Saturday, July 7, 2012

వేయిపడగలతో నేను

అబ్బ! దాదాపు పాతికేళ్ళ క్రితం మొదలెట్టిన పని ఒక్కటి నిన్నటికి పూర్తి అయ్యింది. వేయి పడగలు చదివేశాను!

మాకు చిన్నతనంలో సంస్కృతం చెప్పిన అయ్యవారు విశ్వనాథ వారి శిష్యుడు, భక్తుడు. ఆయన అనువాదం క్లాసులో పాఠాలతో బాటు, మిగతా విషయాలు కూడా చెప్పేవారు. అందులో భాగంగా విశ్వనాథ గురించి చెప్పడమే కాక, ఆయన నవలలు తెఱచిరాజు, వేయిపడగలు, చెలియలి కట్ట వంటి వాటిని తరగతికి తీసుకు వచ్చి కొన్ని భాగాలు మాకు చదివి వినిపించేవారు. తెఱచిరాజులో కత్తియుద్ధవర్ణనా, వేయిపడగల ధర్మారావు గారి ఉపదేశాలు, చెలియలి కట్ట లో కొంతా ఏదో లీలగా జ్ఞాపకం ఉన్నాయి. చెలియలి కట్ట అర్థం కూడా ఆయన ద్వారానే తెలిసింది. ఒక్క సంఘటన మాత్రం జ్ఞాపకపు పొరల్లోంచి మొన్న వెలికి వచ్చింది. " స్త్రీలు మధ్యవయసు వాళ్ళను ఎందుకు పెళ్ళి చేసుకోకూడదు? స్త్రీలు మామూలుగా భోగాసక్తులు, అలా కాకపోతే ఇద్దరు ముగ్గురు భార్యలుండి పిల్లల్లేని దుష్యంతుని శకుంతల ఎందుకు పెళ్ళి చేసుకుంది?" అని ఒకనాడాయన వేయిపడగలలో (18 వ అధ్యాయం) నుండి ఉటంకించారు. నేను  ఆయనను ఆక్షేపిస్తూ, "స్త్రీలందరూ భోగాసక్తులైతే మరి సుకన్య చ్యవనుణ్ణి ఎందుకు పెళ్ళి చేసుకుంది?" అని అడిగినట్టు గుర్తు. మా అయ్యవారికది నచ్చలేదు. ఏదో చెప్పారు, గుర్తు లేదు. నాకు మాత్రం విశ్వనాథ, మా అయ్యవారూ ఇద్దరూ అప్పట్లో నచ్చలేదు. ఆ నచ్చకపోవడం - మాకళీదుర్గంలో కుక్క - తో కాస్త బలపడింది. ఆ కథ నా తొమ్మిదవతరగతి పాఠ్యాంశం. ఆ కథా నాకప్పట్లో అర్థం కాలేదు. ఆ శైలీ నచ్చలేదు. (ఇప్పటికీ)

అంతలా ఆయన చెప్పిన వేయిపడగలు చదవాలని అప్పుడు నిశ్చయించుకున్నాను. మా పుస్తకం మా అయ్యవారినడిగితే ఇవ్వలేదు. విశ్వనాథ పుస్తకాలు అందరికీ సరిపోవని, బదులుగా మహీధరనళినీమోహన్ పుస్తకాలు చదవమని చెప్పారాయన.

అయితే వేయిపడగలు చదవాలన్న కుతూహలంతో మా ఊరి లైబ్రరీకి వెళ్ళి కొంచెం కొంచెం చదువుతూ వచ్చాను. అలా ఓ వందపేజీలు మాత్రమే సాగింది. ఇన్నేళ్ళ తర్వాత అది ముగిసింది.

*********************************************************************************

వేయిపడగల గురించి నా అభిప్రాయం


నవలలో ఆంగ్లేయుల దమన నీతిని గురించి వివరణలూ, భారతీయుల ఔన్నత్యప్రదర్శనా, గ్రామస్వరాజ్య విచ్ఛిత్తి వివరణల్లోని సూక్ష్మతా సంచలనాత్మకంగా, అద్భుతంగా ఉన్నాయి. ఒక చోట జేబులు కొట్టుకునే పిల్లవాని ఔన్నత్యం, అతనిలోని భారతీయాత్మ గురించి చెబుతాడు. హృదయం కదిలిపోతుంది. (అలాంటి సంఘటనలు నిజజీవితంలో ఎదురైతే వాటి విలువ తెలుస్తుంది.)  కొన్ని కొన్ని సంఘటనలు కరుణరసాత్మకంగా ఉన్నాయి. అదే సమయంలో ఆంగ్లేయులను ఉద్దేశించి సమాధానాలు చెప్పినంత మాత్రాన ఈయన భావాలు సరైనవని ఎందుకు ఒప్పుకోవాలో తెలియలేదు.

ఉదాహరణకు: "మోటారు వాహనానికి పెట్టే డబ్బు ముండకు పెడితే తప్పేంటి? ఒక వేశ్యకు పూటకు తినడానికి తిండి అయినా దొరుకుతుంది." - అంటాడొకచోట. ఇది నవలలో వచ్చే కొందరు వర్ణాధికుల వేశ్యాలంపటకు చవకబారు సమర్థన. ఆంగ్లేయులు లేని కాలంలో వేశ్యాలంపటను రచయిత ఏ రకంగా సమర్థిస్తాడు? 

ఇంకా - శూద్రుల దేవాలయ ప్రవేశనిరాకరణకు రచయిత సమర్థనా, దేవదాసీ వ్యవస్థకు glorification, ఆమె పాత్రచుట్టూ చిక్కగా అల్లిన కూటనీతి ఇలాంటివి కాస్తో కూస్తో ఆలోచనాపరులైన పాఠకులకు సహించవు. (తనసిద్ధాంతాలు కరెక్టని నిరూపించడం కోసం విశ్వనాథ సహృదయులు సిగ్గుపడే వాదనలు చేస్తాడు - వల్లంపాటి వెంకటసుబ్బయ్య) ఇక విస్సన్న చెప్పింది వేదమన్నట్టు లెక్చర్లు దంచడం, భిన్నవాదాలు ఇతర పాత్రలతో చెప్పి చర్చించకుండా, తనకు తెలిసింది ధర్మమన్నట్లు హీరో చెబుతూ పోవడం, వింటున్నవాళ్ళు ’బాంచెన్ దొరా’ అన్నట్టు ఊరుకోవడం కృతకంగా, పేలవంగా ఉంటాయి.

విద్యుచ్ఛక్తి మీద విశ్వనాథ విమర్శలు చదివితే రా.రా. మాటలు గుర్తొచ్చి నవ్వొస్తుంది. వీథిదీపాలు రావడం వల్ల ఆ తీగల మీద కూర్చుని కాకులు చచ్చిపోతాయట. అవి రావడం వల్ల ఆడాళ్ళు సాయంకాలం దీపాలు పెట్టరు, అందువల్ల ఇంట్లో మహాలక్ష్మి వెళ్ళిపోతుంది, పైగా ఆముదం అవసరం తీరిపోవడంతో ఆముదం పంట రైతులు మానేసి వరిపంటనే పండిస్తారట!

ఈ రచన విశ్వనాథ స్వీయచరిత్రేనని, నవలలో ధర్మారావు ఈయనేనని, ధర్మారావు, ఆయన మిత్రుల అభిప్రాయాలు, భావజాలం రచయితవేనని స్పష్టంగా తెలుస్తుంది. ఈ నవలను విమర్శిస్తే భావజాలాన్ని విమర్శించనట్లవుతుందో, లేక రచనను మాత్రమే విమర్శించినట్లవుతుందో తెలియదు.

నవల చదివేప్పుడు చాలాసార్లు ఠాగూర్ గుర్తొచ్చాడు.  నవల పూర్తి చేసి వెతికితే ఆర్. ఎస్. సుదర్శనం గారు విశ్వనాథను, రవీంద్రనాథుని పోల్చి వ్రాసిన విమర్శ దొరికింది. (1964 భారతి సెప్టెంబరు నెలలో ప్రచురితం) కొన్ని లోపాలున్నప్పటికీ మంచి వ్యాసం. ఈ వ్యాసాన్ని తిరిగి సారస్వత వివేచనలో రా.రా. సమీక్షించాడు. అదీ గొప్పవ్యాసమే.

ఇంకా "కొల్లాయి గట్టితేనేమి" కూడా గుర్తొచ్చింది. కొల్లాయి గట్టితేనేమి, వేయిపడగలు రెండింటి కథాకాలం ఒక్కటే. 1920 లలో సమాజ ప్రభావం కుటుంబం పైనా, సాంప్రదాయవాది అయిన వ్యక్తి మీద ఎలా ఉన్నదో ఒక అగ్రహార నేపథ్యంతో చెప్పిన కథ మొదటిదైతే, అదే కాలంలో సుబ్బన్నపేట అనే ఒక గ్రామ (స్వరాజ్య) విచ్ఛిన్నతను వ్యక్తులజీవిత నేపథ్యాలతో చెప్పిన కథ రెండవది. మొదటిది Evolution. రెండవది Involution.  బిగువైన కథనం, చిక్కటి సన్నివేశచిత్రణా మొదటి నవలలో కనిపిస్తే, రెండవదానిలో ఉపదేశధోరణీ, సాంప్రయవాదం, జమీందారీవ్యవస్థాప్రతిష్టాపనాపరాయణత్వం, విస్తృతవిషయసంగ్రహం కనిపిస్తాయి. మొదటి నవల శైలి అనాయాసమూ, సులభమూ. రెండవ నవల శైలి గ్రాంథికం లాంటి వ్యావహారికం, వ్యావహారికం లాంటి గ్రాంథికం. ఈ రెంటిని పోల్చి తులనాత్మకంగా అధ్యయనం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి.

వేయి అరఠావులు, 650 పేజీల ఈ నవలను ఈ రచయిత 29  రాజుల్లో వ్రాశాడట. గొప్పవిషయమే, కానీ అది quantitative assertion అవుతుంది. రచయిత పాండిత్యంకన్నా పాఠకునికి ఒరిగినదేమిటి అనేది సరైన ప్రశ్న. నవలలో విషయవిస్తృతి విషయవివేచనను మింగివేసింది. మొత్తం చదివిన తర్వాత పాఠకునికి ఎన్నో విషయాలు చదివినట్లున్నా అనేక విషయాలపై స్పష్టమైన అభిప్రాయం, అవగాహన ఏర్పడదు.ఎందుకంటే ఈ రచన మేధోనిష్టమైనది.

సాహిత్యం హృదయనిష్టమైనది. పాండిత్యం మేధోనిష్టమైనది. రెండిటికీ తేడా ఠాగూర్ కు, విశ్వనాథకు ఉన్నంత!

26 comments:

 1. manchi vimarsa, naaku pedda nachaledandi.
  kani chadavaalsinde. thank you keep writing.

  ReplyDelete
 2. s i too feel same but to b frank i read it when i was in inter is too b read again to get a clear understanding ANNAPURNA

  ReplyDelete
 3. వేయిపడగలు మీద ఈమధ్యనే ఒక బ్లాగులో చర్చ కొద్దిగా జరిగింది.ఆనవలేకాదు,విశ్వనాథ వారి రచనలు చాలా,తీవ్ర విభేద అభిప్రాయాలకు దారితీస్తాయి.ఆయన ఫ్యూడల్ వ్యవస్థని,కులభేదాల్ని ,సనాతనత్వాన్ని సమర్థిస్తూ ,ఆధునికతనీ ,అభ్యుదయాన్ని ,వ్యతిరేకిస్తాడని ప్రధాన విమర్శ .నిజమే.ఆయన పాండిత్యాన్ని ,అనేక సాహిత్యప్రక్రియలలో సామర్థ్యాన్ని ,కవిత్వం లో గొప్పతనాన్ని వ్యతిరేకులు కూడా ఒప్పుకుంటారు.ఇంక ' వేయిపడగలు 'నవల విషయానికి వస్తే; నాకు బాగా నచ్చినది.50 సం.కాలంలో ఆంధ్రదేశంలో వచ్చిన మార్పులు సంఘటనలు గొప్పగా చిత్రించిన నవల.వాటిని ఆయన దృక్పథంలో వర్ణించి ఉండవచ్చును.అందువలనే ఆ నవల తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప నవలగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకొంది.రెండవ కారణం ;ఇప్పుడు మనమంతా ఆందోళన చెందుతున్న పర్యావరణకి ప్రమాదం,కాలుష్యం,కుటుంబ సంబంధాల విచ్చిన్నం ఆనాడే ఆయన ఊహించి రాశారు.ఈ positive aspects కూడా మనం పరిగణన లోకి తీసులోవాలి.

  ReplyDelete
 4. కమనీయం గారూ, ఆ బ్లాగు వెతుకుతాను.

  ఆయన ప్రతిభకు, సామర్థ్యానికి ఇవ్వవలసిన credit కంటే ఎక్కువ ఇచ్చారన్నది నా ధృఢమైన అభిప్రాయం. కవిత్త్వంలో కూడా ఆయన పద్యాల్లో ఆయనకే కనిపించని అంతరార్థాలను లాగడం, చిన్న చిన్న ప్రత్యేకతలను శిల్పం క్రింద ప్రచారం చేయడం చాలా చేశారు. దాన్నే - కవితాకన్యకను చెరబట్టడం అని కొందరు విరుచుకుపడితే శారదాదేవ్యుపాసనాభ్రష్టత్వమని రాళ్ళపల్లి వంటి వారు అన్యాపదేశంగా హెచ్చరించారు. అందులో తప్పేమీ లేదు. విశ్వనాథ శ్రీనాథుణ్ణి, పెద్దనను, వేమన్నను మొదలుకుని అనేకులని ఈసడిస్తే లేని తప్పు, ఈయన కవిత్త్వవిమర్శలో ఉందంటే నేనొప్పుకోను.

  ఈ నవల విషయానికి వస్తే ఇది ఖచ్చితంగా గొప్పనవల, ఇంతకంటే గొప్పవి మాలపల్లి, కొల్లాయి గట్టితేనేమి తదితరాలు.

  ఇక - ఠాగూర్ ఇలాంటి సమస్యలను రచనాపరంగా ఉద్యోతించడమే కాక, స్వయంగా శాంతినికేతనస్థాపన చేసి, సమాజవ్యవహారాలలో, ఉద్యమాలలో పాలు పంచుకుని పరిష్కారానికి ప్రయత్నించారు. అందుకే ఆయన మహర్షి, ఈయన భ్రష్టయోగి.

  ReplyDelete
 5. విశ్వనాథ ను విమర్శించకూడదని నేను అనలేదు.ఎవరినైనా విమర్శించవచ్చును.భిన్నాభిప్రాయాలు ఉండవచ్చును.తెలుగులో ప్రముఖనవలల్లో వేయిపడగలు స్థానం పొందడానికి కారణాలు వివరించాను.టాగూరుని ,విశ్వనాథనీ పోల్చకూడదు. నేను ఎక్కువగా మెచ్చినవి 'చెలియలికట్ట ','ఏకవీర ' నవలలు.

  ReplyDelete
 6. నేను శ్రీ విశ్వనాథ వారి ప్రతిభని గౌరవిస్తాను కానీ వారి నవలలు ఇష్టంగా చదవడం నావల్లకావడం లేదు.ఓ రెండేళ్ల క్రితం వేయి పడగలు కష్టమ్మీద సగం చదివి అపేసాను.మరో సారి మెదటినుండి పూర్తిగా చదివి కాని దాని గురించి మాట్లడను. చదివిన ఆయన నవలల్లో ఏదీ నాకు నచ్చిందని చెప్పలేను.ఎవరి రుచి వారిది కదా?

  ReplyDelete
 7. రవి గారూ...

  మీదయిన శైలిలో నవలా పరిచయం బాగుంది. కానీ కొంచెం విస్తరిస్తే బాగుండేదేమో!

  "ఈ నవలను విమర్శిస్తే భావజాలాన్ని విమర్శించనట్లవుతుందో, లేక రచనను మాత్రమే విమర్శించినట్లవుతుందో తెలియదు." -- రచననూ, భావజాలాన్నీ రెంటినీ విమర్శించినంత మాత్రాన తప్పేముంది. మరో విమర్శా కోణం ఆవిష్కృతమవుతుంది కదా.

  అది కాదండీ బాబూ... టపాలు తొలగించేయడం దేనికి. లోకో భిన్న రుచిః కదా. నేను కొంచెం తాపీగా చదువుకుందామని చూస్తుంటే, మీరేమో మీ గత టపాలు రెంటినీ తీసేసారు, బ్లాగ్యుద్ధాలకో, తీవ్ర చర్చలకో ఇబ్బంది పడడం దేనికనా మీ భావం? flip side of the coin చూడాలని చాలా మందికే ఉంటుంది కదా. అలాంటి మమ్మల్ని నిరాశ పరచడం మీకు భావ్యమేనా?

  ReplyDelete
 8. >>రచననూ, భావజాలాన్నీ రెంటినీ విమర్శించినంత మాత్రాన తప్పేముంది.

  రెంటినీ కలిపి విమర్శించరాదని ఒక సిద్ధాంతం ఉంది లెండి. అదో పెద్ద కథ. ఇప్పుడేల? :)

  >>అలాంటి మమ్మల్ని నిరాశ పరచడం మీకు భావ్యమేనా?

  మీకు పర్వాలేదండి. కానీ అందరూ అలా ఉండరు. ఈ నా తుంట రాతలు పట్టుకొని జనాలు ఈ టపా బయట చర్చిస్తూ సమయం వృథా చేసుకోవడం ఎందుకు? ఎలానూ నా ఉద్దేశ్యం రకరకాలుగా చెబుతున్నాను. అది తెలుస్తే చాలు.

  ’ధ్వని’ టపా తొలగించడానికి కారణం మీరు కాదు. ’ధ్వని’ గురించి చాలా సామాన్యమైన భాషలో, సంస్కృత పండితులస్థాయి నుండి కిందికి, బ్లాగర్ల స్థాయికి దింపి ఒక చిన్న సిరీస్ రాద్దామనుకున్నాను. (అంత సీన్ నాకు లేదు, కానీ కొంచెం ఆవేశం, కొంచెం సబ్జెక్టు కు చెందిన అభినివేశమూ ఉన్నై) రెస్పాన్స్ బావోలేదు. మొత్తం కేన్సిల్. :))

  ReplyDelete
 9. రవి గారు,
  బాగా వ్రాశారు. వీలైతే ఇదే విషయం మీద నేను వ్రాసిన టపా చదవండి

  http://bhava-nikshipta.blogspot.in/2011/06/blog-post.html

  ReplyDelete
 10. హమ్మయ్య!మనుషులే కదా! నేనింకా అవి దాటిన జంతువులనుకొన్నా!

  ReplyDelete
 11. "నవలలో విషయవిస్తృతి విషయవివేచనను మింగివేసింది"
  "పాండిత్యం మేధోనిష్టమైనది"
  Great to see somebody judging the content of a novel from a right perspective-that of its purpose.
  I enjoyed reading this, thank you.

  ReplyDelete
 12. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు, మీ వ్యాసం అప్పుడెప్పుడో చదివాను. మళ్ళీ మొన్నామధ్య చదివాను. చక్కగా, విపులంగా వ్రాశారు. నృత్యం, నాట్యం, నృత్తం గురించీ, నాట్యశాస్త్రం గురించి, అలంకారశాస్త్రం గురించి వేయిపడగలలో చెప్పిన సంగతులు అలంకారశాస్త్రంతో కనీస పరిచయం ఉన్నవారికి పరిచయమైన విషయాలే. (నృత్తం, నృత్యం, నాట్యం భేదాలు తెలియాలంటే దశరూపకం preface చదివితే చాలు). అక్కడా కొన్ని అనుమానాలున్నాయి. మృచ్ఛకటిక ’రూపకం’లోని పద్యాన్ని దేవాలయంలో దేశీ ’నృత్యం’ లో ప్రదర్శించటం ఎలానో అర్థం కాలేదు. (నృత్యం వేరు, నాట్యం వేరయినప్పుడు నృత్యం స్థానంలో నాట్యం ఎలా ప్రదర్శనార్హమవుతుంది?) నృత్యం భావాశ్రితం, నాట్యం రసాశ్రితం, నృత్తం తాళలయాశ్రితం ఐనప్పుడు - ’యతోహస్తః తతో బుద్ధిః...తతో రసః" లోని రస శబ్దం నృత్యానికి ఎలా అన్వయిస్తారు? శ్రీనాథుడు సీసపద్యం చెడగొట్టాడన్నారు. ఎలానో చెప్పరు. ఇలాంటివి ఆయన వివేచన చేయలేదు. (అభిప్రాయాలు చెప్పడానికి, మతనియయాలను scriptures లేదా సాంప్రదాయం సహాయంతో చేసే వ్యాఖ్యానాలకూ, విషయవివేచనకూ తేడా ఉంది. ఇది చెబితే చాలామంది అభిమానులు ఒప్పుకోకపోవచ్చు.)

  సంస్కృత సమాసాలలో అక్కడక్కడా కొంచెం పాండిత్యప్రకర్ష, కొండొకచో అశ్లీలము ధ్వనిస్తాయి. (ఉదా: ఈ అవిదితశ్రోణీభరము నీకేలనే?) అవీ అందరికీ తెలియవు.

  29 రోజుల్లో ఇన్ని పేజీల విషయం వ్రాయడం అద్భుతంగా కనిపిస్తుంది.కొవ్వలి వారి వెయ్యిపైగా నవలలు వ్రాశారు. ఆయన రచనాకాలం 50 యేళ్ళనుకుంటే, ఏడాదికి 20, నెలకు 1-1/2 నవల వ్రాసినట్టు. ఇలా జీవితాంతము! ఆయన విశ్వనాథకన్నా గొప్పవాడవాలి!

  ఈ నవల గొప్పనవల అని ఒప్పుకోవడానికి సందేహం లేదు కానీ, తెలుగు సాహిత్యానికి ఇది తలమానికం, ఇటువంటిది మరొకటి పుట్టదు, వంటి ఉత్ప్రేక్ష్యలు సరిపడవు.

  ReplyDelete
 13. కమనీయం గారు, గోపాలకృష్ణగారు: మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.
  గార్లపాటి రవి గారు: మీ మెప్పుదల వల్ల కాస్త ఉపశమనం లభించింది. ఒక్కరైనా నా భావాలతో ఏకీభవించారు. చాలు.:)
  అన్నపూర్ణ గారు: ధన్యవాదాలు.
  The Tree గారు: ధన్యవాదాలు. మీ బ్లాగు బావుంది.
  బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు: మీ వ్యాసం (వ్యాసాలు) నేను వ్రాసిన దానికన్నా బావున్నాయి. అలానే వ్రాయండి.

  ReplyDelete
 14. శ్రీవల్లీ రాధిక గారు:

  మోటారు కారును విమర్శించేప్పుడు "భోగము" ది ఎందుచేత ప్రస్తావనాంశం అయింది? అంత పండితుడికి మరే ఇతర ఉపమానం దొరకలేక అంటారా? "భోగము" వాళ్ళు అన్నమాట మురుక్కాలువ లా అచేతనమైన వస్తువును సూచించేది కాదు కదండీ? మీ పోలికలోనే తెలుస్తూంది - మోటారుకారు = పూరీ జగన్నాథ్, మురుక్కాలువ = భోగముది.అది ఒక so called నీచ కులాన్ని ఉద్దేశించినది. "నీచ" శబ్దం నాది కాదండి, రచయితదే. నవలలో గిరిక తాను "నీచ" కుల సంజాతనని చెబుతూనే ఉంటుంది.

  ....ఇక నాకు అర్ధమయినంతవరకు, మోటారు కార్లు, భోగమువాళ్ళ ఉపమానంలో ఉద్దేశ్యం మోటరుకార్లని విమర్శించడం కానీ భోగమువాళ్ళని సమర్ధించడం కాదు.

  కావచ్చు. అయితే అక్కడ గౌణంగా కనిపించే అర్థం - "భోగముది - డబ్బు పెడితే వస్తుంది". ఇది నిందాత్మకం.

  మేధోనిష్టమైనది - ఈ మాటను వివరిస్తూ పోవడం వృథా. మీ అభిప్రాయం మీది.

  మీరన్నది నిజమే. నాకు ఈయన మీద అద్భుతమైన అభిప్రాయాలు లేవు.

  "భోగము" కు పర్యాయపదం వాడడం కావాలని చేసినది కాదండి. అది తొలగించినా అక్కడ నిందాసూచన మారదని నా అభిప్రాయం.

  ReplyDelete
 15. శ్రీవల్లీ రాధిక గారు, ఆ ప్రస్తావనను రెట్టించకూడదనే అలా రాశాను. సరే..

  ఈ నవల్లో ప్రధానపాత్ర తండ్రికి నలుగురుభార్యలు. కాక ఇంకొక ఉంపుడుకత్తె. ఆయన త్రయీవిద్యకు నిదర్శనం. భగవంతుని అవతారం, భారతదేశ ఆత్మ. ఈ నవల్లో ప్రధానపాత్ర రచయితే. తండ్రి సొంత తండ్రే. చెబుతున్న కథ ఆయన సొంతకథే.

  ఎవరైనా ప్రధాన పాత్ర (రచయిత) తండ్రి రసికత్వం గురించి ప్రశ్నిస్తే ప్రధాన పాత్ర ఏమని జవాబిస్తాడంటారు?

  ఇప్పుడు "మోటారు కారు.." వాక్యం చదవండి. ఏదో గొప్ప విషయం చెబుతున్నట్టు ఉందా ఆ వాక్యం, లేక సమయం, సందర్భం లేకుండా న్యూనతనో, తప్పునో కప్పి పుచ్చుకునే సమర్థన లా, గుమ్మడికాయ సామెత చెప్పినట్టు ఉందా?

  ReplyDelete
 16. రవిగారు... చిన్న సవరణ....చూడండి? సరదాగా...
  (1) మురిక్కాలవ అచేతనం కాదండొయ్ 'స ' చేతనమే.. ;)
  (2) అక్కడ పోలిక మోటారుకారు = పూరీ జగన్నాథ్ కీ కాదు.. పూరీ జగన్నాథ్ సినిమాకి,

  (పిడకలవేటయ్యిందంటారా??)

  ReplyDelete
 17. ముందస్తుగా ఒక్క విషయం. నేనీ వ్యాఖ్య వ్రాస్తున్నది వేయిపడగలు నవలనో విశ్వనాథనో వెనకేసుకు రావడానికి ఎంతమాత్రమూ కాదు. రవిగారి (వారితో ఏకీభవించిన మిగిలినవారి) అభిప్రాయాలను ఖండించడానికో, మార్చెయ్యడానికో అంతకన్నా కాదు. అలాంటి ఉద్దేశమూ అది సాధ్యమనే నమ్మకమూ పూచికపుల్లంత కూడా నాకు లేదు. మరెందుకీ వాఖ్య అంటే, నా అజ్ఞానాన్ని కొద్దిగా బయటపెట్టుకోడానికి.
  శ్రీవల్లీరాధికగారి వ్యాఖ్య నన్ను దీనికి పురికొల్పింది. ఎలాంటి కాల్పనిక రచనైనా సాధారణంగా తన కాలానికి సంబంధించిన అంశాలను తనలో ఇముడ్చుకుంటుంది. ఆ కాలానికి చెందిన చరిత్రని తెలుసుకొని, దాన్ని ఆ చారిత్రక నేపథ్యంలో అర్థం చేసుకోడం ఒక పద్ధతి. ఇదే ఏకైకపద్ధతీ, సరైన పద్ధతీ, అందరూ అలానే చెయ్యాలీ వంటి వాదనలు నేను చెయ్యబోవడం లేదు. అది ఒక పద్ధతి అని మాత్రమే అంటున్నాను. నాకంతో యింతో నచ్చిన, మంచిదనిపించిన పద్ధతి. ఈ దృష్టితో చూస్తే, విశ్వనాథవారి మోటారుకార్లు, భోగమువాళ్ళ ఉపమానంలో, భోగపుస్త్రీ వ్యవస్థని సమర్ధించడం కచ్చితంగా ఉంది. అది రాధికగారిచ్చిన మురిక్కాలవ పోలికవంటిది ఎంతమాత్రం కాదు. దీని నేపథ్యం తెలియాలంటే దేవదాసీ వ్యవస్థ చరిత్ర తెలియాలి. పందొమ్మిదవ శతాబ్ది చివరలో, ఇరవయ్యవ శతాబ్ది మొదట్లో వచ్చిన anti-nautch movement, ఆ తర్వాత దేవదాసీ వ్యవస్థను రద్దు చేసే ప్రభుత్వ తీర్మానం, దానిపై వచ్చిన వ్యతిరేకత, ఇవన్నీ తెలియాలి. గురజాడనుండి, శ్రీపాద, మల్లాది రామకృష్ణశాస్త్రిగారి వరకూ ఎంతమంది ఏయే స్థాయిలలో ఎందుకీ anti-nautch movementని వ్యతిరేకించారన్నది అర్థం చేసుకోవాలి. ఆ నేపథ్యంలో చూస్తే, వేయిపడగలలోని దేవదాసీ చిత్రణ "glorification" అవునా కాదా అన్నది తెలుస్తుంది. మోటారుకారు విషయంలో భోగపుస్త్రీ పోలికే ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకి కూడా వేరే సమాధానం దొరుకుతుంది.

  ReplyDelete
 18. కామేశ్వరరావు గారు: ఇదివరకు టపాలో తాడేపల్లి గారు కూడా ఇలాంటిదే వ్యాఖ్య చేశారు. బుద్ధుణ్ణి విమర్శించడాన్ని చారిత్రకనేపథ్యంతో పరిశీలించాలన్నారు. అయితే "బుద్ధుడు రాక్షసుడు" అని ఒక చిన్నపిల్లవాని పాటంలో పెడితే చదివే పిల్లవాడు, నేర్పే ఉపాధ్యాయుడు ఆ చారిత్రక నేపథ్యం అర్థం చేసుకోవడం, రచయితపై సానుభూతి చూపడం కుదరని పని. తప్పుగా అర్థం చేసుకున్న ఏ ఇన్నయ్యో ఆయన "నేపథ్యం" తో వాదిస్తే దాన్ని సానుభూతితో అర్థం చేసుకోవలసి వస్తుంది.

  అదే కాస్త పాఠకుడికీ వర్తిస్తుంది. కనిపించిన ప్రతి రచననూ చారిత్రక నేపథ్యంతో చదువుతూ పోవడం అసాధ్యం, అర్థం లేని పని కూడా. నేపథ్యాన్ని రచయిత కనీసం సూచించాలి. రచయిత పాఠకుడి దగ్గరకు వెళ్ళడం న్యాయం కానీ పాఠకుడే రచయితను అర్థం చేసుకోవడం కోసం తపస్సు చేయాలనడం సరైనది కాదు. వేయి పేజీల నవలలో రచయిత అరపేజీ కేటాయిస్తే అపోహలు తొలగి ఉండేవి. కొంచెం అతిగా ayiనా యండమూరి ఈ విషయానికి సరైన ఉదాహరణ.

  ఇక్కడ సాధారణంగా నవల చదివే పాఠకుడికి ప్రధానపాత్ర తన తండ్రిని సమర్థిస్తున్నట్టుగా అనిపిస్తే అందులో పాఠకుడి తప్పు లేదు.

  ReplyDelete
 19. రవిగారు,

  ఈ వాక్యాలు మరోసారి చదవండి:
  "ఆ కాలానికి చెందిన చరిత్రని తెలుసుకొని, దాన్ని ఆ చారిత్రక నేపథ్యంలో అర్థం చేసుకోడం ఒక పద్ధతి. ఇదే ఏకైకపద్ధతీ, సరైన పద్ధతీ, అందరూ అలానే చెయ్యాలీ వంటి వాదనలు నేను చెయ్యబోవడం లేదు. అది ఒక పద్ధతి అని మాత్రమే అంటున్నాను."

  మళ్ళీ మరోసారి చెపుతున్నాను. ప్రతి పాఠకుడూ యిలానే అర్థం చేసుకోవాలని నేను శాసించడం లేదు, ఆశించడం కూడా లేదు. ఇదొక పద్ధతి ఉందని, ఆ పద్ధతి ద్వారా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చునని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. నా వ్యాఖ్య ద్వారా వేయిపడగలనో, దాని రచయితనో సమర్థించే ఉద్దేశం నాకు లేదు.

  ReplyDelete
 20. సనత్ గారు: తెలుగు సినిమాను మురుక్కాలువతో పోల్చి మురుక్కాలువను అవమానించడాన్ని ఖండిస్తున్నాను.

  ReplyDelete
 21. శ్రీవల్లీరాధికగారు,

  మీ అభిప్రాయమూ, రవిగారి అభిప్రాయము రెండూ నాకర్థమయ్యాయి. ఈ రెండిటిలో ఏదో ఒక దాన్ని సమర్థించడానికో, రెండూ తప్పేనని చెప్పడానికో నేనా వ్యాఖ్య వ్రాయలేదు (ఆ విషయం నా వ్యాఖ్యలో స్పష్టపరిచాననే అనుకున్నాను!). అంచేత మీరు చెప్పినదాన్ని గురించి మళ్ళీ వివరణ యివ్వాల్సిన అవసరం లేదు. మరొక మూడవ దృష్టికోణం కూడా ఉంది సుమా అని చెప్పడం ఒక్కటే నా ఉద్దేశం. అది మీకు (అంటే మీ యిద్దరికీ) అవసరమా అనవసరమా అన్నది మీకు మీరుగా ఆలోచించుకొని నిర్ణయించుకోవలసినదే.

  ReplyDelete
 22. రాధిక గారు,
  మీరు పుస్తకంలో వ్రాసిన సమీక్ష మరో మారు చదివిన తర్వాత మీ ఆలోచన నాకర్థమయింది. మీరు నవలను అనుసరించి, ఆస్వాదిస్తున్నారు. నేను ఆలోచిస్తూ, పరిశీలిస్తున్నాను. మీరు నవల ను ఆస్వాదిస్తే, నేను విశ్వనాథ గురించి ఆలోచిస్తున్నాను.

  "భక్తియోగులకు కృష్ణస్వామి సులభుడు. జ్ఞానయోగులకు శివుడు సేవనీయుడు."

  మీరు ఇందుకు ఆకర్షింపబడితే, నాకు శైవభక్తులున్నారు కదా అని, జ్ఞానం అంటే ఏమిటి అనీ అనుమానం వస్తున్నది.

  "..తాను మాట్లాడే విషయం పట్ల ధర్మారావుకి వున్న స్పష్టత. .."

  మీకు రచయిత నేర్పు కనబడితే, నాకు రచయిత ఇతరపాత్రలతో వాదింపజేయకుండా ప్రధానపాత్రను ఎలివేట్ చేసిన తీరు కనిపించింది. ఉదాహరణకు: ఇరవై నాలుగవ అధ్యాయంలో, వర్ణ వ్యవస్థలో ఉచ్ఛనీచాలను విచారిస్తూ "ఆవుపేడ వృశ్చికాదులను చంపును. బర్రెకు ఆ యోగ్యత లేదు. సృష్టిలో ఎక్కువ తక్కువలు ఉన్నాయి." ఇలా వాదిస్తూ పోతాడు. "బర్రె పాలు చిక్కగా నుండును. ఆవుపాలకా యోగ్యత లేదు. వైవిధ్యమూ, వైరుధ్యమూ ప్రకృతి సహజములు. ఒక ప్రకృతినియమముననుసరించి మనుషులు ఏర్పరుచుకున్న సమాజమున అర్హతలను నిర్ణయించుటకు నీవెవరు?" అని ఎవడూ అడగడు. ఆ అధ్యాయం మొత్తానికి నా వద్ద అన్యత్రా ఆలోచనలున్నాయి.

  పైన విశ్వనాథ వాదనలో తన మేధ ఉన్నది. అయితే తనతోటి మానవులకు అంటుకున్న "అస్పృశ్యత" అన్న సమాజజాడ్యం పట్ల సానుభూతి లేదు.

  ఆయన పాండిత్యం లో చెప్పడమే ఉన్నది. వివేచన నాకు కనిపించలేదు. సాహిత్యమూ, వాఙ్మయము, కావ్యమూ వీటి గురించి స్పష్టంగా చెప్పడు. చెప్పినదానికి అలంకారశాస్త్ర ప్రామాణ్యం లేదు. కొన్ని చోట్ల ఉన్నా, విరోధాలు ఉన్నాయి. దీనికి కారణం, పాఠకులపైన లోదృష్టి.

  అందుచేతనే ఇది మేధోనిష్టమైనదని నా అభిప్రాయం.

  ఒక నవలాపాఠకురాలిగా మీ సమీక్ష బావుంది. అయితే, నవల ఎలా వ్రాశాడు అనే దానికన్నా, ఎందుకలా వ్రాశాడు, ఏం చెబుతున్నాడు అన్న విషయాలపై నా దృషి కూరుకుపోయి ఉంది. మరో దురదృషకరమైన విషయమేమంటే, విశ్వనాథ "పరిభాష" వేరు, నేనభిమానించే ఠాగూర్, ఇతరత్రా రచయితల "పరిభాష" వేరు. ఆయన మార్గం లో వెళ్ళే వారికి మాత్రమే ఆయన నచ్చగలడు.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.