Saturday, April 28, 2012

అమృతత్వం నుంచీ అమృతత్వం లోకి...


కృష్ణ పారుతోంది.. గునగున నడిచే చిన్ని పాపాయి గజ్జెల సవ్వడిలా బుడిబుడి ధ్వానాలతో..
కృష్ణ పారుతోంది..శ్రీకృష్ణుని మురళీనాదంలా ప్రకృతిని మైమరపిస్తూ ..
కృష్ణ పారుతోంది..తనలోని ప్రాణశక్తిని ఘనీభవింపజేసి సస్యరాశులకందిస్తూ.,
కృష్ణ పారుతోంది..తనలోని స్వచ్ఛమైన ప్రేమను రంగరించి పచ్చని పంటచేల చీరను భూమితల్లికి చుట్టబెడుతూ..
కృష్ణ పారుతోంది.. జలబిందువుల ఇంద్రనీలాలరాశులను దొరలిస్తూ.. తుళ్ళుతూ..తనలోంచి తనలోకి..చల్లగా.. మెల్లగా .. అమ్మలా .. కమ్మగా.. నవ్వుతూ..

ఆ పక్కనున్న బ్రిడ్జి కావతల ఎవరో రాజు తన శత్రువుల నుండి తప్పుకుందుకు కాబోలు నది మధ్యలో గుట్టమీద ఇల్లు అనబడే కోట కట్టుకున్నాడు. ఆయన ఖాళీ చేసివెళ్ళిపోయినా, కృష్ణ తాలూకు నల్లని నలుపును గోడలమీద ప్రతిఫలింపజేస్తూ, ’టులెట్’ బోర్డు పెట్టినా ఎవరూ ముట్టుకోని దశలో ఆయన ఇల్లు అలాగే ఉంది.

బ్రిడ్జికి ఇటువైపు విశాలమైన స్నానఘట్టాలు, అందులో స్నానాదికాలు చేస్తున్న మనుషులు, దూరంగా చిన్నపిల్లల గుంపు నీళ్ళల్లో ఈదులాడుతూ తుళ్ళుతూ కేరింతలు.. ఒడ్డున విగ్రహాలు, చిన్న చిన్న అంగళ్ళూ, తనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ, తనలోకి అడుగుపెట్టిన వారి మాలిన్యాన్ని కడిగేస్తూ, మనసును తేటపరుస్తూ గలగలలాడుతోంది.

నది - 

ధ్యానానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరకదేమో! అందుచేతనే హెర్మన్ హెస్సే సిద్ధార్థుడు జీవిత చరమాంకంలో నదిలో పడవ నడుపుతూ, నదితో ఊసులాడుతూ, బౌద్ధిక జ్ఞానానికతీతమైన పూర్ణ(శూన్య)త్వాన్ని ఆవిష్కరించుకుంటాడు.

You cannot step in to the same river twice - అని హెరాక్లిటస్.
అవును.
నది బయటకు కనిపించే ఒక నిశ్చలత్వం.
అంతర్గతంగా ఒక అనిశ్చల ప్రవాహం.
మొత్తంగా నిశ్చలమూ, అనిశ్చలమూ రెంటికీ అతీతం.
అంటే నిశ్చలమూ, అనిశ్చలమూ రెండూ కానిది కూడానూ.

తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే । తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః ||

నది ఒక పూర్ణత్వమూ, నది ఒక శూన్యత్వమూ కూడానూ.

ఆ పూర్ణత్వాన్నేనేమో వేద ఋషి ఇలా ఘోషిస్తాడు.

ఆపోవా ఇదగుం సర్వమ్ ,విశ్వాభూతాని ఆపః, ప్రాణావాపః, పశవ ఆపః, అన్నమాపః, అమృతమాపః, సమ్రాడాపః, విరాడాపః, ఛందాగుంసి ఆపః, భూర్భువస్సువరాప ఓమ్...

జగత్తులో సర్వమూ జలమే. ప్రాణము నీరే, పశువులు నీరే, అన్నమూ నీరే, అముతమూ నీరే, సార్వభౌముడు నీరే, బ్రహ్మస్వరూపమూ నీరే, ముల్లోకాల్లో సర్వమూ నీరే....

నది ఒక సౌందర్యం.

నది ప్రాణం, బీజమూ, మరణమూ, అమృతమూ, అమృతత్వమూనూ.

ఎవరో తమ అయినవాళ్ళ చితాభస్మాన్ని నిమజ్జనం చేస్తున్నారు. ఆ పక్కనే ఒడ్డున వారగా తామర పూల మొక్కలు, నీటిలో తేలుతూ ఉన్నై. ఆ మరణం తాలూకు చిహ్నమైన చితాభస్మం కృష్ణ ప్రవాహం ద్వారా చైతన్యం పుంజుకుని ఒక తామరపూవుకు జన్మనిస్తుందేమో!

అలాంటి ఒక అమ్మ ప్రాణం అనే జీవచైతన్యపు ప్రవాహం పంచభూతాలలో ఒకటైన నీటిలో (కృష్ణలో) నిమజ్జనమై ఆ తర్వాత కొన్నేళ్ళకు మరొక తమ్మిపూవంటి ’అమ్మలు’గా మా ఇంట్లో జన్మించింది!

సృష్టి అనంతం - కృష్ణ ప్రవాహం లాగే.

ఈ ప్రవాహం -

అమృతత్వం నుంచి అమృతత్వం లోకి...

3 comments:

 1. అమ్మలంటే అమ్మేగా మరి.....అంతే - అదొక నిరంతర అమృత ప్రవాహం!

  ReplyDelete
 2. చాలా బాగా వ్రాసారండి.

  ReplyDelete
 3. "కృష్ణ పారుతోంది.. జలబిందువుల ఇంద్రనీలాలరాశులను దొరలిస్తూ.. తుళ్ళుతూ..తనలోంచి తనలోకి..చల్లగా.. మెల్లగా .. అమ్మలా .. కమ్మగా.. నవ్వుతూ.."

  అద్భుతం రవి గారు.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.