Thursday, June 2, 2011

నూరు యోజనాలకు...నేనిలా బ్లాగులు రాస్తాన్నట్లు మా అవ్వ చిన్నప్పుడు తన కతలు చెబుతా ఉండేది. మా అవ్వ అంటే మా అమ్మ నాయనకు చెల్లెలు. ఆయమ్మకు చిన్నతనంలోనే పెండ్లి చేస్తే, మొగుడు చనిపోయి విధవయింది. అప్పట్నుండి ఆయమ్మను సాకే పని మా తాతదయ్యింది. ఆచారం, ఆచారం అని నీల్గినందుకు గానూ ఆయనకొచ్చిన బహుమానం ఇది. బిడ్డా, గొడ్డూ లేదు కాబట్టి ఆయమ్మకు నా మీద ప్రత్యేకమైన ప్రీతి కాబట్టీ, నాకు ముచ్చట్లు చెబుతా ఉండేది.

మా తాత గోదావరి ధవళేశ్వరం కాడ బారేజీ కట్టేప్పుడు పీడబ్ల్యూడీలో గుమాస్తాగా చేసేటోడంట. ఆయనా, ఆయన భార్యా, తల్లీ, చెల్లెలు, చిన్న పిల్లకాయొకడూ. (అప్పటికి మాయమ్మ పుట్టలే) ఇదీ సంసారం. గోదారోళ్ళ మాటలు వీళ్ళకర్థమయేవి గాదంట. ఆ మాటకొస్తే వాళ్ళు ఎక్కడో తంజావూరు దగ్గర్నుంచీ వలస వచ్చినోళ్ళు కాబట్టి తెలుగే అంతంత మాత్రం. ప్రతి రోజు హాశ్చెర్యమే. 

సపోటాలమ్ముతా ఉంటే చూసి, వీళ్ళు ఉర్లగడ్డను కూడా పండు గా మార్చి తింటున్నారని అనుకొన్నారంట, మరో రోజు వీధిలో ఎవతో మరమరాలు అమ్ముతా ఉంటే ఆమెను ఏమ్మో వియ్యపురాలూ అని పిలిస్తే, ఆవిడొచ్చి ఎవరికి వియ్యపురాలు? అని ఒకటే గలాట పెట్టుకొనిందంట. మా ఊళ్ళో (సీమలో) మరమరాలకు బొరుగులు అని, వియ్యపురాలిని సంబంధి అని వాడుక. (మరమరాలకు, వియ్యపురాలకు మధ్య కన్ఫ్యూజన్ ఆమెకు) ఇట్లాంటి కబుర్లు చెప్పేది. ఆయమ్మవన్నీ డౌలు మాటలని అనుకునేటోళ్ళం నేనూ మాయన్నా. ఒకరోజు ఇదే గోదావరి కబుర్లు చెబుతా,మనకిక్కడ సీతాఫలమున్నట్ల అక్కడ రామాపండు ఉంటుందిరా అనింది. అది నేను నమ్మలే. ఇన్ని యేళ్ళ తర్వాత ఆ మధ్యనెప్పుడో ఒక ఫోటోబ్లాగాయన ఫోటోపెట్టి చూయిస్తే నమ్మాల్సొచ్చింది!

చిన్నప్పుడివి తెలీకపోయినా నా కాలేజీ రోజుల నుంచీ ఈ రోజు వరకూ ఇట్లాంటి ఆశ్చర్యాలు కనిపిస్తూనే ఉన్నై. వారం రోజుల క్రితం హైదరాబాదొచ్చి ఇక్కడ ఇల్లు చూసుకున్నప్పుడు గంటయ్య పరిచయమయ్యాడు. గంటయ్య నేనున్న అపార్టుమెంటు వాచ్ మెన్. అతనిది పాలకొల్లట. గోదావరి యాస. మొదట్రోజు ఒక్క ముక్క అర్థం కాలేదు. తర్వాత్తర్వాత డీకోడ్ చేసి అర్థం చేసుకుంటున్నా. మొన్నో రోజు పొద్దున అతను పలకరించాడు.

"సారూ, మీ జోళ్ళొదిలీశారేటండి?"

"?...కళ్ళజోడా?" (అడిగిన తర్వాత తెలిసింది వెధవప్రశ్నని)

"కాదండి, కాల్జోళ్ళండి"

కాసేపటికి బల్బు వెలిగింది. నా చెప్పులు బయట మర్చిపోయాను. అదీ సంగతి. మా ప్రాంతంలో కొన్ని చోట్ల చెప్పులకు మెట్లు అంటారు (మెట్టుతో కొడతా అని ఒక పాపులర్ తిట్టనమాట).

బల్బంటే గుర్తొచ్చింది. ఇంటికి బల్బు తెచ్చుకోవాలి.బయట అంగడికెళ్ళాను.

షాపతనకి చెప్పాను. బల్బొకటివ్వమని.

"అర్ పయ్యా? నల్ పయ్యా?"

"?!"

నా అయోమయం చూసి మళ్ళీ అడిగాడు. అర్థం కాకుండా తిరిగి వచ్చేస్తూంటే సిక్స్టీ వాట్ బల్బు, సిక్స్టీని అర్పై అంటున్నాడు కాబోలని స్ఫురణ(యాద్)కొచ్చింది. అదీ సంగతి.

ఇంటికొస్తే మా పాప మొదలెట్టింది.

"నానా, మామిడి పండు తింటా నానా, పండు నేను తింటా పొట్టు నువ్వు తిను.." (మామిడిపండు తోలు నాకు ఇష్టం.
అందుకని పండు కోసి దానికి పెట్టి తోలు నేను తినడం అలవాటు)

పొట్టు - ఫక్కున నవ్వొచ్చింది.

నవ్వుతూంటే అంది. "నానా నువ్వు నవ్వొద్దు". -

(తప్పుతుందా) "!...సరే"

కాలేజీ రోజుల్లో నెల్లూరతను మా మాటలు చూసి నవ్వే వాడు. ఓ రోజు కొన్ని పదాలు రాసుకొచ్చినాడు. వాడు రాసుకొచ్చిన మాటల్లో కొన్ని జ్ఞప్తికున్నవి.

"తీరుమానం"
"పాలేగాడు"
"రెట్టమతం"
"కొల్లబడిబోయింది"
"ఉర్లగడ్డ"
"బీగంచెవి" (బీగం - అంటే ఓ మారు మా కొలీగు ముసల్మాను భార్య అనుకుని తికమకపడినాడంట. ఆ తర్వాత అర్థయింది,వేరే ఏదో అని)
"తట్ట" (కంచం)
..
..

వాడిని అప్పట్లో బాగా తన్నాలనిపించింది, కానీ ఆ పరిస్థితి నాకూ చాలాసార్లు ఎదురయ్యింది. భారతదేశంలో ప్రతి నూరు యోజనాలకు భాష మారుతుందని పెద్దలమాటట. భాష ఒకటయినా మాటలర్థం కాక, అలాంటిది అనుభవంలోకొస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.

11 comments:

 1. నాకూ ఇట్లాంటి అనుభవమే అయ్యింది

  మా హోమియో డిస్పన్సరీలో నేను ఒక కొత్త పేషంటుకు కేసు షీటు రాస్తున్నా. వాకిలేదమా అని కనీసం పదిసార్లడిగాడు. అర్థం అయితే వొట్టు. (వాకిలి / తలుపు వేద్దామా అని ప్రశ్న)

  నాకు నవొస్తుంది అన్నాడు. నవ్వొస్తూండడం రోగమెలా ఔతుందా అని హాస్చర్యపోతూంటే నవ నవ గా ఉంటుందన్నాడు (దురద అని తరువాత అర్థం అయ్యింది)

  గుంటూరెళ్ళినప్పుడొకావిడ పుటింజా అని అడిగింది. అర్థం కాలె. హాబ్బడియా అంది. అదీ అర్థం కాలే (పుట్టిన రోజా, హాపీ బర్థ్ డే యా అని తర్వాత తెలుసుకున్నా.. )

  ReplyDelete
 2. హ హ్హ హ. ఆర్యీసీలో రాష్ట్రం నలుమూలలనించీ వచ్చిన విద్యార్ధుల భాషల్తో ఇట్లాగే నవ్వుకునే వాళ్ళం.

  ReplyDelete
 3. మా ఇంట్లో తెలంగాణా, రాయలసీమ పదాలు ఇలాగే దొర్లుతాయి.

  ReplyDelete
 4. ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ తెలుగు వెబ్ మీడియా - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
  ఇట్లు నిర్వాహకులు

  ReplyDelete
 5. This comment has been removed by the author.

  ReplyDelete
 6. నేను హై. వెళ్ళినకొత్తలో ఎవరో వెనకనుంచి "బాజూ హట్ సాలే!!" అంటే నేను "బావగారూ (తమిళ్ మచ్చా అన్నమాట) పీజా హట్ ఎక్కడవుంది?" అనడుగుతున్నాడనుకొని అతనికి ఎలావెళ్ళాలో వివరంగాచెప్పాను .

  ReplyDelete
 7. భలే. అయితే హైదరాబాదుకి మారారన్నమాట. నేను చిన్నప్పుడు వైజాగు వెడితే మా ఊరి భాష/యాస చక్కగా మాట్లాడుతున్నానని వేళాకోళం చేసేవారు. మా నాన్నగారు కృష్ణా జిల్లా, అమ్మగారు తూర్పుగోదావరి. ఇంట్లో ఒకళ్ళ భాష మీద ఒకళ్ళు జోకులేసుకుంటూనే ఉండేవారు.

  హైదరాబాదు భాష గురించి ఇప్పుడు కామెంటితే పొలిటికల్ అయిపోతుంది కాబట్టి అక్కడ నాకు తగిలిన కల్చరల్ షాకుల గురించి చెప్పడానికేమీ లేదు ప్రస్తుతానికి.

  నేను మొదటిసారి లండన్ వెళ్ళినప్పుడు ఫ్లైటుదిగి బయటకి అడుగుపెట్టాక టాక్సీవాడు మాకోసం వెయిట్ చేస్తూ కనిపించాడు. మమ్మల్ని చూడగానే, 'యువర్ ఫ్లైట్ ఈజ్ వెరీ లైట్ ' అన్నాడు. ఏమిట్రా విమానం లైటుగా ఉందంటాడు అని అర్థం కాలేదు. రెండుమూడు సార్లు వాడు అదే మాట అన్నాక అర్థమైంది, ఫ్లైటు లేటయ్యిందంటున్నాడని. (ఆ టాక్సీవాడు ఆస్ట్రేలియావాడు అయిఉండచ్చని తర్వాత ఇంగ్లీషు ఫ్రెండ్సు అన్నారు.)

  ReplyDelete
 8. ఇలాంటి టపా నేనోటి రాద్దాం అనుకుంటున్నా అసలు! నేను హైద్రాబాదు వచ్చిన కొత్తల్లో మా అక్క వాళ్ళింట్లో ఉండి చదువుకున్నా! ఒకసారి అంతా వీధి అరుగు మీద కూచుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా పక్కింటామె "పాల బిందె పాల బిందె" అని లేచి పరిగెత్తింది. మా అక్కయ్య కూడా హడావుడిగా లేచింది. నేనమనుకున్నానంటే మా వూళ్ళో లాగే పాలమ్మే వాడు లూనాకి బిందెలు కట్టుకుని వచ్చి పాలు పోస్తాడేమో, అతడొచ్చే టైమైందని లేచింది గిన్నె పట్టుకురాడానికి అని! కానీ పాలబిందె అంటే "నలికెళ్ళ పాము" (నలికీసు అంటారు మా వేపు)అట. అది చెట్టు మీదినుంచి కింద పడింది. వీళ్ళమీదికి ఎక్కుతుందేమో అని హడావుడి పడ్డారు.

  ఇలాంటి కల్చరల్ షాకులు చాలా తగిలాయి నాకు. అన్నీ చెప్తే మురళి గారన్నట్టు ఇప్పుడు పొలిటికల్ అవుతుందని ఒక్కటి చెప్పా మచ్చుకి!

  ఇంకోటి, పెళ్ళయిన కొత్తలో పశ్చిమ గోదావరి మాటలు భలే వింతగా ఉండేవి నాకు. పసి పాపకు బొట్టు పెట్టడానికి మా వైపు సగ్గు బియ్యం మాడ్చి, నీరు పోసి ఒక జిగురు తయారు చేస్తారు. దీన్ని "చాదు" అంటాం మేము! మా ఆడపడుచు వాళ్ళ మూడునెల్ల పాపకు బొట్టు పెట్టడానికి "లోపల కిటికీలో అక్కులు ఉంటుంది పట్టుకురామ్మా" అంటే లోపలికి వెళ్ళాక అదేమిటో తెలీక గంట వెదికాను! తర్వాత తెలిసింది చాదు ని వీళ్ళు అక్కులు అంటారని!

  ReplyDelete
 9. ఆ 'చాదు' లేదా 'అక్కులు'ని మేము 'అగులు' అంటాం. :-)

  ReplyDelete
 10. తిరపతిలో కాపురం పెట్టిన కొత్తల్లో ఇబ్బంది పెట్టినవి కొన్ని: కాలుకిలో (పావు కిలో), బీగం (తాళం), తట్ట (కంచం).. నామిని రచనల పుణ్యమా అని మరీ ఎక్కువ ఇబ్బంది పడలేదు లెండి..

  ReplyDelete
 11. బాగుంది! తెలుగు యాసల గురించి ఎంతైనా వ్రాయవచ్చు. ఓ వంద డాక్టరేట్లకు సరిపడేంత విషయం ఉంది.ఒక్క చిత్తూరు జిల్లాలోనే మాట్లాడే యాసను బట్టి అతడు చిత్తూరోడో, తిరప్తోడో, మదనపల్లోడో, కలకడోడో చెప్పేయవచ్చు. వందయోజనాల లెక్క చాలా పాతది.

  "భోషాణం పెట్టెలోన
  ఘోషా స్త్రీలను బిగించి తాళం వేస్తూ
  భేషు బలే బీగాలని
  శ్లేషించెను సాయిబొకడు సిరిసిరి మువ్వా"
  అన్నారు శ్రీశ్రీ.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.