Thursday, November 25, 2010

రామాశాస్త్రి గారి భార్య

సత్యం దానమథాద్రోహ అనృశంస్యం త్రపా ఘృణా
తపశ్చ దృశ్యతే యత్ర స బ్రాహ్మణ ఇతీరితః - (మహాభారతం శాంతిపర్వం)

ఎవనిలో సత్యము, దానము, ఇతరులకు అపకారం చెయ్యకపోవడం, మృదుత్వం, సిగ్గు (ఎవరేమనుకుంటారో అన్న జంకు), జాలి, తపస్సు ఉంటాయో అతను బ్రాహ్మణుడు.

**********************************************************************************

"రాజమ్మా రెండు ఇడ్లీలు" - రామాశాస్త్రి మా ఇల్లు/హోటలు గుమ్మం దగ్గర వచ్చి అడిగేరు.
"ఇదిగోండి స్వామీ" ఓ పేపరు, ఆ పైన అరటి ఆకు అందులో వేడి వేడి ఇడ్లీలు, పల్చటి చట్నీ  మా అమ్మ ఆయనకు అందించింది. పొద్దున 8:30 గంటలవుతోంది. నేను అప్పుడే బడికి వెళ్ళడానికి ఆయత్తమవుతున్నాను. శాస్త్రి గారు, నన్ను చూసి పలకరింపుగా నవ్వారు.

పొద్దున బ్రాహ్మీముహూర్తంలో లేవగానే, మడితో భార్య అందించిన నీటి కడవను దేవళంలోనికి తీసుకువెళ్ళి, అభిషేకం చేసి, రుద్రమూ అదీ చదివి, రోజూవారి పూజలు నిర్వహించిన తరువాత దేవస్థానం పురోహితులు శాస్త్రి గారు మా చిన్న హోటలుకు వచ్చి అప్పుడప్పుడు టిఫిన్ తీసుకుంటుంటారు. శాస్త్రి గారి భార్యగారు (పేరు గుర్తు లేదు) కూడా తర్వాత నిదానంగా మా అమ్మ చేసే ఇడ్లీల కోసం రావడం కద్దు.  ఏదైనా పండగ పబ్బం ఉన్న రోజుల్లోనైతే - పూజ అయిపోయి భక్తులకు ప్రసాద వితరణ జరిగింతర్వాత మా ఇంటికి ప్రసాదం పట్టుకొచ్చి ఇచ్చేవారు శాస్త్రిగారు. ఆయన మర్చిపోతే ఆయన భార్య.

శాస్త్రి గారు సన్నగా ఉన్నా, చుఱుకుగా ఉండేవారు. కోలగా మానవల్లి రామకృష్ణకవి గారిలా ముఖవర్ఛస్సు. ఎప్పుడూ అడ్డపంచె, ఉత్తరీయం. షర్టు, పేంటులలో నేనాయన్ను చూసింది లేదు. శాస్త్రి గారి భార్య స్థూలకాయురాలు. కాస్త కష్టంగా నడిచేది. గుండ్రంగా, దయగా ఉన్న ముఖం, నవ్వుతున్న కళ్ళు. నిజానికి మా అమ్మలానే ఉండేది.

మా ఇంట్లో నాకూ, మా అన్నకూ కొబ్బరిపూర్ణం అంటే తెగ ఇది (ఇది = ఇష్టం + ఇంకాస్త). వినాయక చవితి రోజు - మా అమ్మ ఇంట్లో తమిళుల ఇళ్ళలో లాగా కొబ్బరిపూర్ణం బియ్యప్పిండి మధ్యలో పెట్టి ఆవిరి కుడుములు చేసేది. వీటికి తమిళభాషలో "కొఝకట్టై" అని పేరు.(మా అమ్మకు అన్ని దక్షిణభారతదేశ వంటలూ వచ్చు). ఇవి కజ్జికాయలు కావు. తెల్లగా చిన్న చిన్న ముద్దల లాగా అగుపిస్తాయి. (బొమ్మ చూడండి) అలాగే కారం కుడుములు కూడాను.సదరు కొబ్బరి పూర్ణం కుడుములు చేయడానికి కొబ్బెర - శాస్త్రిగారి ఆవిడే స్పాన్సరు మా అమ్మకు. మా అమ్మ కుడుములు చేసిన తర్వాత శాస్త్రిగారికి పంచడమూ ఒప్పందంలో భాగమే.

శాస్త్రి దంపతులకు పిల్లలు లేరు. అంచేత వాళ్ళ ఇంటికి ఏ పిల్లవాడు వెళ్ళినా, ఏదో ఒకటి దొరకబుచ్చుకోవడం రివాజు. కనీసం కొబ్బరి ముక్కయినా సరే. ఇక మా అమ్మకు, ఆవిడకు పులుసులు, కూరలు, పప్పుల మధ్య అండర్ స్టాండింగు కావలసినంత. ఏదైనా బావుందని అనిపిస్తే, ఆవిడ మా ఇంటికి ఓ గిన్నెలో తన వంట పంపడం, మా అమ్మ వాళ్ళింటికి పంపడం తెర వెనుక జరిగే ఆనవాయితీనే. పొరుగింటి కమ్మనైన కూర కాబట్టి నేనూ, మా అన్నా కూడా వాటికి ఎగబడ్డం మామూలే.

అలాగే మా ఇంట్లో ఏ వ్రతమో, అబ్ధీకమో వచ్చినా శాస్త్రి గారు రావలసిందే, పూజ జరిపించవలసిందే. మా అమ్మ వంట ఆయన రుచి చూడవలసిందే.

ఆ రోజుల్లో టీవీలు, అవీ లేవు కాబట్టి సాయంత్రం పూట తీరుబడిగా ఉంటే మా అమ్మా, ఆవిడా అలా మాట్లాడుకుంటూ ఉండడం, మా అమ్మ వాళ్ళింటి గుమ్మం దగ్గర ఉందన్న కారణంతో మేమక్కడకి వెళ్ళి, ఆ మిష మీద శాస్త్రి గారి ఇంట్లో ఏ కలకండో, కొబ్బరి ముక్కలో, పంచామృతమో కాజెయ్యడం అలవాటైన పని. శాస్త్రి గారు గుంభనంగా పిల్లలను చూసి నవ్వుకోవడమూ, ఆయనను చూసి ఆ ఇల్లాలు మురిసిపోవడమూ ఇవన్నీ - ఈ రోజు నీలి ఆకసంలో తేలియాడుతూ వెళ్ళే చిన్న చిన్న మేఘపు తునకల్లా గుర్తుకువచ్చే మధురమైన జ్ఞాపకాలు.

నాకు ఎనిమిదో ఏటననుకుంటాను. వడుగు చేయాలని నిశ్చయించారు మా తాతయ్య. ఓ శంకర జయంతి రోజు సార్వజనిక ఉపనయనాలు జరుగుతుంటే అందులో భాగంగా మాకు ఉపనయనం చేశారు. ఆ తంతు ముగిసిన తర్వాత వటువు నలుగురి వద్దా భిక్ష స్వీకరించాలి. ఆ రకంగా నాకు మొదటి భిక్ష శాస్త్రి గారి భార్య పెట్టారు.

జీవితంలో అన్నీ సౌమ్యంగా, ఆహ్లాదంగా జరిగితే అది జీవితమెలా అవుతుంది? శాస్త్రి గారి జీవితంలో అతిపెద్ద విషాదం అనుకోకుండా జరిగింది. ఏదో పండుగకోసం దేవళాన్ని శుభ్రం చేస్తూ, సున్నం అదీ తనే స్వయంగా కొడుతున్నారు. వాళ్ళావిడ ఆయనకు ఏదో సహాయం చేస్తున్నారు. ఇంతలో ఆమె కుర్చీలోంచి జారిపడ్డదట. పెద్దగా దెబ్బలవీ తగల్లేదు కానీ, ఎంచేతో ఏమో - "రేపట్నుంచి నేను మీకు ఏమీ చేయలేను" అని అన్నారట ఆవిడ శాస్త్రి గారితో. ఆ మాట పొల్లుపోకుండా జరిగింది.

మరుసటి రోజు ఉదయం ఆవిడ స్నానం చేయడానికి మా ఊరి కెనాలు (కాలువ) వద్దకెళ్ళింది. కాస్తంత ప్రశాంతంగా స్నానం చేద్దామని జనం తక్కువగా ఉన్నచోటికి వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో, ఏమో ఎవరూ చూడలేదు. కాసేపటి తర్వాత ఆమె రాకపోతే ఖంగారుపడి శాస్త్రిగారు చూద్దురు కదా, గట్టు మీద ఆమె ఉంచిన పొడిచీర మాత్రం కనిపించింది. ఇంతలో జనం వచ్చారు. అందులో ఒకరిద్దరు నీళ్ళలో వెతికారు. దొరక్కపోతే కాస్త బాగా ఈత వచ్చిన సంజీవులు వచ్చాడు. ఆమె శవం దాదాపు మూడు కిలోమూటర్ల దూరంలో నీళ్ళలో దొరికింది.

మరణానికి సరిగ్గా ఒక్క రోజు ముందు చాలామందికి తమ మరణం రేపేనని తెలుస్తుందట. ఇది ఆమె విషయంలో ఋజువయ్యింది. (మా తాతయ్య, అమ్మగార్ల విషయంలోనూ ఇది జరిగింది).

ఆ తర్వాత శాస్త్రి గారు గుడి పౌరోహిత్యం మానివేశారు. మరోచోట ఉంటూ కాలం వెళ్ళదీశారు. అప్పుడప్పుడూ మమ్మల్ని చూసినప్పుడు మొహమాటం, పలకరింపు కలిగిన నవ్వు ఒకటి విరిసేది.

కొన్నేళ్ళ క్రితం మా ఇంట్లో ఆయన గురించి అడిగితే, ఆయన పోయాడని, అనాయాసంగా అరగంటలో ప్రాణం విడిచారని విన్నాను. ఒకరి మీద మరొకరికి అంత గొప్ప అనురాగం, అప్యాయతా ఉన్న దంపతులను, దాంపత్యాన్ని, తను నడివయసులో ఉన్నప్పటికీ భార్య పోయిన తర్వాత విరాగి అయి, అత్యంత సాధారణమైన జీవితం గడిపిన భర్తనూ నేను మరెక్కడా చూడలేదు, ఈ రోజు వరకూ.

ఇప్పుడూ ఏదో తెలియని లోకంలో - శాస్త్రిగారి భార్యా, మా అమ్మా ముచ్చట్లాడుకుంటూ ఉంటారు. శాస్త్రి గారు వడివడిగా తనదైన నడకతో అక్కడికొస్తారు. మా అమ్మ లేవబోతే, "కూర్చో రాజమ్మా" అని ఇంట్లో ఏ కర్పూరమూ తీసుకొని అక్కడినుండి నిష్క్రమిస్తారు! ఆ ఇల్లాలు నవ్వుముఖంతో లోపలికెళ్ళి ఏ కొబ్బరి ముక్కో, కలకండో, ఎండిన ఖర్జూరం ముక్కో తీసుకొచ్చి మా అమ్మ చేతిలో పెడుతుంది! ఆ కలకండ తాలూకు తీపి, ఇలా మధురమైన జ్ఞాపకంగా నన్ను పలుకరిస్తుంది!

24 comments:

 1. వరసగా ఆర్దృమైన సంఘటనల సమాహారం గుదిగుచ్చాలని అనుకున్నారా? ఒక్కొక్కటీ జ్ఞాపకాల పూల బుట్ట లోంచి బయటికి తీస్తున్నారు?

  చాలా చాలా బాగా రాశారు. ఇంక ఏమి చెప్పాలో తెలీడం లేదు.ఇలాంటి పరిచయాలు, స్నేహాలు ఇవన్నీ ఇకపై జ్ఞాపకాల్లో మాత్రమే తల్చుకోగలం!

  చదువుతుంటే మాలతి గారి కథల అత్తయ్య గారు గుర్తొచ్చింది.

  ReplyDelete
 2. మీరు ప్రత్యేకం అత్మకధఏమీ వేయనక్కరలేదు.
  మీ బ్లాగులో టపాలను యథాతథంగా ఎత్తుకెళ్లి ప్రచురించి నేనే అమ్మేస్తాను.

  ReplyDelete
 3. హ్మ్.. చాలా బాగా రాశారు. చదువుతూ ఉన్నంతసేపు మనసులో ఏదో మూల బాధ. ధన్యవాదాలు పంచుకున్నందుకు.

  ReplyDelete
 4. అద్భుతంగా వ్రాస్తున్నారు మీ జ్ఞాపకాలను! ’కోతికొమ్మచ్చి’కి ఏమాత్రం తీసిపోయేటట్లు లేదు మీ ఆత్మకథ. చివరి పేరా కిరీటంలో కలికితురాయి!

  ReplyDelete
 5. రామాశాస్త్రి దంపతుల ఆశీస్సులు పొందిన మీరు అదృష్టవంతులు,అలాంటి మహానుభావులు అరుదు.కన్నులు చెమ్మగిల్లాయి.

  ReplyDelete
 6. Brilliant narration!

  ReplyDelete
 7. అలా శ్లోకంతో మొదలుపెట్టిన తీరు, చెప్పిన విధానం అన్నీ నాకు తిరుమల రామచంద్రగారిని గుర్తుచేసాయి!

  "కొఝకట్టై" తమిళులకి ప్రత్యేకం అని చెప్పలేం. మేం కూడా చేసుకుంటాం (అంటే మా అమ్మ చేస్తుంది), వినాయకచవితినాడే. మేం వాటిని "జిల్లేడుకాయ"లంటాం. ఆకారంలో మాత్రం కొద్దిగా తేడా ఉంటుంది - కజ్జికాయల ఆకారం. తమిళులు దానిలో నూలుపప్పు కూడా వేస్తారు. మేం వెయ్యం.

  ReplyDelete
 8. @కామేశ్వరరావు గారు: అవును. మీరన్న జిల్లేడుకాయలు (ఈ పేరు నాకు తెలియదు, అయితే వంటం తెలుసు) ఆకారం కజ్జికాయల రూపంలో ఉంటుంది.

  ఈ కజ్జికాయల షేపు ఎవరు కనిపెట్టారో తెలియదు కానీ, చైనాలోనూ ఇదే ఆకారంలో ఓ వంటకం ఉంది. పేరు -సాంఝుప్సాన్.(లోపల పూర్ణం మాత్రం ఉండదు. బదులుగా...ఎందుకులెండి? :))

  మీరనే నూలుపప్పు వెళ్ళ కొఝకట్టై. ఇవి, మొదటివి 21 చొప్పున చేసి వినాయకుడి నైవేద్యం పెడతారు.

  @సుజాత గారు: ఆ కథల పుస్తకం గురించి మీరే పరిచయం చేయండి.
  @వూకదంపుడు: ఆ పని చేసి, ఏదైనా వస్తే నాకు కాస్త పంచండి.
  @రాజేష్ గారు: ఈ టపా రాయడానికి నాలుగు రోజులు సందేహించాను. చివరికి నాకోసం వ్రాసుకున్నాను.
  @చంద్రమోహన్ గారు: వైవిధ్యాలు, వైరుధ్యాలు ఎవరి జీవితంలో మట్టుకు లేవు? - ఇది తిరుమల రామచంద్ర గారి మాట. నా మాటానూ. ఇవి ఏవో లొల్లాయి కబుర్లేనండి, ఏదో కాలక్షేపానికి. బాపూరమణలతో పోల్చేంత లేదులెండి.
  @కొత్తపాళి గారు, @ఫణిబాబు గారు: Thank you.
  @విజయమోహన్ గారు: వీళ్ళంతా సాధారణమైన వ్యక్తులు. అయితే అసాధారణమైన వ్యక్తిత్వం. ఇలాంటిదే మరో వృద్ధ తమిళుల జంటతో నాకు అనుబంధం ఉంది. ఆ కథ కూడా ఎప్పుడైనా రాస్తాను.

  ReplyDelete
 9. రవి గారు అద్బుతం ! నాకు మీరు రాసే ఇలాంటి జ్ఞాపకాలు చదివినప్పుడల్లా " మనసు చెమ్మగిల్లుతుంది" అంటారు కదా అని ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది

  ReplyDelete
 10. చాలా బాగుంది. ఇవన్నీ రాబోయే ఓ పుస్తకంలోని పేజీలే. నాకైతే సందేహం లేదు. ఇంకా కొనసాగించండి. మీ జ్ఞాపకాల టపాల కోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తూ ఉంటాం.

  మా ఇంట్లోనూ జిల్లేడుకాయలు ప్రతీ వినాయకచవితికీ తప్పనిసరి.

  ReplyDelete
 11. మీరు చెప్పిన వంటకాన్ని మా ఇంట్లో కూడా చేస్తారు. పూర్ణం కుడుములు అంటాం మేము...

  ReplyDelete
 12. మీ జ్ఞాపకాల వీచిక చాలా బాగున్నది. నేనూ అందరితో ఏకీభవిస్తున్నా... మీ ఆత్మకథ పూర్తిగా చదవటానికి ఆట్టే సమయం వేచిఉండక్కర్లేదని నా విశ్వాసం....

  ReplyDelete
 13. రవిగారు చాలా చాలా బాగారాస్తున్నారు. మనసును కదిలించే ఙ్ఞాపకాలను అంతకన్నా ఆర్ధ్రంగా మాకళ్ళముందు ఆవిష్కరిస్తున్నారు.

  ReplyDelete
 14. చాలా బాగారాశారు రవిగారు. మేము కూడా కజ్జికాయాలు లాంటి జిల్లేడుకాయలు చేసుకునే వాళ్లం, చిన్నప్పుడు.

  మానాన్న గారు చనిపోయే నాలుగు రోజుల ముందు నన్ను మా చెల్లిని "నేను పోతే ఏమి చేస్తార్రా? " అని ప్రశ్నించారు. మా స్పందనకు ధైర్యాన్ని చెప్పారు. అదినాకు ఈ రోజుకీ ఓ విచిత్రమే!

  ReplyDelete
 15. చాలా బాగా రాసారు. ఒక చిన్న కథకు సరిపడా కథా వస్తువు ఇందులోఉంది. అభినందనలు.

  ReplyDelete
 16. చాలా బాగా రాశారండి. ముఖ్యంగా చివరి పేరా చదివాక కాసేపు మనసు మూగబోయింది.

  ReplyDelete
 17. చాలా బావుంది, చివరిమాట ఇంకా బావుంది. నాకెందుకో శ్రీ రమణ రాసిన మిధునం గుర్తొచ్చింది.

  కొఝకట్టై ని మనం తెలుగులో జిల్లుడుకాయలు అంటామండీ. ఆ వంట తమిళులకి మాత్రమే పరిమితం కాదు. వినాయకచవితి రోజు జిల్లుడుకాయలు చేసుకోకుండా పండుగ జరగదు కదా.

  ReplyDelete
 18. చాలా బాగుంది రవి గారు.. శ్రావ్య గారు చెప్పినట్టు " నాకు మీరు రాసే ఇలాంటి జ్ఞాపకాలు చదివినప్పుడల్లా " మనసు చెమ్మగిల్లుతుంది" అంటారు కదా అని ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది" నాది కూడా same ఫీలింగ్..
  మీ పోస్ట్ లలో నచ్చినవి చాలా ఉన్నా," చెట్టు - మనిషి - దేవుడు" నాకు చాలా ఇష్టమైన పోస్ట్..ఎన్నో సార్లు చదివాను.. అంత గొప్పగా ఉంది ఈ పోస్ట్..

  ReplyDelete
 19. చాలా చాలా బాగా రాసారు. చివరిపేరా చదివి కాసేపు అలా ఉండిపొయాను.

  ReplyDelete
 20. midhunam malla chadivinattu anipinchindi ... chala chala baga rasaru .... aa kudumulu aa shape lo elavastayabba... maa intlo vatni almost kodiguddu type lo chestaru ...

  ReplyDelete
 21. chaala bagundi nannu naa chinna tanapu gyapakalaloniki teesikellaru
  kruthagyathalu

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.