Monday, November 29, 2010

అట్లాస్ సైకిలు షేక్షావలి

"తొందరగా మమ్ము తినేసెయ్యవే. బుడబుడకలాయప్ప వత్తాడు. సంచీలో పిల్లల్నేసుకుని తీసకపోతాడంట."
పాపతో తిండి తినిపించడానికి నానాపాట్లూ పడుతోంది వాళ్ళమ్మ అనబడు మా శ్రీమతి.కానీ అది (పాప) ముదురుది. వినేరకమా?
"ఎల్లిపోయినాడు కదా. మల్లీ రాడు." డిక్లేర్ చేసింది.
"ఫోను చేస్తానుండు. హలో..ఆ..రాప్పా. ఇక్కడ పాప మమ్ము తినకోకుండ సతాయిస్తా ఉంది." ఈ ఎఫెక్టు కాస్త పనిచేసింది. మమ్ము తినమన్న అభ్యర్థనను ఈ సారికి కన్సిడర్ చేసింది పాప.సెల్లుఫోను ఎఫెక్టు!

లైఫులో మంచివాడు, చెడ్డవాడు అని బోర్డుపెట్టుకుని ఎవరూ ఉండరు. ఇది పెద్ద రాకెట్ సైన్సు గాదు. ఏడవతరగతి పిలాసఫీ, అందరికీ తెలిసిందే. మన లైఫులో ఊహ తెలిసీ తెలియని తరుణంలో మొట్టమొదట తగిలే నెగటివ్ లుకింగు పాజిటివ్ కారక్టరు "బూచి". ఈ బూచి అనబడు విలన్, పైకి విలన్ గా కనబడుతూ కొన్ని కొన్ని ప్రయోజనాలు చేకూరుస్తుంటాడు. పిల్లలు మారాం చేస్తే బెదిరించి దారికి తేవడం, అన్నం తినిపించడం, బుద్దిగా చెప్పినమాట వినేట్టు చేయడం ..ఇలాగన్నమాట. బుడబుడకల వాడు, వీధిచివర పెద్దపెద్ద అంగలేసుకుంటూ వెళ్ళే బుర్రమీసాల పోలీసెంకటసామి, వెనకింటి సూర్యకాంతమ్మత్తా, వేపమండలతో ఇంటి ముంగట వచ్చే నాంచారమ్మా వగైరా వగైరా ఈ కోవలోకి చెందినవాళ్ళు.

నాకూ ఊహ అన్నది మొగ్గతొడుగుతూ బుద్ధి వికసిస్తున్న రోజుల్లో నా పాలిట ఓ బూచి ఉండేవాడు. ఆ బూచి పేరు - షేక్షావలి.

********************************************************************************

"హుర్ర్." కాళ్ళతో నేలను చరిచి నన్ను చూస్తూ ఒక్కసారిగా గదిమేడు గడ్డమూ, మీసాలతో ఉన్న ఆసామీ.
"అమ్మా" అక్కడి నుండి పరిగెత్తాను ఐదారేళ్ళ నేను.
మా అమ్మా, నాన్నతో బాటూ పక్కన నిలబడ్డ మా నాన్న మిత్రులు - తెలుగు మాస్టారు (స్వర్గీయ శ్రీమాన్ పుట్లూరు శ్రీనివాసాచార్యులు గారు) ఫక్కున నవ్వేశారు.
మరుసటి రోజు పట్టుదలగా నేను అతణ్ణి ఎదుర్కున్నాను.
"హుర్ర్.." బయపడలేదు.
"హెక్.." ఊహూ..
చేతులు రెండూ మడిచాడు షేక్షావలి. బెల్టు మీదకు చేయిపోనిచ్చాడు.
"హుప్" అంటూ నా వద్దకు పరిగెత్తి వస్తున్నట్టు ఓ అడుగు ముందుకేశాడు.
"అమ్మో!"...

మా నాన్న మిత్రుడు షేక్షావలి ఓ అట్లాసు సైకిల్ లో మా ఇంటికెప్పుడైనా వచ్చేవాడు. ఆ సైకిలుకు ప్రత్యేకత ఏమిటంటే, వెనుక క్యారేజి, క్యారేజిలో కూర్చుంటే కాళ్ళు పెట్టుకోవడానికి ఇరువైపులా రెండు ఫుట్ బోర్డులు. అవి సరిగ్గా చిన్నపిల్లలకు కాళ్ళకు అందేలా అమరి ఉండేవి. సైకిలుకు ముందున్న బారు మీద ఓ చిన్నసైజు సీటు ఉండేది. గడ్డం, చైనా మీసాలు, చేతుల దగ్గర రెండుమడతలు పైకి మడిచిన ఫుల్ షర్టూ, ఇన్ చేసి బెల్టు బిగించిన నేరో పాంటూ, నోట్లో సిగరెట్టూ, అప్పుడప్పుడూ పెద్దనల్లకళ్ళజోడు, మరెప్పుడైనా తెల్లగా గళ్ళుగళ్ళుగా ఉన్న ముసల్మాను టోపీ, చక్కగా నూనెపట్టించి దువ్విన జుట్టూ, నన్ను చూస్తే ఆటపట్టించాలన్నట్టుగా చూసే నవ్వు.

ఆ రోజుల్లో సినిమా వస్తే ఓ ఎద్దుల బండికి లేదా రిక్షాకు సినిమా వాల్పోస్టరు తగిలించి మైకులో పాటలు పెడుతూ, మధ్యమధ్యలో అనౌన్సు చేస్తూ తిరిగే వాళ్ళు. ఆ బండి దగ్గరకు వెళితే ఓ పాంప్లేటో, పాటలపుస్తకమో ఏదో ఇచ్చేవాళ్ళు. అది కూడా పెద్దలకే. పిల్లవాళ్ళు ఆ పేపరు సంపాదించాలంటే చిన్నసైజులో సామదానభేద దండోపాయాలు ఉపయోగించాలి. ఓ మారు నేను ఆ బండి వెనకాతలే పాటలు వినుకుంటూ, ఆ పాంప్లేట్ సంపాదించి, రసానుభూతి చెందుతూ వెళ్ళిపోతుంటే, షేక్షావళి ఆ రసానుభూతికి అడ్డుపడి, నన్ను సైకిల్లో ఇంటికి తీసుకొచ్చి దింపేడట. దింపడమే కాకుండా మా ఇంట్లోవాళ్ళకు నా గురించి హెచ్చరించాడుట, మీ వాడికి సినిమా బండ్ల వెనుకలే నడుచుకుంటూ థియేటర్ వరకూ వెళ్ళిపోయే సిండ్రోమ్ ఉంది, జర భద్రం అని. (ఈ కథంతా నాకు గుర్తు లేదు. మా పెద్దలు నా చిన్ననాటి సంగతులు నెమరు వేసుకుంటుంటే తెలిసింది).

ఆతని సైకిలు ఎక్కాలని నా ఆశ. ఓ రోజు స్టాండు వేసి ఉన్న సైకిలు ఎక్కి కూర్చుంటే మా అమ్మ తిట్టినట్టు లీలగా గుర్తు. అయితే అమ్మకు నచ్చజెప్పి అతనే ఎక్కించుకుని రెండు రౌండ్లు తిప్పి తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటిదగ్గర టీ కలిపి ఇచ్చారు నాకు. నాకు అప్పటికి బయట ఎవరి ఇంటికి వెళ్ళిన అనుభవం లేదు. వాళ్ళింట్లో టీ తాగాలా వద్దా తెలియదు. ఆ మాట చెబితే ఈయనేమంటాడో తెలియదు. సరే టీ తాగేశాను. ఇంట్లో తాతయ్య దగ్గర - షేక్షావలి ఇంట్లో టీ తాగానని చెబితే, ఆయన నవ్వేశాడు. "ఏమైనా తిన్నావా, లేదు కదా. ఏమీ కాదులే" అన్నాడు. ఆయన భయం కేవలం నేను నాన్ వెజ్జు తెలియకుండా తినేస్తానేమోనని.

ఇంటికి వెళ్ళాను కదాని అతను గుర్రుపెట్టటం, భయపెట్టటం మానలే. అన్నయ్య అన్నయ్యే, పేకాట పేకాటే!

షేక్షావలికి మా తాతయ్య అంటే గురి అనుకుంటాను. మహమ్మదీయుడైనా తనకు కొడుకు పుడితే మా తాత వద్దకు భార్యను, బిడ్డను తీసుకువచ్చి ఆశీర్వదించమని అడిగాడన్నట్టు లీలగా నాకు జ్ఞాపకం.

తను బహుశా రైల్వేలో పనిచేసేవాడనుకుంటాను.షేక్షావలికి ఆ తరువాత ఎక్కడికో ట్రాన్స్ ఫర్ అయింది. చాలా యేళ్ళయ్యాయి.

కాలేజిలో చదువుకుంటున్న రోజుల్లో, ఓ రోజు.. ఏదో షాపుముందు నిలబడి ఉన్నాను. పక్కన లూనా దగ్గర ఓ అసామీ సిగరెట్ తాగుతున్నాడు. అతణ్ణే చూస్తున్నాను నేను. అతను నన్ను రెండు మూడు సార్లు గమనించాడు. ఆ తర్వాత నెమ్మదిగా నవ్వుముఖంతో నన్ను సమీపించాడు. మనిషి ఏ మాత్రం మారలేదు. చెవుల దగ్గర జుత్తు కాస్త తెల్లబడిందంతే."హు.." అన్నాడు, నవ్వుతూ. నవ్వేశాను నేను. ఆ తర్వాత పలుకరింపులు, కుశలప్రశ్నలూ అయాయి. మా తాత గురించి ప్రత్యేకంగా అడిగేడు షేక్షావలి. ఆయన స్వర్గస్తులై మూడు, నాలుగేళ్ళయిందని చెప్పాను. "బాబూ! హమ్ ముసల్మాన్ హై, ఫిర్ భీ హమ్ ఆప్ కా దాదాజీకో బహుత్ మాన్ తేహై. ఆప్ బోల్ తే హైనా, సన్యాసి, సన్త్..ఐసాహీ వో. .." ఇలా చెప్పుకొచ్చాడు.

మతం అన్న బూచి ఎదుటివ్యక్తిని ఇబ్బందిపెట్టి జీవితాలకి అడ్డురానంతవరకూ ఏ మతమైతేనేం? సమ్మతమేగా! ఆత్మీయతలు, అనుబంధాలు వీటి ప్రస్తావన వచ్చినప్పుడు మతం దారి మతంది, మనిషి దారి మనిషిది.అన్నయ్య అన్నయ్యే, పేకాట పేకాటే!

మనిషులు మనకు రకరకాల స్టేజుల్లో తగులుతుంటారు, విడిపోతుంటారు. అందరినీ గుర్తుపెట్టుకోవడం మనిషి బుద్ధికి సాధ్యపడదు. అయినా పర్లేదు. జీవితం నాటకరంగం. పాత్రధారులు ఆయా పాత్రలను పోషించింతర్వాత స్టేజు దిగి పోతుండాలి. అప్పుడే నాటకానికి అందము.చందమూ!

7 comments:

 1. ఆప్ కా షేక్షావలీ = హమారా ఉయ్ తాత! :)

  షుక్రియా!

  ReplyDelete
 2. Thanks for the nice post.. This makes me recall the memories of all those good loving anna,akka,maama,atta,avva etc.. from my village who though from other religions, never behaved as if they are different.. Thanks..

  ReplyDelete
 3. షేక్షావలి=ఆపేక్షావళి

  ReplyDelete
 4. చాలా బాగుందండీ, అని చెప్పడం కూడా పేలవంగా అనిపిస్తోంది. టాగూరు కాబూలీవాలా గుర్తొచ్చింది కొంచం.

  ReplyDelete
 5. ___________________________________

  మనిషులు మనకు రకరకాల స్టేజుల్లో తగులుతుంటారు, విడిపోతుంటారు. అందరినీ గుర్తుపెట్టుకోవడం మనిషి బుద్ధికి సాధ్యపడదు. అయినా పర్లేదు. జీవితం నాటకరంగం. పాత్రధారులు ఆయా పాత్రలను పోషించింతర్వాత స్టేజు దిగి పోతుండాలి. అప్పుడే నాటకానికి అందము.చందమూ!
  ___________________________________

  I don't have any words to appreciate the above sentences.

  ReplyDelete
 6. రానారె వీరబల్లె కతలు రాయడం మానేసిన కొరతని తీరుస్తున్నారు. చాలా బాగుంటున్నై.

  ReplyDelete
 7. చాలా బాగున్నది

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.