Monday, October 31, 2011

మూగోళ్ళ తోట


జనార్దనరెడ్డి నా వంక విచిత్రంగా చూసినాడు. వాడి చూపును చూసి నాకెందుకో భలే ముచ్చటేసింది. పలుకరించినా. వాడు తిరిగి బదులివ్వలేదు. రోంతలికి వాడి చూపుల్లో విచిత్రం కొంచెం కొంచెంగా సర్దుకుని మట్టసంగా ఐనాడు. నాతోబాటూ మా ఆవిడా, పాఠశాలలో ఆమె తోటి టీచర్లూ, ఇంకా స్టాఫు, అక్కడ కొట్టంలో జనార్దనరెడ్డి వాళ్ళ ఇంటి ఆడవాళ్ళూ.. ఇంతమంది ఉన్నా, నాకెందుకో వాడితోనే ఊసులాడాలానీ, ఆ అందమైన సాయంత్రం ఆడుకోవాలని అనిపించింది. వాడు అంతమంది మధ్య నాదగ్గర మొగమాటం లేకుండా దగ్గరికి రాగలిగినాడు కానీ మాట్లాడడు.

ఆ పిల్లోని నోట పలుకు రాకపోవడానికి కారణం తెలిసి, ఆ రోజు బలవంతంగా నా ఉద్వేగాన్ని అణుచుకోవలసి వచ్చింది. జనార్దనరెడ్డి పుట్టుమూగి. అతడే కాదు, వాళ్ళ నాన్న, ఇద్దరు పెదనాన్నలూ ఎందుకనో యేమో మూగవాళ్ళు.(అందుకనేనేమో, దేవుడిభాష మౌనాన్ని అర్థం చేసుకున్న వానికి మనుషుల గోల చూసి చిత్రమనిపించుంటుంది. దేవుని భాష, గీర్వాణమూ, ప్రాకృతమూ కాదు. మౌనమే ఆయన భాష. కావాలంటే ఈ సారి ప్రశాంతమైన దేవళంలో శివుని లింగం ఎదురుగానో, అమ్మవారి ముంగిటనో నిశ్శబ్దంగా కూర్చుని కళ్ళుమూసుకోండి. ఒట్టు. దేవుని పలుకరింపు వినబడుతుంది. ఇంకా పెద్దమనసున్న వానికి దేవుని గుడే అక్కర్లే, యే చెట్టుకిందనో అందమైన పూట కూర్చుంటే చాలు)

రెడ్డేర్ల తోటలో మామిడిచెట్లూ, పనస చెట్టూ, కొబ్బరి బొండాలు, పక్కనున్న బాయి, దూడ, ఇవన్నీ మమ్మల్నా రోజు ఆప్యాయంగా పలకరించినై. మమ్మల్ని కట్టమీద కూర్చోమని రెడ్డి చెట్టుపైనెక్కి కొబ్బరి బొండాలు దింపినాడు. నవనవలాడే పచ్చిమామిడి కాయలు ఎవరికాళ్ళు కోసుకుని ఒకపక్క ఉప్పురాసుకుని నముల్తా మురిసిపోతున్నారు.

నాకు మాత్రం వాటికన్నా మా జనార్దనరెడ్డి లోటాలో తెచ్చుకున్న బొరుగులు వాడికి తినిపిస్తా, ఒకట్రెండు పలుకులు నేనూ నోట్లో యేసుకుంటా ఉంటే, అహా అనిపించింది.

రెడ్డెర్ల ఇంటాడంగులు మాట్లాడిస్తా, పొలం కబుర్లు చెప్పిరి. అందర్లోకి చిన్నోడంట ఇప్పుడు పొలం చూస్తా ఉండేది. యే యేడికాయేడు ఎట్లో నెగ్గుకొస్తన్నామని చెప్పినాదాయమ్మ. ఆ మహాతల్లికి, మాకు ఏం సమ్మందమని? మామిడికాయలు కోసిచ్చి, ఉప్పూకారం తెచ్చిచ్చి, బొండాలు తాపి, తోటకి మళ్ళీ రమ్మని పిలిచిందాయమ్మ.

సాయంత్రం బండిమీద తిమ్మాపురంలో శనక్కాయలతోట కాడికి, ఆడ నుండి మూగోళ్ళ తోటకూ బైల్దేరి, పొద్దుగుంకే వేళ చంద్రుడు, సూర్యుడు డ్యూటీలు మార్చుకునే టయానికి తిరిగొస్తిమి.

బండి మీద ఊరేగటం భలే ముచ్చట. 

ఇప్పటికి మూడున్నరేండ్ల ముందర ముచ్చట ఇది.  టీవీ సీరియళ్ళూ, క్రికెట్టు మజా, ఫ్రిజ్జు నీళ్ళూ, సోఫాసెట్టు మెత్తదనం, ఫ్యాను గాలి, లాప్ టాపులో intellectual ejaculations, దవడలల్లాడించడానికి ఏదో జంక్ ఫుడ్డు ఇయేవీ లేని ఒక సాయంకాలం అది. మొబైల్ ఫోను సిగ్నలు కూడా లేదు. శుభం.

జనార్దనరెడ్డి ని మర్చిపోలేను. వాని చూపును కూడా. మళ్ళీ వాణ్ణి చూసే ధైర్యం మటుకు నాకు లేదు. వాడు బాగుంటే అంతే చాలు.

ఈ ముచ్చటనంతా కళ్ళున్నాయో లేవో తెలవదు కానీ తనకళ్ళతో కాక, మనసుతో చూసిన ప్రాణి ఇంకొకరున్నారు. దాని పేరు సంహిత. అవును. అప్పుడు మా ఆవిడ దౌహృద :).

3 comments:

 1. అయ్యా రవి గారు,

  సత్తా ఉన్న బ్లాగ్ రచయిత గా ఉన్నారు! ధన్యవాదాలు 'బ్లాగ్' తెర తీసినందులకు! అప్పుడప్పుడూ రాస్తూన్డండీ ! రాయక పోయినా అంతర్మధనమే! ఎల్లప్పుడూ రాస్తూన్నా అవుటర్ మధనమే ! రెండింటీ మధ్య అప్పుడప్పుడు అలా అన్న మాట !!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 2. @రవి - ఇదీ లెక్క! పోష్టంటే, బ్లాగటమంటే ఇలాగుండాలి అని తెలుసుకున్నవాడు, తెలుసుకున్ననాడు - ఆనందోబ్రహ్మ!

  రాసే గీత అందరికీ ఉంటే చదివే వాడేమైపోతాడంటారా? - మూగోళ్ళతోటలో మూగోడైపోవాల్సిందే......

  రెండో పేరాలోని (బ్రాకెట్లు) తినేసాయి...అదరహా! ఇరగ!

  ReplyDelete
 3. జిలేబీ గారు, వంశీ: నెనరులు.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.