Sunday, December 9, 2012

క్రిష్ ఆడిన నాటకం - కృష్ణం వన్దే జగద్గురుమ్కొన్నాళ్ళ క్రితం దిండు క్రింద పోక చెక్క అన్న నవల చదివాను. దాని అట్టపైన "కల్పనాత్మకమైన చారిత్రక నవల" అని రాసుంది. అందులో ఉన్నది అంతా కల్పనే. చరిత్ర శూన్యం. ఆ కల్పన వెనుక ఉన్నది రచయిత విశ్వనాథ సత్యనారాయణ యొక్క కుత్సితత్వపు బుద్ధి అన్నది నవల చదివితే అర్థమవుతుంది.

ఈ రోజు సాక్షి పేపర్ లో జాగర్లమూడి క్రిష్ గారి ముఖాముఖి లో "సినిమా" గురించి తన అభిప్రాయం కూడా అలాంటిదే. "సినిమా వ్యాపారాత్మక కళ" అని ఆయన వాక్రుచ్చారు. ఆయన లేటెస్టు సినిమా "క్రిష్ణం వన్దే జగద్గురుమ్" లో "కళ" కంటే వ్యాపారమే ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఆ వ్యాపారం వెనుక ఏముంది అని ఆలోచిస్తే, ఇది క్రిష్ గారు జనాల మెదళ్ళమీద ఆడిన డ్రామా లాగా అనిపిస్తా ఉంది.

ఇదివరకు ఠాగూర్, అపరిచితుడు, మల్లన్న, శివాజీ వంటి సుగర్ కోటెడ్ సినిమాలు వచ్చినాయి. ఇవన్నీ ఏదో సామాజిక సమస్య మీద వ్యక్తి పోరాడుతున్నట్టు చిత్రీకరించి హీరోతో విలన్లను చితకబాదించి, ఆయనతో దైవాంశ సంభూతమైన పనులు చేయించి నేల విడిచి సాము చేసి, మధ్యలో హీరోవిన్లతో ప్రదర్శన చేయించి ఓ మూడుగంటలు ప్రేక్షకులను ఎంటర్ టయిన్ చేసి, పబ్బం గడుపుకున్నాయి. క్రిష్ గారు చేసిన "కొత్త" పని ఏమంటే - ఆ సుగర్ కు "దైవత్వం" అన్న మరొక లేయర్ "తేనె" దట్టించటం. ఈ కొత్త పని వల్ల ఆయనకు వచ్చే అడ్వాంటేజి ఏమిటంటే - ఈ సినిమాను మెచ్చుకుంటే "దైవత్వం" తాలూకు గొప్పతనాన్ని ఒప్పుకున్నట్టు ప్రేక్షకుడికి కలిగే భ్రమ, ఈ సినిమాలో లోపాలెత్తి చూపితే వాడికి టెస్టూ సెంటిమెంటూ లేవని చెప్పడానికి కలిగే వెసులుబాటూనూ.

ఇంతా చేసి ఈ సినిమాలో హీరో గారు చేసిన పనుల సారాంశం ఏమంటే - లక్ష కోట్ల ఆస్తి ఉన్న విలన్ ను డ్రమటిక్ గా నరసింహ స్వామి రూపం ధరించి చంపెయ్యటం. అందుకు పైకి చెప్పే కారణం - ఆ విలనుడు నేలను తవ్వి వ్యాపారం చేసి, అడవులను నాశనం చేసి, అడవి బిడ్డల్ని తిప్పలు పెట్టాడని. ఆ కారణం మీదనే సినిమా నడుస్తే మంచిదే. అయితే అలా చేస్తే "వ్యాపారం" ఎలా? అందుకని విలన్ గారు హీరో తల్లితండ్రులను చంపిన మేనమామ అన్న తెలుగు సినిమా తాలూకు పాచిపోయిన భావదారిద్ర్యపు ఫార్ములానే దర్శకుడు వాడుకున్నారు. హీరోతో విన్యాసాలు, ఫైట్లు చేయించారు. హీరోవినును ప్రేమింపజేశారు. అట్టహాసపు డవిలాగుల హంగులను, పాటల జిలుగులను అద్దెకు తెచ్చుకున్నారు. సగటు ప్రేక్షకుడిని "సగటు" గానే ఉండమని సరికొత్తగా చెప్పారు.

నాటక రంగం నాశనమైపోయిందని ఈ సినిమాలో హీరో, వారి తాతగారి (దర్శకుడి) బాధ. (ఇది మాటల్లోనూ, సన్నివేశకల్పనలోనూ చూపించడంలో సఫలమయ్యారనే చెప్పవచ్చు) అయితే దానికి నేపథ్యం కావాలని బళ్ళారి కి హీరోను తీసుకొచ్చారు. హీరో తాతగారిది బళ్ళారిట. ఆ బళ్ళారి బాబులు బళ్ళారి తెలుగులో మాట్లాడరు. శుద్ధమైన కోనసీమభాషలో మాట్లాడుతారు, టేక్సీ డ్రయివరుతో సహా. పోనీ కన్నడ భాషయినా సరిగ్గా వెలగబెట్టారా అంటే అదీ లేదు. నిజానికి బళ్ళారి కన్నడ బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో కన్నడకంటే భిన్నమైన యాస. తెలుక్కే గతిలేదు, ఇక కన్నడ యాసకెక్కడ? ఇలాంటివి మామూలు సినిమాల లో కనిపిస్తే ఓకే. కానీ ఈ సినిమాలో "కళ" మీద గొప్పగొప్ప డవిలాగులు రాయించుకున్న క్రిష్ గారికి కళ కు ప్రాంతీయత్వపు సౌరభం అతి ముఖ్యమైన అంగమని, అవసరమని తెలియకుండా పోయింది. ఒక్క యాసే కాదు, బళ్ళారి, అసలు రాయలసీమ తాలూకు వాసనే ఈ సినిమాలో కనిపించదు. ఆ ఊరి పేరు మీద రామోజీ సిటీలో వేసిన చవకబారు సెట్లు తప్ప. బళ్ళారి రాఘవ, వారి శిష్యులూ, ఇంకా ధర్మవరం రామకృష్ణమాచార్యులు, ధర్మవరం గోపాలాచార్యులు, యడవల్లి సూర్యనారాయణ, ఇత్యాది మహానుభావులు ఒకప్పుడు సీమ ప్రాంతంలో పోషించిన  బళ్ళారి నాటకరంగం తాలూకు ఆనవాళ్ళు మచ్చుకైనా లేవు. వారి ఫోటోలు కూడా హీరో గారి ఇళ్ళల్లోనూ మరెక్కడానూ లేవు. బళ్ళారిలో రైట్ ఆనరబుల్ కోలాచలం వారు కట్టించిన రంగ మందిరం, (నేటి మునిసిపల్ ఆఫీసు అనుకుంటాను) వారి "సుమనోహర" సంఘం, వారు వ్రాసిన నాటకాలు, రూపనగుడి నారాయణరావు గారి సాహిత్యం ...ఊహూ...ఏవీ కాబట్టలేదు. చివరికి బళ్ళారి పట్టణంలో నాటి చరిత్రకు మౌనసాక్ష్యాలైన టిప్పుసుల్తాను కోట, వార్డ్ లా కాలేజ్, మెడికల్ కాలేజ్ (బ్రిటిష్ హయాంలో స్వాతంత్ర్య సమరయోధుల జైలు) ఏవీ లేవు. అసలు బళ్ళారి ఊరికే వెళ్ళకుండా ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఊపిరి పోసుకున్న మహోజ్జ్వల కళ గురించి క్రిష్ గారు రామోజీ సిటీ సహాయంతో ప్రేక్షకులకు జ్ఞానసంపద పంచిపెట్టారు! హాట్సాఫ్!

నేపథ్యం "కళ" తో క్లాసు ప్రేక్షకులను గేలం వేసి, మైనింగు, లక్ష కోట్లు సంపాదించిన విలను, అతని క్రూరత్వం, వీటి ద్వారా సాధారణ సినిమాకు కావలసిన మసాలా హంగులను కూర్చుకోవడంలో చక్కని తెలివి తేటలు కనబర్చారు. ఆ లక్ష కోట్ల విలను - చేసే పనులు కాస్త లాజిక్ ఉపయోగిస్తే పేలవమైనవని తెలిసిపోతాయి. అన్ని కోట్లు కూడగట్టి, పేరలల్ ప్రభుత్వం నడుపుతున్నతను, హీరోయిన్ ను చంపాలని, ఆమె దగ్గర రహస్యాలున్నాయని తాపత్రయపడటమేమిటో? చక్కగా ఆమె బాస్ ను డబ్బుతో కొనెయ్యచ్చు, లేదా మీడియానే కొనెయ్యవచ్చు, లేదా సాక్ష్యాలు తారుమారు చేసుకోవచ్చు. అవన్నీ వదిలేసి, ఒక సిన్సియర్ తెలుగు విలన్ లా, హీరోవిన్ ను, చంపాలని తన మందితో ప్రయత్నిస్తాడు! నిజానికి ఆ స్థాయి విలన్ తన చెయ్యికి మట్టి అంటకుండా పనులు చేస్తాడు. తన రౌడీలతో అలాగే చేయిస్తాడు. ఆ రౌడీలు దర్శకుడి చేతిలో కీలుబొమ్మలు కనుక, హీరోగారి ట్రూపులో సభ్యుణ్ణి అనవసరంగా నాలుక కోసి, హీరో తాత గారి అస్తికలపై మూత్రం పోసి హీరోతో వైరాన్ని కొనితెచ్చుకొని, ఆ ప్రయత్నంలో దైవాంశసంభూతుడిలాంటి అతని చేతిలో తన్నులు తింటూ, హీరో పగను మరింత రెచ్చగొడుతూ తమ ప్రాణం మీదకు తెచ్చుకుంటూ ఉంటారు!

ఒక్క విషయానికి మాత్రం క్రిష్ గారిని మెచ్చుకోవాలి. లాజిక్ కు అందని విన్యాసాలను చక్కగా అడవి పుత్రుల తాలూకు ఎమోషన్ సీన్స్ ద్వారా కవర్ చేసి ఊపిరి ఆడకుండా పని జరిపేసుకున్నారు. సామాన్యుల ఆక్రోశం, మట్టి రాజు అనే పాత్ర ద్వారా మట్టిని ఎవరూ దోచుకెళ్ళకుండా నీళ్ళలోకి వేసి దాచిపెడుతున్నట్టు చూపించడం, వాళ్ళ ఆగ్రహాన్ని చూపించడానికి హీరో వాళ్ళతో కుండలు పగులగొట్టించటం, చివర్లో విలన్ ను మోసుకొచ్చి వాళ్ళ ద్వారానే చంపించటం, దానిని చూసిన ఒక పిల్లవాడు "ఏ దేవుడు" అంటే - మనిషి దేవుడనటం....సిరివెన్నెల గారి దశావతారాల్లో కృష్ణుడి వరకు మాత్రమే వచ్చిన పాట, పవర్ ఫుల్ డైలాగులు, సినిమా మొదట్లో అభిమన్యుడు, ఘటోత్కచుల అద్భుత ప్రదర్శన, హీరో హీమేనిజం, హీరోవిన్ తో సరమైన శృంగారం, చీప్ కామెడీ, ఒకట్రెండు చవకబారు ఐటెమ్ సాంగ్స్ - అన్నీ కలిపి, ఈ సినిమాను హిట్ సినిమా చేస్తాయి. అయితే ఈ సినిమా "కళ" కు అద్దం పట్టిందనో, గొప్ప సినిమా అనో అంటే మభ్యపడే ప్రేక్షకులతో బాటూ సైలెంట్ గా కూర్చుని ఆలోచించే వాళ్ళూ ఉంటారు. అలాంటి వారికి ఇది క్రిష్ గారు ఆడించిన డ్రామా అని తెలిసిపోతుంది.

మంచి ఎంటర్ టైనర్ ఈ సినిమా. సరికొత్త ప్రయోగం కూడా. డవిలాగులు చాలా బావున్నాయి. సినిమా తప్పక చూడండి. అయితే "కళ" గురించి క్రిష్ గారు వేసే జోకులు డ్రామాలో భాగంగాను, టీవీ ఛానెళ్ళలో సిరివెన్నెల గారిని అడ్డుపెట్టుకుని దశావతారాలని అవని ఇవని, కళ అని పడికట్టు మాటలలో వెనుక ఉండే హంగామాను జాగ్రత్తగా గమనించండి.

17 comments:

 1. "...దిండు క్రింద పోక చెక్క అన్న నవల చదివాను. దాని అట్టపైన "కల్పనాత్మకమైన చారిత్రక నవల" అని రాసుంది. అందులో ఉన్నది అంతా కల్పనే. చరిత్ర శూన్యం. ఆ కల్పన వెనుక ఉన్నది రచయిత విశ్వనాథ సత్యనారాయణ యొక్క కుత్సితత్వపు బుద్ధి అన్నది నవల చదివితే అర్థమవుతుంది...."

  మీరు వ్రాసిన వ్యాఖ్యకు ఒక పోస్ట్ వేసి, పూర్తి వివరణ ఇస్తే బాగుంటుంది, మీకు విశ్వనాథ వారి నవలనుండి అర్ధమయినది ఏమిటో అంతటి వ్యాఖ్య వ్రాయటానికి కారణం ఏమితో తెలియచెప్పిన వారవుతారు.

  ReplyDelete
 2. ఈ సినేమా మీద ఇంత రాయటం అవసరమా? టైం వేస్ట్.

  ReplyDelete
 3. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 4. what is your problem sir
  You write as if you haven't seen in a movie in a while..
  What is Viswanadha to do with this story line or movie.

  ReplyDelete
 5. meeru asalu vishayam vadilipetti , mootram lo chepalu padutunnaaru ,avineethi, akrama mining , araachakam , kaniptitunte andarikee , meeku avi apradaanya samasylaa , settu , viggu , veetimeeda aalochinchadam , maani , asalu vishayyyaalu aalochinchandi

  ReplyDelete
 6. This comment has been removed by the author.

  ReplyDelete
 7. అవును సార్. నేను కూడా టీవీ ఛానళ్లలో సిరివెన్నెల గారి మాటలు, క్రిష్ గొప్ప గొప్ప మాటలు విని మోసపోయాను. తీరా సినిమా చూస్తే...నిరాశ కలిగించింది. ఈ మధ్య సిరివెన్నెల ఏ పాట రాసినా ....ఈ పాటతో నా జీవితం ధన్యమైంది అంటున్నారు. చక్రంలోని పాటకు ఇలాగే ప్రచారం చేసినా...ఆ సినిమా నిలబడలేదు. అలాగే ఈ సినిమా గురించి కూడా అధికంగా చెప్పారు.

  ReplyDelete
 8. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నేడు ఒక బ్రాండ్. దాన్ని ఉపయోగించుకుని ఇలాంటివాటికి ప్రచారం చేసిపెట్టే పని నెత్తికెత్తుకున్నట్టు అనిపిస్తుంది నాకు. నాటకం అన్న కళ గురించి తపన పడేవారికి దాని చుట్టూ ఉండే భావోద్వేగాలు, మంచి చెడులు తెలిసి ఉండాలని చూపగలగాలని ఆశిస్తాం. అదేమీ లేకుండా ఏదో ఫేస్ బుక్ లో నేను దేశభక్తుణ్ణి అని చెప్పుకున్నట్టు ఫాషన్ కి చెప్తే ఏం ప్రయోజనం. కె.విశ్వనాథ్ సంగీత, నాట్యాల గురించి బాధపడ్తూ తీసిన సినిమాల్లో ఆయా అంశాల గురించిన ఉద్వేగాలూ, స్థితిగతుల గురించిన పరిశీలనలు ఎంతో లోతుగా ఉంటాయి. శంకరాభరణంలో శంకరశాస్త్రి అనే పాత్ర సగం నిద్రలో స్వరం తప్పకుండా పాట పాడే సన్నివేశం చూడండి.. అన్ని చైతన్యాలూ లయమైపోయే నిద్రలో, సుప్తచేతనకు పట్టేసి ఆత్మానందం పొంది ఉన్నాడు కనుకే పాట స్వరయుక్తంగా పాడాడు అన్న సూచన ఉంటుంది అందులో. ఇలాంటివెన్నో చెప్తూ పోతే. ఇవన్నీ క్రిష్ గారి సినిమాలో ఏవి. శేఖర్ లీడర్, క్రిష్ "కృష్ణం వందే.." లాంటివి అరకొర ఆసక్తితో, భావోద్వేగాలు, అధ్యయనం పాళ్లు అతితక్కువగా ఉండి తీసినవి కాబట్టే వాటిని గోప్పగా భావించే పని లేదు.

  ReplyDelete
 9. గమ్యం సినిమా చూసి అదే స్థాయిలో ఉంటుందనుకుని వేదం చూశాను.వేదం చూశాక...ఈ సారైనా బాగా తీసుంటాడని ఆశతో ఈ సినిమా కెళ్లాను.

  కమర్షియల్ పాయింట్ కి కళ అని రంగేసి, ఇది అభ్యుదయ సినిమా అని చెప్పినట్టు ఉంది ఈ సినిమా!

  ఎంతో డెప్త్ తో తీయాల్సిన సీన్లు అన్నీ తేలి పోయాయి. కళకు, మైనింగ్ కి ముడి పెట్టాలని ఎందుకు అనుకున్నాడో, అనుకున్నాక అది ఎటు పోయిందో తెలీకుండా దర్శకుడి చేతిలోంచి జారి పోగా, ఏదో ఒకటి చేసి అనవసర మలుపులు పెట్టి సినిమా ముగించాడు అనిపించింది.

  సమయానికి వేరే సినిమా లేక, దీన్ని చూసి పెట్టినట్టున్నారు ప్రేక్షకులు.

  లోకల్ జనాలతో కలవని వస్త్ర ధారణతో తిరుగుతున్న హీరోయిన్ ని గుర్తు పట్టకుండా "ఆ లేడీ జర్నలిస్టు ని ఎలాగైనా పట్టేయాలి" అని అందరూ వెదకటం.

  2. ఆవిడ ఒక్కత్తే ఒక పెద్ద కెమెరా పట్టుకెళ్ళి విలన్ల మొహాల్లో పెట్టి షూట్ చేసేయడం

  3.రెడ్డప్ప లాంటి వాడు "చంపుకోండి నన్ను" అన్నట్లు ఎవడికి పడితే వాడికి accessible గా ఉండటం,

  4.చక్రవర్తి/రెడ్డప్ప ఐడెంటిటీ అనే వృధా ఎపిసోడ్

  5.మట్టి రాజు మరియు ఆ పల్లె స్టోరీ ని ఒక మానవీయ కోణం పేరుతో వాడటం తప్ప అస్సలు బలంగా లేకపోవడం (వాళ్ళ పల్లె తగలబడ్డట్లు ఒక ఫ్లాష్ బాక్ సీన్ తో సరి పెట్టడం). ఆ కథను ఎంతో డెప్త్ తో చూపించి ఉంటే....వాళ్ళు రెడ్డప్పని చంపడం జస్టిఫై అయి ఉండేది

  6. చివర్లో ...దాన్ని అసలు రంగస్థల నాటకం అనొచ్చా?

  7. ఇంతకీ తాత బాబుకి ఏం చెప్పినట్లు? నీ మేనమామ ఫలానా వూర్లో ఉన్నాడు కాబట్టి వాడి మీద పగ తీర్చుకోమనా ? (అలా అయితే అసలు అక్కడ ఏం జరిగిందో అన్న పూర్ణకు తప్ప తెలీదుగా?) లేక నీ పుట్టిన వూరు అది కాబట్టి అక్కడ నాటకం ఆడాలనా?(అలా ఆడితే బాబుకు ఏమిటి లాభం? ఆయన తల్లి దండ్రులు కనీసం కళాకారులు కాదు..వాళ్ళ ఆత్మలు శాంతించడానికి...)

  8. ఐటం సాంగ్స్ నీచాతి నీచం!

  మీడియా అకాశానికెత్తక పోతే , మరో (మంచి) సినిమా అదే సమయంలో రిలీజ్ అయి ఉంటే...ఇంత హిట్ అయి ఉండేది కాదు.


  ReplyDelete
 10. రచనలు మానితి వేలనొ?
  సుచరితుడా! పద్యకన్య శోభలు తరిగెన్.
  విచలిత చిత్తము వీడుము.
  రచియింపుము పద్యములను.రవి! భారవివై.

  ReplyDelete
 11. లేదండి. పద్యాలు వ్రాయడానికి ఇష్టం లేదు. మహా మహా మహానుభావుల కావ్యాలకే మోక్షం లేదు. వారిమీద కనీసం గౌరవమూ లేదు మనుషులకు. నేను అర్భకుణ్ణి. నా వెర్రి మొర్రి పద్యాలతో ప్రజలనెందుకు ఇబ్బంది పెట్టి, కీర్తి కోసం తాపత్రయపడటం?

  ReplyDelete
 12. without your permission i posted in my face book link of yours andi.. hope u dont mind.
  best regards
  sri

  ReplyDelete
 13. @శ్రీ: I don't mind. Infact it was posted already. :)

  ReplyDelete
 14. రాను రాను మన సినిమా రంగం లో చవకబారు తనం ఎలాగో తప్పదు. ఉన్నత భావాలను విలువలను ఇప్పుడు సినిమా రూపం లో తియ్యడం అతి సాహసం అనే పికితనం బుర్రలో వెనకవైపు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఎందుకంటే తీరా కోట్లు ఖర్చుపెట్టి తీశాక బయ్యర్లు డిస్త్రిబ్యుటర్లు రాకపోతే ఎలా అనే భయం మొదటి నుంచి నిర్మాతకి ఉంటుంది కాబట్టి కళా ఖండాలు గట్రా దర్శకుడు తీస్తానంటే ఒప్పుకోడు సరికదా మొదటి నుండి షంటి జాగ్రత్త పడతాడు. అందువల్ల సినిమా అంటే మాస్ మసాలా ఉండక తప్పదు. ఎవడో అయ్యవారిని చెయ్యబోయి కోతిని చేసాడట అన్నట్లు దర్శకుడు ఎంత మొనగాడైనా చివరికి తెరకేక్కే ప్రోడక్ట్ ఎంతవరకు అసలు ఉద్దేశ్యాన్ని చూపించగలిగింది అనేది సగటు ప్రేక్షకుడి అదృష్టం మాత్రమె అవుతుంది. అందుచేత తెలివైన వాళ్ళు పాలల్లో ఎన్ని నీళ్ళున్నాయి అని వెదుక్కోవడం, రివ్యూలలో వెక్కి వెక్కి ఏడవడం మానేసి నీళ్ళల్లో పాలు ఎంత వున్నాయో వెతుక్కుని ఆహా ఒహో అని చెప్పుకోవడం వలన ఉన్న కాస్త మంచిని elevate చేసి సదరు అభివృద్ధికి దోహద పడినట్లు అవుతుంది. ఇంకా చేతనైన మొనగాళ్ళు ఎవరైనా ఉంటె వెళ్లి సినిమాలు తీసి ప్రపంచాన్ని ఉద్ధరించేయ్య ప్రార్థన చేతకాకపోతే ఇంట్లో కూర్చుని మనసుకి నచ్చిన పుస్తకం చదువుకోవటమో ఇతరులకి మంచి విషయాలు చెప్పటమో వినటమో చెయ్యవచ్చు లేదా హాలివుడ్ సినిమాలు చూడచ్చు

  ReplyDelete
 15. @Tingu: ఇక్కడ సమస్య అతను కళాఖండన్ని తీయలేదని కాదు. కమర్షియల్ సినిమాను కళాఖండంగా మభ్యపెడుతున్నాడని. జాగ్రత్తగా గమనించగలరు.

  ReplyDelete
 16. రవి గారూ,
  చాలా బాగా చెప్పారు. కళ అవసరం ఇప్పుడెవరికుంది? మీరన్నట్లు ఆ తరగతి ప్రేక్షకులనీ తియేటరకు రప్పింఛే వ్యాపార మెళుకువ అది!

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.