Wednesday, September 7, 2011

భీష్ముఁడు - వైయక్తిక ధర్మము

ధర్మము వైయక్తికమా లేక సార్వజనీనమా? అన్నది మనిషి మనుగడంత పురాతనమైన ప్రశ్న. సిద్ధాంత రూపేణా బహిర్గతం కానప్పటికీ, జీవితపయనంలో ఏదో ఒక సమయంలోమనిషి  ఈ ప్రశ్నను ఎదుర్కొనవలసి  వస్తుంది. ఇదే ప్రశ్నను కాస్త సులభంగా చెప్పుకోవాలంటే - మనిషి  చేసే న్యాయాన్యాయ విచక్షణకు ఆఖరి ప్రస్థానం (సాధ్యమైనంతగా ఇతరులను పీడించకుండా) జీవితంలో సాకల్యాన్ని,సార్థకతను సాధించడమా? లేక కేవలం త్యాగబుద్ధితో ఇతరుల కోసం (కుటుంబం,సమాజం కోసం) మనుగడ సాగించడమా? ఆత్మ దర్శనమా/దీనజనోద్ధరణమా? అంతే కాక దీనికి అనుబంధంగా మరిన్ని ప్రశ్నలు బయలు దేరుతాయి. దేవుడిలో విలీనం కావడం లేదా నిర్వాణం చెందడం మానవుని అంతిమ లక్ష్యమా? లేక తనతో బాటు తనవాళ్ళనందరినీ కట్టగట్టుకుని ఉద్ధరించి, సంతృప్తితో కన్నుమూసి,తనవారిని ఇహంలో ఉద్ధరించి,ఆ తర్వాత  పుణ్యాన్ని పంచడం ద్వారా  పరంలో మోక్షానికి తీసికెళ్ళడం ముఖ్యమా?

ఈ విషయమై బౌద్ధంలో కాస్త స్పష్టమైన విధానం ఉందని వ్యక్తిగతంగా నా అనుకోలు. బుద్ధబోధ కేవలం "ఆత్మ దీపో భవ". ఇది రాజీలేని వైయక్తిక ధర్మం. మరింతగా లోతులో దిగితే బుద్ధబోధలో మరొక విషయం కనిపిస్తుంది. ఆయన చెప్పిన వైయక్తిక ధర్మంలో విలువల (morals)ప్రస్తావన లేదు. అంటే అబద్ధం ఆడరాదు, ఏకపత్నీవ్రతం, తండ్రి ఆజ్ఞపాటించడం, బ్రాహ్మణధర్మం, క్షాత్రధర్మం, కుటుంబం పట్ల నిబద్ధత  వగైరా వగైరాలు లేవు. (ఇక్కడ ఒకవిషయం గమనించాలి. బౌద్ధంలో విలువలు లేవు అంటే ఆ విలువలను ఖండిస్తున్నట్టూ, వాటి వ్యతిరేకతను సమర్థిస్తున్నట్టూ కాదు. ఆత్మశోధనలో వాటి ప్రసక్తికి తావు లేదని మాత్రమేనని గ్రహించాలి) వ్యక్తి అంతిమ లక్ష్యం తనను తాను తెలుసుకోవడం. ఆ తెలుసుకొన్న విషయానికి అనుబంధంగా విలువలు వాటంతటవే ఆవిష్కృతమౌతవి. వాటిద్వారా  ఇతరులు ప్రేరేపితమై, ఇలా అనేకులు తమను తాము తెలుసుకోగల్గడం, తద్వారా ప్రజల శ్రేయస్సు అనుగతంగా వస్తాయి. మరో విషయం ఏవంటే బౌద్ధంలో ఎక్కడా "సమాజం" అన్న పదం లేదు. బుద్ధుని మాటలన్నీ "సంఘం" గురించే ఉద్దేశించడం మనం గమనించవచ్చు. సంఘం అంటే ఏకాభిప్రాయం కలిగిన "వ్యక్తుల" సమూహం. బుద్ధుని సంఘం "భిక్షుకుల సంఘం". ఆ సంఘం కోసం చెప్పిన నియమాలు (వినయపిటకం) సార్వజనీనంగా అందరికీ అంటే - సమాజానికి వర్తించవు. స్త్రీలను సంఘంలో చేర్చరాదని బుద్ధుని ఆదేశం. అలా చేరిస్తే సంఘభావన క్రమంగా లుప్తమై,  ఏకాభిప్రాయం సడలుతుందని, సంఘం సమాజంగా (సమాజం కుటుంబాల సమూహం. సంఘం వ్యక్తుల సమూహం) పరిణమిస్తుందని, అంతటితో బౌద్ధధర్మం అంతరిస్తుందని బుద్ధుడి తీర్పు. అది అక్షరాలా జరిగింది కూడానూ.

హైందవ ధర్మం మాత్రం శతాబ్దాలుగా సార్వజనీన ధర్మం కోసం శోధిస్తున్నట్టుగా అనిపిస్తుంది. వైయక్తిక ధర్మాన్ని ప్రబోధించిన గ్రంథాలు హైందవంలో ఉన్నా, వాటి చివరి సందేశం సమాజశ్రేయస్సు లేదా ఆత్మావిష్కరణతో కూడిన సమాజశ్రేయస్సుగా మనం కనుగొనవచ్చు. పూర్తిగా కుటుంబాన్ని, సమాజాన్ని,అలక్ష్యం చేసి ఆత్మావిష్కరణ  కోసం పాకులాడమని హైందవం చెప్పినట్టు కనబడదు. కొండొకచో అష్టావక్ర సంహిత వగైరాలు ఆ విషయం చెప్పినా, అట్టి గ్రంథాలకి తగినంత ఆమోదం లభించినట్టు కనబడదు. మొత్తానికి ధర్మం వైయక్తికమా లేక సార్వజనీనమా అన్న విషయం ఒక ప్రధానమైన ప్రశ్నగా నాటి నుంచి నేటి వరకు  మనకు వినబడుతున్నది. భగవద్గీతలో కూడా వైయక్తిక ధర్మాన్ని జ్ఞానయోగంగా పేర్కొని, కర్మ, భక్తి యోగాలను సార్వజనీనంగా అన్వయించడం గమనించవచ్చు. పంచమ వేదంగా ప్రశస్తమైన మహాభారతంలో భీష్ముని పాత్ర ఈ వైయక్తిక/సార్వజనీనతల సంఘర్షణకు ప్రతీక అని నా అభిప్రాయం. ఆ దృక్కోణంలో భీష్ముని పాత్రపై నా ఆలోచనల పరంపర ఇది. ఈ వ్యాసం తప్పు, ఒప్పుల నిర్ధారణ కోసం కన్నా ఒకానొక దృక్కోణాన్ని వెతికే ప్రయత్నం మాత్రమేనని నా విన్నపం.

***********************************************************

భీష్ముడు పరమపుణ్యమూర్తి. శాపగ్రస్తుడైన మహనీయుడు.అష్టవసువులలోనొకఁడు. గంగామాత తనయుడు కాబట్టి ఆతని పుట్టుకపరమపవిత్రమైనది. అనుశాసనిక పర్వంలో భీష్ముని ఉపదేశాలు ఆ కాలంలో వివిధ వర్ణాలకు అవశ్యాచరణీయాలు. ఈయన తన జీవితంలో విలువలతో కూడిన వైయక్తికధర్మానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు తఱచి చూస్తే అగుపిస్తున్నది. తద్వారా సమాజశ్రేయస్సును సాధించగల్గడానికి పూనుకున్నట్టు ఆయన చరిత్రలో అంతర్లీనంగా కనబడుతుంది. భీష్ముని జీవితంలో అడుగడుగునా ఈయన ధర్మాన్ని సవాలు చేసే సంఘటనలు, సంకటపరిస్థితులు అగుపిస్తాయి. తన కట్టెదుట గుడ్డిరాజు పుత్రప్రేమతో దాయాదులకు ద్రోహం తలపెడుతున్నప్పుడు,  వంచనాద్యూతం జరుగుతున్నప్పుడు, కులస్త్రీని వివస్త్రను చేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు, పద్దెనిమిది రోజుల్లో లక్షలమంది - తమ భర్తలను, తమ్ములను, తండ్రులను, పిల్లలను, బంధువులను కోల్పోతున్నప్పుడు,చివరికి తన ప్రాణం ఇవ్వవలసి వచ్చినప్పుడు ఈయన జీవితం నేపథ్యంలో మనకు వైయక్తిక సామాజిక ధర్మాల తాలూకుసంఘర్షణ అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. వీటిని పరామర్శించడానికి  కథను మళ్ళీ చెప్పుకోవాలి. మార్గాంతరం లేదు.

అనగనగా శంతనుడనే ఒక రాజు. గొప్పరాజు, జనరంజకమైన పాలన - మామూలే. ఈయన ఒకరోజు గంగను చూచాడు. ఆమెను వివాహం చేసుకోవాలని అడిగాడు. గంగ తన షరతులను శంతనునికి చెప్పింది. తను ఏం చేసిన ప్రశ్నించరాదంది. ఒప్పుకుని ఆమెను వివాహం చేసుకున్నాడీయన. వరుసగా ఒకరితర్వాత మరొకరుగా ఏడుగురు పుత్రులు పుట్టారు. ఏడుగురిని నదిలో పారవేసిందామె. ఎనిమిదవ వాడు పుట్టాడు. ఈ సారి శంతనుడు ఆమె ప్రయత్నాన్ని అధిక్షేపించాడు. గంగ, ఆ ఏడుగురు శాపగ్రస్తులని, వారి శాపవిమోచనం కోసం తానాపని చేశానని, ఎనిమిదవ కొడుకును పెంచుకోమని చెప్పి శంతనుడిని వీడింది. కొన్నేళ్ళు ఆ పిల్లవాడికి విద్యాబుద్దులు చెప్పించి శంతనుడికి ఒప్పగించింది. ఆ బాలుడే భీష్ముడు.

ఆ బాలుడు పెఱిగి పెద్దవాడవుతున్నాడు. ఈ లోగా శంతనుడికి సత్యవతి (యోజనగంధి) అని ఒక అమ్మాయి కనిపించింది. ఆ స్త్రీపై మరులు గొన్నాడు రాజు. ఆమె తండ్రి దాశరాజు కడకు వెళ్ళి ఆమెనిమ్మని అడిగాడు. దాశరాజు శంతనునికి తన షరతును చెప్పాడు. శంతనుని తదనంతరం సత్యవతికి పుట్టబోయేబిడ్డ రాజ్యం చేయాలి. అది ఆ షరతు. శంతనుడు కూడదన్నాడు.దాశరాజు తన బిడ్డనిమ్మను పొమ్మన్నాడు. శంతనుడు దిగులు చెందాడు. తండ్రి దిగులు గమనించిన పుత్రుడు విషయం ఎలాగో కనుక్కున్నాడు. తనే స్వయంగా దాశరాజు వద్దకు వెళ్ళాడు. విషయం తెలుసుకుని రాజ్యం పరిత్యజిస్తానన్నాడు.అలాగెలాగ, నీవు ఒప్పుకుంటే అవుతుందా? ప్రజలు తిఱుగుబాటు చేస్తేనో లేదా ఆ కొడుకుకు సంతానం లేకపోతేనో అన్నాడు దాశరాజు. నేను పెళ్ళి చేసుకోనే చేసుకోను అని భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు శాంతనవుడు.

ఇక్కడ ఆగాలి మనం.

౧. యోజనగంధికి తనను కట్టబెట్టమని శంతనుడు భీష్ముని అడుగలేదు. ఒకవేళ భీష్ముడు తండ్రి దగ్గర విషయం ప్రస్తావించి ఉంటే ఆయన కొడుకును వారించేవాడేమో. 
౨. తను తండ్రి కోరిక నెరవేర్చడం కోసం పెళ్ళి చేసుకోను - ఇది భీష్ముని సొంతమతం. తండ్రి "కోరిక" (ఆజ్ఞ కాదు, గమనించండి) తీర్చడం తనయుడిగా తన "ధర్మం".నిజానికి తండ్రి కోరిక తీర్చకపోయినా తండ్రి తనమీద కోపం చెందడం అన్న ప్రసక్తి వచ్చి ఉండదు.

భారతకాలం నాటి ధర్మం ప్రకారం ఒకరి తదనంతరం పెద్దకొడుకు రాజ్యం చేయాలి.అది క్షత్రియధర్మం,భీష్ముడు ఉత్తమగుణోపేతుడు, యోగ్యుడు కాబట్టి తను రాజు కావడం అన్నివిధాలా "సమాజానికి",భరతఖండానికి లాభం. పైగా సమర్థుడు కాబట్టి శాంతిభద్రతలను రక్షించి, వైరులను పారద్రోలి, రాజ్యాన్ని బలోపేతం చేసి జనులను కాపాడి ఉండేవాడు.ఈ ధర్మాన్ని విడనాడి భీష్ముడు తండ్రి కోరిక తీర్చడం కోసం ఒకానొక త్యాగానికి ఒడిగట్టడం ఎంచేత? - ఇందుకు సమాధానం వైయక్తికధర్మం అని చెప్పుకోక తప్పదు. 

కేవలవైయక్తికధర్మం లేదా శుద్ధవైయక్తికధర్మం(అంటే సంన్యాసదీక్ష) కాకుండా తండ్రి కోరిక తీర్చడమనే విలువ ఇందులో ఇమిడి ఉన్నందున ఇది నియమసహితవైయక్తికధర్మంగా కనిపిస్తుంది.
మళ్ళీ కథలోకి వెళదాం.

ఏదైతేనేం, శంతనుడు సత్యవతిని మనువాడాడు.ఆ దంపతులకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని ఇద్దరు పుత్త్రులు కలిగారు. శంతనుని తర్వాత చిత్రాంగదుడు రాజు కావాలి, అయ్యాడు. ఈ చిత్రాంగదుడు సమరలంపటుఁడు. దారినపోయే గంధర్వులతో పెట్టుకుని పోరాడి మరణించాడు. తర్వాత ఆతని తమ్ముడిని విచిత్రవీర్యుడిని గద్దెనెక్కించాడు భీష్ముడు. ఆతని కోసం కాశీరాజు కూతుళ్ళు ఇద్దరమ్మాయిలను తీసుకు వచ్చి పెళ్ళి కూడా చేశాడు. (ఆ పనిలోభాగంగా అంబ అనే అమ్మాయిని నొప్పించి, లేని తలనొప్పులను తెచ్చుకుని, విద్యనేర్పిన గురువుతో పోరాడి, చివరకు తన చావుకు కారణం కూడా ఏర్పరుచుకున్నాడు).

విచిత్రవీర్యుడు పొద్దస్తమానం అంతఃపురంలో సుఖాలలో ఓలలాడి మితిమీరిన కామంతో క్షయవ్యాధిని కొని తెచ్చుకున్నాడు!

శంతనుని ఇద్దరు కొడుకులు గతించిన తరుణంలో తను స్వయంగా రాజ్యం చేపట్టడం భరించరానంత తప్పు కాదు. పైగా అందులో స్వార్థం లేదు ప్రజలకోసం, రాజ్యం కోసం గద్దెనెక్కడం లేదా శంతనుని ప్రతినిధిగా  (రామాయణంలో భరతుడు రాముని చెప్పులను సింహాసనం పైన పెట్టి ఆతని ప్రతినిధిగా రాజ్యం చూసుకున్నట్టు)  రాజ్యవ్యవహారాలను చూసుకోవడం ఒకవిధంగా యుక్తం. కానీ శాంతనవుడు వ్యాసుని సంప్రదించాడు. సంతానం లేని వారు ఒక సద్బ్రాహ్మణుని ద్వారా సంతానం కని వంశం నిలుపుకోవడం ఆ కాలపు ధర్మం. ఏతద్ధర్మం ప్రకారం ఆయన వ్యాసుని ద్వారా అంబిక, అంబాలికలకు ధృతరాష్ట్రుని, పాండురాజుని, విదురుని కననిచ్చినాడు.

ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి. అంగవిహీనుఁడు రాజ్యాన్ని ఏలకూడదు, విదురుడు దాసీపుత్రుడు కాబట్టి పాండురాజు సింహాసనం ఎక్కాడు. అయితే పాండురాజు మరణించడంతో మళ్ళీ ధర్మసంకటం వస్తుంది. ఎట్టిపరిస్థితులలోనూ తను గద్దెనెక్కరాదని దాశరాజుకు ఇచ్చిన మాట ఒకవైపు. అంగవిహీనుని సింహాసనాధీశుని చేసి విశాలసామ్రాజ్యాన్ని కేవలం కాపాడవలసిన వ్యక్తిగా మిగిలిపోవడమనే ఒక సంకుచిత సామాజిక ధర్మానికి లొంగవలసిన అవసరం మరో వైపు. ఈ అసిధారావ్రతాన్ని బయటకు కనబడనప్పటికి అత్యంత జాగరూకతతో నిర్వహించిన మహోన్నత మూర్తిమత్వం భీష్ములవారిది. ఒకపక్క జరాసంధుడు ౮౪ మంది రాజులను జయించి మదగర్వంతో మిడిసిపడుతున్నాడు. వృష్ణివంశస్తులు కూడా అతని జోలికి పోని పరిస్థితి. కురురాజ్యం వైపు జరాసంధుడు చూడకపోవడానికి కారణం భీష్ముడు.  

ఇంతా చేసి ఈ పితామహుని పాత్ర భృత్యత్వం లానే అగుపిస్తుంది.

ధృతరాష్ట్రుడు పుత్రోత్సాహంతో తన మాటను పెడచెవిన బెట్టిన సందర్భాలలో మౌనం వహించవలసిన పరిస్థితి తప్ప మరొక మార్గాంతరం భీష్మునికి కనబడదు. కారణం తనకై తను విధించుకుని పాటిస్తున్న "దాశరాజుకిచ్చిన మాట" అనబడే ఒక వైయక్తిక ధర్మం. ఆ పరిస్థితులలోనూ అతఁడు విదురుని ధృతరాష్ట్రునికి మంత్రిగా నియమించడం ద్వారా - రాజ్యనిర్వహణలోనూ, ధర్మనిర్వహణలోనూ జరుగుతున్న లోపాలను అరికట్టటానికి సాధ్యమైనంతగా ప్రయత్నం చేయడం అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది.

ఆ తర్వాత దుర్యోధనుడు రాజ్యానికి రావడం, పాండవులకు కౌరవులకు బాల్యమాదిగా వైరం, మాయా ద్యూతం - ఇన్ని జరుగుతున్నా ఏమీ జరుగనట్టు కనబడడం - ఇదంతా ధర్మాధర్మాల నడుమ సంఘర్షణ. నిజానికి భీష్ముడు మహావీరుడు. మహాభారత యుద్ధ సమయంలో తొమ్మిది రోజులపాటు యుద్ధం చేసి,పాండవపక్షంలోని అనేక వీరులను సంహరించిన తర్వాత ధర్మరాజుకు తన రహస్యాన్ని చెబుతూ తనను యుద్ధంలో ఎదిరించి నిలువగలిగే వారు లేరని శాంతనవుడు అంటాడు. నిజం కూడా. అంతటి వీరుడు దుర్యోధనుణ్ణి కానీ ధృతరాష్ట్రున్ని కానీ ఒక్క గదుం గదిమి, వీలైతే యుద్ధం చేసి నీ రాజ్యం నిలబెట్టుకొమ్మని సవాలు విసరడు!

నిండుసభలో కులస్త్రీని దుశ్శాసనుడు వివస్త్రను చేయబూనినప్పుడు ద్రౌపది సభికులను అడుగుతుంది - నేను ధర్మవిజితనా? అధర్మవిజితనా అని. ఈ ప్రశ్నకు సమాధానం న్యాయంగా ధర్మరాజు చెప్పాలి. తనే దుర్యోధనునికి పణంగా ఒగ్గి ఓడి దాసుడైన తర్వాత ధర్మరాజు భార్య దాసీయే. అంచేత ఆమె ధర్మవిజితయే అనవలసి వస్తుంది భీష్మునికి. సభలో అబలకు అన్యాయం జరుగకుండా సభామర్యాదను కాపాడవలసిన బాధ్యత గుడ్డిరాజుది. ఆతడు మిన్నకున్నాడు. ఆ భీషణమైన ధర్మాధర్మ సంఘర్షణలో భీష్ముడు ఏమైతే అయిందని విల్లు చేతబట్టి దుశ్శాసనుణ్ణి నిలువరించాలనుకోడు. అక్కడా ధర్మసంకటం. అలా చేసి యుద్ధం దాపురిస్తే దుశ్శాసనుణ్ణి చంపి తన ఇచ్చిన మాట (సత్యవతి పుత్త్రుల వంశమే గద్దెపై ఉండాలన్నది) కు పరోక్షంగా భంగం కలిగించుకునే పరిస్థితి వస్తుందన్న తీవ్రసంఘర్షణ. 

ఈ ధర్మాధర్మాల నేపథ్యంలో భీష్ముని పాత్ర కొన్ని సందేహాలకూ, దూషణలకు తావవుతుంది. అది పాఠకుల అల్పత్వమే కానీ వ్యాసుని పాత్రసృజనలో లోపం కాదు. అర్థం/ధనం కోసం ధృతరాష్ట్రుని/దుర్యోధనునికి సహాయం చేశాడని ఒక వాదం. అర్థవాది అయితే అంతటి సామ్రాజ్యాన్ని ఒక చిన్నమాటకోసం తృణీకరించడు. వయసు మళ్ళింది కాబట్టి ఆ వయసులో ఎటూ పోలేక దుర్యోధనుడి వద్ద ఉండిపోవడన్నది మరింత పేలవమైన వాదన. ఇచ్చామరణ వరం కలిగిన వాడు, లోకంలో అందరికీ ప్రియుడు అనేక రాజులవద్ద గౌరవం చూరగొన్న మహాత్మునికి అటువంటి సామాన్య కారణాలు ఆపాదించడం అల్పత్వం.

ఇలా భీష్ముని ప్రస్థానం కొనసాగి చివరకు మహాభారత యుద్ధం సంక్రమిస్తుంది. ఆ యుద్ధంలో భీష్ముడు తలుచుకుని ఉంటే మహాస్త్రాలు ప్రయోగించి పాండవులలో కనీసం ఒకరిద్దరిని మట్టుపెట్టి ఉండవచ్చు. కానీ అలా చేస్తేనూ ధర్మం తప్పుతుంది. తన కంటి యెదుట ఏ వైయక్తికధర్మం కోసం తను జీవితం అర్పణ చేశాడో, ఆ ధర్మం నశించి తను ప్రేక్షకపాత్ర వహించి చూస్తూ నిలబడవలసి వస్తుంది. తన కట్టెదుట రాజ్యత్యాగం చేసి, బ్రహ్మచారిగా మారి సత్యవతి పుత్రుల తాలూకు వంశజులు - ఒకరితో ఒకరు యుద్ధం చేసి అందులో కౌరవులు అందరూ మరణిస్తే భీష్ముడు నిర్వికారంగా చూస్తూ నిలబడవలసి వస్తుంది.
వ్యక్తి తన జీవితంలో ధర్మాధర్మాల సంఘర్షణను ఎంత తీవ్రంగా తట్టుకుని నిలబడినాడు అన్న దృక్కోణంతో భీష్ముని పాత్రను పరిశీలిస్తే అంతటి మహోన్నతమైన పాత్ర మరొకటి కనిపించదు. ఇంతటి అద్భుత వ్యక్తి కావ్యం (ఇతిహాసం) లో కేవలం ఒక పాత్రగా ఉన్నాడు కాబట్టి భారతం ఒక మహోన్నతమైన ఇతిహాసం.పంచమ వేదం. అనితర సాధ్యం.భీష్ముని వంటి ఉదాత్త పాత్రను సృజించిన  మహర్షి - సాక్షాద్విరించి వేదవ్యాసుడు.

అచతుర్వదనో బ్రహ్మా
ద్విబాహురపరో హరిః
అఫాలలోచనశ్శంభుః
భగవాన్ బాదరాయణః

...

(మహాభారత విమర్శనం - 2 పుట్టపర్తి నారాయణాచార్యుల వారి రచన చదివిన తర్వాత నాలో కలిగిన
ఆలోచనలివి.)

7 comments:

 1. చాలా బాగా వ్రాశారు. ధర్మము అంటే ఏమిటి అన్న ప్రశ్నని ప్రస్తుతానికి పక్కన పెడదాం. ఏదో ఒకదాన్ని ధర్మమని నమ్మాము. నమ్మిన‌దాన్ని త్రికరణశుద్ధిగా ఆచరిస్తున్నాం. అయితే ఒక్క విషయం గురించి ఆలోచించండి. మన ధర్మ 'ఆచరణ' ఎంతవరకు? మన 'పాత్ర' అనుమతించినంతవరకు. మనకి స్కోప్ ఉన్నంతవరకు. అవునా? కాదా?

  ఏ సన్నివేశంలోనైనా మన 'పాత్ర' ఎంతవరకు ఉన్నది అన్నది తెలుసుకోవడం ఎలా? ఇదీ 'ధర్మమంటే ఏమిటి' అని అడగడం లాంటిదే. కాబట్టి దాన్ని కూడా ప్రస్తుతానికి పక్కన పెడదాము.

  భీష్ముడి ధర్మాచరణ గురించి ఆలోచించినప్పుడు ఆయనకి ఉన్న‌ 'పాత్ర' లేదా స్కోప్ గురించి కూడా ఆలోచిస్తే నాకు మరికొంత స్పష్టత వచ్చింది. సరిగ్గా అదే ఆలోచన కృష్ణుడి గురించి కూడా చేసి, ఇద్దర్నీ కంపేర్ చేస్తే కృష్ణుడి అవతార‌ తత్త్వం మరింత మధురంగా అనిపించింది నాకు.

  ReplyDelete
 2. కృష్ణుడి పాత్ర గొప్పది కానీండి తను నమ్మిన ధర్మానికి విరుద్ధంగా నడుచుకునే పరిస్థితులు కృష్ణుని జీవితంలోకన్నా భీష్ముని జీవితంలోనే హెచ్చుగా వచ్చినట్టు నా అనుమానం.

  ఉదా: మహాభారత యుద్ధం. ఆ యుద్ధంలో ఏ పక్షాన పాల్గొని యుద్దం చేసినా, వైరిపక్షం వాళ్ళ మరణానికి కారణమవాలి. దానితో తను దాశరాజుకు ఇచ్చినమాట "నీ కూతురు వంశజులే గద్దెపై కూర్చుంటారు" అన్నది తప్పవలసి వస్తుంది. అయినా యుద్ధం చేశాడు. ఇది చాలా క్లిష్టమైన నిర్ణయం.

  కృష్ణుని పాత్ర "స్కోప్" ఏమిటో అన్న విషయంపై నాకు స్పష్టత కనిపించట్లేదండి. (నేను ఏ భారతమూ చదవలేదనుకోండి). భీష్ముని పాత్ర స్కోప్ "తను దాశరాజుకిచ్చిన మాట" అని definable గా ఉంది. కృష్ణుడు తన లక్ష్యం ఇది అని ఎక్కడైనా చెప్పాడంటారా?

  ReplyDelete
 3. రవి గారు,

  నా భావనలు కొన్ని...

  మీరు చెప్పిన ఉదాహరణలోనే భీష్ముడి 'అస్వతంత్రత', తాను నమ్మిన ధర్మాలే తనకి సంకెళ్ళుగా మారడం కనిపిస్తుంది. నిజానికి సత్యవతి
  తన‌ సంతానం మరణించినతర్వాత ఆవిడే స్వయంగా భీష్ముణ్ణి అభ్యర్థిస్తుంది, ఎవరినైనా వివాహం చేసుకుని పట్టాభిషేకం చేసుకోమని. ప్రతిజ్ఞాబద్ధుడైన భీష్ముడు నిరాకరిస్తాడు. దాశరాజు పుత్రికా సంతానం ఎవ్వరూ మిగలనప్పుడు ఇంక భీష్ముడు దాశరాజుకి ఇచ్చిన మాటకి, చేసిన ప్రతిజ్ఞకి అర్థమేముంది కనుక!!

  జాగ్రత్తగా పరిశీలిస్తే భీష్ముడు కుర్రతనంలో తొందరపాటుగా ప్రవర్తించాడని (ప్రతిజ్ఞ చెయ్యడం, కాశీరాజు కుమార్తెల్ని బలవంతంగా తీసుకురావడం) అనిపిస్తుంది. దానివల్ల సన్నివేశాలన్నీ తనకి వ్యతిరేకంగా పరిణమించాయని గమనించి, 'విధి'కి తలవంచి ఆయన తన పాత్రని పరిమితం చేసుకుని ఉండిపోయాడని నా భావన. మీరన్నట్టుగా ఆయన వ్యక్తిగత ధర్మమే అందుకు కారణం. ఆ వ్యక్తిగత‌ 'ధర్మమే' ఆయన పాత్రని పరిమితం చెయ్యడం విధి విచిత్రం.

  కృష్ణుడికి 'పరిమితి' అన్నది లేదు. ఆయనకి వైయక్తికమైన ధర్మమంటూ ఏమీ లేదు. అసలు (అహంకార స్వరూపమైన‌) 'వ్యక్తిత్వము' అనేదే ఆయనకి లేదు కాబట్టి ఆయన వేసిన ప్రతి అడుగూ, చేసిన ప్రతి చేష్టా ధర్మమే అయ్యింది, ధర్మ‌ సంస్థాపనకే వినియోగపడింది. ధర్మం ఆయనకి బంధనం కాలేదు, భీష్ముడికి లాగా.

  కాబట్టి ఎంత ధర్మనిరతులైనప్పటికీ తమదైన వ్యక్తిత్వమంటూ ఉన్నవాళ్ళకి ఆ వ్యక్తిత్వాన్నిబట్టి పరిమితులు (స్కోప్) ఉండక తప్పదు. అలా అని ధర్మాచరణని వదిలెయ్యనవసరం లేదు. సాధన పరిపూర్ణమై, ఆత్మజ్ఞానం పొంది, తమ వ్యక్తిత్వం కరిగిపోయిన తర్వాత మాత్రం వాళ్ళకి ఇంక‌ వైయక్తికమైన ధర్మం అంటూ ఏమీ ఉండదని నా అవగాహన.

  అలా అని అటువంటి పరిపూర్ణులు అధర్మం చేస్తారనుకోవడం పొరపాటు. ధర్మాన్ని ప్రయత్నపూర్వకంగా ఆచరించడం (భీష్ముడు) నుంచి, ధర్మం సహజంగా తమనుండి వ్యక్తం కావడం (కృష్ణుడు)గా పరిణితి చెందుతారని అనుకుంటాను నేను.

  ReplyDelete
 4. మీ విశ్లేషణ బావుంది. అయితే ఇలా కృష్ణుని విషయంలో మాత్రమే ఎందుకు జరుగుతుంది?

  - కృష్ణుడు దైవాంశ సంభూతుడు కాబట్టి.

  అలాగయితే సంపూర్ణవైయక్తికధర్మం (ఏది చేసినా అది ధర్మమే అవడం అనుకొందాం) కేవలం దేవుళ్ళకేనా? మానవమాత్రులు ఇలా మిగిలిపోవాల్సిందేనా? ఏమోనండి. ఇదంతా తల్నెప్పి వ్యవహారం లా ఉంది. వదిలేద్దాం.

  మొత్తానికి భీష్ముని పాత్ర - తనకై తను విధించుకున్న వైయక్తికధర్మానికి, సామాజిక ధర్మానికి మధ్య సంఘర్షణకు ప్రతీక అని నాకనిపించింది. ఇందుకు మీరు ఏకీభవించారనుకుంటున్నాను.

  ReplyDelete
 5. >> తనకై తను విధించుకున్న వైయక్తికధర్మానికి, సామాజిక ధర్మానికి మధ్య సంఘర్షణకు ప్రతీక
  - అవును, ఏకీభవించాను.

  >> అలాగయితే సంపూర్ణవైయక్తికధర్మం (ఏది చేసినా అది ధర్మమే అవడం అనుకొందాం) కేవలం దేవుళ్ళకేనా? మానవమాత్రులు ఇలా మిగిలిపోవాల్సిందేనా? ఏమోనండి. ఇదంతా తల్నెప్పి వ్యవహారం లా ఉంది. వదిలేద్దాం.

  - సంపూర్ణ ధర్మం అందాం, వైయక్తిక అన్న మాట వదిలెయ్యవచ్చు దేవుళ్ళ విషయంలో.. :‍-) మానవమాత్రులు గట్టిగా ఏం చెయ్యదలచుకున్నా తలనొప్పే కదండీ! నిజాలే చెబ్దామని గట్టిగా నిర్ణయం తీసుకున్నా ఏప్రిల్ ఫస్టు విడుదల లాగా తయరౌతుంది బతుకు.

  మీరన్నట్టుగా 'ఆత్మదీపోభవ' అన్నది బెస్టు మనకి అనిపిస్తుంది నాకు కూడా. మనలోకి మనం అన్వేషించుకుంటూ పోతూ ఉంటే మెల్లిమెల్లిగా ఆత్మ వికాసమూ, దానితోపాటూ అప్రయత్నంగా ధర్మాచరణ వస్తాయనే ఓ నమ్మకం. ఆ వికాసం మనకి తెలీకుండానే ఎప్పుడో పరిపక్వమౌతుంది. అప్పుడు ఎవరన్నా మనల్ని కూడా దేముడనేవాళ్ళు దేముడనచ్చు గానీ మనం 'మనం'లాగే ఉండమూ?!!

  ReplyDelete
 6. This comment has been removed by the author.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.