Monday, August 6, 2012

మధురస్వప్నంరోజూ లాగే మరో పొద్దు పొడిచింది. అదే పొద్దు మునుగుతూనూ ఉంది. ఈ పొద్దుకూ ఎక్కడెక్కడో, ఎన్నో తమ్మిపూలు విరబూసి ఉంటాయ్.  ఈ ఇంటా ఒక తమ్మి విరబూసింది. ఈ రోజు పొద్దునే సంహిత పట్టులంగాలో కనిపించింది. దానికి జుట్టు అంతగా పెరగలేదు. అయినా సరే రెండు క్లిప్పులు పెట్టుకుని, ఒక్కోసారి చిన్న చిన్న మల్లెపూలమాలలు చుట్టుకుని తిరుగుతూంటుంది. భలే నవ్వొస్తుంది. నాన్న బయటికే నవ్వేస్తుంటే అది కొంచెం ఉడుక్కుంటుంది. ఊహూ, ఉడుక్కోవడం కాదు...ఏదో విచిత్రమైన భావం! నాన్న ఎందుకు అమ్మలాగా, అమ్మమ్మలాగా సీరియస్ గా ఉండడు, ఊరికే నవ్వుకుంటూ ఉంటాడు అనేమో!

అవును మరి, అమ్మకూ, అమ్మమ్మలకూ పావడా,అంగీ తడుస్తే కోపం,మట్టిలో ఆడుకుంటే తప్పు, క్రాఫు మాసిపోతేనో, షర్టు నలిగితేనో, ఐస్క్రీం తింటేనో చిన్నపాటి భయం! నాన్నకివేవీ పట్టదు. నాన్న దగ్గర ఫ్రీ!

నాన్న కు బొంగరమాడటం, చేతిలో తిప్పటం వచ్చు ( గోళీలు,బొంగరాలు, చిల్లాకట్టె, బచ్చాలు వంటి విద్యలని ఉగ్గుపాలతో నేర్చుకున్న రక్తం గదా) మన్నెప్పుడో రాకరాక ఊర్లో వాన పడితే, తనూ, నాయనా కలిసి గొడుగు పట్టుకుని మిద్దె మీదకెళ్ళారు. కాసేపటికి వానతో బాటు, ఎండ మొదలైంది. దానికి సైడ్ ఎఫెక్ట్ లాగా సరిగ్గా ఇంటికికెదురుగా ఒక రంగురంగులబాణం వచ్చి నిలబడింది. పాప ఆ ఇంద్రచాపాన్ని చూసి దానికంటే అందంగా నవ్వింది. కాసేపటికి మళ్ళీ కాగితపు పడవల పర్వం మొదలయ్యింది. అంతా అయ్యి ఇంటికొస్తే, పాప అమ్మకు పాప, నాన్న ముఖాల్లో వెలుగుకన్నా, పాంటు అంచుల్లో బురద, పావడ అంచుల్లో నీళ్ళు కనబడ్డాయి. తిట్లు మామూలే. నాయన నవ్వు మామూలే. తమ్మి నాన్న వంక చిత్రంగా చూడటమూ మామూలే.

తమ్మికి కాల్లో ముల్లు గుచ్చుకుంటే అందరికీ బాధ. నాన్నకు మాత్రం ఆ ముల్లు తీయడానికి, ఆ ముల్లు ద్వారా తెలుగు నేర్పడానికి ఒక అవకాశం చిక్కిందన్న ఊహ, ఆ ఊహ వలన వచ్చిన నవ్వు.

మరుసట్రోజు పాప అమ్మ దగ్గరకెళ్ళి పెద్దగా అరుస్తా పద్యం చెప్పింది.

చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ

అమ్మకు అందులో మూడవపాదం అన్నిటికన్నా స్పష్టంగా వినిపించింది. నిరసన మామూలే.

*********************************************************

మా తమ్మిని పట్టులంగాలో చూస్తుంటే ఏదో అస్పష్టమైన జ్ఞాపకం, మా అనంతపురంలో కురిసే వానలాగా నాతో దోబూచులాడుతూ ఉంది. అంతే కాదు, అది నా దగ్గర వచ్చి ఏదో ప్రశ్న అడగడం, దానికి నేను బయటికే నవ్వడం వంటివి చూసినప్పుడు కూడా ఏదో సందిగ్ధమైన ఆలోచన. ఎప్పుడో, ఎక్కడో, ఇలాంటిది నా ముందు జరిగింది అని.

ఆ జ్ఞాపకాల సీతాకోక చిలుక ఇదుగో ఈ రాత్రి నా చేతికి పట్టుబడింది.

**************************************************************

అవును. తమ్మి లానే పట్టు లంగా, చిట్టి చిట్టి జడలతో ఉన్న అమ్మాయి నాకు బహుశా ఐదారేళ్ళప్పుడు పరిచయం. ఆ అమ్మాయి మా పక్కింటి సరోజ. బహుశా నా జీవితంలో మొదటి గర్ల్ ఫ్రెండు!

సరోజ పొద్దస్తమానం మా ఇంట్లోనే ఆడుకునేది. మా ఇంట్లోనే భోంచేసేది. పొరుగింటి పుల్ల కూర రుచి అన్న విషయం ఆ వయసులోనే ఆమెకు అర్థమయ్యింది! దానికి భోజనం పెట్టటం అమ్మకు, ఇంట్లో అందరికీ ముచ్చట. అయితే "సుందరాంగులను చూచిన వేళల కొందరికి ముచ్చట" ఎలాగో,"కొందరికి బిత్తర" అలాగే. ఎందుకంటే మదీయులకు అప్పుడు తిండి తినిపించడానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉండేవి. కిటికీ పక్కన కూర్చోవాలి, అక్కడ కూర్చుని, పెరుగన్నం తినాలి. తినేప్పుడు ఆకాశవాణి కడపకేంద్రంలో నచ్చిన పాట వినబడాలి. నచ్చినపాట - ఎంతగా నచ్చాలంటే ఆ పాట సినిమా బండిలో వినబడితే ఆ బండి వెనక నడుచుకుంటూ తన్మయత్వంతో వెళ్ళిపోయేంత మంచిపాట అన్నమాట.

తిండికి ఇంత హంగామాని చూసి సరోజ నవ్వితే సూర్యుడు సిగ్గుపడి మబ్బులదాపునకెళ్ళిపోడూ!

ట్రాన్సిస్టర్ లో అయిపోయిన సెల్సూ, కొయ్య ఏనుగు బొమ్మా, కొన్ని ప్లాస్టిక్ బొమ్మలూ మా ఇంట ఉండేవి. ఒక ఏడెనిమిది సెల్స్ ను రౌండు గా పెట్టి, వాటిపై మరికొన్నిటిని, వాటిపైన వీలైతే ఒకసెల్ ను ఇలా అమర్చి ఆడుకొంటుంటే, సరోజ పట్టుపావడతో రెండు జళ్ళతో మా ఇంటికి వచ్చేది. భోజనాల సమయానికి కొంచెం ముందుగా. అంత కన్స్ట్రక్టివ్ గా ఆలోచించడం ఆ పాపాయికి రాదు కాబట్టి ఏదో అలా చూసి వెళ్ళిపోయేది.

చందమామలో భల్లూక మాంత్రికుడు సీరియల్ వచ్చే రోజులవి.

మాచిరాజు కామేశ్వరరావు కథల్లో ’కట్నం’ అనే పదం ఎప్పుడూ వస్తుంది. అదేంటి అని అడిగితే మా అమ్మ చెప్పలేదు. భల్లూకమాంత్రికుడు చివర్లో ’ఇంకా ఉంది’ అంటే ఆ ’ఇంకా’ ఎక్కడ ఉందో ఎవరూ చెప్పరు. సరోజకు మాత్రం వాళ్ళ నాన్న రాత్రి పూట మడతకుర్చీలో పడుకుని చుక్కలు చూపిస్తా ఏవో కథలు చెప్పేవాడు.  నాన్న చేతిలోనే అలా నిద్రపోయేది.

నాకు బాగా జ్ఞాపకమున్న ఒకరోజు. సరోజ మామూలుగానే మధ్యాహ్నానికి కాస్త ముందు మా ఇంటికి రావాలన్న ప్లానుతో ఉంది. వాళ్ళమ్మకు పొద్దస్తమానం పాప అలా పక్కింటికి వెళడం తప్పని, దానికి సర్ది చెప్పాలని తాపత్రయం. అందుకని ముందుగానే భోజనం తినిపించెయ్యాలనుకుంది. ఊహూ. కుదరదు! అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎలా కుదరదో, అలా సరోజ చేత పక్కింటికి వెళ్ళడం మానిపించడం అమ్మకు కుదరలేదు. వాళ్ళ అమ్మకు కోపం వచ్చింది. రెండు దెబ్బలేసింది.

అంతే! ఆ పాప ఏడుపు లంకించుకుంది. ఏమయ్యిందో, ఎలా వినబడిందో తెలియదు. వాళ్ళ నాన్న ఆఫీసు నుండి వచ్చాడు. పాపను సముదాయించాడు. ఆ తర్వాత మా ఇంట్లో ఆడుకోవటానికి పంపాడు!

ఇసుకలో ఆడుకుని బట్టలు పాడుచేసుకుంటే అమ్మ బట్టలు పాడయ్యాయంటే ఏం కాదని సరోజ నాన్న ఎత్తుకుని ముద్దుచేసేవాడు.

ఆ పాప వాళ్ళ నాన్న గారికి ట్రాన్స్ ఫర్ అయింది. ఆ తర్వాత ఎక్కడకు వెళ్ళిపోయారో తెలియదు. వాళ్ళ ఆచూకీ లేదు! అంతే! ఆ కథ ఒక ముగిసిపోయిన అందమైన అస్పష్టమైన మధుర స్వప్నం!

తమ్మి రాత్రి పూట అన్ని నక్షత్రాలు ఎక్కణ్ణుంచి వస్తాయని అనుమానం! అవన్నీ చిన్న పిల్లలై భూమీదకు వస్తాయని, ఒక నక్షత్రం పోతే మరొకటొస్తుందని నాన్న నవ్వు దాచుకుంటూ చెబుతున్నాడు. తమ్మికి నాన్న తప్పు చెబుతున్నాడా అని ఏదో అనుమానం. దాని ముఖం చూసి దాన్ని బోల్తా కొట్టించానని నాన్నకు నవ్వు!

సరోజ వాళ్ళ నాన్న కూడా ఇలానే నవ్వేవాడు!

అవును! పాపాయి పుట్టినప్పుడే ఆ ఇంట్లో నాన్న కూడా పుడతాడు! ఆ పుట్టుక తామర పువ్వు విరిసినంత అందంగా ఉంటుంది.

27 comments:

 1. అరమరికలు ఎరుగని బాల్యం మరో మారు మధుర స్వప్నమై జ్ఞప్తికి వచ్చింది. ధన్యవాదములు.

  అవును! పాపాయి పుట్టినప్పుడే ఆ ఇంట్లో నాన్న కూడా పుడతాడు! ఆ పుట్టుక తామర పువ్వు విరిసినంత అందంగా ఉంటుంది.
  ఎంత బాగా చెప్పారు. :)

  ReplyDelete
 2. చాలా బాగుంది రవి గారు.

  ReplyDelete
 3. మధుర జ్ఞాపకాలు చాలా బాగున్నాయి. :-) మీ తమ్మిలానే

  ReplyDelete
 4. అధ్బుతంగా చెప్పారు

  ReplyDelete
 5. సంహి సరోజ కబుర్లు బాగున్నాయి!

  ReplyDelete
 6. అత్యద్భుతం ! మాటల లేవంతే రవి గారు !

  ReplyDelete
 7. బాగుంది రవి గారు.
  ఆ మాధుర్యతను ఎంజాయ్ చేస్తున్నారనమాట :)

  ReplyDelete
 8. ముందుగా సంహిత కి హృదయపూర్వక పుట్టీనరోజు శుభాకాంక్షలు...

  పోస్ట్ అద్భుతం..రవి గారూ...సూపరంతే.. ;)

  ReplyDelete
 9. super :-).
  wonderly presented exerience..

  ReplyDelete
 10. మనసు చిన్ననాటి స్మృతుల వద్దకు వెళిపోతే ఇక్కడ వ్రాయటానికి మాటలు లేవండీ! అత్యద్భుతం!
  సంహితకి జన్మదిన శుభాకాంక్షలు!

  ReplyDelete
 11. చాల బాగుందండి

  ReplyDelete
 12. భలేగా వ్రాసారు. అందమైన అనుభవాలు మూటగట్టుకుంటున్నారన్నమాట.

  మీ సరోజ గురించి వివరాలు కావాలంటే ఓ సారి తేటగీతి టపా చదవండి http://tetageeti.wordpress.com/2012/08/06/facebook-9/ :)

  ReplyDelete
 13. పోస్ట్ ఎంతబాగుందో చెప్పడానికి మాటలుదొరకటంలేదు రవిగారు... అద్భుతం అంతే..

  ReplyDelete
 14. Ravi
  You are absolutely correct, I am njoing everybit of my time with Shravani. I feel there is some spl bondage between a daughter and father


  - Ganeshan

  ReplyDelete
 15. చాలా బాగా వ్రాశారు రవి గారు...సంహితకి జన్మదిన శుభాకాంక్షలు!

  ReplyDelete
 16. ఇలా రాస్తే ఎలాగండీ !! ఇప్పుడు అర్జంట్ గా మా నాన్నని చూడాలంటే ఎలా !!

  కూతురు పుట్టినప్పుడే నాన్న పుడతారు...ఎంత నిజమో! నా చిన్నతనం జ్ఞాపకాలను మా నాన్న తలుచుకుంటున్నప్పుడు ఆయన కళ్ళల్లో మెరిసే కాంతి చూస్తే నాకు గర్వం గానూ, ఆనందంగానూ ఉంటుంది నేను ఆడపిల్లగా (ఆయనకు కూతురిగా) పుట్టినందుకు.

  చిన్నారి సంహిత కు పుట్టినరోజు ఆశీస్సులు!

  ReplyDelete
 17. Okay, I knew I was missing great things in life not having an opportunity to raise a girl child - but you and Kameswar Rao gaaru add insult to injury. Not fair, Ravi :)

  Happy Birthday, Samhitha! I wish you learning, earning and yearning!

  ReplyDelete
 18. చాలా బాగుంది రవి గారూ!
  మధుర స్మృతులు పంచినందుకు అభినందనలు..
  @శ్రీ

  ReplyDelete
 19. సంహిత తరపున అందరు అంకుల్స్ కీ, ఆంటీలకు నమస్సులు, థాంకులండి.

  RK, There are many beautiful flowers come across on our way. If one flower is missed, even better, or the best one still awaits :). You get definitely many, not just one :)).

  Praveen: Thank you for sharing tetageeti's post. I was not using google reader for some days. Now again I have to use it!

  ReplyDelete
 20. >>అవును! పాపాయి పుట్టినప్పుడే ఆ ఇంట్లో నాన్న కూడా పుడతాడు!
  అవును నిజం! సంవత్సరాలు వేరైనా మనిద్దరం ఇంచుమించు ఒకే రోజు పుట్టినట్టున్నాం :-)
  నేను మీ అంత సదానంద చిద్విలాస మూర్తిని కాదు కాని, వానలో తడవడం లాంటి విషయాల్లో నాదీ మా పాపదీ ఒకటే జట్టు :-)

  >>ఆ పుట్టుక తామర పువ్వు విరిసినంత అందంగా ఉంటుంది.
  మీ టపా కూడా అంత అందంగానూ ఉంది!

  ReplyDelete
  Replies
  1. >>నేను మీ అంత సదానంద చిద్విలాస మూర్తిని
   బాబోయ్! అంతమాటనేశారేమిటండి? అలా అయి ఉండేవాణ్ణేమో, పెళ్ళయిన తర్వాత ఆ ఛాన్సుపోయింది. :) ఈ టపా కు స్ఫూర్తి మీ టపాయే కాబట్టి నెనర్లు కేన్సిల్! :)

   Delete
 21. మధుర స్వప్నంలోకి ఇంతమందిని లాక్కెళ్ళిపోవచ్చని తెలియలేదు :) చాలా బాగుంది మీ అనుబంధం, దానిని వర్ణించిన విధం రెండూ!

  ReplyDelete
 22. అవును! పాపాయి పుట్టినప్పుడే ఆ ఇంట్లో నాన్న కూడా పుడతాడు! ఆ పుట్టుక తామర పువ్వు విరిసినంత అందంగా ఉంటుంది.
  __________________________
  మరిచిపోలేని అనుభూతి , ఆనందం ఇది..

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.