Sunday, November 4, 2012

దృష్టి


"To see is to love" - అని ఒక మహాజ్ఞాని వచనం. ఆయన వచనం ఉటంకించినంత మాత్రాన ఆయనంత గొప్పవాడు కానవసరం లేదు. భగవద్గీత ను చదువుకోవడానికి,  ఉపయోగించుకోవడానికి మనిషైతే చాలు, భగవంతుడు కానక్కరలేదు.

రోజూ చూసే చెట్టు, ఈ రోజు ఎందుకో కొత్తగా కనిపిస్తున్నది. ఎందుకో తెలియదు. చెట్టు తాలూకు ప్రతి ఆకు విలక్షణంగానూ, వినూత్నంగానూ కనబడుతూంది. మెత్తటి స్పర్శ, ఆకు తాలూకు ఈనెలు, నిన్నటి వర్షంలో తడిచి, హర్షం నింపుకుని రంగుతేలిన రూపం, సుకుమారమైన ఆకు చివరి భాగం, చెట్టుకు మొట్టమొదటి సారి కాస్తున్న కాయలు, ఏదో పనున్నట్టు అక్కడికి వచ్చి, బుర్ర గోక్కుని తిరిగి వెళుతున్న గండు చీమ, ఎందుకింత అమాయకంగా ఉంది ఈ చిన్ని ప్రపంచం?

రెణ్ణెల్ల క్రితం - పాపకు స్కూలుకు వెళుతుంటే ఒక బాదాం కాయ కనబడింది. ఆ కాయ ఇంటికి తెచ్చుకుని, కండ తిన్నది పాప. బాదాం చెట్టు కండ తిని నీళ్ళు తాగితే తీయగా ఉంటాయిట. ఆపైన కాయ కొట్టుకుని, మిగిలిన ముక్కను పెరట్లోకి విసిరి వేసింది. కొన్ని రోజుల తర్వాత అక్కడ ఒక చిన్న చెట్టు మొలకెత్తింది. చెప్పడానికి భావం చాలని అందమైన దృశ్యం అది! ఇప్పుడా చెట్టు మెలమెల్లగా పెరుగుతూంది.

ఇప్పుడున్న పెరటి బాదాం చెట్టు కూడా అలాగే వచ్చిందో, ఏమో! 

చెట్టు కాండాన్ని కావిలించుకుని దానికి చెవులను ఆన్చి వింటే ఒక మౌనసంగీతం వినబడుతుందట. వినగలిగితే అంత హృదయంగమమైన సంగీతం మరొకటి లేదు. సంగీతానికి నియతి కావాలేమో, ప్రకృతిపాటకు నియమాలు లేవు.

"నియతికృతనియమరహితాం, హ్లాదైకమయీమనన్యపరతంత్రామ్" అని జ్ఞానమూర్తిని, జగజ్జననిని, సాకారంగా, సరూపార్చన చేస్తాడు కవి. ఈ సృష్టి కూడా అంతేనేమో! ఇక్కడా నియమాలు లేవు, కోకిలపాట, బాదాం ఆకులపై వర్షం చినుకుల దరువూ, చల్లటి గాలి చిఱుస్పర్శ ఈ నియమరహితమైన సౌందర్యాన్ని, హ్లాదమే పరతత్త్వంగా కనిపిస్తున్న జగతిని - భగవంతుడు సృష్టించలేదు. ఈ సృష్టే తానై ఉన్నాడు. అసలు "ఉన్నాడు", "ఉన్నది" అన్న మాట కూడా తప్పేమో! "తథా అథ" - "అది అంతే" - కనిపిస్తున్నదే సృష్టి, స్రష్ట, సృజన అన్నీ!

కొన్నాళ్ళకు ఆ ఆకు రాలిపోతుంది. ఎఱుపు రంగు తేలి, గాలి విసురుకో, బలహీనత తోనో! చెట్టు నుండి విడిపోవటం లోనూ ఒక దర్పం! ఒక దర్జా, చిఱునవ్వూ! మరణమంటే ఇంత సులువుగా, ఇంత ఆనందంగా ఉంటుందా అని చూచేవాళ్ళకు అనిపించేట్టు! హ్లాదైకమయి - అనన్య పరతంత్ర - అంటే స్వేచ్ఛను అణువణువునా నింపుకున్నది కూడా ! ఈ రాలిపోయిన ఆకు ఆ చెట్టుకు, అంటే తన తల్లికి ఎరువు!

ఆధ్యాత్మికత భగవంతుడిలోనూ, ఆచారాలలోనూ, కర్మల్లోనూ, కర్మసిద్ధాంతం లోనూ ఉందని ఎవరు చెప్పారో ఏమో! చిత్తమార్దవం, క్షమ, శుచిత్వం అభిమానం లేకపోవటం వంటివి దైవికమైన లక్షణాలుట! అవి చాలేమో మనిషికి!

పక్కింట్లో పాపాయి మారాం చేస్తూ ఉంటే అమ్మ చందమామను చూపిస్తూ బాదం ఆకులో పెరుగన్నం పెట్టి తననే తినమని చెబుతూంది! పాప నవ్వుతూంది.

To see is to love! - ప్రపంచాన్ని చూడటమే ప్రేమ!

15 comments:

 1. చక్కని భావుకత, చిక్కని ఆధ్యాత్మికత కలబోసి అందించారు. చాలా బాగుందండీ..!
  ధన్యవాదాలు.
  అన్నట్టు ఈ పోస్టులోని అక్షరాలకు రంగు ఎంపిక కూడా సందర్భానుసారంగా అమరింది.

  ReplyDelete
 2. చాలా బాగుంది రవి గారు!

  ReplyDelete
 3. బాగా చెప్పారు రవి గారు.

  ReplyDelete
 4. "తథా అథ" - "అది అంతే"

  Awesome Sir

  :)

  ReplyDelete
 5. To respond is to killing the emotion. No words.

  ReplyDelete
 6. ఏమీ చెప్పాలని లేదు...ఆస్వాదించడం తప్ప.

  ReplyDelete
 7. ఏదో తెలియని భావం మదిని తాకిన అనుభూతి సార్ !

  ReplyDelete
 8. భావుకతను అక్షరక్షరానా చిలకరించిన పోస్టు. చాలా బాగా వ్రాశారు!

  ReplyDelete
 9. అద్భుతంగా రాసారండీ :)

  ReplyDelete
 10. మీ యీ దృష్టిమీద యింత వరకూ నా దృష్టిపడలేదేంటి చెప్మా! :)
  చెప్పడానికేం మాటల్లేవ్. ఎప్పుడో రాసుకున్న ఓ పద్యంలోని "చూచెడు చూపులో కలదు సుమ్ము ప్రపంచము" అనే వాక్యం గుర్తుకొచ్చింది.

  ReplyDelete
 11. రవి గారూ,

  ఎంత బాగా రాసారు. మాటలు చాలడం లేదు. బోలెడన్ని కృతజ్ఞతలు మీకు.

  శ్రీనివాస్

  ReplyDelete
 12. "తథా అథ" - "అది అంతే" - కనిపిస్తున్నదే సృష్టి, స్రష్ట, సృజన అన్నీ!

  అంతే అంతే!

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.