Saturday, October 29, 2011

కొల్లాయి గట్టితేనేమి?

ఈ నవల చాలాకాలం నుండి చదవాలనుకుంటున్నా, ఇప్పటికి కుదిరింది. చదవడానికి ప్రేరణ మహీధర రామ్మోహనరావు గారు మహీధరనళినీమోహన్ గారితండ్రి కావడం వల్ల. నళినీమోహన్ రచనలు, గణితంలో ఆయన పుస్తకాలు చదివి పెరిగిన బాల్యం నాది. నా చదువుకు, ఇంజినీరింగ్ సీటుకు, ఉద్యోగానికి పరోక్షంగా ఆయన వ్రాసిన పుస్తకాలనే ఎఱువు కొంతవరకూ కారణం.

ఈ పుస్తకం గురించి విమర్శ, సమీక్ష వంటివి చేయడం చేయదల్చుకోలేదు. రానారె అప్పుడెప్పుడో మునికన్నడిసేద్యం పుస్తకానికి రివ్యూ రాస్తూ, పుస్తకానికి రివ్యూ వ్రాయడమంటే జీవితానికి రివ్యూ వ్రాయడమేనన్నారు. కొల్లాయి...అదే కోవకు చెందుతుంది.

చదువుతూ ఉండగా అక్కడక్కడా ’షాకింగ్’ గా అనిపించినవి, నా జీవితంలో ముడివడిన ఒకట్రెండు సందర్భాలు పంచుకొందుకు ఈ రాత. (ఇంకా అనేకం ఉన్నా, ఇప్పటికింతే)

1.
ఓ నెలరోజుల ముందు మా పాపాయితో ఆడుకుంటుంటే బంతి గుమ్మం దగ్గరకెళ్ళింది. పాప బంతిని తీసుకుని, గడప మీద కూర్చుంది. ఆ తర్వాత అంది - "నానా, గడప మీద కూర్చోకూడదా? దేవుడుంటాడా?" - నేను సమాధానం చెప్పలేదు కానీ కొంత ఆలోచించి లేచి వచ్చి గడప మీద కూర్చున్నాను.

సరిగ్గా పదేళ్ళనాడు నేను మా అమ్మను అదే ప్రశ్న అడిగినట్టు గుర్తు. మా అమ్మ "గడప" అంటే లక్ష్మీదేవి కూర్చోకూడదు అంటే, బడాయిగా - "లక్ష్మీదేవి ఒళ్ళో కూర్చోడం మంచిదేగా" అని ఆక్షేపించి అక్కడ కూర్చున్నట్టు నాకు గుర్తు.

"కొల్లాయి గట్టితేనేమి?" - ఈ నవల్లో రామనాథం (వయసు ఇరవై) కు వాళ్ళమ్మకూ ఇదే సంభాషణ ఉంది. కాకతాళీయంగా అక్కడా అమ్మ పేరు రాజమ్మే.

"పీట వాల్చుకో. గడప మీద కూర్చోకూడదు."
"కూర్చుంటేనేమమ్మా!"
రామనాథం మామూలు ప్రకారం అనేశాడే కానీ, వాగ్వాదం పెట్టుకునే ధోరణిలో లేడు.

కొల్లాయి...నవలాకాలం 1920. అప్పటికి, 1985 కు, 2011 కు ఒకటే ప్రశ్న. పైకి అనుకొన్నంత చిన్న ప్రశ్న కాదిది. సమాజ విలువలను సమీక్షించుకోవడం మనిషికి ఎప్పటికప్పుడు అవసరమేమో? నిజానికి ఆ ప్రశ్నలో "చెడ్డ", "మంచి" అన్న శషభిషకన్నా, - వివేకం వైపు వేసే తప్పటడుగుల మార్దవం ఉందని నా అనుకోలు.

2.

"కొల్లాయి ..." నవల్లో చేయని శిక్షకు రామనాథాన్ని జైల్లో పెడతారు. అక్కడ మొదటిరోజు తర్వాత అతని జందెం బట్టలతోబాటు వెళ్ళిపోతుంది. జైల్లో త్రాడు వంటివి ఖైదీల అందుబాటులో ఉంచకపోవడం ఒక రూలు. ఆ తర్వాత ఆరునెలలకు రామనాథం జైలునుండి విడుదలై, తన అగ్రహారం ముంగండకు వస్తాడు. అక్కడ పినతండ్రి శంకరశాస్త్రి గారు రామనాథం ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటారు (జైల్లో శూద్రుల చేతికూడు తిన్నందుకు). ఒకాయన "ఆరు నెలలు భుజం మీద జందెం లేదా చొచ్చొచ్చో" - అంటాడు (పేజి - 192).

సరిగ్గా అదే మాట - అదే ప్రశ్న నాకు ఒకప్పుడు తగిలింది. నేను జందెం తీసివేయడం వెనుక కారణం జైలు కాదు. :)) జందెం తీసివేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న తపన, జందెం వల్ల పక్కన ఎవరికీ రాని ఒక పవిత్రత నాకు వస్తుందంటే అప్పట్లో ఒప్పుకోలేని ఔద్ధత్యం. నాకు సమాధానం చెప్పలేకపోయినా, ఆక్షేపణ చెప్పిన వాళ్ళు మా నాన్నగారితో సహా చాలామంది. ఒకరిద్దరు మిత్రులతో సహా. వారిదెవరిదీ తప్పు లేదు. అయితే అప్పట్లో నేను చేసింది కూడా తప్పు కాదని నాకు తెలుసు.

ఇప్పుడదంతా  తల్చుకుంటే చాలా నవ్వొస్తుంది.

***********************************************

ఇంట్లో ఆడవాళ్ళను ఇంటిబయట మూలన కూర్చోబెట్టేవాళ్ళు, దానికి శాస్త్రాల్లో సమాధానాలు వెతికేవాళ్ళు, రజస్వల అయిన అమ్మాయి కరివేపాకు చెట్టు ముట్టుకుంటే ఎండిపోతుందని నమ్మేవాళ్ళు, మంగలిదగ్గరికెళితే అస్పృశ్యత పాటించేవాళ్ళు రోజూ కనబడుతూనే ఉంటారు. ఇటువంటి విలువలను మానవత్వమనే గీటురాయి మీద నిరంతరం గీస్తూ పరీక్షిస్తూ ఉండకపోతే మనిషనేవాడు మిగలడు. రాక్షసుడే మిగులుతాడు. "ఛాందసత్వం" ఆ రాక్షసత్వానికి తొలిమెట్టు. కొల్లాయి గట్టితేనేమి? - ఈ నవల బ్రాహ్మణ కుటుంబంలో ఛాందసంతో కూడిన సాంప్రదాయికవిలువలసంఘర్షణను అద్భుతంగా చిత్రీకరించిన ఒక ఆధునిక కావ్యం.

No comments:

Post a Comment

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.