Tuesday, February 22, 2011

అంతర్మథనంనన్ను నా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు... వాళ్ళకోసం నేను చేస్తున్న ప్రయత్నాలను కూడా గుర్తించడం లేదు...ఇలా ఎన్నాళ్ళు...అసలు మనుషులంతా ఇంతేనా? ప్రతిమనిషి ఇతరులపై తన ఆశల్ని, ఆకాంక్షలనూ మోపుతూ ఉండడమే జీవితమా? ఒకరిమీద మానసికంగా ఆధారపడకుండా ఇద్దరుమనుషులు కలిసి బతకటం భూమిపైన అంత కష్టమా? మనసంతా దిగులుగా...ఊహూ దిగులు కూడా కాదు, ఓ విధమైన వైరాగ్యం..నైరాశ్యం...

గంటకు ఏభై కి.మీ. వేగంతో బండి తారు రోడ్డుపైన తనపని తాను చేసుకు పోతూంది, చట్టం లాగా.

ఆకాశం - కేన్వాసుపైన భానుడనే ఒక అసమగ్రకళాకారుడు ఏ చిత్రం గీయాలో తెలీక తన రంగులను చిందరవందరగా వంపేసినట్టు రంగులమయంగా ఉంది. ఒకవైపు నుండి చల్లటి గాలి వీస్తూ ఉంది. రోడ్డుపక్కన పొలాలలో తాడిచెట్లు పాఠం అర్థం కాని వెనుకబెంచి విద్యార్థులలాగా స్తబ్ధమైన ముఖాలతో నుంచున్నాయి. ఓ కొంగలబారు ’v’ ఆకారంలో తూర్పు నుండి వస్తూ, ఉత్తరం దిశగా మలుపు తిరిగేయి. ఆ కొంగలబారును చూస్తూ బండి నడుపుతూంటే, రోడ్డు గతుకులూ, బండి కిందపడుతుందేమోనన్న ఆలోచనా ఏదీ మనసుకు పట్టలేదు. కొంగల బారు కాసేపటి తరువాత పడమరగా ఓ బూరుగుచెట్టువైపుకు మళ్ళింది.

కాసేపటి తర్వాత ఓ పెద్ద ఆంజనేయస్వామి బొమ్మ (విగ్రహం) కనిపించింది రోడ్డుకు కుడిపక్కన, మనిషి తన మనసులో దేవునికి నివేదించదలుచుకున్న ఆశల కుప్ప లాగా ఆయన విగ్రహం ఎత్తుగా...దేవుని ముఖంలో అమాయకత్వం, ఆ సంజె వెలుగులో ప్రతిఫలిస్తూన్న అమాయకత్వం తాలూకు ప్రశాంతత. ఆ విగ్రహం పక్కగా ఓ చిన్న రోడ్డు గ్రామానికి దారి తీస్తూంది. నేను వెళ్ళాలనుకున్నది ఆ ఆంజనేయస్వామి మందిరానికి కాదు, దగ్గరలో ఉన్న మరో ప్రసిద్ధమైన మందిరానికి. ఈ మందిరం తాలూకు సంస్థ (?) ప్రపంచప్రఖ్యాతి పొందింది. అయితే అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియక గ్రామం లోనికి వెళ్ళాను. ఆ పల్లెలో ఏదో సంత జరుగుతున్నట్టుంది. రకరకాల తినుబండారాలు, చిన్నచిన్న దుకాణాలు, పిల్లల ఆటవస్తువులూ, బెలూన్లు, తెల్ల రంగు చొక్కా, పంచెలలో గ్రామీణులు, ఎండలకు కమిలిన నల్లటి శరీరాలతో ఉన్న పల్లె స్త్రీలు, చక్కగా అల్లిన వాళ్ళ జడల్లో పూలూ, వాళ్ళల్లో కొంతమంది చంకల్లో బిడ్డలూ, ఆకువక్కా వేసుకుని ఎర్రబడిన నోళ్ళతో పెద్ద వయసులో స్త్రీలూ, సందడిగా అల్లరి చేస్తూన్న చిన్నపిల్లలూ...

అసతోమా సద్గమయ - (అసత్యం నుండీ సత్యంవైపు మళ్ళించు) అన్న ప్రార్థనను కష్టం నుంచి సుఖం వైపుకు నన్ను మళ్ళించు అని అర్థం చేసుకున్న భగవంతుడి దీవెనలా ఉందా పల్లెవాతావరణం.

పల్లెలోపలకు వెళుతూంటే సందడి ఎక్కువై పల్లెబయటకు వెళుతున్నట్టు అనిపించింది. మళ్ళీ వెనక్కు తిరిగి ప్రధాన రహదారి మీదకు వచ్చి నేను వెళ్ళాల్సిన మార్గం పట్టాను. కాసేపటి తరువాత రథం ఆకారంలో ఉన్న మందిరం, రథం ముందు పెద్ద పెద్ద గుర్రాల విగ్రహాలూ, గుడి దగ్గరకు వచ్చాను. మోటారు బండిని అక్కడ ఒకచోట నిలిపి చెప్పులు ఒకచోట విడిచి గుడివైపుగా అడుగులేయసాగాను. ఎవరో విదేశీయ దంపతులు గుడికి వస్తూన్నారు. వారితో బాటూ ఒక యువకుడు, వారికి విషయాలవీ చెప్పడానికి వారివెంటనే వస్తున్నాడు. ఆ అబ్బాయి తాలూకు నల్లకళ్ళజోడు ఉండాల్సిన చోట కాక తలపైన ఉంది.

నా కాళ్ళు గుడికి వెళుతున్నాయి కానీ మనసుమాత్రం శూన్యంగా ఉంది. ఎక్కడైనా మనుషులెవరూ రాలేని చోటికి వెళ్ళి దిక్కులు పిక్కటిల్లేలా, గొంతు పగిలేలా ఏడవాలనిపించే ఓ ఆవేదన, ఆక్రోశం. ఆ ఆవేదనకూ, ఆక్రోశానికి సరైన అర్థం లేదు, కారణమసలే లేదు.

మందిరం బయట ఓ చిన్న తోట. అక్కడ ఓ చిన్న కొలను. నాచు నీళ్ళు, అందులో గుండ్రంగా తామరాకులు, మధ్యన అక్కడక్కడా ముకుళించుకుని ఉన్న తామర మొగ్గలు. వాటినెవరూ చూడట్లేదు. అందరూ ఓ పక్కగా ఉన్న కుందేళ్ళకు చిన్నచిన్న ఆహారపు ముక్కలు వేస్తూ, ఆ కుందేళ్ళు వాటికై సన్నగా పరుగులు పెడుతూంటే తీగల బయట నుండి చూసి సంబరపడుతున్నారు.

ఒకరి ఆకలి మరొకరికి సంబరం.
ఒకరి ఆకలి మరొకరికి పుణ్యసంపాదనామార్గం. (అలా అన్నార్తులు ఉంటేనే పుణ్యం, పుణ్యం సంపాదించుకోగల అవకాశము, అదృష్టమూనూ)
ఒకరి ఆకలి జీవుడికి, దేవుడికీ కూడా అవసరం (దేవుడా రక్షించు నా నైరాశ్యాన్ని, అజ్ఞానాన్ని)

వీటన్నిటికీ దూరంగా, ఈ ప్రపంచకంలో ఉంటూనే, తనకే మాత్రం పట్టనట్టూ ఉన్న తామరాకు దొప్పెలు! ఓ చిన్న కప్ప కాబోలు నీళ్ళలోంచి ఎగిరింది. నీళ్ళలో చిరుప్రకంపనాలు తామరాకు ప్రశాంతతను మరింతగా పెంచుతూ... బయట బార్ లైట్ తాలూకు కాంతి కూడా ఆ నీళ్ళదగ్గర స్పష్టంగా ప్రతిఫలించడం లేదు.

ఆ పక్కన విదేశీయులకు స్వదేశీయుడు ఏవేవో భగవంతుని లీలలకు చెందిన ఘట్టాల బొమ్మలను చూపుతూ వివరిస్తున్నాడు.

కాసేపు తర్వాత గుడిలోనికి అడుగుపెట్టాను. భగవంతునికి హారతి ఇస్తున్నారు.  ప్రతిమ ధూపం తాలూకు పొగల్లో అస్పష్టంగా కనబడుతూంది. భక్తులు ఏవో భజన పాటలు పాడుతూ నాట్యం చేస్తూన్నారు. దేవుని దర్శనం దూరం నుండే చేసుకుని, ప్రసాదం తీసుకుని బయటపడ్డాను.

బయట చీకటి పడింది. ఆ కొలనూ, తామరాకులూ, నిశ్చలతా....ఎందులోనూ మార్పు లేదు. దేవునికన్నా దేవుని సృష్టిలోనే ప్రశాంతత కనిపిస్తూంది, ఎందుచేతనో. చీకట్లో ఆ తామరాకుల అస్పష్టమైన ఆకారం నా మనసులో ఏదో కాంతి నింపింది.

******************************************************************

బండి తీసుకుని బయటపడి, ఊరివైపుగా నడపడానికని మలుపు తిప్పాను. ఆ రోడ్డు అక్కడ కాస్త బావోలేదు. బండి సర్రున జారింది. క్షణకాలం ఏం జరిగిందో తెలీదు. అయ్యో అని ఇద్దరు ముగ్గురు బాటసారుల మాటలు వినబడ్డాయి. బండి మీదనుండి లేచాను. చేతులకంటిన దుమ్ము దులుపుకుని ఇంటిబాట పట్టాను. దెబ్బలు తగిలినా తగలనట్టే ఉంది.

13 comments:

 1. మీ ఈ రచన కూడా ఒక తామరాకుల కొలనే అనిపిస్తోంది . ప్రతి మనిషీ తనని తాను చూసుకోవచ్చు ఇందులో!

  ReplyDelete
 2. కానీ నేను ఆ స్వామి ఆలయాలకు వెళ్ళినప్పుడల్లా ఆ పద్మపత్రాలను గమనిస్తున్నప్పుడు కర్మసన్యాస యోగంలో ఆయన చెప్పిన
  " బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః!
  లిప్యతే న స పాపేన పద్మపత్రమివామ్భసా!! "
  ఎవరైతే కర్మలను బ్రహ్మముకు అర్పించి, సంగభావాన్ని వదిలి పనిచేస్తారో, అట్టివాడు నీటిలో ఉన్న తామరాకు ఎలా నీటివలన తాకబడదో అలాగే పాపం చేత తాకబడడు.
  శ్లోకం గుర్తుకు వస్తూ ఉంటుంది.

  ReplyDelete
 3. "నన్ను నా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు" - చేసుకోరు

  "వాళ్ళకోసం నేను చేస్తున్న ప్రయత్నాలను కూడా గుర్తించడం లేదు" - గుర్తించరు

  "ఇలా ఎన్నాళ్ళు - మనకు రాసిపెట్టినున్నన్నాళ్ళు

  అసలు మనుషులంతా ఇంతేనా?" - అవును

  "ప్రతిమనిషి ఇతరులపై తన ఆశల్ని, ఆకాంక్షలనూ మోపుతూ ఉండడమే జీవితమా?" - ఒకరకంగా అవుననే సమాధానం. ఆ మోపులు మోయకూడదు అని మోసేవాడికి, మోపకూడదు అని మోపేవాడికి తెలియనంత కాలం. ఆ మనుషులకు తెలిస్తే ఈ పోష్టు చూసే అదృష్టమూ, ఇక్కడ రాసే భాగ్యమూ కలిగేది కాదు. సంఘానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ముందు. కుటుంబంతో మొదలుపెట్టటానికి చూస్తే పెనం మీద నుంచి నిప్పులోకి దూకినవారౌతారు. సంఘానికి దూరం అంటే నీకు కూడా దూరంగా ఉండమనేగా? :) అవును! మళ్లీ :)

  "ఒకరిమీద మానసికంగా ఆధారపడకుండా ఇద్దరు మనుషులు కలిసి బతకటం భూమిపైన అంత కష్టమా?" - కష్టం కాదు. ఇష్టాలు కలవక. ఇష్టాల కోసం కష్టాలు పడటం మనుషులకు అలవాటైనదే. ఇష్టాలు మనసుకు కాక బుద్ధికి సంబంధించినవైతే ఈ గోల ఉండదు.

  "మనసంతా దిగులుగా...ఊహూ దిగులు కూడా కాదు, ఓ విధమైన వైరాగ్యం..నైరాశ్యం..." - వైరాగ్యం మంచిది. ఉపయోగపడుతుంది. దిగులు, నైరాశ్యం ఉపయోగపడవు.

  విచిత్రంగా మీకు తామరాకులు, నాకు ఆ శంభో శంకరయ్య అస్పష్ట రూపంలోనే కనపడి కాంతి నింపారు. ఆ కాంతితో మనకెదురైన కంతుల్ని తెంచటమే!

  దెబ్బలు తగిలినా తగలనట్టే ఉండాలి. అదీ లెఖ్ఖ. అప్పుడే బాధ మనకు పరిమితం చేసుకోవచ్చు. మన దెబ్బలు మనమే నయం చేసుకోవచ్చు. ఎక్కువ తగిలించుకుంటే రాటు దేలిపోవచ్చు.

  దెబ్బలు కనపడితే మటుకు మళ్లీ సంఘమొస్తుంది. పనికిమాలిన ఓదార్పులొస్తాయి. అయ్యయ్యోలొస్తాయి. అయ్యా అదీ సంగతి...ఇప్పటికి ఇంతటితో సరి....

  సదా మీ శ్రేయోభిలాషి
  వంశీ

  ReplyDelete
 4. "దెబ్బలు తగిలినా తగలనట్టే ఉండాలి. అదీ లెఖ్ఖ. అప్పుడే బాధ మనకు పరిమితం చేసుకోవచ్చు. మన దెబ్బలు మనమే నయం చేసుకోవచ్చు. ఎక్కువ తగిలించుకుంటే రాటు దేలిపోవచ్చు"

  వంశీ గారూ,

  Bingo...


  పై మాటల అర్ధం అవతలి వాళ్ళకి తెలియచెప్పటం చాల కష్టం. దాంట్లోంచి వెళ్ళి జీవిస్తేనే తెలుస్తుంది. అయితే ఆ స్థితి కి చేరుకోవటానికి మీరు పైన చెప్పిన వైరాగ్యం కావాలనుకుంటా(పాజిటివ్ సెన్సులో). ఎనీవే I just wanted to say that I agree with you. Don't want to dilute anymore. Bye
  KumarN

  ReplyDelete
 5. @వంశీ గారూ
  ఇష్టాల కోసం కష్టాలు పడటం మనుషులకు అలవాటైనదే.
  చిన్నదిగా కనపడే చాలా పెద్ద విషయం చెప్పారు.

  @రవి గారూ
  ఆకాశం - కేన్వాసుపైన భానుడనే ఒక అసమగ్రకళాకారుడు ఏ చిత్రం గీయాలో తెలీక తన రంగులను చిందరవందరగా వంపేసినట్టు రంగులమయంగా ఉంది.
  వర్ణన బ్రహ్మాండంగా ఉంది.

  ReplyDelete
 6. ఏమైంది రవీ?! దెబ్బలేం గట్టిగా తగల్లేదు కదా??

  ఆ-లోచన కలిగినవాళ్ళందరికీ అంతర్మథనం తప్పదనుకుంటా... మరి మథనం జరిగితేనే కదా అమృతం పుట్టేది! ఇట్లాంటి రచనలూ పుట్టేది!!

  అసందర్భమేమో....
  కస్యైకాంతం సుఖముపనతం, దుఃఖమేకాంతతోవా, నీచైర్గచ్ఛత్యుపరిచ దశా చక్రనేమి క్రమేణ!

  సంసార కటువృక్షస్య ద్వే ఫలే హ్యమృతోపమే, సుభాషితరసాస్వాదః, సంగతిస్సుజనే జనే!


  ఇది మాత్రం హాస్యానికి గుర్తు చేస్తున్నా...
  సంసారే స్వప్నసారే పరిణతితరలే ద్వేగతీ పణ్డితానామ్.........

  ReplyDelete
 7. @మూలా సుబ్రహ్మణ్యం గారు: ధన్యవాదాలండి.
  @వంశీ గారు, @నాగమురళి: ఖంగారేం లేదు. రాసేవన్నీ అనుభవాలు కానక్కరలేదు. ఆలోచనలు కూడా అవచ్చునండి. :)).ఇహ పోతే, వంశీగారు, మీరు చెప్పినదంతా నిజమే, ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోవడమే నిజమైన ఇబ్బంది. దీన్నే ముద్దుగా తాపత్రయం అంటారనుకుంటా. ఒక్క చిన్న విషయంలో విభేదిస్తున్నాను. ’సంఘం’ అన్నారు. నా దృష్టిలో సంఘమూ, సమాజమూ వేర్వేరు. ఎప్పుడైనా వీలుచూసుకుని బ్లాగుతాను.
  ఏదేమైనా, చక్కటి భాషితాలు, సుభాషితాలు దొరికాయి. తీరిగ్గా నెమరు వేస్తాను.
  @విజయమోహన్ గారు: సందర్భోచితంగా అద్భుతమైన శ్లోకం చెప్పారు. భగవద్గీత మళ్ళీ చదవాలనిపిస్తుంది.
  @KumarN గారు: సరిగ్గా చెప్పారు. అన్నీ తెలిసినా ఎందుకో తాపత్రయం. కారణం తెలిసినంతమాత్రాన సమస్య దూరం కాదని జిడ్డు కృష్ణమూర్తి గారి సుభాషితం.
  @Rao గారు: ఆ వర్ణన దాదాపు ఎనిమిదేళ్ళ ముందు నేనో పుస్తకంలో రాసుకున్నది. :) మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది.

  ReplyDelete
 8. రవీ !

  ఎవరికి వారికి వారి మనసును వారే చదువుతున్నట్టు అనిపించి ఉంటుందేమొ మీ టపా చదువుతూంటే (నాకలా అనిపిస్తోంది కాబట్టి). బాగా రాశారు. కొన్నిచోట్ల నైరాశ్యం, కొన్నిచోట్ల తృప్తీ కలగలుపుగా ఉన్న ఆలోచనా తరంగాలను ప్రతిఫలిస్తున్నట్టు గా అక్కడక్కడ సునిశితమైన దృష్టి, అదే సమయంలో భావగర్భితమైన వర్ణననూ కలనేతగా చేసిన భావ పరంపర బాగున్నది.

  అయితే రచన విషయానికొస్తే నా మట్టి బుర్రకి కొన్ని ప్రశ్నలు మిగిలిపొయాయి

  (1) "బయట చీకటి పడింది. ఆ కొలనూ, తామరాకులూ, నిశ్చలతా....ఎందులోనూ మార్పు లేదు. దేవునికన్నా దేవుని సృష్టిలోనే ప్రశాంతత కనిపిస్తూంది, ఎందుచేతనో. చీకట్లో ఆ తామరాకుల అస్పష్టమైన ఆకారం నా మనసులో ఏదో కాంతి నింపింది". కథనం ఎత్తుగడలో ఉన్నంత బిగువు, చివరకు తొందరలో ముగింపుపలికించేయటం తో ఏదో తెలీని వెలితి మిగిలిపోయింది. "ప్రతిమ ధూపం తాలూకు పొగల్లో అస్పష్టంగా కనబడుతూంది" అన్నారు. అంతక ముందు గమనించినవన్నీ (మనుష్యులు, తామరాకులూ, నీటి కదలిక మొ|| అన్నీ) ఆయన సృష్టే కదా.. మీ ఉద్దేశం దేముడి ప్రతిమ కన్న ప్రకృతిలో ప్రశాంతత కనిపించింది అనా?

  (2) ఆలోచనా పరంపరలో కొట్టుకెళ్తున్నప్పుడూ, మనసు గతుకులను గమనించలేదు బండి చేజారలేదు. మన్సులో కాంతి గోచరమైనాక మనసు గతుకులనూ గమనించలేదు. బండి చేజారింది. అయినా దెబ్బలనూ పట్టించుకోలేదు. కాంతి దర్శనానికి, ఈ సంఘటనలకూ సంబంధం ఉన్నట్టా లేనట్టా? ఏమి సూచించదలిచారో అస్పష్టంగా అనిపించింది. అంతకముందు తగిలిన దెబ్బలు మనుసుకని అందుకే చాలా ఆక్రోశం, నైరాశ్యం వంటివి చుట్టుముట్టాయనీ, ఇప్పుడు తగిలినా అది శరీరానికి మాత్రమే అని మనసుకు తాకలేదని సున్నితమైన గమనికా?

  ReplyDelete
 9. సనత్: అద్భుతమైన పాయింటు. ముందుగా చెప్పాల్సింది ఏమంటే, నేను మంచి కథకుణ్ణి కాదు. ఆత్మవిమర్శకుణ్ణి (self proclaimed) మాత్రమేను. :) ఈ చిన్నకథ రాసేప్పుడు ఒక ఊపులో, భావోద్వేగంతో, పదినిముషాలలో రాశాను. బ్లాగు పబ్లిష్ అయిన తర్వాత ఒకమారు సరిదిద్దాను అంతే.

  (1) నా ఉద్దేశ్యంలో ప్రతిమ దేవుడు. ఆ ఉద్దేశ్యంతోనే కదా అంత దూరమూ వెళ్ళింది. దేవుని సన్నిధిలోకన్నా గుడి వెలుపల ప్రాంగణంలో ఆయనకు దూరంగా ఉన్న ప్రకృతిలో ప్రశాంతత కనిపించిందనే. ఇక్కడ అస్పష్టత ఉంది నిజమే.

  రెండవ పాయింటుకు ముందు కొంచెం నా సోది. స్పష్టమైన ముగింపు "కథ" లలో మాత్రమే ఉంటుంది. మంచి కథలంటే జీవితానికి ప్రతిబింబాలు కాబట్టి, వాటికి ముగింపు ఉండదు. ఉన్నా, కథ ముగింపు మరో కథకు (జీవితానికి) నాందిని సూచిస్తూ ఉంటుందని నాకొక నమ్మకం. ముగింపు అన్నది రచయిత చెప్పకుండా చదివిన పదిమంది పాఠకులలో పది రకాలుగా తడితే అది ఒక చక్కటి రచన కావచ్చుననిపిస్తుంది.

  ఇక (2) లో నేనేదీ సూచించదలచలేదు. కిందపడ్డ తర్వాత ఎంచేతో ఏ ఆలోచనా దరికి రాలేదు. ఇంటికి వెళ్ళడానికి బండి నడుపుతున్నప్పుడు ఓ తామరాకూ, దానిపక్కనున్న మొగ్గ, ఆ నిశ్చలత్వం ఇవే మనసులో ఉన్నాయి. ఓ అరగంటపాటూ వేరే ఏదీ లేదు. (ఈ వివరణ కాస్త అతిగా అనిపిస్తే ఒగ్గేయగలరు. :-;)

  ReplyDelete
 10. This comment has been removed by the author.

  ReplyDelete
 11. ఆ-లోచన కలిగినవాళ్ళందరికీ అంతర్మథనం తప్పదనుకుంటా... మరి మథనం జరిగితేనే కదా అమృతం పుట్టేది! ఇట్లాంటి రచనలూ పుట్టేది!!
  -----------
  @nagamurali చాలా బాగా చెప్పారు

  రవి గారు
  మొదటి సారి చదివినతర్వాత ఎందుకో మళ్లీ చదవాలని అనిపించింది
  చదివిన తరువాత ఎందుకో తెలీదు ఏదో ఆలోచన

  ReplyDelete
 12. హ్మ్! రవి గారు ఇది నేను ఇప్పటి కి ఏ పదోసారో చదవటం చదివిన ప్రతిసారి ముందు కన్నా మరింత గొప్పగా ఉంది అనిపిస్తుంది !
  దెబ్బలు తగిలినా తగలనట్టే ఉండాలి అంతేనేమో !

  ReplyDelete
  Replies
  1. This comment has been removed by the author.

   Delete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.