Monday, January 7, 2013

జంతు ప్రపంచం


ఆర్నెల్ల క్రితం హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ అయింది నాకు. వచ్చిన తర్వాత కొన్నాళ్ళకు ఒక వినూత్నమైన, అద్భుతమైన సత్యం నాకు తెలిసింది. బెంగళూర్ లో లాగా వీధికి కనీసం పదికుక్కల చొప్పున లేవు. బహుశా నాగార్జున వాళ్ళావిడ అమల ఆ మధ్య శేఖర్ కమ్ముల సినిమా షూటింగ్ లో తలమునకలై కుక్కల బాధ్యతను విస్మరించినట్టుంది.

బెంగళూరులో వీధిలో ఒక రాయి విసిరితే, అది - అయితే సాఫ్టు వేర్ వాడికి లేదా కుక్కకు తగులుద్ది అని ఒక సూక్తి. అదొక భయంకరమైన నిజం.

బెంగళూరు లో మొరుగేశ్ పాళ్యలో, ఉన్న భయానకమైన రోజులు మర్చిపోలేను. చీకటి వేళల్లో పిల్లిలాగా, శబ్దం చేయకుండా నడవడం ప్రాక్టీసు చేసి అందులో నిష్ణాతుణ్ణయినా, గుండెలు పీచుమనేవి. మా ఇంటి గేటు దగ్గర ఆఖరు గండం ఉండేది. ఆ చివరి మజిలీ దాటి, ప్రపంచాన్ని జయించినట్లు ఫీలయిన సందర్భాలెన్నో. ఆ బాధలు అలా పడీ ఓ రోజు దేవుడిని ప్రార్థించాను.

దేవుడా,
ఎక్కడ వీధికి పదికుక్కలు లేవో
ఎక్కడ రాత్రుళ్ళు ప్రశాంతంగా గడుస్తుందో
ఆ ఊరికి నన్ను తరిమేసెయ్

ఆ ప్రార్థన ఫలించినట్టుంది. భాగ్యనగరంలో నేను ఆద్దెకున్న వీధిలో మూడు కుక్కలే ఉన్నాయి. అవి కూడా మొరగటం లేదు.

ఇలా ఆనందదాయకమైన ప్రపంచంలో ఉంటూ - ఓ సాయంత్రం సూపర్ బజార్ నుండి సరుకులు తెస్తుండగా - ఒక కుక్క ’భవాన్ భిక్షాం దేహి’ అని వెనుక పడింది. యే మాత్రం మొరగకుండా అహింసాపద్ధతిలో భిక్ష అడిగిన ఆ సాత్విక శునకాన్ని చూసి నా హృదయం స్పందించింది. (నా చొక్కా పై జేబులో సెల్ ఫోను ఉంటుంది). ఒక బిస్కట్ ముక్క విసిరాను.

అదే నేను చేసిన తప్పు.

ఆ శునకం కేవలం క్రీమ్ బిస్కట్లనే తింటుందని, ఆ నియమం ఉంది కనుకనే తుచ్ఛమైన ఇతర బిస్కట్ల జోలికి పోదని నాకు అప్పుడు తెలియలేదు. మరుసటి రోజు యథావిధిగా మరోసారి సూపర్ బజార్ నుండి వస్తుంటే - ఆ శునకం దగ్గరకొచ్చింది. ఈ సారి నేను కాస్త బెట్టు చేశాను. ఆ కుక్క నన్ను చూసి స్వల్పంగా ’గుర్’ మన్న హలోట్యూను చేసి చుట్టూ చూసింది.

అర్థమయ్యింది నాకు. అదొక పెద్ద ఇంటలెక్చువల్ కుక్క. దాని సంకేతానికి అర్థం - క్రీమ్ బిస్కట్ ఇస్తావా లేక దూరంగా కుతూహలంగా చూస్తున్న శునకరాజాలను పిలవమంటావా? అని. ఆ బలహీనమైన క్షణంలో నేను ఆ శునకానికి లొంగిపోయాను.

అదే నేను చేసిన రెండవ తప్పు.

అలా ఆ ఇంటలెక్చువల్ కుక్క నన్ను మానసికంగా లోబర్చుకుంది. ప్రతిదినం సాయంత్రం ఇంటికి వచ్చే ముందు క్రీమ్ బిస్కట్ల కోసం షాపింగుకు వెళ్ళటం ఆనవాయితీ అయింది నాకు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే - ఇల్లు మారాలి. తప్పదు.

అలా ఇల్లు మారేను.

ఇప్పుడు ఉన్నది కొత్త ఇల్లు. ఇక్కడ కుక్కలు లేవు కానీ కొన్ని రోజులకు ముందు - పొద్దునే ఆఫీసుకు తగలడుతుంటే ఇంటి బయట ఒక నల్లని జీవి కనబడింది. ఆ జీవిని మార్జాలంగా నా మెదడు గుర్తించింది. పిల్లుల గురించి నాకొక ఫ్లాష్ బ్యాక్ ఉంది.

*********************************

ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో - నేను ఒక చిన్న సైజు అభ్యుదయవాదిని.

మా ఇంటిలో ఎలుకల బాధ అధికం. ప్రతిరోజూ బోనులో కనీసం ఎనిమిది ఎలుకలైనా పడేవి. ఆ ఎలుకలను చూసి పొద్దునే మా ఇంటిదగ్గర పిల్లులు క్యూ కట్టేవి. వాటి ముఖం చూస్తే దరిద్రమని మా అమ్మా నాన్న విసుక్కునే వారు. వారిని నా అభ్యుదయవాద దృక్పథం సైలెంటుగా ఖండించేది. (సౌండుతో ఖండిస్తే పాకెట్ మనీ రాదు. అందుకే సైలెంట్ ఖండన). అది ఎంతవరకు వెళ్ళిందంటే కావాలని పనిగట్టుకుని ఫ్రెండ్ సహాయంతో పిల్లిని నా దారికి అడ్డం పరిగెత్తించి ఇంటర్మీడియట్ ఆంగ్ల పరీక్షకు అటెండ్ అయాను. ఆ పరీక్షలో పాస్ అయి మా నాన్నకు అభ్యుదయ వాదం పవర్ చెప్పి వివరించాను. (ఇంటర్మీడియట్ లో నాకు అన్నిటికన్నా తక్కువ మార్కులు ఇంగ్లీషులో వచ్చాయి. ఆ మాట అప్రస్తుతం కాబట్టి చెప్పట్లేదు)

*********************************

ఇంత తీవ్రమైన అభ్యుదయవాదిని నన్ను పిల్లులేమి చేయగలవు అని ఆ రోజు ఆఫీసుకు ధైర్యంగా తగలడ్డాను. మా ఆఫీసు - ఎల్లవేళలా రక్తచరిత్ర సినిమాకు భాష్యంలాగా ఉంటుంది. ప్రాజెక్టుకు ముందే డెడ్లైన్లు, విపరీతమైన నస, బూతులు సర్వసాధారణం. కొన్ని రోజులుగా అలా లేదు. అయితే పిల్లి కనబడ్డ మొదటి రోజు సాయంత్రం ఉన్నట్టుండి భయంకరమైన పని మొదలయ్యింది. రక్తం మరిగించే టెన్షన్.

తర్వాత రెండు రోజుల తర్వాత ఆ నల్లని పిల్లి - నన్ను చూసి స్మయిలిచ్చింది. ఆ రోజు ఆఫీసులో రుధిరం చిమ్మింది. నరాలు చిట్లిపోయే టెన్షన్. ఇండియా - పాకిస్తాను వరల్డ్ కప్ మాచ్ లోనూ అంత టెన్షన్ ఉండదు.

ఇలా ఆ పిల్లి కనబడ్డం, ఆఫీసులో రక్తం చిమ్మటం వరుసగా జరిగేసరికి నా అభ్యుదయ వాదం బీటలు వారింది. ఇప్పుడు నేను ఆ పిల్లికి కనబడకుండా వీరప్పన్ లా తప్పించుకుని తిరుగుతున్నాను. ఈ ఏరియాకు ’మియాపూర్’ అని ఎందుకు పేరు పెట్టారో ఇప్పుడిప్పుడే తెలుస్తూంది.

పిల్లులు, కుక్కలు, దోమలు లేని కొత్త చోటికి ఇల్లు మారాలి. మ్యాజిక్ బ్రిక్స్ అన్న వెబ్ సైట్ లో ఇలా పిల్లులు, కుక్కలు లేని చోట ఇల్లు అద్దెకు కావాలని ప్రకటిద్దామంటే - ఆ సదుపాయం లేదట.

నా ప్రస్తుతసమస్య ఎలా గట్టెక్కుతుందో దీర్ఘంగా ఆలోచిస్తున్నాను.

9 comments:

 1. అమల ఏమైనా హెల్ప్ చెయ్యగలదేమో అడిగి చూడరాదూ :)

  అన్నట్టు పిల్లులకు, నాకు మధ్య జన్మ జన్మల వైరం ఉందని నా ప్రగాఢ విశ్వాసం.

  ReplyDelete
 2. >>చీకటి వేళల్లో పిల్లిలాగా, శబ్దం చేయకుండా నడవడం ప్రాక్టీసు చేసి అందులో నిష్ణాతుణ్ణయినా<< అదీ, అందుకే మీకు కుక్కల బాధ తప్పలేదు. పిల్లిలా నడిస్తే ఏ కుక్కైనా ఊరుకుంటుందా :))

  ReplyDelete
 3. హహహ!
  >>"ఒక కుక్క ’భవాన్ భిక్షాం దేహి’ అని వెనుక పడింది. యే మాత్రం మొరగకుండా అహింసాపద్ధతిలో భిక్ష అడిగిన ఆ సాత్విక శునకాన్ని చూసి నా హృదయం స్పందించింది."

  ఇది చదవగానే పోకిరి సినిమాలో బ్రహ్మానందం వెంటబడే బిచ్చగాళ్ళ సీను గుర్తుకొచ్చింది. :)

  రాయి తగలడం సూక్తి సాఫ్ట్వేరు వాళ్ళకి కాదుకాని కుక్కలకి బహు చక్కగా వర్తిస్తుంది, మా చెన్నైలో. అందులోనూ మా వీథిలో యీ మధ్య వీటి బెడద మరీ విపరీతమైపోయింది. మీ పోస్టు చదివాక కిందటి వారం జరిగిన సంఘటనొకటి మళ్ళీ కళ్ళముందు మెదిలింది. అర్థరాత్రి రెండుగంట్లకి హాయిగా నిద్రపోతున్న నన్ను ఒక దిక్కుమాలిన భయంకర శునకారావం మేలుకొలిపింది. ఎంతసేపటికీ ఆగదు! బాగా దగ్గరనుంచి వస్తున్నట్టనిపించింది. మా కర్మ పరిపక్వం చెంది, మా వెనకింట్లో ఒకరు కుక్కను పెంచుకుంటున్నారు. పెంచుకుంటున్నారు సరే, ఎవరైనా కుక్కని యింటుముందు కట్టుకుంటారు, వీళ్ళు యింటి వెనక బాల్కనీలో కడతారు. ఆ బాల్కనీ సరిగ్గా మా యింటి వెనక్కే వస్తుంది. దాని అరుపులతో గత కొన్ని నెలలుగా మా చెవులు చిల్లులుపడి పూడుకుపోయాయి కూడా. ఆ రాత్రి వినిపిస్తున్న అరుపు దానిదే అనుకున్నా ముందు. కాని తర్వాత ఏదో తేడాగా అనిపించింది. మెల్లగా లేచి ముందు గది తలుపు తెరిచి బయట తాళం వేసిన జాలీ తలుపు గూండా చూద్దును కదా, ఎలా దూకిందో, ఓ నల్ల కుక్క, మా యింటి బయటి ప్రహరీ గోడ దూకి, యింటి ముందున్న వసారాలో కుయ్యో మొఱ్ఱో అంటూ తచ్చాడుతూ ఉంది. బయటకి పోడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. గోడ దూకుదామని చూసింది. అది కాస్త ఎత్తు, దూకలేక పడిపోయింది. బయటి గేటు సందులోంచి దూరిపోడానికి ప్రయత్నించింది. వాటి యినప చువ్వలు మరీ దగ్గరగా ఉన్నాయి, దూర లేకపోయింది. ప్రహరీ గోడ వార ఒక స్కూటరుంది. సీటు ముందుండే జాగా మీదకెక్కి గోడ దూకే ప్రయత్నం చేసింది. అయినా ఎత్తు సరిపోలేదు. స్కూటరు సీటెక్కితే బహుశా అందేదేమో. కాని అది దాని బుఱ్ఱకి తట్టినట్టు లేదు. ఇలా ఏదో ఒక ప్రయత్నం చెయ్యడం, విఫలమవ్వడం, కెవ్వుమని ఏడ్చినట్టు అరవడం. చాలా అసహనంగా ఉంది. నేను తలుపు తీసిన చప్పుడుకి బయట జాలీ తలుపు దగ్గరకి వచ్చి నన్నే చూస్తూ నిలుచుంది. పాపం చాలా జాలేసింది. ఒక్క క్షణం తాళం తీసి, బయట గేటు తీద్దామా అనిపించింది. అంతలోనే బుద్ధి గట్టిగా హెచ్చరించింది. "ఆ కుక్క నీ దయాహృదయాన్ని అర్థం చేసుకుంటుందని భ్రమపడుతున్నావా? నువ్వు దాన్నేదైనా చేయడానికి వస్తున్నావనుకొని మీద పడితే నీ గతేం కాను?" అంటూ భయంతో కూడిన జ్ఞానబోధ నూరిపోసింది. అంతే, నా ఆలోచన విరమించుకున్నాను. పాపం ఆ కుక్క కొంత సేపు నా వైపే చూసి, నేనేమీ తనకి సహాయం చెయ్యనని అర్థమైపోయింది కాబోలు, మళ్ళీ తన ప్రయత్నం మొదలుపెట్టింది. నేను నిస్సహాయంగా వచ్చి పడుకున్నాను. పొద్దున్న ఎవరైనా బయటనుండి గేటు తెరిచినప్పుడు పోయినట్టుంది, పొద్దున లేచి చూస్తే లేదు. అసలది లోపలకి ఎలా గెంతగలిగిందని పరిశోధిస్తే తెలిసిందేమిటంటే, మా పక్కింటి వాళ్ళు తమ యింటికేవో మరమ్మత్తులు చేపట్టారు. దానికోసం బోలెడంత యిసక మా యింటి గోడ ముందు ఒక పక్కగా కుప్పగా పోసుంది. ఇంకో కుక్కేదో తరిమితే, యీ నల్ల కుక్క ఆ యిసక దిబ్బెక్కి మా యింట్లోకి దూకినట్టుంది!

  ఇతి శ్రీ భైరవభట్లకామేశ్వరరాయ కృత జంతుపురాణే కాలభైరవోపాఖ్యానం సంపూర్ణం! :)

  ReplyDelete
 4. మియాపూర్ నుండి కొండాపూర్ మారండి, కుక్కలు, పిల్లులు కాకుండ వేరే ఏమైనా జంతువులు కనపడతాయేమో :) మేమక్కడ ఉన్నప్పుడు మా ఫ్లాట్స్ వాచ్‌మ్యాన్ పులిని చూశానన్నాడు :)

  ~సూర్యుడు :-)

  ReplyDelete
 5. శివ సినిమాలో చైన్ బ్యాచ్ లా ఈ మధ్యన మా వైజాగ్ లో కూడా కుక్కలు రాత్రి పూట బ్యాచులు బ్యాచులుగా వచ్చి జనాలని అటకాయిస్తున్నాయి. ఇంకా హైదరాబాద్ ఫరావలేదేమో అనుకున్నాను..అక్కడ కూడా వీటి బాధ ఉందన్నమాట..బాగా రాసారు ..

  ReplyDelete
 6. ఫణి గారు, సౌమ్య గారు, కామేశ్వరరావు గారు, నారాయణస్వామి గారు, సూర్యుడు గారు, నవజీవన్ గారు: అనివార్య కారణాల వల్ల కొన్ని రోజులుగా నెట్ చూడ్డం కుదరలేదు. వ్యాఖ్యలకు కృతజ్ఞతలు. కామేశ్వరరావు గారు: మీరు రాసిన ఉదంతం బావుంది, :) అలాంటిదే ఒక పిల్లి ఎపిసోడు నాకూ అనుభవం. ప్రస్తుతం మూడ్ లేదు. మరెప్పుడైనా రాస్తాను.

  ReplyDelete
 7. బాగా రాసారు ..

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.