Thursday, September 13, 2012

పూల గుసగుసలు మరొకసారి..


వామ్మో! అసలు బాలు మనిషేనా? పాటలెవరైనా పాడతారు కానీ ఇదేంటిది? ’వయసు సవ్వడి చేసేనని’ - ఆ ముక్క పాడేప్పుడు వయసు సవ్వడి ’చేసే’ - లో అదుగో ఆ చేసే అనే చోట బాలు గొంతు వినితీరాలి బాబులూ!

ఎక్కడ నుండి మొదలెట్టాలి? చరణం నుండి మొదలెడదామా? వద్దు. ముందు ఈ వీడియోలు చూసెయ్యండి. చెప్తా. రెండు వీడియోలెందుకంటే రెండు ట్యూన్లలో కాస్త తేడాలున్నయ్ వినండి తెలుస్తుంది. మొదటి వీడియోలో కృష్ణ ఏక్షన్ ను కూడా వదలద్దు.


 

చూశారా? ఇప్పుడు చరణం గుర్తుకు తెచ్చుకోండి.

మబ్బు కన్నెలు ’పిలిచే’నని - మేఘాల కన్నెలు పిలుస్తున్నట్టే లేదూ?
మనసు రివ్వున ’ఎగిరే’నని - ’ఎగిరే’నని అనే కాడ రోంత మనసు పెట్టి యినండి. మనసు ఎగురుతున్నట్టు లేదూ?
వయసు సవ్వడి ’చేసే’నని - ఇదివరకే చెప్పా గదా! ’చేసే’ అనేచోట గొంతును అలా మార్చడం ఈ భూప్రపంచంలో బాలుకు మాత్రమే సాధ్యం. మా
భాస్కర్ భాయ్ కూడా అదే అంటున్నాడు.

సరే, బాలు కు సిగ్గు లేదు కాబట్టి ఇలా పాడి పెట్టాడు. మా ’బెండు’ అప్పారావు - కృష్ణకు ఏమొచ్చింది మాయరోగం? ఆ వీడియో చూశారు గందా, మొదట్లో ఈల వేసుకుంటూ వస్తాడు కదా, అక్కడ అసలు మొగ్గ లాగానే నడుస్తున్నాడు చూడండి. ఆ తర్వాత పూలు గుస గుస అని పల్లవి ఎత్తుకునేప్పుడు మాత్రం పువ్వులా వికసించిపోయాడు.అసలు మా వాడు కృష్ణయే పువ్వు లాగున్నాడు. అతణ్ణి చూసి పువ్వులే సిగ్గుపడాలి. ఇక కోటు తొడగటం ’ఊర మాస్’ లో క్లాసు కు పరాకాష్ట! ఈ పాటకు కోటు వేసుకోకుండా మామూలు అంగీ తొడిగి ఉంటే ఎంత దరిద్రంగా ఉండేదో ఊహించండి! అసలు ఎవడు సామీ ఆ సైన్మ దర్శకుడు? ఎవడసలు నృత్యదర్శకుడు? అందరూ ఇట్లా రెచ్చిపోతే ఎలాగ ?

కళా దర్శకుడు తక్కువ తిన్నాడా? ఆ లొకేషనేంటి? ఫోటోగ్రాఫరో? కృష్ణ మొదటి చరణం పాడేసి రిలాక్సెడ్ గా ఉన్నప్పుడు గాంధీ విగ్రహం చూపిస్తున్నాడు. ఆ తర్వాత "ఆ, ఓహ్" అనే అమ్మాయి గొంతు గమకాల మధ్య వాణిశ్రీ! వామ్మో! ఏం మాసు? ఏం క్లాసు??పూలు గుసగుస అనే దాన్ని మూడు టోన్ లలో పాడినప్పుడు నాకు మొదటి సారి బాలు గొంతులో మల్లెపువ్వు, రెండో సారి బంతి పువ్వు, మూడో సారి వంద రేకులతో తామరపువ్వూ విరిసినట్టు (వి)కనిపిస్తా ఉంది. ఏం, పోలిక బాలేదా? అయినా సరే అదంతే.

పల్లవి అయిన తర్వాత మ్యూజిక్ వచ్చేప్పుడు (లల లలా, లాలా) పూలమీద నుండి పక్కకు మళ్ళుతుంది కెమెరా. ఒక్క కెమెరాయే కాదండి. మ్యూజిక్కూ మళ్ళుతుంది. చరణం మొదలవుతుంది.

చరణం తర్వాత ఒకసారి వినండి. ’రురురు రూరూరురు ,,, ఆ...ఓహ్’ లో ఆ ’ఆహ్..ఓహ్..’ ల కాడ ఆ ట్యూను ఉందే అది రికార్డు చేసేప్పుడు బాత్ రూమ్ లో దూరి రికార్డు చేసి ఉంటాడు ఖచ్చితంగా. బాలు మనిషి కాదు కాబట్టి చెప్పలేం కానీ మనలాంటి మనుషులకు మాత్రం కృష్ణ గొంతులో వినిపించే ఆ ’ఆహ్, ఓహ్’ లు బాత్ రూములో మాత్రమే సాధ్యమైతయ్.

రెండో చరణం -

అలలు చేతులు సాచేనని - అలలు అన్నప్పుడు అలలు వస్తున్నట్టు ’చే’తులు లో ’చే’ దగ్గర అల విరిగింది. సాచే లో చే దగ్గర మరోసారి అల విరిగింది.

నురుగు నవ్వులు పూచేనని - పూచే లో పూలు పూయడం విన్నారా?
నింగి నేలను తాకేనని ... నేడే తెల్సింది రురు .. రురు.. రురురూ ..ఆహ్ .. ఓహ్

నింగి నేలను ’తాకే’ నని - ’తాకే’ దగ్గర గొంతులో ఆ తమకం! బాలూ నీవు కడుపుకేం తింటున్నావురా బాబు? ఆ పరవశం నుండి కోలుకోకుండానే మళ్ళీ ఆ ’ఆహ్..ఓహ్’ లు!

ఈ పాటకు రెండు రకాల ట్యూన్లు. ఒకటి సినిమాలో, మరొకటి బయట. రెండూ రెండే! ఈ పాట వినడానికి కళ్ళూ, చూడడానికి చెవులూ కావాలి. ఎందుకంటారా? పాట వినేప్పుడు పూవు విచ్చుకోవడం కనిపిస్తుంది. కృష్ణ వీడియో లో ఆడియో మూసి పెట్టి చూడండి. పూల గుసగుసలు, మబ్బు కన్నెలు పిలవడం, వయసు సవ్వడి చేయడమూ వినిపించట్లే?

నిజానికి నాకయితే విన్న ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా వినిపిస్తుంది. వందసార్లు విన్న తర్వాత కూడా కొత్తగానే ఉంటది. కొన్ని నెల్ల క్రితం నా ఫోనులో రింగుటోను పెట్టాను. ఆఫీసులో కొరియావాడు మొదట ఈలతో వచ్చే మ్యూజిక్ విని డంగై పోయాడు! ఆ ఈల సహజంగా ఉంది, ఎవరో వేస్తున్నట్టు! ఆ పాట నాతో అడిగి ఎక్కించుకున్నాడు కూడా!

తెలుగు సైన్మా పాటల్లో ఇది నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఇది రాసింది నారాయణరెడ్డి అట. సంగీతం జీకే వెంకటేష్. అయితే వాళ్ళిద్దరి కంటే బాలు, కృష్ణలే ఈ పాటకు నిజమైన కర్త, కర్మ క్రియ అన్నీ! ఇంత చేసి ఈ పాట హిందీ సినిమా పాటకు కాపీ. అయితే ఆ హిందీపాట జితేంద్ర మొఖంలా ఉంది. దాని గురించి మాట్లాడ్డం వేస్ట్.ఈ పాటను మళ్ళీ ఈ మధ్యన ఒక సైన్మా లో పెట్టుకున్నారు. అది లెజెండ్రీ స్థాయినుండి సెలెబ్రిటీకి పడిపోయినట్టు నికృష్టంగా ఉంది.

మరొక పాట ’వీణ వేణువైన సరిగమ విన్నావా?’ దాని గురించి మరెప్పుడైనా బుద్ధి పుట్టినప్పుడు.

9 comments:

 1. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ సూపర్ గా రాసారు కదా కేకంతే

  ReplyDelete
 2. అన్నాయ్
  కుమ్మొదిలిపెట్టావుగా
  >>నిజానికి నాకయితే విన్న ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా వినిపిస్తుంది. వందసార్లు విన్న తర్వాత కూడా కొత్తగానే ఉంటది.<<
  హండ్రెడ్ లైకింగ్సు
  కానీ! ఎందుకో ఈపాట సినారే వ్రాశాడంటే నమ్మబుద్ధికాదు

  ReplyDelete
 3. ఎంతైనా నటశేఖర నటశేఖరనే! 'సారొస్తారా రొస్తారా' పాట డాన్స్ చూశాక మళ్ళీ కృషణ్గారిని చూసినంత ఆనదమేసింది. ఏమి విరుపులు, ఏమి కదలికలు. ఆ..హ్ ఓ..హ్.. ఫూల్ గుస్ గుస్ లాడేన్ అని. :)

  ReplyDelete
 4. >>మొదట్లో ఈల వేసుకుంటూ వస్తాడు కదా, అక్కడ అసలు మొగ్గ లాగానే నడుస్తున్నాడు చూడండి. ఆ తర్వాత పూలు గుస గుస అని పల్లవి ఎత్తుకునేప్పుడు మాత్రం పువ్వులా వికసించిపోయాడు.అసలు మా వాడు కృష్ణయే పువ్వు లాగున్నాడు. అతణ్ణి చూసి పువ్వులే సిగ్గుపడాలి. ఇక కోటు తొడగటం ’ఊర మాస్’ లో క్లాసు కు పరాకాష్ట! ఈ పాటకు కోటు వేసుకోకుండా మామూలు అంగీ తొడిగి ఉంటే ఎంత దరిద్రంగా ఉండేదో ఊహించండి! అసలు ఎవడు సామీ ఆ సైన్మ దర్శకుడు? ఎవడసలు నృత్యదర్శకుడు? అందరూ ఇట్లా రెచ్చిపోతే ఎలాగ ?


  ఇంత కామెడీ తట్టుకొవటం నా వల్ల కాదు బాబోయ్.

  ReplyDelete
 5. అయ్యో రాత! (మీరు వ్రాసిందానికి నా దగ్గర మాటల్లేవు)। నాకు పైరేట్స్ ఆఫ్ కఱ్ఱిబ్బియన్ చూసినప్పుడు ఇలాఁటి అనుభూతే కలుగుతుంది।

  ReplyDelete
 6. నిజంగానే బ్లాగాడించారు.

  ReplyDelete
 7. చాలా చక్కని విశ్లేషణ. బాలు బాగా పాడతాడు అని అందరూ అంటారు గానీ ఇలా విశ్లేషించి , విడగొట్టి ఉదాహరణ లతో, బోల్డు చేసి మరీ చెప్పడం..ఎంతో ఓపిక కావాలి, అంత కంటే ఇష్టం, అభిరుచి ఉండాలి. జోతలు

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.