తెలుగులో మౌలికాంశం ఒకటి తెలీకండానే ఇన్నిరోజులు బతికేశానని నిన్న తెలిసింది. అదీ సంస్కృత వ్యాకరణం చదువుతుంటే. ఈ కథాకమామీషు ఇది.
చిన్నప్పుడెపుడో తెలుగు టీచరమ్మ సవర్ణదీర్ఘసంధి చెబితే ఊకొట్టాం, ఆ సూత్రం నిర్వచనం ఇలా ఉంటుంది.
అ - ఇ - ఉ - ఋ లకు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును. (ఈ సూత్రం వికీపీడియాలో కొట్టుకురాబడినది)
బానే ఉంది, సవర్ణాలంటే? దీనివెనుక ఓ పెద్ద కథ. ఆ కథ కోసం సంస్కృతానికెళ్ళాలి.
**********************************************************************************
సూత్రము: తుల్యాస్య ప్రయత్నం సవర్ణమ్. (౧-౧-౯)
స్థానము, (అభ్యంతర) ప్రయత్నము ఈ రెండునూ ఏ వర్ణమునకు మరే వర్ణముతో తుల్యముగా నుండునో అవి రెండును ఒకదానికొకటి సవర్ణములనబడును.
స్థానము: అర్థమును చెప్పాలన్న బుద్ధి మనస్సును చేరుతుంది. ఆ మనస్సు శరీరంలో అగ్నిని (energy) ని ప్రజ్వలింపజేస్తుంది. ఆ అగ్ని వాయువును ప్రేరేపిస్తే, ఆ వాయువు తగిన ముఖావయవానికి తాకడంతో ధ్వని ఉత్పన్నమవుతుంది. ఏయే స్థానంలో వాయువు తాకితే ఏ శబ్దం వస్తుందో ఈ లంకెలో వివరంగా చెప్పారు.
ప్రయత్నం: కేవలం ఆకాంక్ష ఉంటే సరిపోదుగా, ప్రయత్నం కూడా కావాలి. అంటే "ప" అనే అక్షరం పలుకాలంటే రెండు పెదవులు కలువడం, విడివడడం అన్న క్రియాజాతము జరుగాలి. దాన్నే యత్నము అంటారు. అధికమైన యత్నం - ప్రయత్నం. ఇవి రెండు రకాలు. అభ్యంతర ప్రయత్నం, బాహ్య ప్రయత్నం. బాహ్య ప్రయత్నం ప్రసక్తి సవర్ణనిర్ణయంలో లేదు.
అభ్యంతర ప్రయత్నం, స్పృష్టము (పూర్తిగా స్పర్శించుట),ఈషత్ స్పృష్టము (కొంచెము స్పర్శించుట),వివృతము (విడివడుట), ఈషద్వివృతము (కొంచెము విడివడుట), సంవృతము అని ఐదు రకాలు.
స్థానము, ప్రయత్నము రెండూ కలిసిన వర్ణాలే సవర్ణాలు. స్థానమొక్కటీ, లేదా ప్రయత్నమొక్కటీ కలిస్తే లాభం లేదు. ఉదా: "ప", "ఫ" సవర్ణాలు.
**********************************************************************************
ఇప్పుడు మళ్ళీ సంధికొద్దాం.
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమగుచో - అంటున్నాడు. మనం "అ" ఒక్కటి తీసుకుని సూత్రం ప్రతిక్షేపిద్దాం. "అ" కు సవర్ణాలు వెతకాలి.
"అ" కు సవర్ణం అంటే,
౧. "అ" అనే ధ్వని ఎక్కడ పుడుతుందో, అక్కడే సదరు సవర్ణమూ పుట్టి ఉండాలి.
౨. ఆ ధ్వని పుట్టడానికి జరిగిన ప్రయత్నం సవర్ణానికి కూడా వర్తించాలి.
"అ" అనే ధ్వని కంఠంలో పుడుతుంది. (అకుహ విసర్జనీయానాం కణ్ఠః)
ఇంకా కంఠంలో పుట్టేవి, "అ","ఆ", "హ", "హా", మరియు "క" . వీటిని రెండవ సూత్రంలో ప్రతిక్షేపిద్దాం.
(అంత అవసరం లేదు నిజానికి. ఎందుకంటే, సవర్ణదీర్ఘసంధి అచ్చులకు మాత్రమే అని చెప్పబడియున్నది. కానీ కొంత సరదా కూడా తీర్చుకుందాం.)
ఈ క్రింది పట్టిక చూడుడి.
వర్ణము - అభ్యంతర ప్రయత్నము
అ - వివృతము
ఆ - వివృతము
హ - ఈషద్వివృతము
హా - ఈషద్వివృతము
క - స్పృష్టము
అంటే "హ" కు "అ", "ఆ" లకు అభ్యంతర ప్రయత్నం తేడా ఉంది కాబట్టి, సవర్ణం అనే పొత్తు కుదరదు. అంచేత "అ", కు "అ", "ఆ" మాత్రమే సవర్ణాలు.
ఉదా:
దైత్యారి = దైత్య+అరి
విశ్వాత్మ = విశ్వ + ఆత్మ
చంద్రాస్య = చంద్ర + ఆస్య
ఇలానే మిగిలిన అచ్చులకూ సవర్ణాలు తెలుసుకోవచ్చు.
ఏ ధ్వని ఏ స్థానంలో పుట్టిందో గుర్తుపెట్టుకోడానికో శ్లోకం పాణిని చెప్పారు.
అకుహ విసర్జనీయానాం కణ్ఠః
ఇచుయశానాం తాలుః
ఋటురషాణాం మూర్ధా
ఌతులసానాం దన్తాః
ఉపూప్ధ్మానీయా నామోష్టౌ
ఞ మ ఙ ణ నానాం నాసికాచ
ఏదైతో కణ్ఠతాలుః
ఓదౌతోః కణ్ఠోష్టం
వకారస్య దంతోష్టం
జిహ్వమూలీయస్య జిహ్వమూలమ్
నాసికా2నుస్వరస్య.
ఇక అభ్యంతర ప్రయత్నాలను చూద్దాం
అ, ఇ, ఉ, ఋ, ఌ, ౡ, ఏ, ఓ, ఐ, ఔ - వివృతము
క వర్గము, చ వర్గము, ట వర్గము, త వర్గము, ప వర్గము - స్పృష్టము
య,ర,ల,వ - ఈషత్పృష్టము
శ,ష,స,హ,ః,ం - ఈషద్వివృతము
ఈ సవర్ణ కథలో చివరి ట్విష్టు ఏమంటే - ఋ వర్గము, ఌ వర్గము ఒకదానికొకటి (అంటే "ఋ" కు "ఌ") పై సూత్రం ప్రకారం సవర్ణాలు కాకపోయినప్పటికీ, వీటికి ప్రత్యేక కోటా కింద "ఋ" ను "ఌ" కు సవర్ణంగా చేర్చారుట. ఋ, ఌ లను ప్రయోగించి, సవర్ణదీర్ఘసంధి చేసుకోవచ్చా అనేది తెలియకుండా ఉంది. అలాంటి ప్రయోగం ఎక్కడైనా ఉందేమో పెద్దలెవరైనా చెబితే బావుణ్ణు.
**********************************************************************************
Disclaimer: పైన చెప్పిన వివరాలు ఓ పుస్తకంలో నాకు అర్థమైన పరిధిలో తెలుసుకుని వ్రాసినవి. తప్పులుండవచ్చు. సరిదిద్దితే సంతోషం.
కృతజ్ఞత - పాణిని లఘుకౌముది మార్గదర్శిని , ఆచార్య శలాక రఘునాథశర్మ.









