Monday, April 2, 2012

సింగనమల - శ్రీరంగరాయలు

అనంతపురంజిల్లా కేంద్రమయిన అనంతపురం పట్టణం నుండి తాడిపత్రి పట్టణం వైపు వెల్లే త్రోవలో సింగనమల గ్రామం ఉంది. ఆ గ్రామం పక్కన ఒక కొండ. అసలా కొండవల్లనే ఆ ఊరికా పేరు. అది "శృంగుని మల" - అంటే ఋష్యశృంగుడు తపస్సు చేసిన కొండ అట. ఇప్పుడది సింగనమల. ఆ ఊరిలో ఒక అందమైన చెఱువు కూడా ఉంది. ఆ చెఱువు పేరు - శ్రీరంగరాయల చెఱువు. ఆ శ్రీరంగరాయల గురించి తెలియాలంటే - ’చనిననాళుల తెలుగుకత్తులు సానబెట్టిన బండ మా పెనుగొండ కొండ’ గురించి, ఆరవీటి రామరాజు తర్వాత విజయనగర సామ్రాజ్యం గురించి తెలియాలి.

కృష్ణరాయల తర్వాత అచ్యుతరాయలు, ఆ తర్వాత సదాశివరాయలు, అతణ్ణి నామమాత్రంగా చేసి ఆర్వీటి రామరాజు (అళియ రామరాజు) వచ్చారని ఇదివరకు చెప్పుకున్నాము.

అళియరామరాజు రాజ్యానికి ఎలా వచ్చినప్పటికీ సమర్థుడు. ఆయనకే రామరాజభూషణుడనే కవి ’వసుచరిత్ర’ ను అంకితమిచ్చాడు. ఆ రాజు చేసిన ఏకైక తప్పిదం అదిల్షాను నమ్మి, ఆదరించడం. ఆ పొఱబాటు రాక్షస తంగడి అనే ఘోరయుద్ధానికి దారి తీసింది. ఆ యుద్ధంలో అటువైపు నిజాం షా (అహ్మదు నగరం), అతని అల్లుళ్ళు అదిల్షా, ఇబ్రహీం కులీ కుతుబ్ షా అయితే ఇటువైపు రామరాజు, అతని తమ్ముళ్ళు తిరుమల రాయలు, వెంకటపతి రాయలు. యుద్ధంలో తిరుమల రాయలు, వెంకటపతిరాయలు ముందంజలోనే ఉన్నారు. కానీ వృద్ధుడైన రామరాజు యేనుగు నుండి క్రిందపడి శత్రువులకు చిక్కి శత్రువుల కత్తికెర కావడంతో ఇటువైపు సైన్యాలు పారిపోజొచ్చినాయి. ఎలాగైతేనేం - చివరికి విజయం తురుష్కుల వైపుకు మొగ్గింది.

***********************************************************************************************************

రాక్షస తంగడి యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యప్రాభవం నశించిందని పాశ్చాత్యులు వ్రాశారు. ఇందులో అర్థం లేదని కొన్ని శాసనాల వల్ల, మరికొన్ని కావ్యాల వల్లా, ఇతర ఋజువుల వల్లా తెలుస్తుంది. (మల్లంపల్లి సోమశేఖరశర్మ గారూ ఈ మాట ధృవపరుస్తున్నారు) యుద్ధంలో ఓడిన తర్వాత రామరాజు తమ్ముడు తిరుమల రాయలు విజయనగర రాజుల చలువరాజధాని - ఘనగిరి అనబడే పెనుగొండకు వచ్చాడు. పాడుబడిన కోటలను, అగడ్తలను, బురుజులను దండనాయకుడు సవరము చెన్నప్పనాయకుడి సహాయంతో సరిచేసుకున్నాడు. అలా రాజ్యాన్ని తిరిగి స్థాపించినాడు. (తిరుమల రాయలు తిరుపతికి పారిపోయాడని హెరాసు వ్రాశాడుట. అది చరిత్ర వక్రీకరణ)

కం ||
ఆరామ శౌరి పిమ్మట
ధీరామరశాఖవీర తిరుమల రాయం
డారాసేతు హిమవ
త్మారామారమణుడై జగంబు భరించెన్ (౧-౫౪) - వసుచరిత్ర

ఇటువైపు విద్యానగరాన్ని ఆరునెలలు ఓవర్ డ్యూటీ చేసి కొల్లగొట్టిన నవాబులు తిరుమల రాయలను ఉపేక్షించలేదు. అతడు రాజ్యం తీసుకున్న కొన్ని రోజులకే క్షయనామసంవత్సరం (క్రీ.శ. 1566) పుష్యమాసంలో కేసర్ ఖాన్ అనే వాడిచేత దండయాత్ర జరిపించారు. ఆ యుద్ధంలో కేసర్ ఖాన్ ఓడిపోయి ప్రాణం పోగొట్టుకున్నాడు. తర్వాత నూరు ఖాన్ అనే సైన్యాధికారి విభవ నామ సంవత్సరంలో తిరిగి దండయాత్ర చేశాడు. అతనికీ అదే గతి పట్టింది. ఆ తర్వాత అదిల్షా తనే స్వయంగా వచ్చాడు. అతడూ ఓడిపోయాడు. ఈ మూడు యుద్ధాల వెనుక తిరుమల రాయలకు అండగా నిలిచిన యోధుడు సవరము చెన్నప్పనాయకుడు. (ఈ విషయాలు పెనుగొండ ఉత్తరద్వారం దగ్గర ఆంజనేయస్వామి దేవళం దక్షిణ గోడపై చెక్కి ఉండేవట. నేడు శిథిలమైనట్టు కనబడుతూంది)

తిరుమల రాయడు రాక్షసతంగడి యుద్ధంలో ఒకకన్ను పోగొట్టుకున్నాడని ఒక చాటువు (అన్నాతి గూడిహరుడయి...) ద్వారా తెలుస్తూంది.

తురుష్కుల చతురంగబలాలు నిర్మూలించబడి, పెనుగొండ కొండలు ఎలా కనిపిస్తున్నాయని, నాటి భట్టుమూర్తి, నేటి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్ముల వారూ ఇలా చెబుతున్నారు.

భట్టు మూర్తి వారు:
తిరుమలరాయశేఖరుని ధీరచమూభటరాజి యాజి భీ
కర యవనేశ్వరప్రహిత ఖాన బలంబులఁ జక్కు సేయ ని
ద్ధరఁ బెనుగొండ కొండలు మదద్విపచర్మ కపాలమాలికా
పరికరభూషితంబులయి బల్విడిగాంచె గిరీశభావమున్.

(తిరుమల రాయని సైన్యాలు తురుష్కుల చతురంగబలాలను తుక్కు చేస్తే, శత్రుసైనికుల తాలూకు మదించిన యేనుగుల చర్మాలు, కపాలమాలికలతో పరివృతమయ్యి గుట్టలు గుట్టలుగా పేరుకొని పెనుగొండ కొండలయాయిట.)

అనంతకృష్ణ శర్మ గారు:

చనిననాళుల తెలుగుకత్తులు
సానబెట్టిన బండ మా పెనుగొండ కొండ.

రంధ్రముల ప్రహరించు శత్రుల
రక్తధారలు త్రావిత్రేచిన
ఆంధ్రకన్నడ రాజ్యలక్ష్ముల
కరతి నీలపుదండ మా పెనుగొండ కొండ.

వెఱపులెఱుగని బిరుదు నడకల
విజయనగరపు రాచకొడుకులు
పొరలబోయగ కరడుగట్టిన
పచ్చినెత్తురుకండ మా పెనుగొండ కొండ.

తిరుమలేంద్రుని కీర్తి తేనెలు
బెరసిదించిన కాపుకవనపు
నిరడద్రాక్షారసంబులు
నిండి తొలికెడు కుండ మా పెనుగొండ కొండ.

చివర్లో తిరుమలేంద్రుని కీర్తి తేనెలు అంటే తిరుమల రాయలవి కావచ్చునని నా ఊహ. ఈ పాటను రాళ్ళపల్లి వారి స్వహస్తాలతో చూడాలనుకుంటే ఇక్కడ నొక్కండి.

***********************************************************************************************************

తిరుమల రాయలు ఎంతోకాలం రాజ్యం చేయలేదు. అతని తర్వాత అతని రెండవకొడుకు శ్రీరంగరాయలను పట్టాభిషిక్తుని చేసినాడు. మొదటి కొడుకు రఘునాథరాయలు యోగ్యుడు. అయితే అతని మీద సదాశివరాయలను చంపాడనే ఒక అభియోగం ఉంది. (సదాశివరాయలు ఎవరో క్రితం వ్యాసం నుండి తెలుసుకోవచ్చు). అందుచేత శ్రీరంగరాయలు రాజ్యానికి వచ్చాడు.

హరిపద భక్తశీలుడగు నా రఘునాథ నృపాలు కూర్మి సో
దరుడు సిరంగరాయవసుధావరు డాత్మగుణప్రమోదవ
త్తిరుమల రాయశేఖరవితీర్ణ మహాయువరాజపట్ట బం
ధురుడయి సర్వభూభవన ధూర్వహశక్తివహించునెంతయున్.

ఈ రంగరాయలు తండ్రికంటే శౌర్యం చూపించినాడు. ఈయన కాలంలో గోలకొండ నవాబులు రెండు సార్లు దండయాత్ర చేస్తే రెండు సార్లూ తిప్పికొట్టటమే కాక, కుతుబ్షా యేలుబడిలో ఉన్న కొండవీడు వినుకొండ దుర్గాలను సాధించినాడు.

"....శ్రీరంగరాయ శ్శ్రితభాగధేయః
ఉద్ధగిరౌస్థితః పరివిచిత్య చ దుర్జయాన్
దుర్గమకొండ వీడు వినుకొండ పురప్రముఖాన్
భూవలయకరత్న పెనుగొండపురే నివసన్
రాజతియః సమకరాది లాంఛనత" (ఎపిగ్రాఫికా కర్ణాటికా)

ఇదంతా గతించిన చరిత్ర కావచ్చు.  ఆ గోల్కొండ నవాబులను తిరుమల రాయలు, రంగరాయలు తిప్పికొట్టకపోయి ఉంటే? వాళ్ళ ప్రాభవం పెరిగి  ఆంధ్రదేశం, దక్షిణదేశమంతా తురుష్కుల యేలుబడిలోకి వచ్చి ఉంటే? వారి ప్రాభవం అప్పటితో మొదలై, నిజాముతో బలపడి ఉంటే? ఈ ప్రశ్నలకు సమాధానం చరిత్ర చెబుతుంది.

ఈ శ్రీరంగరాయలు శృంగునిమల దగ్గర పెనుగొండకోటకు ప్రత్యామ్నాయంగా మరో దుర్గాన్ని నిర్మించుకొన్నాడు. ఆతని దుర్గం ఉన్న కొండ ’మహల్ కొండ’ - నేటి మాలకొండ. కొంతదూరంలో తటాకము త్రవ్వించుకున్నాడు. అదే శ్రీరంగరాయల చెఱువు. ఈయన అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి విడిది చేసేవాడట. ఈయన ఇక్కడ విడిది చేసినప్పుడూ తురుష్కులు దాడి చేస్తే వారిని అప్పుడూ పారద్రోలాడట.

నాడు శ్రీరంగరాయలు తవ్వించిన చెఱువు నేడూ జనాల దాహార్తిని తీరుస్తోంది. పంటలకూ నీరందిస్తూ ఉంది. ఒకప్పటి ఆ ’జీర్ణకర్ణాట పునర్జీవసుండగు రమ్యగుణశాలి శ్రీరంగరాయ మౌళి’ - నేడు రంగరాయల చెఱువు తూముదగ్గర విరిగి, అరిగి, కరిగి పోయిన జీర్ణ శిథిలాలలో దాగి ఉన్నాడు. ఆయన అందించిన స్ఫూర్తి మాత్రం ఈ తెలుగునాటిసీమ కోలుపోదు.

4 comments:

 1. తల్లికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం అంతం కాలేదు,నిజమే.కాని దాని ప్రాభవం తగ్గింది.హంపీ నగరం నాశనమైనది.తల్లికోట యుద్ధం A.D.1565.తర్వాత పెనుకొండ,చంద్రగిరి,నుండి A.D.1640 దాకా కొనసాగింది.కాని తొల్లిటి ప్రాభవాన్ని,బలాన్ని పొందలేదు.

  ReplyDelete
 2. సింగనమల చెరువు చాలా పెద్దది, ఇటీవల అక్కడకి వెళ్ళినప్పుడూ చూశాను అయితే దాని వెనుక కథ మాత్రమ్ ఇప్పుడు మీరు చెపితేనే వివరంగా తెలిసింది

  ReplyDelete
 3. hii.. Nice Post Great job.

  Thanks for sharing.

  Best Regarding.

  More Entertainment

  ReplyDelete
 4. శింగనమల దగ్గరలోనే, గంపమల్లయ్య కొండలు వుంటాయి అని విన్నాను, వాటి చరిత్ర, ఏమైనా తెలిస్తే షేర్ చేయండి ప్లీజ్ :)

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.