Monday, April 4, 2011

"మూల" బడిన నక్షత్రం

చిన్నప్పుడు ఆరవ తరగతిలో అనుకుంటాను. తెలుగులో చంద్రహాసుడి పాఠం వస్తుంది. కథ లీలగా మాత్రమే గుర్తుంది. చంద్రహాసుడనే అతడు మూలానక్షత్రంలో పుట్టాడు. అతడు ఒకరోజు ఒకానొక ఉద్యానవనంలో తెలివితప్పి పడిపోయి ఉన్నాడు. అతడి జేబులో ఒక ఉత్తరం ఉంది. అందులో "ఇతడహితుడు. విషమునిమ్ము" అని రాసుంటే, రాకుమారి విషయ చూసి, కాటుకతో, "ఇతడు హితుడు. విషయ నిమ్ము" అని మారుస్తుంది. దాంతో కథ సుఖాంతం.

ఆ కథ గుర్తుండడానికి ముఖ్యమైన కారణమేమంటే, నాదీ మూలా నక్షత్రం కనుక. నాకు జ్యోతిష్యం మీద ఆసక్తి, అనాసక్తి రెండూ లేవు కానీ నాకు తెలిసిన కొంతమంది చెప్పేదేమంటే - ఈ మూలా నక్షత్రం ఒక వేస్టు చిల్లర నక్షత్రమట. ఇందులో పుట్టినవాళ్ళను చేసుకుంటే అత్తగారు గానీ, మామగారు కానీ ఫట్ అంటారు అని. ఇవి ఎంతవరకూ నిజాలో నాకు తెలియదు. దానికి ఎక్సెప్షన్స్ ఏవేం ఉన్నాయో అంతకన్నా నాకు తెలీదు.

అయితే ప్రతి ఉగాదికీ పంచాంగశ్రవణం వినేప్పుడు ఠంచనుగా అయ్యవార్లు చెప్పేది మాత్రం గుర్తుంది. ఈ యేడాది ధనూ రాశి వారికి బావోలేదు. చిన్నప్పుడు మా అమ్మ రెండు మూడు ఉగాదులు వరుసగా ధనూరాశి వారికి బావోలేదని చెప్పి ఆ తర్వాత ఉగాదికి మళ్ళీ ధనూరాశికి అష్టమ శని అనేసరికి కోపం వచ్చి నేనడిగా. "అమ్మా, శని ధనూరాశికి పట్టిందా? ధనూరాశే శనికి పట్టిందా?". మా అమ్మ కాసేపు అలా దిక్కులు చూసి, సరే కనుక్కుని చెబుతానంది. తరువాత రెండు రోజులకు అమ్మ నా దగ్గరకు వచ్చి అంది. "ఒరే, ఆణ్మూలం అరసియల్ (తమిళం) అంటార్రా, అంటే మూలానక్షత్రంలో పుట్టిన మగపిల్లవాడికి ఎదురే లేదుపో!" మళ్ళీ అడిగా. ఆణ్మూలం సంగతి సరే, పెణ్మూలం బావోదా? ఈ సారి అమ్మ నవ్వేసింది. నేననుకున్నాను. పెణ్మూలం ఎందుకు బావుండదూ? ఖచ్చితంగా బావుంటుంది, బావుండాలి, బావుంది కూడానూ. కంటెదురుగా మూలా నక్షత్రంలో పుట్టిన పెణ్ణు కనిపిస్తూంది. (మా అమ్మ నక్షత్రం ఏంటో కనుక్కున్నారా? లేకపోతే వెవ్వెవ్వె)

ఈ ఆణ్మూలం సెంటిమెంటు మరోసారి నా లైఫులో ఎంట్రీ ఇచ్చింది. నా మీద మా నాన్న కుట్రపన్ని నాకు పెళ్ళి సంబంధాలు వెతుకుతుంటే ఎవరో నా నక్షత్రం సంగతి విని హెవీ కట్నం ఆఫర్ చేశారట. అయితే మా నాన్న కట్నం మాటవింటే నేనెక్కడ కసురుకుంటానో అని ఆ ప్రసక్తి నా వద్ద తీసుకురాలేదు. ఈ మధ్య ఎందుకో నాదగ్గర మానాన్న ఆమాట అంటే నేను అన్నాను. అవును మూలానక్షత్రం వాళ్ళు రాజులా ఉంటారుకానీ బానిసలా అమ్ముడు పోరుగా..

ఈ మధ్య పెళ్ళైన తర్వాత మూడేళ్ళుగా పంచాంగశ్రవణంలో ఒక చిత్రం గమనిస్తున్నాను. నాకు ఆదాయం 14, వ్యయం 2 అని ఉంటే మా ఆవిడ నక్షత్రంలో ఆదాయం 2, వ్యయం 14 ఇలా ఉంటూ వస్తూంది. అంటే నేను సంపాదించడం, ఆమె ఖర్చు పెట్టడం ఇలా అన్నమాట. (సాధారణంగా భార్యాభర్తలు అందరికీ ఇదే ఈక్వేషన్ వర్తిస్తుందని నాకు చూచాయగా తెలుసు). హళ్ళికి హళ్ళి, సున్నకు సున్న. ఈ సీక్వెన్సు జీవితాంతం కంటిన్యూ అవుతూంటుంది. అవడమే మేలు. అలా కాక, భార్యాభర్తలిద్దరూ ఒకే నక్షత్రంలో పుట్టినవాళ్ళై, ఆదాయవ్యయాల లెక్క ఒకటే అయితే అప్పుడు ఆ ఇంట్లో రిక్టర్ స్కేలు ఒకటి సంస్థాపించి పెట్టుకోవాలి. తప్పదు.

మొన్నామధ్య మా ఆవిడకు జ్ఞానం ఎక్కువై, మీది మూలానక్షత్రమటగా అంది అనుమానంగా చూస్తా. అవునన్నా. అదేమంత నక్షత్రం కాదటగా అంటే నేనన్నా, మీ ఇంటిదేవుడు ఆంజనేయస్వామి కూడా మూలానే తెలుసా. ఆవీడ సన్నగా ఏదో అంది. నాకు ఆమె ఏమందో వినబడలేదు. (తూచ్)

ఈ రోజు యుగాది కాబట్టి ఏదో రాయాలనే సెంటిమెంటుతో రాశా. మూలా నక్షత్రం గురించిన పచ్చి నిజాలేమైనా ఉంటే అవి ఈ టపా వ్యాఖ్యలలో అనుమతించనని సవినయంగా మనవి చేస్తున్నాను. ఆపైన మీ ఇష్టం.

అందరికీ ఖర నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు.

10 comments:

 1. మూలా నక్షత్రము సరస్వతీ దేవి నక్షత్రమంటారని విన్నాను.
  మీరు చెప్పిన ఉపోద్ఘాత కథకు చిన్న సవరింపు. రాజకుమారి కాదు, మంత్రి కుమారి (దుష్ట బుద్ది మంత్రి యొక్క కుమార్తె) ఆమె పేరు "విషయ". మార్చినిది "విషము నిమ్ము" బదులు "విషయ నిమ్ము" అని. దానితో దుష్ట బుద్ది కుమారుడు తన చెల్లెలైన "విషయ"నిచ్చి పెళ్లి చేస్తాడు.

  ReplyDelete
 2. చంద్రహాసుడి కథను నేనూ ఆరో తరగతిలోనే చదూకున్నాను. గతంలో ఎక్కడో ఒక బ్లాగులో గుర్తు చేసుకున్నానా కథను.

  ఇప్పుడు మూలా నక్షత్రం గురించిన పచ్చినిజా లో రెండు మీకోసం -రామచరితమానస్ రాసిన తులసీదాస్ ’మన’వాడే.

  ReplyDelete
 3. హ హ బాగా రాసారు రవి గారు ! ఐతే చదువరి గారు మీది మూల నక్షత్రమేనా భలే చెప్పారు ఆ విషయాన్ని :)

  ReplyDelete
 4. చదువరి గారూ
  సరస్వతీదేవి తన నక్షత్రంలో పుట్టిన"వాళ్ళ"నంతా ఇలా అనుగ్రహిస్తుందని తెలీలేదే, తెలిసుంటే అలాగే పుట్టేవాళ్ళమే...ప్చ్....

  ReplyDelete
 5. చిన్నప్పుడు "ఉషా పరిణయం" నేనూ చదివాను.
  మా బేచ్ వాళ్ళు చాలామంది ఉన్నారే ఇక్కడ.
  నేను అంటున్నది నక్షత్రం గురించి కాదు. అప్పటి క్లాసు గురించి.

  ReplyDelete
 6. నాకు గుర్తున్న కథ వేరుగా ఉందండి! కథలో ఇతడహితుడు విషమునిమ్ము" అని ఉంటే రాజకుమారి(ఆవిడ పేరు విషయ) 'ఇతడు హితుడు. విషయనిమ్ము" అని కంటి కాటుకతో దిద్ది హీరోయిన్ అవుతుంది.

  మూలా నక్షత్రం అమ్మవారి నక్షత్రం! శరన్నవరాత్రుల్లో కూడా మూలా నక్షత్రం వచ్చిన రోజు ప్రత్యేక పూజలు చేస్తారు. కానీ అందులో ఒక పాదానికి మాత్రం(ఏ పాదమో తెలీదు) బాగా సాంతి అవసరమంటారు.

  మొత్తానికి మూల నక్షత్రం వాళ్ళు చాలా శక్తివంతులు! ఇది పచ్చి నిజమే కానీ చెప్పక తప్పట్లేదు.

  (సాధారణంగా భార్యాభర్తలు అందరికీ ఇదే ఈక్వేషన్ వర్తిస్తుందని నాకు చూచాయగా తెలుసు ____________ఇది కూడా పచ్చి నిజమేనండోయ్!

  ఇంకో మాట.......... ధనూ రాసి వాళ్ళకి ఈ ఏడాది అదిరిపోయే శుభఫలితాలున్నాయని రెండు ఛానెళ్ళలో చెప్పారు పంచాంగ శ్రవణంలో! ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయట,మనశ్శాంతి లభిస్తుందట. ఇంకా ఇలాంటివే....!

  ReplyDelete
 7. జిగురు వారూ, సుజాత గారూ, మీరు కరెక్టు. "విషయనిమ్ము" అని ఉండాలి. అది టైపో. సవరించాను.

  ReplyDelete
 8. "నాకు గుర్తున్న కథ వేరుగా ఉందండి! కథలో ఇతడహితుడు విషమునిమ్ము" అని ఉంటే రాజకుమారి(ఆవిడ పేరు విషయ) 'ఇతడు హితుడు. విషయనిమ్ము" అని కంటి కాటుకతో దిద్ది హీరోయిన్ అవుతుంది"

  నాకూ అలాగే గుర్తుంది

  ReplyDelete
 9. ఈ సంవత్సరం అ రెండు, వ్య పదకొండు. ఆ తొమ్మిది సావింగ్స్ అన్ని కరిగించటం, అప్పులు చేయటం, క్రెడిట్ కార్డులు గీకి గీకి కట్టి కట్టి ....

  ReplyDelete
 10. adento andarimoolalaki ravi name vuntundi :).. nadi kuda

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.