తన ప్రియునితోటి గోదారి గట్టుకాడ ఒక తోటలో అంతకు ముందే అనుకున్న సంకేతస్థలంలో కలుసుకుందామనుకుంది. అక్కడకెళ్ళి చూస్తే ఒక బాపనాయన (ధార్మికుడు) ’పూజలు చేయా పూలు కోస్తాను’ అని పాడుకుంటూ పూలు తెంపుకోడానికి వచ్చినాడు. వేళకాని వేళలో అతనలా దాపురించడానికి ఒక కారణం ఉంది. అతనికి కుక్కలంటే అలర్జీ. ఆ చుట్టుపక్కల ఓ కుక్క ఉన్నది. ఆ కుక్క ఇప్పుడు ఇతను వచ్చిన టైములో డ్యూటీకెళ్ళింది కాబట్టి రాదు. అది కనిపెట్టి మనవాడు పూలు తెంపుకోడానికి వచ్చాడు. ఈమె అతణ్ణి చూసింది. "అబ్బా! శనిగాడు!" అనుకుంది. అతనితో ఈ శ్లోకం చెప్పింది.

ఓ ధార్మికుడా! ఇక నువ్వు స్వేచ్ఛగా (ఈ ప్రాంతాలలో) తిరుగాడు! ఆ పాడు కుక్క ఉందే, దాన్ని ఈ దగ్గర్లో నదిపక్కన పొదల్లో నివాసముండే సింహం చంపేసిందిలే. ఆ కుక్కకు భయపడే పని లేదింక!

ఇదీ ఆమె పైకి చెప్పిన అర్థం.

దీనికి ’ధ్వని’ కారుడు చెప్పిన ప్రతీయమానార్థం ఇది - ’ఓ ధార్మికుడా! ఇక్కడకు రాబాకు. ఇక్కడ సింహం ఉన్నాది. అది కుక్కను చంపేసింది, నిన్నూ చంపేస్తూంది. వెళ్ళిపో’ (నీవు దయ చేస్తే నేనూ నా ప్రియుడూ కలిసి ఏదో తృతీయపురుషార్థసాధన చేసుకుంటాము)

------------------------------

దీనికి మహిమభట్టు అబ్జెక్షన్లు చాలా లేవదీశాడు. అన్నిటికన్నా పక్కాగా ఉన్నది, నాకు బాగా నచ్చినదీ అయిన అబ్జెక్షన్ ఇది.

- సింహం కుక్కను చంపేసింది, ఇక నువ్వు కుక్కకు భయపడకుండా ’తిరుగు’ అనగానే ఆ బ్రాహ్మణుడు తెలివైన వాడైతే ఇలా ఆలోచిస్తాడు.

- తిరుగు అని అంటా ఉంది. అదీ వినమ్రతతో అంటా ఉంది. కానీ సింహం ఉంది అని భయపెడతా ఉంది. సింహం కుక్కకంటే బలమైనది. సింహమే వచ్చి ఉంటే సింహం వస్తుంది పారిపో అని చెప్పకుండా - అలా అలవోకగా, సావకాశంగా, ఆమె కూడా సింహమొస్తుందన్న టెన్షన్ పడకుండా - నన్ను పారిపొమ్మని చెప్పకుండా - ఇక్కడ నీకు వచ్చిన అడ్డంకీ యేమీ లేదులే, హాయిగా పూలు కోసుకో అని అసంబద్ధంగా ఎందుకు చెబుతా ఉంది?

అంటే ఈమె చెబుతున్నది నిజం కాదు.

ఇలా బ్రాహ్మణుడు సహజంగానే ఆలోచిస్తాడు. ఎందుకంటే అతను వివేకి కాబట్టి, లేదా కనీసం ఆ అమ్మాయికున్న తెలివితేటలు అతనికి ఉంటాయి కనుక.

అలా బ్రాహ్మణుడు ఆలోచిస్తాడన్న సెన్సు ఆమెకు ఉంటే అలా చెప్పదు. అంటే - ఈ పద్యం అనౌచిత్యమూ, ధ్వని సిద్ధాంతానికి విపరీతంగానూ ఉన్నది. అంచేత ధ్వని సిద్ధాంతం తప్పు.

ఇంకా ఆలోచిస్తే ఎంత సింహమైనా తన స్టేటస్ కు తగిన జంతువులను చంపి తింటుంది కానీ, కుక్క వెంటబడి చంపదు. అది లోకవ్యవహారానికి భిన్నంగా ఉంది. ఇది అనౌచిత్యం. మరి ఆ ధ్వని కారుడు మేనర్సు లేకుండా తప్పుడర్థాలెందుకు చెబుతా ఉన్నాడు?

------------------------------

ఏతావతా ధ్వని అనేదే లేదు.

ఇలా ధ్వనికారుడు చెప్పే ఒక్కో ఉదాహరణనూ ఈ మహిమభట్టు తాట వలిచేస్తూ, వెళతాడు. ఈతని వాదనలన్నీ చాలా గొప్ప లాజిక్ తోటి ఉంటాయి. ఇందాక అన్నట్లు అర్థం కావు కానీ, ధ్వన్యాలోకాన్ని, ఈ వ్యక్తివివేకాన్నీ పక్కపక్కన పెట్టి చదువుకుంటూ పోతే అర్థమయినంత మేరా భలే ఎంటర్ టయిన్ మెంటు. అలాగని ఈ మహిమభట్టుగారు ఏదో కోపంతోనో, ఈసడిస్తున్నట్టో, ఆనందవర్ధనుణ్ణి తిడుతున్నట్టో ఉండదు. గ్రంథం మొదట్లో ఆనందవర్ధనుణ్ణి మనసారా అభినందించి, గొప్పవాళ్ళను విమర్శించడం కూడా యశస్సుకు దోహదమని చెప్పుకుంటాడు.

వాదనలు రాజవాదమని, పండితవాదమని రెండురకాలట. రాజవాదమంటే - వాదించే వ్యక్తి పూర్తీగా తనంతట తానే అన్ని విషయాలనూ కూలంకషంగా తను నమ్మిన/ఆచరించే/ఆదర్శంగా పెట్టుకున్న సిద్ధాంతాలకనుగుణంగా విమర్శ చేయటం. పండితవాదమంటే - ఇద్దరూ కలిసి విషయాన్ని అటూ ఇటూ పొర్లించి చూడటం. పండితవాదానికి మిళిందపన్హ అనే బౌద్ధగ్రంథం గొప్ప ఉదాహరణ అయితే, రాజవాదానికి వ్యక్తివివేకం గొప్ప ఉదాహరణ

15 comments:

 1. హహహ. ఈ రోజుదయాన్నే మంచి లడ్డూ లాంటి పోస్టు తినిపించారు. :)
  మహిమభట్టు వ్యక్తివివేకం చదవాలి. దీన్ని ఎవరైనా తెలుగు చేసారా?

  ఆ గాథాసప్తశతి శ్లోకంలో అసలు ప్రతీయమానమయ్యే అర్థం, "నీవు దయ చేస్తే నేనూ నా ప్రియుడూ కలిసి ఏదో తృతీయపురుషార్థసాధన చేసుకుంటాము" అనుకుంటాను. :) అలా అనుకుంటే మహిమభట్టు చూపిన అభ్యంతరాలు తొలగిపోతాయేమో.
  "అలా బ్రాహ్మణుడు ఆలోచిస్తాడన్న సెన్సు ఆమెకు ఉంటే అలా చెప్పదు." - అలా బ్రాహ్మణుడు ఆలోచిస్తాడన్న సెన్సుతోనే, అలా ఆలోచిస్తే, ఎలాగో అలా అతన్ని అక్కణ్ణుంచి దయచేయమని చెప్పడమే తన ఆంతర్యమని అర్థమవుతుందని ఆమె అలా చెప్పిందని అనుకోవచ్చు కదా?

  ReplyDelete
  Replies
  1. ఆంధ్రవ్యక్తివివేకము
   భాగవతుల కుటుంబరావు గారు, (ఆంధ్రజాతీయకళాశాల మాజీ ప్రాంశుపాలురు)
   మచిలీపట్టణం తెనిగించారు. ఐ.టీ ఎమ్ ట్రస్టు ముంబాయి వారి వద్ద లభిస్తుంది నాకు హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో కనబడితే కొన్నాను.
   ITM Trust.
   103/104 Centre point bldg,
   18th rd, chembur, mumbai.
   Ph: 25280063
   డీ ఎల్ ఐ లో వ్యక్తివివేకం కనిపించట్లేదు.

   Delete
 2. >> దీన్ని ఎవరైనా తెలుగు చేసారా?

  తెలుగు చేశారండి. ఇంటికెళ్ళి చూసి చెబుతాను.

  మీరు చెప్పిన ప్రతీయమానార్థం ఆనందవర్ధనుడు చెప్పలేదనే ఈ మహిమభట్టు గొడవ. 'భ్రమ ' - ఇది విధేయార్థమని, 'మా భ్రమ ' అని ప్రతీయమానార్థం అని తద్వారా అత్యంత తిరస్కృతవాచ్యధ్వని అని ఆయన అన్నాడని ఈయన తిరుగుబాటు. :)

  >>అలా బ్రాహ్మణుడు ఆలోచిస్తాడన్న సెన్సుతోనే, అలా ఆలోచిస్తే, ఎలాగో అలా >>అతన్ని అక్కణ్ణుంచి దయచేయమని చెప్పడమే తన ఆంతర్యమని >>అర్థమవుతుందని ఆమె అలా చెప్పిందని అనుకోవచ్చు కదా?

  అనుకోవచ్చునండి. :) అప్పుడు అదీ గుణీభూతవ్యంగ్యమో మరేదో అవుతుంది. ఆమె చిక్కులు తొలగిపోతాయేమో కానీ, సంస్కృత విద్యార్థులకు చిక్కులెక్కువవుతాయి. :)


  ReplyDelete
 3. చాలా బాగుంది.

  ఆయన ధార్మికుడు (బాపనాయన). ఈవిడ స్వైరిణి. 'ధార్మిక' అన్న సంబోధనని 'పంతులు గారూ' అని తెలుగులోకి అనువాదం చేసుకుంటే మనకి ధ్వని చక్కగా తెలుస్తుంది - వాదాలూ, సిద్ధాంతాల సంగతెలా ఉన్నా!!

  మీరు కాళిదాసు వ్రాసాడని చెప్పబడే శృంగార తిలకమ్ చదివారా? ధ్వని సంగతి తెలియదుకానీ బుఱ్ఱ తిరిగిపోయే చమత్కారం ఉంటుందా శ్లోకాల్లో కూడా.

  ReplyDelete
 4. నాగమురళి గారు: శృంగార తిలకం అమరుకసింహుడిదన్నట్టు ఎక్కడో చదివాను. అది నేను చదవలేదు కానీ అందులో శ్లోకాలు అక్కడక్కడా అలంకారికులు పేర్కొన్నారు.

  ReplyDelete
 5. >> రాముడు++
  :-) అయితే ఇప్పుడు నేను తల్చుకునే రాముడ్ని ఏమని పిలవాలి? రాముడు++ అనడం కష్టం ఎందుకంటే ఆయన పోయి రెండు యుగాలు గడిచిపోయినై; ఒక + ఒక యుగానికి సమానం అనుకుంటే సరిపోతుందేమో లెండి.

  ReplyDelete
 6. చక్కటి వ్యాసం.అభినందనలు. గాథా సప్తశతిని శ్రీ రాళ్ల పల్లి అనంత కృష్ణ శర్మ గారు తెనిగించారు.ఆ పుస్తకం ఇప్పుడు నా వద్ద లేదు కనుక మీది శ్లోకానికి తెలుగు అనువాదమేమిటో చెప్ప లేను.కొన్ని గాథలను మహీధర నళినీ మోహన్ గారు అనుకుంటాను తెలుగు చేస్తే ఆంధ్ర జ్యోతి వీక్లీ లో పురాణం వారు ప్రచురించారు.

  ReplyDelete
  Replies
  1. నమస్కారాలండి. రాళ్ళపల్లి వారి గాథాసప్తశతీసారము నా దగ్గర ఉందండి. అయితే చదవడానికి ఓపిక లేదు. మహీధర నళినీ మోహన్ గారి రచన గురించి తెలుసుకోవాలని ఉంది. ఆయన నాకు చిన్నతనం నుండి జ్ఞానభిక్ష పెట్టిన మహామనీషి. నా చదువూ, ఉద్యోగం అన్నిటికీ ఆయన పుస్తకాలు పరోక్షంగా కారణం.

   Delete
 7. నా కామెంట్ ఈ పోస్ట్ కి రిలేటెడో కాదో తెలియదు కానీ, http://kinige.com/kbook.php?id=1332&name=Prakruta+Gatha+Saptasati దగ్గర ప్రాకృత గాధాసప్తశతి ఉంది.

  ReplyDelete
 8. భలే ఉంది. మళ్ళీ ఇంకోసారి తీరిగ్గా చదవాలి.

  మీ పోస్ట్లు అన్నీ ఆలోచింపచేసేవి గా ఉంటాయి. తెలుగులో సంస్కృతం లో తెలుసుకోవాల్సినవి ఇన్ని ఉన్నాయా
  అనిపిస్తుంది .

  మహీధర నళినీ మోహన్ గారు - ఈయన సైంటిస్ట్ అని ఇప్పుడే తెలిసింది. వీరి గురించి ఒక వ్యాసం వ్రాస్తే నాలాటి వాళ్ళకి తెలుస్కోడానికి ఉపయోగపడుతుంది . (వికీ లో పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు ఈయన గురించి )

  ReplyDelete
 9. మీ పోస్ట్ లు చాలా బాగుంటాయి. ప్రాచీన చమత్కార, శ్రంగార సంభాషణలమీద పోస్ట్ వ్రాయవలసిందిగా కోరుతున్నాను.

  ReplyDelete
 10. వాదం ఛలం కానంతవరకూ ఏదైనా ఫర్వాలేదేమోనండీ. విలువైన టపా.

  ReplyDelete
 11. నాది కూడా కామేశ్వర రావు గారి మాటే. ఈ రోజుఉదయాన్నే మంచి లడ్డూ లాంటి పోస్టు తినిపించారు. :)
  thank you.

  ReplyDelete
 12. ఆ అమ్మాయి చెప్పిన విషయంలోని అనౌచిత్యం ఆ అమ్మాయి దాస్తున్న కారణానికి అద్దం పడుతోందని గ్రహించలేడూ ఆ ధార్మికుడు? పేకాటలో "ఆస్కింగ్ కార్డ్" కాన్సెప్ట్ గుర్తుకొచ్చింది ఆ అమ్మాయి మాటలు వింటూంటే.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.