Friday, April 20, 2012

షాడో ... షాడో ... షాడో...

- గుండెల మీద పదిటన్నుల బండరాయి పడ్డట్టు ఉక్కిరిబిక్కిరయ్యాడు
- విపరీతమైన ఆలోచనలతో కందిరీగల తుట్టెలా తయారయ్యింది షాడో అంతరంగం
- అంతటితో షాడో వెన్నంటి వచ్చిన అదృష్టదేవత ముఖం చాటు చేసింది.
- తాషామర్బా లాంటి కంఠం తో అరుస్తూ...
- ’గెట్ బేక్ ఎవ్రీబడీ’ - ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నలు వెయ్యలేదెవ్వరు..
- అప్రయత్నంగా చలిగాలి వీచినట్లు జలదరించింది.
- అత్యంతప్రమాదకరమైన సైడ్ కిక్ డెలివరీ చేశాడు.
- అబే దొంగనాయాళ్ళలారా, ఈ గంగారాం నే అడ్డుకుంటార్రా?
- ’తీర్చుకుంటాను ఫ్రెండ్. నిన్ను ఈ గతికి గురిచేసిన వాణ్ణి ఇంతకన్నా దారుణమైన మరణానికి గురిచేసి గాని విశ్రమించను’.
- నల్లటి పరదాలు కళ్ళముందు ప్రత్యక్షమవుతుండగా నేలపైకి జారిపోయాడు.
- బుగ్గల మీదకు కారింది వెచ్చటి కన్నీరు
- ముఖమంతా నవ్వులమయం చేసుకుంటూ..
- అసహ్యంగా చూస్తూ సిగరెట్టు వెలిగించాడు
- రాగయుక్తంగా అంటూ...

ఈ వాక్యాలు మీకు అర్థమయితే మీ మదిలో ఓ చిన్న చిరునవ్వు కదులుతూ ఉండాలి.

బాగా అలసిపోయి మీరు ఇంటికి వచ్చారు. కాస్త రిలాక్స్ అవుదామనుకుంటున్నారు. అప్పుడు యే తత్త్వవేత్త పుస్తకమో, మహాకావ్యమో, ఉత్తమ నవలో, హృదయాలు పిండేసే కథో మీ ముందు పెడితే ఆ పుస్తకమక్కడ పెట్టిన వాడిని ’ఫెడీ’ మని తందామనిపిస్తుంది. అలాంటి సమయంలో మాంఛి కాఫీ లాంటి పుస్తకమొకటి చేతిలో పడిందా, మీ తల్నొప్పి, గిల్నొప్పి చేత్తో తీసేసినట్టు మటుమాయం. అదుగో - అలాంటివే ఈ షాడో పుస్తకాలు.

1980 దశకం చివరా, 90 ప్రథమార్థం లో కాలేజీ చదువులు చదివిన వాళ్ళకు వాళ్ళ జీవితంలో ఈ క్రింది సంఘటనలు ఏదో ఒకసారి, ఎలాగోలా అసలు రంగుతోనో, రంగుమార్చుకునో ఎదురయి ఉండకపోవు.

అమ్మా నాన్నా, షాడో బుక్కులు చదవనివ్వడం లేదు. ఈ బుక్కులు చదివితే చెడిపోతారనో, లేకపోతే అలవాటు పడి పరీక్షలకు చదివి ఛావరనో వాళ్ళ ’ఇది’. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. అట్టాంటి ఒకానొక ఉపాయం పేరు కంబైన్డ్ స్టడీ. ఫ్రెండింట్లో మేడపైన మకాం. బాడుగ పుస్తకాల వాడి దగ్గర ఓ నాలుగైదు పుస్తకాలు అప్పటికే సహృదయుడొక్కడు తీసి ఉంచాడు. ఇక ఆ పూటంతా పండగే పండగ. కంబైన్డ్ స్టడీయే స్టడీ!!

మనకో థిక్కెస్టు ఫ్రెండు. అయితే వాడు మీ దగ్గర బాడుగ పుస్తకం తీసుకుని పోగొట్టాడు. అడిగితే దబాయిస్తున్నాడు. ఇవతల బాడుగ షాపు వాడు అరెస్టు వారంటు ఇష్యూ చేసి తిరుగుతూ ఉన్నాడు. చివరికి టెక్స్ట్ పుస్తకం పాత పుస్తకాల షాపులో అమ్మితే ఆ పీడ వదిలింది. అంతా అయిన తర్వాత ’ఫ్రెండు’ జాతీయం చేసిన పుస్తకాన్ని ఓపన్ గా తెచ్చి కళ్ళముందే చదువుతూ ఉన్నాడు!!!

ఇంగిలీసు పరీక్ష మరుసట్రోజే. అయితే మన టెన్షన్ అందుక్కాదు. సగం చదివిన షాడో పుస్తకం ఆ రోజు ఎలాగైనా పూర్తి చెయ్యాలి. ఎట్టకేలకు మన పని పూర్తి చేశాం. మరుసట్రోజు ఇంగిలీసు కోసం ’బూన్ టు ఇంటర్ ఇంగిలీసు’ లో తెలుగులో రాసిన ఎస్సేలు చదువుకెళ్ళాం. మనకొచ్చిన అతి భయంకరమైన ఇంగిలీసును పరీక్షలో ప్రదర్శించాం. ఆ ఉత్తమ ప్రదర్శనకు తగిన ఫలితమూ వస్తుందని తెలుసు. మనకు బాధే (సిగ్గే) లేదు. షాడో పుస్తకం చదివిన సంతోషం ముందు ఏదీ నిలవదు.

అమ్మ - షాడో పుస్తకం చదవనివ్వట్లేదు. ఒక చిన్న ఎత్తు వేశాం. రెండు భాగాలున్న మాంఛి నవలొకటి తీసుకొచ్చి బాడుగ షాపు వాడి దగ్గర నుండి తెచ్చి ఇంట్లో పెట్టాం. అమ్మ ఆ పుస్తకం తీరికున్నప్పుడు చదివి పూర్తి చేసింది. ఆ పుస్తకం తిరిగిచ్చేసి రెండో భాగం పట్టుకు రమ్మంది. ఇప్పుడు బాల్ మన కోర్టులో ఉంది కాబట్టి ’అమా, నేనూ ఒక బుక్కు తెచ్చుకుంటా’  అనేసి ఆ పుస్తకం తో బాటు అఫిషియల్ గా మనక్కావలసిన పుస్తకం తెచ్చుకున్నాం.

’నువ్వు ఇలాంటి పుస్తకాలు కూడా చదువుతావా?’ - ఇంటికి వచ్చిన నాన్న గారి హైక్లాసు హైటెక్కు బంధువులెవరో అడిగారు. వాళ్ళ ఇళ్ళలో ఉత్తమాభిరుచి పేరు ’ఇంగ్లీషు అమర్ చిత్రకథ’. కసి రేగింది. మన ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ తెచ్చాం. హాశ్చర్యం! వాళ్ళ ఇళ్ళలోనూ ఇలాంటి సీన్లేనట. అసలు షాడో పుస్తకాలు చదివితే ఎన్ని దేశాల రాజధానుల పేర్లు తెలుస్తాయ్? అసలు సీ ఐ బీ (ఇది సీబీఐ కాదు. కాదని కుంచెం తెలిసినా వొప్పుకోకూడదని, రెండూ ఒకటే అని ఎప్పుడో డిసైడు అయిపోయినాం) ఎలా పని చేస్తోందో ఇంతకంటే బాగ ఎవరు చెప్తారు? అమర్ చిత్రకథల్లో చెప్పే రామాయణాలు, భారతాలు అప్పటికే ఎన్ని హరికథల్లో, పురాణ కాలక్షేపాల్లో విన్లేదు? ’చిచ్చీ ఈ పెద్దాళ్ళున్నారే’ అనే డయలాగ్ అప్పట్లో లేదు కానీ ఉంటే అదే అనుకొని ఉండేటోల్లం. ఎవరు అడ్డొచ్చినా షాడోని నీడలాగ అనుసరిస్తామని ఫ్రెండ్సు ప్రతిజ్ఞ చేసుకున్నాం!!!

ఇలా రకరకాల కథలు.

చదవడం లో మొదట చందమామ, బొమ్మరిల్లు, బాలజ్యోతి, ఆ తర్వాత కొంచెం తక్కువ స్టాండర్డువైన బాలభారతి, బాలమిత్ర, బుజ్జాయి, ఆ తర్వాత ఆంధ్రజ్యోతి లేదా ప్రభలో అక్కడక్కడా కొన్ని ఫీచర్సు (సినబ్బ కతలు, మిట్టురోడి కతలు, నండూరి విశ్వదర్శనం, టీ కప్పులో తుఫాను, కథాకళి, ఫిడేలు రాగాలు వగైరా), ఆ తర్వాత సీరియల్సు, ఆ తర్వాత యండమూరి, మల్లాది, చందు సోంబాబు, యర్రంశెట్టి సాయి వగైరా వగైరా....

ఈ తర్వాత లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చినాయన షాడో గారు. మిరపకాయల పొట్లం తాలూకు పేపర్లోనూ ఏదైనా ఇంటరెస్టింగా ఉందేమో అని చదివే రోజులు. అమ్మా నాన్నా యేమో ’హిందూ’ పేపర్ చదవరా, మంగళవారం నాపొద్దు అదేదో ’నో యువర్ ఇంగిలీసు’ అని వస్తుందంట, అని టార్చర్ పెడుతూంటే, హిందూ చదివితే ఇంగిలీసొస్తుంది కానీ న్యూసు తెలీదని, న్యూసు పేపర్ న్యూసు కోసముండాల గానీ, ఇంగిలీసు కోసం గాదని తిరుగుబాటు ప్రకటించేసిన రోజులు. అప్పుడు పరిచయమైన షాడో....

షాడో స్పై అడ్వెంచర్ అని షాడో స్పై థ్రిల్లర్ అని రెండు కేటగిరీలు. ఇందులో మొదటిదే చాలామందికి ఇష్టమని నా గెస్సింగు. మొదటి దాంట్లో గంగారాం, రెండవ కేటగిరీలో ముకేషు, శ్రీకరూ, బిందూ, కులకర్ణి గారు ముఖ్యమైన వాళ్ళు. మొదటి రకం పుస్తకాల్లో షాడో ఊర్లోకి ఎంటరవుతూనే సేట్ మంఘారాం ఇంట్లో దొంగతనం చేసి, దస్తావేజులు గాల్లోకి విరజిమ్ముతాడు. ఇదంతా చెప్పడు. కేరక్టర్ల ద్వారా చెప్పిస్తాడు. ఒక పోలీసాయన షాడో కోసం తిరుగుతా ఉంటాడు. ఒక దీనమైన పాత్ర షాడో కోసం ఎదురుచూస్తూ ఉంటది. ఇట్లా కథ సాగిపోతుంది.

రెండవరకంలోనైతే షాడో ఏదో దేశంలో అడుగుపెడతాడు. దిగగానే ఫైటు. అతణ్ణి కలుసుకోవాలనుకున్న సీక్రెట్ ఏజెంట్ చచ్చిపోతాడు. ఆ మధ్యలో అక్కడికెందుకొచ్చాడో చెప్పే మినీ ఫ్లాష్ బాకు. ఆ తర్వాత చివరి వరకూ ఉత్కంఠ! ఈ షాడో ఎక్కడికిపోయినా ఒకటే భాష ఎట్లా మాట్లాడుతాడని, అతనికి వయసు మీదపడదా అని, అతను చచ్చిపోడా అని డవుట్లు వస్తే వాడికి షాడో మార్కు వంద సైడ్ కిక్ లు ఫ్రీ.

షాడో ని చూసి ’బుల్లెట్’ అని ఒక రచయిత మొదలెట్టాడు. సేం కాన్సెప్టు. అయితే అంత క్లిక్ అయినట్లు లేదు.

అప్పట్లో ఈ షాడో పుస్తకాలు ఎందరికో జీవన భృతిగా మారాయ్. ఎంతో మంది విద్యార్థులకు పరీక్షలంటే ఏదో ప్రాణసమస్య అనే ఫీలింగు కలుగనీకుండా కాపాడినయ్. ఎందరో భర్తారావులకు భార్యలతో పోట్లాడే ఛాన్స్ యీకుండా టైమ్ సేవ్ చేసి రక్షించాయ్. నాలాంటి వాళ్ళకు ఎందరికో ’చదవడం’ ఏమిటో నేర్పించినయ్. నిజంగా షాడో వచ్చినా అలాంటి పనులు చెయ్యలేడేమో గానీ ఆ ’మధుబాబు’ అనే ఆయన చేశాడు.

చాలా రోజులు మధుబాబు గారంటే షాడో లాగా ఎదురైన విలన్లను సింహనాదం చేసి, రెండుకాళ్ళతో ఎదుటి వాని గుండెపై ’ఫెడీ’ మని తన్నగలిగే శక్తిమంతుడిలాగా, నూనూగు మీసాల యువకునిలా, కుంగ్ ఫూ లో నిష్ణాతునిలా, కంటికి కనిపించనంత వేగంగా కదిలే వ్యక్తిలా ఊహించుకున్నాం. ఆయన కనీసం ’కులకర్ణి’ లా కూడా ఉండరని స్వాతి వారపత్రికలో అప్పుడెప్పుడో ఫుటో వచ్చినప్పుడు తెలిసింది. కళ్ళద్దాలు పెట్టుకుని సాదాసీదాగా ఉన్నారాయన.

కావ్యాలని, విమర్శలని, ఉత్తమ కథలని, సాహిత్యమని,చర్చలని మరోటని, మనలో చిన్నపిల్లవానికి రంగులు కొట్టి భేషజంతో పులివేషకాలాడుతున్న రోజుల్లోకి వచ్చి పడినాం. ఇప్పుడు షాడో అంటే నవ్వులాట. ఈ నవ్వులాట వెనుక ఎంత స్వచ్ఛమైన నవ్వులుండేవో! ఆ నాటి మా ఊహల పూలతోటల తోటమాలి మధుబాబు గారికి కుంగ్ ఫూ స్టైల్లో ఒక నమస్కారం.

* షాడో పుస్తకాలు కినిగె లో లభ్యం.

15 comments:

 1. cool intro to shadow

  ReplyDelete
 2. నాకు షాడో మరి అతి లేటెస్టు. గత ఆర్నెల్లలో డిస్క్వర్ చేస్కున్నా :-) మీరన్నట్లు, బాగా అలిసిపోయి, అనీజీగా ఉన్నప్పుడు షాడో నవలలే చదువుతున్నా అప్పట్నుంచీ నేను :)

  ReplyDelete
 3. >>బాగా అలసిపోయి మీరు ఇంటికి వచ్చారు. కాస్త రిలాక్స్ అవుదామనుకుంటున్నారు. అప్పుడు యే తత్త్వవేత్త పుస్తకమో, మహాకావ్యమో, ఉత్తమ నవలో, హృదయాలు పిండేసే కథో మీ ముందు పెడితే ఆ పుస్తకమక్కడ పెట్టిన వాడిని ’ఫెడీ’ మని తందామనిపిస్తుంది. అలాంటి సమయంలో మాంఛి కాఫీ లాంటి పుస్తకమొకటి చేతిలో పడిందా, మీ తల్నొప్పి, గిల్నొప్పి చేత్తో తీసేసినట్టు మటుమాయం. అదుగో - అలాంటివే ఈ షాడో పుస్తకాలు.
  Agree with 200% :)
  అన్ని కధలూ దాదాపు ఒకే పద్ధతిలో సాగినా, ఎక్కడా ఆపనివ్వకుండా చదివించే కధనం వల్ల, బోర్ కొట్టదు..

  ReplyDelete
 4. బాగా రాసారు, నా చిన్నప్పటి తీపి గుర్తుల్ని తాజా చేసారు. నేను మరీ టూ మచ్, పాన్ డబ్బా దగ్గర నుంచుని (10 పైసలు for book) చదివేసే వాడిని. ఒక పెద్ద లిస్టు కూడా తయారు చేశాను.

  ReplyDelete
 5. నేను ఖాళీగా ఉంటే గొడవ చేస్తూ ఉంటాను అని నాకు షాడో పుస్తకాలు కొనిచ్చే వారు...ఒక రోజు లో 4-5 పుస్తకాలు చదివిన రోజులు ఉన్నాయి. ఇదంతా 5-6 తరగతులలో. తర్వాత మా నాన్న గారి స్కూలు కోసం తెచ్చిన సాంఘిక శాస్త్రం మరియు నాన్ డెటైల్ పుస్తకాలకి ప్రమోషన్ వచ్చింది.చిన్నప్పటి తీపి గుర్తు.

  ReplyDelete
 6. గంగారాం ఉన్నవి షాడో పాస్ట్ లైఫ్ సిరీస్ అండీ.

  ReplyDelete
 7. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ పోస్ట్ండీ..

  నా చిన్నప్పుడు నేను బాలమిత్ర చదివే టైమ్ లో మా మావయ్యలు చదివేవారు భీభత్సం గా. కొంచెం ఆలస్యం గా అయినా నేనూ మొదలెట్టా. షాడో సిరీస్ చదివినవి తక్కువే గానీ మధుబాబుగారికి నేనూ పే..ద్ద పంకాని. స్వాతి బుక్ లో వచ్చే అతని సీరియల్ కోసం ప్రతీ వారం కొనేవాడిని. ఈ పోస్ట్ చదివే టైం లో..ఇప్పుడు కూడా చదువుతున్నా.. "కాళికాలయం" ;) ;)

  సిగరెట్ పొగ గుండెల నిండా పీల్చి, భారంగా నిట్టూర్చాడూ.
  ఎర్రగా మారిన కళ్ళు. కాలితో బలంగా నేలని తన్నాడు. అక్కడికి ఇరవై అడుగుల దూరం లో ఉన్న ఖాన్ దాదా కి ఆ ప్రకంపనలు స్పష్టం గా తెలిసాయి...>>

  అతని లో ఆ మ్యాజిక్ ఉందండీ.. సూఊఊఊఊఒపర్ పోస్ట్..

  ReplyDelete
 8. ఆనాటి ఊహలతోటలోకి మరోసారి షికారు చేయించిన మీక్కూడా కుంగ్ ఫూ స్టైల్లో ఓ నమస్కారం! :)

  ReplyDelete
 9. ఈ నవ్వులాట వెనుక ఎంత స్వచ్ఛమైన నవ్వులుండేవో!
  నిజం.

  షాడో నా చిన్నప్పటి హీరో. ఇప్పటికీ హీరోనే. గంగారాం సాబ్ ఛాలెంజులు, మొక్కులు.. శ్రీకర్ తెలివితేటలు + అల్లరి.. ఒక టేమిటి అన్నీ బావుంటాయ్. ఈ పుస్తకాల గురించి ఎవ్వరు ఎన్ని కామెంట్లు చేసినా.. వాటిలో అంతర్లీనంగా ఉండే.. "దేశం కోసం ఏమైనా చెయ్ " అనే మెస్సేజును విస్మరించలేరు.

  చిన్నప్పుడు నేను వీటిని తెగ చదువుతుండడముతో మా అన్నయ్య షాపతని దగ్గరకు వెల్లి, మా వాడు వస్తే పుస్తకాలు ఇవ్వకండి అని చెప్పేయడం జరిగింది. దాంతో అతను నాకు .. మీ అన్న చెప్పాడమ్మా నేను నీకు ఇవ్వలేను అని చెప్పేశాడు. మనం తగ్గుతామా.. వాళ్ళ ట్రిక్కులు వాళ్ళకుంటే, మన ట్రిక్కులు మనకుంటాయ్. నా బెస్ట్ ఫ్రెండ్ కి చెప్పి ఏదో ఒక పుస్తకం పట్రా అని చెప్పేవాడిని. నా బదులు అతను వెల్లి తెచ్చేవాడు ఆపుస్తకాలు.. :-D.

  ReplyDelete
 10. "చట్రాతి మీద కొట్టిన చిల్ల పెంకుల్లాగా జనం తలో దిక్కుకూ చెల్లా చెదురై పోయారు" idhi naa favorite line.

  ReplyDelete
 11. Hats off. Great post. Long live shadow.

  Yes, great patriotic message is hidden in all. If anyone ridicule us fans, use yavara sticks! ;)

  ReplyDelete
 12. చాలా బాగా చెప్పారు. ఇప్పటికి నేను ఎక్కడ దొరికినా చదువుతూనే ఉంటాను, షాడో బుక్స్. మీరన్నట్టూ ఎవరి ట్రిక్స్ వాళ్ళకుంటాయి, నేను బాడుగ షాప్ లోనే నుంచొని చదివేశేవాడిని. "తీపి గురుతులు".

  ReplyDelete
 13. కావ్యాలని, విమర్శలని, ఉత్తమ కథలని, సాహిత్యమని,చర్చలని మరోటని, మనలో చిన్నపిల్లవానికి రంగులు కొట్టి భేషజంతో పులివేషకాలాడుతున్న రోజుల్లోకి వచ్చి పడినాం. ఇప్పుడు షాడో అంటే నవ్వులాట. ఈ నవ్వులాట వెనుక ఎంత స్వచ్ఛమైన నవ్వులుండేవో!
  ఆ నాటి మా ఊహల పూలతోటల తోటమాలి మధుబాబు గారికి కుంగ్ ఫూ స్టైల్లో ఒక నమస్కారం.

  ReplyDelete
 14. నా దగ్గర ఇంకా బోలెడు చాలా షాడో పుస్తకాలు ఉన్నాయి. ఇప్పటికి తిరగేస్తూ ఉంటాను. జ్ఞాపకాలకు థాంక్స్, రవి గారు. తేటగీతి

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.