Friday, April 1, 2011

మేడ

మా ఇంట్లో అన్నిటికన్నా నాకు ఇష్టమైన గది - నా బెడ్రూము, డ్రాయింగు రూము..ఉహూ..ఏదీ కాదు. నాకిష్టమైన చోటు - మా ఇంటి మేడ. అదొక ప్రత్యేకప్రపంచం.

చాలాకాలం క్రితం ఎన్. ఆర్. నంది సీరియల్ ఆంధ్రభూమి వారపత్రికలో వచ్చేది. పేరేంటో మరిచాను. ఆ సీరియల్ లో ఒకమ్మాయికి కొన్ని అతీత శక్తులు ఉంటాయి. ఆమె స్నేహితురాలొకనాడు ఆమె ఇంటికొస్తుంది. ఇద్దరు కలిసి డాబా మీదికి వెళతారు. పైనుండి వీధిలో జరిగే పోట్లాటను గమనిస్తుంటారు. అప్పుడా అమ్మాయి అంటుంది - మనం పైనుండి చూస్తే క్రింద జరుగుతున్నది కనిపిస్తుంది. అలాగే అంతః చక్షువులను ధ్యానం ద్వారా సాధారణ స్థాయినుండి పైనికి తీసుకెళితే మనకు సాధారణ ప్రపంచం విషయాలు తేలిగ్గా తెలుస్తాయి అంటూంది. ఆ సీరియల్ లో ఆ అమ్మాయికి మేడనే ప్రపంచం.

అతీత శక్తులు ఏంటో కానీ, మేడ పైనుండి కనిపించే ప్రపంచం అద్భుతమైనది. అందునా సాయంకాలం పూట..

లంకంత ఇంట్లో మనుష్యుల మధ్య ఇమడలేక బయట వచ్చి కూర్చున్న ముసలమ్మ,
అమ్మ కొంగుపట్టుకుని సోన్ పాపిడి బండి వైపు లాగుతున్న పిల్లవాడు,
బడిపిల్లలను దించడానికొస్తున్న స్కూలు బస్సు,
ధీమాగా రోడ్డుపైన కదిలిపోతున్న ఆవు
రాత్రి నడుం వాల్చడానికో గూడు కోసం ఎగిరిపోతున్న కొంగ,
దూరంగా మరో డాబా పైన కేకలు పెడుతూ బంతాట ఆడుకుంటున్న పాప, అతని చిట్టి తమ్ముడూ,
ఆఫీసునుండి ఇంటికి వచ్చి తిరిగి ఏదో పనిమీద బండిమీద కిరాణాకొట్టు భారంగా వెళుతున్న నిరంతరశ్రమజీవీ,
ప్రపంచాన్నంతటినీ నిర్వికారంగా చూస్తూ అవనితల్లిని సెలవడుగుతున్న రవి...

ద్వైతం లేకపోతే అద్వైతం లేదు. ప్రపంచమూ-ప్రజలూ, బాధా-సంతోషమూ, చిర్నవ్వూ-కన్నీటిచుక్కా, మంచీ-చెడూ ఇవన్నీ లేక దైవత్వం, దేవుడూ ఉండడు. ఠాగూర్ ఒకానొక కవితలో ఒక చిన్నకథ చెబుతాడు. అర్ధరాత్రి సన్న్యసించడానికి ఉద్యుక్తుడవుతాడు. అతడికి ఎవరో తనచెవిలో "వద్ద"ని గుసగుసలాడుతారు. "ఎవరూ" అంటాడతను. నిద్రలో పాపాయి వాళ్ళమ్మను మరింత హత్తుకుంది. నన్ను వదిలి నా భృత్యుణ్ణి వెతకడానికి వెళుతున్న ఈ పిచ్చివాడెవడవని భగవంతుడు నవ్వుకుంటాడు.

Being in the world, but not of it
O yogi, get salvation at market place!

ఎక్కడో చదివిన కవిత..

ధ్యానమూ, ఏకాగ్రతా వేర్వేరంటాడు కృష్ణమూర్తి. ఏకాగ్రత అంటే - ఒక వస్తువుపైన దృష్టిని కేంద్రీకరించడం. ఆ ప్రయత్నంలో అందుకు అడ్డువచ్చే ఆలోచనలను నియంత్రించడం తప్పనిసరి. ఆ నియంత్రించేది కూడా బుద్ధే కాబట్టి ఏకాగ్రత ఓ ద్వైధీభావం. మెదడులో నిరంతరంగా జరిగే సమరం అది. ధ్యానం అంటే చుట్టూ జరుగుతున్న ప్రపంచాన్ని నిర్వికారంగా ’చూడడం’. ఈ చూడడం కాంక్షారహితమై, గతం, ఆగతం వర్తమానంలో కరిగిపోతే అదే ప్రేమ, అదే దైవం, అదే నిర్వాణమంటాడాయన.

ఈ రోజు మేడపైన - ప్రపంచాన్నీ, సూర్యుణ్ణీ, ఆ తర్వాత ఉదయించిన చంద్రుణ్ణి చూస్తూంటే ఏకాంతానికి అర్థం లీలగా స్ఫురించింది. ఏకాంతం - అంటే ఒంటరితనం కాదు. తనకు తాను తోడుండడం. అది అనుభవైకవైద్యం.


3 comments:

  1. మేడ ముచ్చట్లు బాగున్నై.

    ReplyDelete
  2. ఏకాంతమంటే తనకు తాను తోడుండటం... బాగుందండీ. :)

    ReplyDelete
  3. బాగున్నాయండి రవి గారు ! మీ మేడ ముచ్చట్లు ఫోటోలు కూడా బాగున్నాయి ..నేనెక్కడో చదివాను " పది మంది మనలని కాదనుకుంటే ఒంటరితనం పది మందిని మనం కాదనుకుంటే ఏకాంతం ....ఉగాది శుభాకాంక్షలు

    ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.