Thursday, December 23, 2010

చక్కిలాలు, జంతికలోయ్..
ధనుర్మాసం చలి దంచేస్తోంది. ఈ చలిలో కరకరలాడుతూ చక్కిలాలు తింటూ, టీవీయో, నెట్టో, పుస్తకమో పట్టుకుంటే ఎంత బావుంటుంది? వర్షంలో పకోడీలూ, ఎండకు చల్లటి మజ్జిగా, చలికి కరకరలాడే చక్కిలాలూ ఊహించని జీవితం జీవితమేనా?

నా ఊహ మటుకు ఈ రోజు నిజమయినది. పెళ్ళిళ్ళ సీజను కాబట్టి ఈ మధ్య నాకు ఓ పెళ్ళి తాలూకు కైమురుకులు/చక్కిలాలు దొరికాయ్. ఆ చక్కిలాలు లాగిస్తూంటే, ఇదుగో ఈ టపా తట్టింది. క్రితం ఏడాది ధనుర్మాసం ఇలానే పులిహోర మీద నోరు, చేయి చేసుకున్నాను, కాబట్టి ఇప్పుడు చక్కిలాల మీదపడ్డానికి అభ్యంతరం లేదనిపించి రాస్తున్నాను.

చక్కిలాలు - వీటిని కొన్నిచోట్ల మురుకులు అంటారు. జంతికలు అని కొందరంటారేమో కానీ నాకు తెలిసి జంతికలు అంటే గుండ్రంగా ఉండక, చుట్లు చుట్లుగా ఉన్నవి. చక్కిలాలు, జంతికలు, మురుకులు, పాలకాయలు, నిప్పట్లు, చేగోడీలు ఏవైతేనేం? అన్నీ ఒకే కుటుంబానికి చెందినవి. "యుష్మాకం సహకుటుంబానాం భక్షణ సమయే సముచిత స్థాన ప్రాప్తిరస్తు!"

ఇవి తిండిలో అజాతశత్రువులు. ఇవి నచ్చని వాడెవడూ ఉండడు. అయినా - అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుగా - అందరూ గారెలూ, బూరెలూ, బొబ్బట్లూ తలుచుకుంటారు కానీ వీటిని తలుచుకునే నాథుడు లేడు. చివరికి ’వివాహభోజనంబు..’ లో కూడా పింగళి వారు "ఔరౌర గారెలల్ల, ఒహ్హోరె బూరెలిల్ల..ఇవెల్ల నాకె చెల్ల" అంటూ చక్కిలం ఫ్యామిలీలో పెద్ద అయిన గారెలని తలుచుకున్నాడు కానీ చక్కిలాలకు సముచిత స్థానం ఇవ్వలేదు. చివరికి మన దేవాలయాల్లో కూడా చక్కిలానికి వివక్షత. ఏ దేవుడూ చక్కిలాన్ని ప్రసాదంగా తీసుకోడు (నాకు తెలిసినంత వరకు). పెళ్ళిళ్ళప్పుడు మాత్రం తగుదునమ్మా అని పెద్దపెద్ద గుండ్రాలుగా తీర్చిదిద్ది, పెళ్ళి తంతులో కూర్చోబెడతారు. ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.

నా చిన్నతనంలో సెలవులకు మా పిన్ని ఇంటికి వెళ్ళినప్పుడల్లా అక్కడ మాకు చక్కిలాలు భలే దొరికేవి. వాళ్ళింట్లో ఓ పెద్ద డబ్బా, అందులో నిత్యాగ్నిహోత్రంలా నిరతమూ లభ్యమయే చిరుతిండి. ఆ పెద్ద బాక్సు సగానికి వచ్చినప్పుడల్లా తిరిగి నిండుతుండేది, అక్షయ తూణీరంలా, అక్షయఖండనఖాద్యపేటిక అని చెప్పుకోవచ్చు. అవి తింటూ టీవీ చూసుకుంటూ అలా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ సెలవులను అలవోకగా గడిపేసే వాళ్ళం.

మా ఊళ్ళో శ్రీకంఠం అని ఓ సినిమా థియేటర్ ఉంది. అక్కడ వచ్చే సినిమాలేమో గానీ అక్కడ ఇంటర్వెల్ లో దొరికే చక్కిలాలు మాత్రం నా చిన్నతనంలో ఫేమసు. నాకు చక్కిలాల పిచ్చి కాస్త ఎక్కువే అప్పట్లో. ఎనిమిదవ తరగతిలోననుకుంటాను ఓ మారు చిరంజీవి సినిమాకు టికెట్లు దొరక్క నిరాశతో ఇంటికి తిరిగి రాబుద్ధి పుట్టక ఏ సినిమా ఐతే ఏముందని ఈ సినిమా థియేటర్కు వెళ్ళాము నేనూ నా ఫ్రెండూనూ. సినిమా పోస్టర్ చూడలేదు. ఏదో డబ్బింగ్ సినిమా. సినిమా చూశాము, ఇంటర్వెల్ లో చక్కిలాలు, కలర్ సోడా కూడా లాగించాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అడిగారు ఏరా సినిమా బావుందా ఎలా ఉంది. జరిగింది చెప్పాను నేను. చిన్న సైజు బడితె పూజ చేశారు. నేనేం పాపమూ ఎరుగకపోయినా బడితె పూజ! ఎందుకంటే - ఆ సినిమా మలయాళ చిత్రరాజమట. నాకూ నా స్నేహితునికి బూతు అ(క)నిపించలేదు, సకుటుంబ సమేతంగా చూడవచ్చు ఆ సినిమాని. ఎవడో డాక్టరు వచ్చిన వాళ్ళకు ఏదో చెబుతుంటాడు. అదీ ఆ సినిమా కథ. అలా చక్కిలాల కోసం చెయ్యని పాపానికి దెబ్బలు తిన్నాం.

ఇదివరకెప్పుడో నా బ్లాగులో ఇడ్లీల గురించి ఓ మాటనుకున్నప్పుడు ఇడ్లీలు ఇండోనేషియా నుండి వచ్చాయని మనసు విరిచేశారు పరుచూరి శ్రీనివాస్ గారు. చక్కిలం మటుకూ భారతదేశ వంటకమని నా వాదన. సంస్కృతంలో చక్కిలాలను "శష్కులీ" అంటారు. (శష్కులీ ప్రకృతి - చక్కిలి వికృతి కాబోలు). ఈ శష్కులీ గురించి ఓ శ్లోకం ఈ రోజే నా కళ్ళబడింది.

నృపమాన సమిష్టమానసస్సనిమిజ్జత్కుతు కామృతోర్మిషు |
అవలంబిత కర్ణశష్కులీ కలశీకం రచయన్నవోచత ||

ఇష్టమానసః = ప్రియమైన మానస సరస్సుగల
సః = ఆ రాజహంస
కుతుకామృతోర్మిషు = సంతోషామృత లహరులలో
నిమజ్జత్ = మునిగిన
నృపమానసం = నలుని చిత్తమును
అవలంబిత కర్ణశష్కులీ = పట్టుకొనబడిన చక్కిలము వంటి చెవులనెడి
కలశీకం = కలశములు కలదిగా
రచయన్ = చేయుచూ
అవోచత = పలికెను

కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నా అర్థం ఇదీ.
మానస సరోవరం లో తిరిగే రాజహంస సంతోషాంతరంగ లహరులలో ఓలలాడే నలుని చక్కిలాలవంటిచెవులను కలశములచే నిలబెట్టి (సావధానచిత్తునిగా చేసి) చెప్పసాగింది.

చక్కిలాలవంటి చెవులను కలశాలుగా చేయడం - ఈ మాటకు అర్థం ఇంచుమించుగా ఇది. నదిలో మునిగేవాడికి ఖాళీ బిందె దొరికితే దాని సహాయంతో (మునక్కుందా పైకి పట్టుకుని) ఎలా వస్తాడో అలా సంతోష తరంగాల్లో మునిగిన నలునికి చెవులనే కలశాలు దొరికాయిట. ఆ చెవులు చక్కిలాల్లా ఉన్నాయిష!

కర్ణశష్కులీ - ఉపమాలంకారము.

పై శ్లోకం నైషధీయచరితంలో రెండవ ఆశ్వాసంలోనిది. రచయిత శ్రీహర్షుడు. ఈయన పదవ శతాబ్దపు ఆసుపాసుల్లోనివాడనుకుంటాను కాబట్టి మనం చక్కిలం భారతీయమైనదని ఒప్పేసుకుకోవచ్చు అనుకుంటాను. చక్కిలాల రుచిచూసేనేమో ఆయన "ఖండనఖండఖాద్యం" అన్న ఓ తర్కగ్రంథం వ్రాశాడు. ఆ మాటకర్థం - ఖండనం అనబడే చిరుతిండి. ఇది అద్వైత వాదం సమర్థించే ప్రౌఢగ్రంథం.

తెలుగులో జంతికల గురించి వేమన ఓ పద్యం చెప్పాడు.

తమకుఁ గలుగుపెక్కుతప్పు లటుండఁగా
నొరుల నేరమెంచు టొప్పు గాదు
చక్కిలంబు విడిచి జంతిక లేరుటా?
విశ్వదాభిరామ వినుర వేమ.

26 comments:

 1. ఆలొచించాల్సిన విషయమే - అసలే నా చెవులు చక్కిలాలులా కాకుండ చాక్లెట్ అంత చిన్నాగా ఉమ్టాయేమో -వేమన పద్యమ్ ఇదే మొదటి సారి నా చెవినబడటం - పైగా అదే మకుటం తో తరువాత కొద్దిమంది కవులు పద్యాలు వ్రాశారు.
  నైషధం లో పద్యాన్ని శ్రీనాధులవారు ఎలా తెనిగించారో చెప్పలేదు
  భవదీయుడు
  ఊకదంపుడు

  ReplyDelete
 2. నిప్పట్లు, చెగోడీలూ, పకోడీలూ, గారెలూ అన్నీ ఒకే కుటుంబానికి చెందినవంటారు :-) బాగుందండి. పద్యాలు కూడా బాగున్నాయ్.

  పాపం ప్రాస కుదరక పింగళి వారు వదిలేశారేమో కానీ “వివాహభోజనంబు” పాట వీడియో లో మాత్రం బ్రహ్మాండంగా తెరనిండుగా కనులవిందు చేస్తాయి పెద్ద పెద్ద జంతికల చుట్టలు.

  ReplyDelete
 3. "చక్కిలాలు, జంతికలు, మురుకులు, పాలకాయలు, నిప్పట్లు, చేగోడీలు" - పేర్లు చెబుతోంటేనే చాలు, మనసు లాగేస్తోంది. పైపెచ్చు మీ కథనం ఒకటి! ఈ కుటుంబంలో ఏ ఒక్క సభ్యురాలైనా చాలు, నిరాహారదీక్ష చేసేవాణ్ణి కూడా నిరతాహారదీక్షాపరుణ్ణి చేసేందుకు.

  ReplyDelete
 4. చక్కిలం అన్న పదమే విన ముచ్చటగా వుంటుంది, జంతిక లేటండి తిని గెంత మన్నట్టు! చక్కిలం అని ఇంటిపేరుగా ఎవరో రచయిత్రి వున్నట్టు గుర్తు. ఎంత రుచికరమైగొగొప్ప రుచికరమైనదో కాకుంటే, ఇంటిపేరుగా పెట్టేసుకుంటారో! చక్కిలం అంటే విష్ణుచక్రంలా అలా వేలికి తగిలించుకుని 'నేనే చక్రిన్, గిక్రిన్ ..' అని ఫీలయిన రోజులు లీలగా గుర్తొస్తున్నాయ్. :) నచ్చింది, మీ చక్కిలోపాఖ్యానం. :))

  /టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే./


  టపా స్పూర్తి, తంతి-తపాలా స్పూర్తి ..సరే, అఘోరించారులేండి, అగీకరించక చస్తామా! ఏమిటో బ్లాగర్లది మరీ చాదస్తం.

  ReplyDelete
 5. అదుర్స్ again... :-)

  - సనత్

  ReplyDelete
 6. చాలా బాగుంది. మాకు చిన్నప్పుడు చక్కిలాల కన్నా జంతికలు, చెగోడీలే ఎక్కువ పరిచయం, ఇష్టం కూడాను. కర్ణ శష్కులీ అంటే చక్కిలాలవంటి చెవులన్నారు. కానీ శష్కులీ అన్న పదానికి రెండు అర్థాలు ఉన్నాయి - చక్కిలము, బయటిచెవి (the orifice of the ear , auditory passage) అని. కాబట్టి ఇక్కడ 'కర్ణ శష్కులీ' అంటే బయటిచెవి అనే అర్థమే ఎక్కువ పొసగుతుందేమో. చక్కిలంతో పోలిక అంతగా పొసగక పోవచ్చు - ఎందుకంటే ఈ శష్కులాలని కలశాలతో పోలుస్తున్నాడు తర్వాత. పైగా ఉత్సుకత అనే సముద్రంలో మునిగిపోయిన మనస్సు ఈ కలశాల్ని పట్టుకుని పైకి రావాలి కూడాను. :-)

  ఈ మహాకవులతో వచ్చే చిక్కే ఇది. ప్రతీ వాక్యం/పదంలోనూ అనేకార్థాలు, అనేక భావాలు స్ఫురించేలా రాస్తారు. మాఘుడి శ్లోకాలూ ఇలాగే ఉంటాయి. ఒక్కో శ్లోకం మీదా ఎంత విశ్లేషణ అయినా చేసుకోవచ్చు.

  అవునుగానీ ఆ రోజుల్లో చక్కిలాలు తియ్యగా ఉండేవంటారా? ఎందుకంటే డిక్షనరీలో ఇలా ఇచ్చాడు - a large round cake composed of ground rice , sugar , and sesamum , and cooked in oil.

  పంచదార వేస్తే రుచి తగలడిపోదూ??

  ReplyDelete
 7. మీరు చెప్పిన కుటుంబంలో అన్నిటికన్నా చక్కిలాలాలే చెయ్యడం కష్టమనుకుంటాను! వీటిని చేత్తో చుట్టి, ఎండబెట్టి అప్పుడు వేయిస్తారు. అంచేత జంతికలు చేగోడీల కన్నా ఇవి తక్కువ నూనె పీలుస్తాయి.

  శష్కులి గురించి నాగమురళిగారు మంచి పాయింటే లేవదీశారు! ఎంతైనా శ్రీనాథడు గడుసుపిండం. దాన్ని అలానే ఉంచేసి తప్పించుకున్నాడు. శ్రీనాథుడి పద్యం ఇది:

  ఇష్టమానసమైన యా హేమఖగము
  నలుని మానసమానంద జలధియందు
  కర్ణశష్కులికలశంబు కౌగిలించి
  యీద జేయుచు మృదభాష నిట్టు లనియె

  దీనికి వేదం వేంకటరాయశాస్త్రిగారి వ్యాఖ్యలో చక్కిలమనే అర్థమిచ్చారు. హర్ష నైషధానికి మరొక తెలుగు వ్యాఖ్యానంలో కూడా చక్కిలమనే అర్థమిచ్చారు.
  మల్లినాథుని సంస్కృత వ్యాఖ్యానంలో ఇలా ఉంది:

  కర్ణౌ శష్కుల్యావివ కర్ణశష్కుల్యౌ తే ఏవ కలశ్యౌ తే అవలంబితే అవహితే కృతే ధృతే చ యేన తత్తథోక్తం

  దీనర్థం ఏమిటో మరి? అయినా అందగాడైన నలుని చెవులని చక్కిలాలతో పోల్చడమా, నేనొప్పుకోను! :-)

  (మనలో మనమాట, ఈ చక్కిలాల వ్యాఖ్యానం మన తెలుగు వ్యాఖ్యాతల పాండిత్యమేమోనని అనుమానం వస్తోంది!)

  ReplyDelete
 8. @నాగమురళి గారు, @కామేశ్వర రావు గారు: కర్ణౌ శష్కుల్యావివ అంటే "చెవులు శష్కులముల వలె" - ఉపమాలంకారము. ఈ సమాసం ప్రకారం చక్కిలమనే అర్థమే యుక్తమవాలి. ఇదే నేను చదివిన వ్యాఖ్య కూడాను. "జీవాతు" (మల్లినాథసూరి)వ్యాఖకు తెనుగు అనువాదంలో ఉడాలి సుబ్రహ్మణ్యశాస్త్రి గారు చక్కిలమని అంటున్నారు. నాగమురళి గారన్నట్టు రెండర్థాలు బ్రౌణ్యం ప్రకారం కూడా. అయితే శష్కులీ అంటేనే బయటి చెవి అన్నప్పుడు కర్ణ శబ్దం తిరిగి జోడించవలసిన అవసరం ఏముందని అనుమానం. అలా ఉంచితే शष्कुली ని గూగిలిస్తే మహాభారతంలో ఓ శ్లోకం తగులుతోంది. అక్కడ మటుకు భక్ష్యవిశేషంగానే తెలుస్తోంది.

  అయితే ఆ శ్లోకంలో నన్ను చికాకు పెట్టిన విషయం శష్కులీ కాదు. కుతుకామృతోర్మిషు అంటే "సంతోషామృత తరంగాలలో" అని అనువాదం చెప్పారు. బానే ఉంది. తరంగాలలో ఓలలాడడం, ఈదులాడడం ఔచిత్యం కానీ, నిమజ్జనం ఏమిటండి? సరే మునిగిందే అనుకుందాం. కలశాలు లైఫ్ జాకెట్లు ఉన్నట్లు చిత్రీకరించి, చెవులను కలశాలుగా మార్చడం ఏమిటి? అదీ ఓకే. అంత సంతోషంలోంచి బయటకు లాగి, ఆ రాజహంస చేసే పనేమిటంటే - దమయంతీ సౌందర్యాన్ని వర్ణిస్తూ కూర్చోవడం. ఇది ఏమి బయటకు లాగడమో నాకు తెలియట్లేదు.

  నాగమురళి గారన్నట్లు ఈ కవులతో వచ్చే చిక్కులివే!

  ReplyDelete
 9. @వూకదంపుడు గారు: వేమన పద్యం ఆయన రాసిందేనా అని అనుమానమే. మీ కోరిక కామేశ్వర్రావు గారు విన్నారు. :)
  @వేణూ శ్రీకాంత్: అవును. వీడియోలో ఉన్నాయి. ఈ పాట కన్నడలో కూడా ఉంది. అందులోనూ జంతికలున్నట్టు లేదు.
  @విజయ మోహన్ గారు,@సనత్ శ్రీపతి, @చదువరి: నెనర్లు.
  @snkr గారు: అప్పుడెప్పుడో గోల భరించలేక ఆ స్లోగన్ జత చేశాను. అలా పడి ఉంది లెండి. వికీలీక్స్ టైపులో ఎవడన్నా ఇక్కడ బయలుదేరితే కొంచెం పనికొస్తుంది. :)

  ReplyDelete
 10. నిన్న రాత్రే ఇంట్లో ఆర్డర్ పాస్ చేసా (అంత సీన్ లేదు లెండి, ఓ అర్జీ పడేశా), చెగోడీలూ జంతికలూ చెయ్యమని.

  అయితే ఈ శ్లోకంలో చక్కిలాల ప్రసక్తికి కారణం మల్లినాథసూరి వ్యాఖ్యానం అని తెలుస్తోంది. ఆయన 'కర్ణౌ శష్కుల్యావివ' - అంటే 'శష్కులాలు అనెడి చెవులు' (రూపక సమాసం) అనడమే దీనికంతటికీ కారణం. కానీ ఆయన శష్కులము అంటే భక్ష్యవిశేషము అని చెప్పలేదు. శష్కులానికి పైన చెప్పిన రెండు అర్థాలూ తప్ప మరో అర్థం లేకపోవడంతో మిగతా అందరూ చెక్కిలాలనే నిర్ధారణకి వచ్చేశారనిపిస్తోంది. కానీ, బహుశా, ఈ పదానికి మరో అర్థం కూడా ఉండి ఉండవచ్చు. లేదా, మల్లినాథసూరి పొరబడి కూడా ఉండచ్చు. నిజానికి అది 'కర్ణయోః శష్కుల్యౌ' (కర్ణములయొక్క శష్కులములు) కావచ్చు. బాగా తీరిక ఉన్నవాళ్ళెవరైనా ఈ పన్లు చేస్తే బాగుంటుంది.

  1. నైషధానికి మల్లినాథుడిది కాకుండా మరో వ్యాఖ్యానం ఏదైనా ఉంటే సంపాదించి ఈ శ్లోకానికి వ్యాఖ్యానాన్ని పరిశీలించాలి.

  2. శష్కులీ పదానికి ఇంకా ప్రాచీన శబ్దకోశాల్లో వేరే అర్థాలేమైనా ఉన్నాయేమో చూడాలి.

  3. వేరే కావ్యాల్లో ఎక్కడైనా చెవులని చక్కిలాలతో పోల్చడం జరిగిందేమో చూడాలి.

  రవిగారూ మరో విషయం. కుతుకం అంటే ఉత్సుకత (curiosity; eagerness , desire for) అండీ. దానిని తెలుగు వ్యాఖ్యానాల్లో సంతోషం అని ఎందుకు అన్నారో అర్థం కావడం లేదు. నలుడి మనస్సు ఈ ఉత్సుకత అనే సముద్రంలో పడి మునిగిపోవడం సహజమే కదా. ఆ తర్వాత దమయంతి గురించి చెప్తూ ఉంటే, చెవులనే కలశాలని పట్టుకుని అందులోంచి బయట పడడమూ ఉచితమే కదా.

  అన్నట్టు మరో సంగతి. మా రాగమ్మని ఇదివరకు ముద్దు చేస్తూ 'అమ్మా, నీ చెవులు స్విస్ చాక్లేట్లే' అనేవాణ్ణి. ఈ ఉపమానాన్ని ఎవరైనా కావ్యాల్లో ఉపయోగిస్తానంటే నేను కాపీరైట్ ఒదులుకోడానికి సిద్ధమే.

  ReplyDelete
 11. అన్నట్టు మర్చిపోయాను. కుతుకాన్ని అమృతం అనడం ఉచితం కాదు. అందుకే దాన్ని మనవాళ్ళు ఆనందం అన్నట్టు ఉన్నారు.

  ReplyDelete
 12. ఆహ్. మళ్ళీ చూస్తే శ్రీనాధుడి అనువాదం కరెక్టు, పర్ఫెక్టు. నలుని మనస్సుని ఆనందము అనబడే సముద్రంలో ఈదులాడేలా చేసింది ఆ హంస. ఆ ఈదడం కూడా కర్ణ శష్కులాలు అనబడే కలశాలు పట్టుకుని ఈదేలా చేసింది. కాబట్టి నిమజ్జత్ పదానికి మునిగిఉన్న అని మక్కీకి మక్కీ అర్థం చెప్పుకోకూడదు, బహుశా. ఈ రోజుల్లో ఈత నేర్చుకునేవాళ్ళు రబ్బరు/ప్లాస్టిక్ టైర్ల లాంటివి పట్టుకుని ఈదేట్టుగా ఆ రోజుల్లో కలశాల్లాంటివి పట్టుకుని ఈదేవారేమో. విచిత్రంగా ఉంది కదూ.

  ReplyDelete
 13. please watch
  http://bookofstaterecords.com/
  for the greatness of telugu people.

  ReplyDelete
 14. @నాగమురళి గారు: మీరన్నట్టు శష్కులీ పదం వెనుక ఓ పెద్ద మతలబు ఉన్నట్టుంది. తీగె లాగగల సమర్థులెవరున్నారు? :)

  >>నలుడి మనస్సు ఈ ఉత్సుకత అనే సముద్రంలో పడి మునిగిపోవడం >>సహజమే కదా.

  "కుతుకామృతోర్మిషు.." ఇందులో నన్ను ఇబ్బంది పెట్టింది కుతుకం కాదండి. "ఊర్మిషు" ("భంగస్తరంగ ఊర్మివా స్త్రియాం వీచి" - అమరం) అంటే తరంగాలలో, లహరులలో అని అర్థం కదా. సముద్రంలో కాదు కదా? శ్రీనాథుడు కూడా జలధి అనేశాడు. "తరంగాలలో ఓలలాడ్డం/ తేలియాడ్డం సమంజసం కానీ నిమజ్జనం" ఏంటోనని అర్థమవక చెప్పాను.

  ReplyDelete
 15. మల్లినాథుడు తన జీవాతువ్యాఖ్యలో "కర్ణౌ శష్కుల్యావివ కర్ణశష్కుల్యౌ తే ఏవ కలశ్యౌ తే అవలంబితే అవహితే కృతే ధృతే చ యేన తత్తథోక్తం" అన్నారు తప్పితే శష్కులి అంటే ఏమిటో చెప్పలేదు. కానీ "కర్ణాకారో వాద్యవిశేషశ్శష్కులీ" అని నారాయణపండితుడు తన (నా వద్దనున్న)నైషధీయప్రకాశవ్యాఖ్యలో చెప్పారు.

  శష్కులీ అంటే చెవి ఆకారంలో ఉన్న ఒకానొక వాద్యం అన్న అర్థం తీసికొంటే ఆ హంసపలుకులు వినసొంపుగా ఉన్నాయన్న అర్థం వస్తుంది. ఆ చెవులే కలశాలుగా కలిగి ... అన్న మిగతా భావం స్పష్టమే.

  ReplyDelete
 16. రాఘవ గారూ, నెనర్లు. మొత్తానికి నా అనుమానమే నిజమైంది. నైషధాన్ని విద్వదౌషధం అని ఊరికే అన్నారా!!

  ReplyDelete
 17. శష్కులం అనేదొక తినుబండారమని మా గురువుగారు చెప్పారు. చక్కిలం దాని తద్భవమట,

  ReplyDelete
 18. తాడేపల్లివారూ, మా గురువుగారిని అడిగితే మొదట ఆయన చెప్పినది కూడా ఇదేనండీ. శష్కులీ శబ్దానికి అర్థం చక్కిలమని. ఈ అర్థం తీసికొంటే మల్లినాథుడు పొఱబడ్డాడని అనుకోవాలి. ఈ అర్థం కాక, నారాయణ పండితుడు చెప్పిన వాద్యం అన్న అర్థం తీసికొంటే మల్లినాథుడి వ్యాఖ్యానంతో కూడా ఇబ్బంది లేదు.

  ReplyDelete
 19. శష్కులికి వాద్యమనే అర్థం అన్వయసులభంగా ఉంది. అయితే ఆ వాద్యం ఖచ్చితంగా ఏంటని ? అదెలా ఉంటుంది ? చెవిని బట్టి దాని పక్కపదం వాద్యం అని ఊహించడం సృజనాత్మకంగా ఉంది. కానీ చక్కిలానికున్న శంకలే దీనికీ మిగిలిపోయాయి కదా ?

  ReplyDelete
 20. ఇక్కడ వచ్చిన చిక్కే అదండీ. నారాయణపండితుడు చెప్పాడన్న మాట తప్పితే శష్కులి అంటే అర్థం ఇదమిత్థంగా తెలియలేదు. ఆయన శష్కులి అంటే చెవి ఆకారంలో ఉండే ఒక వాద్య విశేషం అన్నారు కాబట్టి, చెవికీ చెవి ఆకారంలో ఉండే వాద్యానికీ పోలిక బాగుంటుందని నైషధకారుడు వాడారని అనుకోవాలి. శష్కులి అంటే చక్కిలమని ఎలా తెలిసింది? చక్కిలంగా పరిణమించగల పదం శష్కులి కావటం వల్లనే కదా?

  అమరంలో శష్కులి ప్రస్తావన లేదు. అమరేతరకోశాలలో ఏమైనా ఇచ్చారేమో చూడాలండీ. విశ్వకోశంలో ఏమైనా ఇచ్చారేమో చూస్తానుండండి.

  ReplyDelete
 21. విశ్వంలో లాన్తవర్గంలో శౌష్కలశబ్దం ఉంది తప్పితే శష్కులీ లేదు.

  వాచస్పత్యంలోనూ శబ్దకల్పద్రుమంలోనూ శష్కులి ఉందండీ. 1. నువ్వులూ బియ్యమూ మినుములూ కలిపి చేసిన గంజి (soup) 2. కర్ణరంధ్రము (నైషధంలోని ప్రయోగమే ఉదాహరణ) 3. పిష్టకవిశేషము (ఈ అర్థంలో మహాభారతంలోనూ భావప్రకాశలోనూ ఉందట).

  ReplyDelete
 22. తాడేపల్లి గారు, రాఘవ గారు, నెనర్లు. మహాభారత శ్లోకం ఇది.

  संयावं कृसरं मांसं शष्कुली पायसं तथा |
  आत्मार्थं न परकर्तव्यं देवार्थं तु परकल्पयेत ||

  లంకె లో దొరికింది.

  ReplyDelete
 23. మీరు తార్కాణించిన శ్లోకం బావుంది. నెనర్లు.

  కానీ తెలుగులిపి సంస్కృతానికి పనికిరానట్లు, సంస్కృతం యొక్క ఒరిజినల్ లిపి నాగరి మాత్రమే అయినట్లు దాన్ని నాగరలిపిలో ఇవ్వడమే నాకు కొఱుకుడు పడలేదు. సంస్కృతానికి ఇదమిత్థంగా ఒక లిపంటూ ఏమీ లేదు. ఒక తమిళం తప్ప అన్ని భారతీయభాషలూ సంస్కృతానికి స్వంతలిపులే. ప్రాచీనకాలంలో అ భాషని 64 లిపుల్లో వ్రాసేవారని లలితవిస్తరం పేర్కొంటున్నది.

  ReplyDelete
 24. >>కానీ తెలుగులిపి సంస్కృతానికి పనికిరానట్లు, సంస్కృతం యొక్క ఒరిజినల్ >>లిపి నాగరి మాత్రమే అయినట్లు

  అలాంటి ఉద్దేశ్యాలేవీ లేవండి. ఆ లంకెలో శ్లోకం యథాతథంగా తెచ్చి దింపడంతో ఆ లిపి వచ్చిందంతే. నేను ఇదివరకెన్నడూ, ఈ టపాలోని శ్లోకంతో సహా, ఏ సందర్భంలోనూ సంస్కృతానికి దేవనాగరలిపి వాడిన సందర్భం లేదని మనవి చేసుకుంటున్నాను.

  ReplyDelete
 25. శష్కులీ పదం నాకు ఇవాళ భీమేశ్వర పురాణంలో కనిపించింది.దక్షారామ విలాసినీవతుల సౌందర్య వర్ణనంలో:

  అంబుధరశ్రేణి హరిణలాంఛన రేఖ
  కమ్రకార్ముకవల్లి కామతల్లి
  జలచరద్వంద్వంబు చంపకప్రసవంబు
  బింబంబు దాడిమ బీజరాజి
  శష్కుళీ యుగళంబు చారుదర్పణములు
  శంఖంబు బిసములు జలరుహములు
  పసిడికుంభంబులు బయలంబువీచులు
  పుష్కలావర్తంబు పులినతలము...

  ఇక్కడ శష్కులీ పదం చెవులనే అర్థంలోనే వాడినట్లుంది.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.