Friday, December 31, 2010

కఠినోపనిషత్ (పెళ్ళై రెండేళ్ళు దాటిన మగవారికి మాత్రమే)

The best way to remember your wife's birthday is - not to remember it.

***************************************************************************************************************
ప్రతి యేడాదీ new year ఆరంభంలో నేను చేసే పని ఒకటుంది. అది - మొబైల్ ఫోను స్విచ్ ఆఫ్ చేసి పడేయటం. అవును. నాకు ఆ అర్ధరాత్రి ఫోనులంటే కిట్టవు.
గత మూడు యేళ్ళుగా ఈ new year కు తోడుగా మరో తల్నెప్పి తోడయింది నాకు. మా ఆవిడ పుట్టినరోజు డిసెంబరు ముప్పై. ఆమె నాకు సెట్ చేసిన kpi (key process indicator) ప్రకారం ఆ రోజు ముందురోజు అర్ధరాత్రి దయ్యంలా మేలుకుని, నిద్రలేకుండా కళ్ళు వాయగొట్టుకుని ఆమెకు శుభాకాంక్షలు చెప్పాలి. నాకు ఆమె బర్త్ డే, భర్త డే ఏం ఖర్మ, నా బర్త్ డే కూడా గుర్తుండి ఛావదు. ఇక ఆ అర్ధరాత్రి స్కీములు ఎట్లా అమలు జరిపేది? కానీ చిచ్చీ, ఈ ఆడాళ్ళున్నారే .. (అదేదో సినిమాలో ఉదయకిరణ్ లా చదువుకోవచ్చు) వాళ్ళకు ఇట్లాంటి డ్రామాలు తప్ప ప్రాక్టికల్ గా ఆలోచించటం రానే రాదు.

భర్తారావులూ, మనలోమాట. ఒకవేళ బర్త్ డే, ఇంకో డే గుర్తున్నా కూడా గుర్తుండనట్టు మిన్నకుండడం ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే, పోన్లే పాపం అని Many happy returns of the day అని చెప్పామనుకోండి. అంతటితో తెమలదు. నిజానికి అప్పుడే ప్రమాదం మొదలవుతుంది. ఏదో మాటవరసకు returns అంటే, నిజంగానే returns అడుగుతారు వాళ్ళు. అది మరీ ప్రమాదం. వెనకటికో సారి మా ఆవిడ గిఫ్టు అడిగింది కదా అని ఏదో వాచీ, మరేదో గిఫ్టు ఆర్టికల్లూ కొనుక్కుని వెళితే మా ఆవిడ మెచ్చుకోడానికి బదులు తిట్టిపోసింది. పెళ్ళానికి గిఫ్టు ఆర్టికల్స్ ఇవ్వకూడదట. నగలు, నట్రా ఇలాంటివి ఇవ్వాలంట. (నట్రా = లేటెస్టు మొబైలూ, స్విస్ వాచూ, ఐపాడు, ఐపోడు, నా శ్రాద్ధం వగైరా వగైరా) అదీ మామూలుగా కాదంట, ఆర్చీస్ వాడి దగ్గర ఓ పెద్ద కార్డు ఒకటి కొనుక్కుని దానితో బాటు ఇవ్వాలంట. ఆ ఆర్చీస్ కార్డు లో రాసేదంతా పరమ సొల్లు. ఆ సోదంతా ఆమె చదివి ఆనందామృత తరంగాలలో ఓలలాడాలట. అవసరమా ఇదంతా?

నాకు ఫీలింగ్సే లేవని, ప్రేమంటే ఏంటో తెలీదని మా ఆవిడకో గోప్ప నమ్మకం. నా పొఱబాటు కూడా ఉంది లెండి. పెళ్ళైన కొత్తల్లో ఇంప్రెస్ చేయడానికి - "ప్రేమలో ఏమియునూ లేదు, ప్రేమయన్న భావన తప్ప" అని కృష్ణ శాస్త్రి మాట, "Love is not a sensation" అన్న కృష్ణమూర్తి మాట, "నీవు ప్రేమించట్లేదు, ప్రేమ అనే భావనను ప్రేమిస్తున్నావు" అన్న యండమూరి కోటు ఇలా తన్మయత్వంతో చెప్పుకుంటూ పోయేసరికి, ఆమెలో రియాక్షన్స్ వచ్చి, నా మీద నెగటివ్ ఫీలింగ్స్ స్థిరపడిపోయినయ్.నేనో ఇంటలెక్చువల్ అన్న బిరుదు రావడానికి బదులు, మెటీరియలిష్ట్ అన్న ముద్ర శాశ్వతంగా నామీద మోపబడింది.

అలాగే ఫీలింగ్స్ అంటే సినిమాల్లో లాగ ఉండాలా అని నా ఫిర్యాదు. ఓ రోజు ప్రాక్టికల్ గా ఆమెకు సినిమాల్లో ప్రేమలు ఎలా ఉంటాయోనని కొన్ని ఉదాహరణలతో వివరించా. నేను చూపిన సినిమాలు, ఉటంకించిన దృశ్యాలు ఇవి.

రైల్వే స్టేషన్ ప్రేమ - చూడాలని ఉంది
అక్వేరియం ప్రేమ - అక్వేరియంలో అటూ ఇటూ మొఖాలు పెట్టుకుని మహేష్ బాబు, ఆర్తి అగర్వాలూ ప్రేమించేస్కుంటారు.
పసిప్రాయం ప్రేమ - మరీ చిన్నవయసులోనే హీరోవిన్ను ప్రేమించెయ్డం
చిచుబుడ్డి ప్రేమ - తొలిప్రేమ
వగైరా...అలా అక్వేరియంలో మొహం చూసుకుని ప్రేమెట్ల వస్తుందని ఓ మాటు నేనడిగితే - మా శ్రీమతికి ఎంచేతనో నచ్చలేదు.

మొగోళ్ళకు (ముఖ్యంగా భర్తలకు) ఫీలింగ్స్ ఉండవని చాలామంది భార్యామణుల ప్రగాఢ నమ్మకం అనుకుంటా.నాకైతే జెంట్స్ కే ఫీలింగ్స్ ఉంటాయని నా ఫ్రెండ్ ఒకతను నిరూపించాడు. ఆ కథాక్రమంబెట్టిదనిన..

చాలా యేళ్ళ క్రితం బాచిలర్ గా ఉన్న రోజుల్లో నా ఫ్రెండుకు తన పెళ్ళైన కొత్తలో నేనో గిఫ్టు పంపా. ఓ గ్రీటింగు కార్డు - ఆ కార్డు అట్టమీద - "నిన్ను చూస్తే నా హృదయం లోపలున్న వస్తువులా ఉప్పొంగుతుంది. నీకు లోపలున్న పరికరం లా బోళా మనిషివి.నీకు కాస్ట్లీ గిఫ్టు ఇవ్వలేను, ఏదో నా తృప్తి కోసం ఈ చిన్న ముక్క. దయచేసి misuse చేయద్దు..." ఇలా ఏవేవో రాసి లోపలో ఊపరబుడ్డ (బెలూను) పెట్టి పంపా. అతనా గిఫ్టు ఇంకా దాచుకున్నాడు(ష). నా పెళ్ళికి వచ్చినప్పుడు చెప్పాడు.

సరే ఇందాక భర్తలకు తగలడే ప్రమాదం గురించి మాట్లాడుకున్నాం కదా. దానికి నేను పాటించిన ఉపాయాలు కొన్ని ఫ్రీగా చెబుతాను. విచ్చలవిడిగా వాడుకోండి.

౧. రాత్రి పూట విషెస్ చెప్పలేదు. మర్సటి రోజు పొద్దున చెప్పవచ్చు. నాకు నా ఫ్రెండు, ఇంకా ముఖ్యమైనోళ్ళు రాత్రే చెప్పేసినారు అంటే - మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయంతో మొదలై సూర్యోదయంతో ముగిస్తే సమయం వరకు దినం. అని లెక్చరివ్వండి. వీలుంటే ఓ సంస్కృత శ్లోకం ఉటంకించండి. ఏదైనా పర్లేదు. (మీ శ్రీమతికి సంస్కృతం రాకున్నంత వరకూ పర్లేదు)

౨. ఆ రోజు ఆఫీసుకెళ్ళేప్పుడు మీరు మొబైల్ ఫోను మర్చిపోతారు, పోవాలి.

౩. సాయంత్రం (లేటుగా) వచ్చేప్పుడు ఓ స్వీటు డబ్బా తీసుకురండి. ఇంటికి వస్తూనే నగర ట్రాఫిక్ మీద విరుచుకు పడండి. అలానే తొందరగా మూసేసిన అంగడి వాళ్ళపైనా, ఆఫీసులో బాసురుని మీదా వగైరా కూడా.అంత కష్టంలోనూ మీరు స్వీటు డబ్బా తెచ్చిన వైనం వివరించండి.

౪. ఆ రోజు ఆఫీసులో మీ కొలీగుకు పెళ్ళవబోతోందని, అదీ ఇదీ చెబుతూ, అతని కట్నం సంగతి అలవోకగా, అందులో భాగంగా చెప్పేయండి. ఆ కట్నం తాలూకు ఫిగరు మీరు తీసుకున్న ఫిగరు (ఒకవేళ తీసుకుని ఉంటే) కంటే ఎక్కువ ఉండాలన్నది వేరే చెప్పనక్కర లేదనుకుంటాను.

౫. పెరిగిపోతున్న బాంకు ఋణాల గురించి కూడా ఓ మాట అనుకోవచ్చు.

౬. ఎందుకో మీకు భార్య పుట్టిన రోజు ఆమె చేతి వంట తినాలనిపిస్తుంది. భార్య వంట ఆ రోజు బావుంటుంది కూడా. అమ్మంత కాకపోయినా దాదాపుగా అంత. ఇది ఒకే బాణానికి రెండు పిట్టలు కాన్సెప్టు ఇలా జరగకపోతే బయట హోటలు కెళదాం అన్న ప్రపోజలు ఒకటొస్తుంది. దానితోబాటు హిడెన్ అజెండా కింద భోజనం తర్వాత షాపింగు అన్నది వస్తుంది. ఇవి రెంటిని తప్పించుకోడానికి ఇందాక మీకు కలిగిన ఫీలింగు పనిచేస్తుంది.

౭. మీ ఆఫీసులో ఇదివరకెప్పుడో ఇచ్చిన చిన్న గిఫ్టేదైనా ఉంటే సరిగ్గా ఈ రోజు ఇంటికి తీసుకు రండి. ఈ మధ్య చాలా సంస్థలలో ఉద్యోగులను ఆకట్టుకోడానికి చిన్నచిన్న గిఫ్టులు ఇస్తున్నారు. ఇవన్నీ సుల్తాన్ బజార్ సరుకులు లేదా చైనా దరిద్రం. వాటిపైన అందమైన రాపరో, కంపనీ ముద్రో ఉంటది అంతే.(మా ఆఫీసులో మంచినీళ్ళకప్పు, ఓ హెడ్ శెట్టూ, కాలిక్యులేటరూ, టీ షర్టూ ఇలాంటి ముష్టి ఇస్తున్నారు). లేడీస్ సైకాలజీ ప్రకారం కంపనీ వాడిచ్చే సుల్తాన్ బజార్ సరుకులంటే వాళ్ళకు చాలా ప్రేమ. ఇదివరకు తరాల్లో పాత చీరలేసి స్టీల్ సామాన్లు కొనుక్కునే స్కీము, షాపుల్లో పదిసోపులు కొంటే ఒకసోపు స్కీము ఇవన్నీ అట్లాంటివే కదా.

ఇలా ఎన్నో స్కీములు ఉపయోగించి మీకు వచ్చిన ప్రమాదాలనుండి బయటపడండి. ప్రస్తుతానికి సెలవ్. అర్ధరాత్రి నన్ను నిద్దర లేపకుండా ఉండేందుకు ఇప్పుడే మీకందరికి చెప్పేస్తాండ. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

18 comments:

 1. Ammmmmmmmmmmooooo...Entha kutra,Entha kutra?Memoppukomu.Ayina meeru ila cheputhunnaru.maa intlo nene ma vaariki gifts istha unta..avikuda merane aa naga,natrane.

  Ina idhi matram dharunam.Mee avidagari number kastha isthara guruvugaaru??aha,emle ela unnaro adugudham ani..

  ReplyDelete
 2. మీరు ఆడవాళ్ళని జెనరలైజ్ అనవసరం గా ఆడిపొసుకుంటున్నారెమో నాకనుమానం కొంచెం మంది నా లాంటి వాళ్ళు కూడా ఉంటారు :)

  ReplyDelete
 3. రవి గారు,

  శ్రావ్య గారి మాటే నాదీను. నేను నా పుట్టిన రోజు అందరు మర్చిపోతే బాగుండు అనుకుంటాను. మీ టపా ప్రకారం మావారు అదృష్టవంతులనమాట. అర్జంట్‌గా ఈ మాట ఆయనకు చెప్పేయాలి :)

  ReplyDelete
 4. ఈ ఐడియా ముందే ఎందుకు రాలేదు రావు గారూ అనవసరంగా ఎన్నో నగలు కొనేశానే...
  (ఈ ఐడియా నాకు రాలేదు. అనవసరంగా ఎన్నో షూస్ కొనేశాను. మన్మథుడులో నాగ్ తో మిరియం బ్రహ్మానందం డైలాగ్ - బూట్లు కొని పరిగెత్తేముందు)

  ReplyDelete
 5. రవిగారు అర్ధరాత్రి పన్నెండుగంటలైంది కాస్త నిద్ర లేచి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందుకోండి సార్ :-)

  సలహాలు సూపరు :-)

  ReplyDelete
 6. హన్నా! ఎంత ధైర్యం, ఇలా రాసేశారు!! మీ ఆవిడ గారికి తెలుగుకూడా రాదా యేవిటి? వారు బ్లాగులు చూడరా?
  నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 7. bavundi me tapaa.loverki ayithe night call chesi wbirthday wishes cheptharu mari surprise gifts istharu.but wife vishayaniki vasthe logicga matladutaru.

  ReplyDelete
 8. ఆవిడ పుట్టినరోజుకి ఆవిడకే గిఫ్ట్లు, మన పుట్టిన రోజుకీ ఆవిడకే, చివరకి విషాదకరమైన మన పెళ్లిరోజుకీ ఆవిడకే. పాపం భర్తా రావుల గతి ఇంతే.

  ReplyDelete
 9. @కవిత గారు: మా ఆవిడ తన ఫోను మీకివ్వద్దంటూంది.:)
  @మందాకిని గారు: మీరు ఎందుకో "గుర్ర్" అన్నట్టుగా ఉంది. :)
  @శ్రావ్య గారు: మీరన్నమాట మీ ఆయన చెప్పాలండి. :)
  @స్నేహగారు: మీకూ అదే మాట.
  @sooryuDu: నవ్వండి, నవ్వండి. మీకు పెళ్ళికాలేదనుకుంటా.
  @panditjee: pandit jee లు మీరే పొరబడితే ఎలాగండి?
  @వేణూ శ్రీకాంత్: అందుకున్నా. ఆచరించి మంచి ఫలితాలు పొందితే నాది క్రెడిట్టు. అలా కాకపోతే మీ ఆచరణలో లోపం.
  @ఫణి గారు: ఆమె బ్లాగులు చదవదండి. అమాయకురాలు పాపం.
  @dhanalakshmi గారు: తప్పదు కదండి.
  @సుబ్రహ్మణ్యం గారు: నిజం చెప్పారు.

  ReplyDelete
 10. టపా అదరహో...నిజంగానే బ్లాగాడించారు...

  ReplyDelete
 11. రవి గారు,
  మీ ఊళ్ళో విశ్వసంస్కృత పుస్తక మహామేళా జరుగుతోందనుకుంటా.
  నేషనల్ స్కూల్ మైదానంలో నట.మీకు తెలిసే ఉంటుందనుకోండి.
  ఒకవేళ తెలీక మీలాంటి సంస్కృతాభిమానులు వెళ్ళకపోతే...అని . స్పైడర్మాన్ లాంటివీ, ఫ్యూషన్ సంగీతాల సీడీలు లాంటి ఆధునిక ప్రక్రియలు కూడా సంస్కృతంలోనట. ఈవేళ సాయంత్రం 5 గం. కు ఉద్ఘాటన అట.

  ReplyDelete
 12. @మందాకిని గారు: తెలుసండి. ఈ వారాంతం వీలు కుదిరితే వెళ్ళాలి. ఈ ఆధునిక ప్రక్రియల గురించి అయితే మాత్రం తెలీదు. ఏమైనా మీ సూచనకు నెనర్లు.

  ReplyDelete
 13. బాగుందండీ,మీ ఆవిడ పుట్టిన రోజు కొత్త సంవత్సరం ముందు, మా ఆవిడ పుట్టిన రోజు కొత్త సంవత్సరం తర్వాత.

  ReplyDelete
 14. @రవి

  ఆలస్యంగా చదివానండి మీ వ్యాసం. మీ శ్రీమతిగారికి నా జన్మదినశుభాకాంక్షలు :)

  ReplyDelete
 15. ఎంటండి అన్నీ అబద్దాలే మీరు వ్రాసింది నేను నమ్మను. మీరు మాత్రం చిలక గోరింకల్లాగా ఉంటూ మా ఆయనలని మర్చేద్దామని కుంటున్నారా?

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.