Sunday, April 10, 2011

కర్రదెబ్బలూ - మొట్టికాయలూ

గు శబ్దః అంధకారః రు శబ్దస్తు తన్నిరోధకః
అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే ||

గురు అంటే అంధకారాన్ని వదిలించి కాంతిపథాన్ని దర్శింపజేసేవాడురా. ఎవడ్ని బడితే వాణ్ణి గురు అనకూడదురా రేయ్. శాస్త్రి సారు చెప్పారు.

గురు అని సినిమా ఉంది సార్, అది చూడచ్చా? వెనకబెంచీ వాడొకడు ధర్మసంకటం వెలిబుచ్చాడు. అయ్యవారికి కోపమూ, నవ్వూ వచ్చినై. నవ్వు దాచుకుని, కోపం చూపిస్తూ వాడి చెవులు పట్టుకుని వీపు వంచారు. జేబు నుంచీ నేత ముళ్ళకంప ఆకు కాస్త కిందపడింది. లేత ముళ్ళకంపాకు జేబులో కూరుకుంటే ఆ రోజు దెబ్బలు తగలవని పిల్లకాయలకు ఒక నమ్మకం.

ఇదేందిరా? అయ్యవారు పక్కన పిల్లవాణ్ణి అడిగారు.

"సార్. అది జేబులో పెట్టుకుంటే తన్నులు పడవంట సార్." - చెప్పాడా అబ్బాయి.

బెల్లు కొట్టారింతలో.

అయ్యవారు కిందపడిన ఆ ఆకులు తీసి ఆ పిల్లవాని జేబులో కూరి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.

"అమ్మయ్య. దెబ్బలు తప్పినయ్ గురూ.." వాడు పక్కనున్న పిల్లవానితో అన్నాడు.

**************************************************************************

మరో అయ్యవారు వచ్చారు. ఈ అయ్యవారికి కోపమొస్తే రూళ్ళకర్ర తెప్పిస్తారు. దేవుడికన్నా పూజారి వరం అవసరమని ఆ రూళ్ళకర్ర తెచ్చే ప్యూపిల్ లీడరుకు తెగ డిమాండు. ఒక్కోసారి అయ్యవారి హిట్ లిస్టులో అస్మదీయులు ఎక్కువగా ఉంటే, సారు ఆజ్ఞ అయిన తర్వాత రూములో రూళ్ళకర్ర దాచిపెట్టి వచ్చి, అయ్యవారికి "కర్ర దొరకలేదు సార్" అని చెబుతుంటాడు.

ఆ రోజు పూజారి పాత్రధారి దగ్గరకు గోపాల్ వచ్చాడు.

"ఒరే, నేను హోమ్ వర్కు చేయలేదు, ఈ రోజు సారుతో తన్నులు తినకుండ నువ్వే ఏదో చెయ్య"మన్నాడు. వీడు "నాకేమిస్తావ"ని అడిగినాడు.

పూజారికి రెండు కమ్మరకట్టలు, ఒక జీడి మామిడి కాయకు ఇచ్చేలా బేరం కుదిరింది.

అయ్యవారు రానే వచ్చారు. రూళ్ళకర్రకు పురమాయించారు. కాసేపటికి - "రూళ్ళకర్ర కనిపిస్తా లేదు సార్" అన్న సమాధానం వచ్చింది. సరిగ్గా అక్కడ, ఆ రోజు కథం అడ్డం తిరిగింది.

అయ్యవారి కోసం ఎవరో అతిథి వస్తే తన రూముకు తీసుకు వెళ్ళారు. అక్కడ అతిథి అల్మైరా పక్కన కుర్చీలో కూర్చుని ఉంటే అల్మైరా పైనుండీ రూళ్ళకర్ర దొర్లుకుంటూ వచ్చి తన తలమీద పడింది. అతిథిని పంపేసి రెట్టించిన కోపంతో క్లాసుకు ఒచ్చినారు. ప్యూపిల్ లీడరు రూళ్ళ కర్రను అల్మైరా పైన దాచి ఉంచినాడని అర్థమయిపోయిందాయనకు. అయితే అతని సంగతి పక్కనబెట్టి వస్తూనే హోమ్ వర్కు గురించి ఆరా తీశారు.

గోపాల్ కు ఇక అర్థమైపోయింది. అయితే వాడు పంచతంత్రంలో ప్రాప్తకాలజ్ఞుడిలాంటి వాడు. అయ్యవారు రూళ్ళకర్రతో కొట్టడం మొదలెట్టగానే ఫిట్స్ వచ్చినవాడిలా పడిపోయి తల అటూ ఇటూ కదల్చడం మొదలుపెట్టినాడు. అయ్యవారి కోపం బెరుకుగా మారింది. ఏదో కీచైను చేతిలో పెట్టి, నీళ్ళు చల్లి ఇట్లా ఏదేదో చేసినాడు. ఆ గొడవలో అసలు దొంగను మర్చిపోయినాడు.

ప్యూపిల్ లీడరే కమ్మరకట్టలు, మామిడికాయలూ, రసగుల్లాలు ఇచ్చుకోవలసి వచ్చింది చివరికి.

మా గోపాల్ గురించి రెండు మాటలు. చిన్నప్పుడు నువ్వేమౌతావురా అంటే అందరూ నేను డాక్టరు, ఇంజినీరు, టీచరూ - ఇట్ల చెబితే వాడు మాత్రం రాజకీయనాయకుడైతానని అన్నాడు. ఇప్పుడు ఏదో పల్లెలో సర్పంచ్ అయినట్లున్నాడు.

**************************************************************************

మరో పీరియడు వచ్చింది. ఈ అయ్యవారు క్లాసులో సైలెన్స్ ను ఇష్టపడతారు. అలా క్లాసంతా సైలెంటుగా ఉంటే ఆయన పుస్తకం మధ్యలో చందమామ పెట్టుకుని హాయిగా చదువుకుంటుంటారు. అనువాదం క్లాసు కాబట్టి చెప్పేదేమీ లేదు. తరతరాల సంపదగా వస్తున్న నోట్సు రాసుకోవడమే.

సైలెన్సు పాటించడం కోసం ఈయన భేదోపాయం అనుసరిస్తారు. ఎవడైనా మాట్లాడితే పక్కన వాడు మొట్టికాయ వేయమని చెప్పారు.

కాసేపు బానే ఉంది. ఆ తర్వాత ఒకడికి మొట్టికాయ పడింది. "ఎందుకు కొట్టావు?" అని అడిగాడు వాడు. తక్షణం రెండు మొట్టికాయలు - ఇవతల వాడు, అవతలి వాడు వేశారు. (మాట్లాడాడు కాబట్టి). వీడు వస్తున్న కోపం దిగమింగి మొదటి మొట్టికాయకు ప్రతీకారం తీర్చుకుందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రత్యర్థి పడనీయడం లేదు. అయ్యవారు ధ్యానముద్ర నుండి లేవగానే మొదటి బెంచి లో సీను కనబడింది. వాడెవడో (ఇందాకటి ప్రత్యర్థి) ఊరికే కూర్చుంటే వీడు వాణ్ణి తన్నడానికి వెళుతున్నాడు! "రేయ్ వీడికి ఒకటెయ్యండ్రా". ఈ సారి ఒరిజినల్ సఫరర్ కు ఇటువైపు, అటువైపు మాత్రమే కాకుండా వెనుకనుండి రెండూ వెరసి నాలుగు మొట్టికాయలు పడ్డాయి.

**************************************************************************

(ఈ మధ్య మా ఊళ్ళో స్కూలు మిత్రులం కలిసినప్పుడు గుర్తుకు వచ్చిన జ్ఞాపకాలు కొన్ని)

5 comments:

 1. బాగుంది. నేనుకూడా చిన్నప్పుడు కమ్మరకట్టలు తిన్నానోచ్(నేను చదివింది కళ్యాణదుర్గం, గుత్తిలలో మరి.) :-)

  ReplyDelete
 2. మీ జ్ఞాపకాల దొంతర బాగున్నదే...

  ReplyDelete
 3. చాలా బాగున్నాయి ...మా వూళ్ళో రూళ్ళ కర్రల కంటే కూడా ఈత బెత్తాలు ( మీరన్నట్లు అస్మదీయులు కొందరు ఈత చెట్టు ఎక్కి అవి కోసి గురువు గారికి సమర్పిస్తారు ) వాడేవారు .....కొన్ని సార్లు కొంత మంది గురువుల గురించి చాలా కధలు వినపడుతుండేవి...ఆ గురువు గారు బెత్తం పట్టుకుంటే విరిగిపోయే దాక ఆపరనీ ...అలా కొడుతూనే ఉంటారనీ ...ఇంకా ఏవేవో ...టపా మాత్రం చాలా బాగా రాసారు

  ReplyDelete
 4. ఆఖరు దృశ్యం (సీను) మఱీ బాగుంది :)

  ReplyDelete
 5. హ హ :) పంచతంత్రంలో ప్రాప్తకాలజ్ఞుడి పోలిక చాలా బాగుంది. బాగా వ్రాశారండీ :)

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.