Friday, November 19, 2010

పుష్పక విమానం

.. ఆ సినిమా గుర్తుందా? సింగీతం శ్రీనివాసరావు, కమల్ హాసన్ ల కాంబినేషన్లో మాటలు లేని సినిమా. ఇప్పుడు వచ్చే మాటల సినిమాలకన్నా వేయిరెట్లు అర్థవంతమైన సినిమా కదూ! ఆ సినిమాలో పీ.ఎల్.నారాయణ ఓ బిచ్చగాడు. కమల్ ఓ రోజు అతని ఎదురుగా నిలబడి రుపాయ కాయిన్ అలా అలవోకగా తిప్పుతుంటాడు. నా దగ్గర డబ్బుంది చూడు అన్నట్టు. అప్పుడు బిచ్చగాడు తన చొక్కామడతల్లోంచి, చిరిగిన జేబులోంచి, నడుము దగ్గర పేంటు మడతలోంచి ఒక్కోనోటు చూపిస్తూ, చిరిగిన తన బొంత మరుగున నోట్ల కట్టలు చూపిస్తాడు. విస్తుపోవడం కమల్ వంతు. నిజమైన బిచ్చగాడు తనేగా అనుకుంటాడు.

ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి తన రోజు కాకపోయినా, తన క్షణాలైనా వస్తాయని చెబుతున్నట్టు ఉంటుంది. ఈ రోజు డీవీడీ చూస్తూంటే నాకు మర్చిపోయిన మిత్రుడు కణ్ణన్ గుర్తొచ్చాడు. నిరుద్యోగిగా నా జ్ఞాపకాలూ గుర్తొచ్చాయ్.

పదేళ్ళ ముందుమాట. ఆ రోజుల్లో నేను సాఫ్టువేరు నేర్చిన నిరుద్యోగిని. నా రూమ్మేట్ కణ్ణన్ - ఓ చిరుద్యోగి. అతడి ఉద్యోగం - హోటల్ పుష్పక్ - అదేనండి బెంగళూరు విండ్సర్ మేనర్ (ఆ సినిమాలో కనబడే హోటలదే) అనబడే ఐదుచుక్కల పూటకూళ్ళ ఇంట్లో రూమ్ బాయ్ గా.

************************************************************

బెంగళూరు యశ్వంతపురా లో ఒకానొక నిరుద్యోగుల భవనంలో నేనూ కణ్ణనూ రూం మేట్లు. మాకు తోడుగా, నల్లులు, హాస్టలు వాడు సప్లై చేసిన బెడ్డూ, దానిపైన అసహ్యమైన బెడ్ షీటూ తోడు. అలాగే అనేకమైన కబుర్లూ, స్వాతి వారపత్రికలో డబ్బా న్యూసు (అదేనండి బాక్స్ ఐటమ్) లాంటి మసాలా కబుర్లూ, వెకిలి నవ్వులూ రాత్రి పదకొండు వరకూ హస్కూ - ఇలా జీవితాన్ని అనుభవిస్తున్న రోజులు.

అప్పుడు నేను నిక్షేపం లాంటి ఇంజినీరు ఉద్యోగం మానుకొని, సాఫ్టు వేరు నేర్చుకుని మృదులాంత్ర ఉద్యోగవేటలో ఉన్నాను. నాతో భావసారూప్యం కలిగిన వాళ్ళు - తాతబ్బాయ్, శ్రీధరు, చంద్రమోహన్ (CM), కిశోర్ ఇలా ఓ గేంగు. అందరిదీ ఒకే ఆశయం. సాఫ్టువేరు ఉద్యోగం సంపాదించాలి. యే అమెరికాకో వెళ్ళిపోయి, ’అనుభవించు రాజా...’ అని పాటేసుకోవాలి. ఆ సదాశయప్రాప్తికి మేమంతా తపిస్తూ ఒకచోట చేరగా - నాకు రూమ్మేటుగా కణ్ణన్ వచ్చాడు.

కణ్ణన్ కన్యాకుమారి నుండి వచ్చాడు. పొట్టచీలిస్తే ఇంగ్లీషు అక్షరం ముక్క లేదు. తమిళం మాత్రమే వచ్చు. అట్లాగే డబ్బులూ లేవు. నాన్న డ్రైవర్ అట. డ్రైవర్ పనికి పోతానంటే వద్దని బెంగళూరికి తరిమాడట. పల్లెటూరి వాడు కాబట్టి - విజయకాంత్ లా నల్లగా నిగనిగలాడే దేహఛాయ, కాయవాటు శరీరం. లా చదువుతాడట. సాయంకాలం కాలేజీలో. బెంగళూరికి వస్తూనే ఎవరిని పట్టాడో, ఎలా పట్టాడో తెలీదు, ఓ చిరుద్యోగం సంపాదించాడు. ఆ ఉద్యోగం - ఇందాకే చెప్పానుగా.

ఉద్యోగంలో చేరిన మొదటి రోజు పార్టీ ఇచ్చాడు, నాకూ మరో అబ్బాయికి మాత్రమే. పార్టీ ఐటమ్సు ఏవంటే - నేతిలో వేయించిన ముంతపప్పు, వేరుశనగ పలుకులు, ఫ్రూట్సు కొన్ని ఇలా. పార్టీ బావుంది సరే, ఆ తర్వాత కూడా అప్పుడప్పుడూ వాడి టేబుల్ మీద ఫ్రూట్సూ, ఇలాంటి రసభరితమైన ఐటమ్స్ కనబడేవి. ఆ సీక్రెట్ విప్పాడు ఓ రోజు. అవన్నీ అతను పనిచేసే హోటల్ లో రూములో అతిథులు ఓపన్ చేయకుండా వదిలేసిన ఐటమ్స్. వాటిని అలా పట్టుకొచ్చే వాడు.

కణ్ణన్ నాతో ఇంగిలీషు చెప్పించుకునే వాడు. బ్రదర్ అంటే నాగరికంగా ఉంటుందని, అలానే పిలిచేవాడు. అతని దృష్టిలో నేనో చిన్నసైజు మేధావి. నా బతుకేమో, కమల్ హాసన్ బతుకు. ఉన్న కొన్ని డబ్బులు ఎన్ని రోజులొస్తాయో, ఆ తర్వాత ఎలా గడపాలో, బంధువుల్లో ఎవరికి పాగా వెయ్యాలో, ఉద్యోగం ఎప్పుడొస్తుందో, ఇలా ఏదీ తెలియని పరిస్థితి.

కణ్ణన్ - ఆ రోజు ఓ డబ్బా న్యూస్ మోసుకొచ్చాడు. విండ్సర్ మేనర్ లో కమల్ హాసను, ఓ కొత్తమ్మాయి, కలిసి వచ్చార్ట. ఆ కొత్తమ్మాయి ’భలే’ ఉందట. అదృష్టవశాత్తూ కమలూ, ఆ అమ్మాయి ఎక్కిన లిఫ్టులోనే వీడు ఎక్కాడట. ఇంతలో ఎవడో అదే లిఫ్టులో ఎక్కి కమల్ పక్కనున్న కొత్త హీరోవినుతో వేషాలెయ్యబోతే, కమల్ లిఫ్టు ఆపి, ’త్రో హిమ్ అవుడ్’ అని అరుస్తూ, బయటికి గెంటాడట. ఇది అతను బుర్రకథలా నాకూ, మరొకతనికి చెపుతూ ఉంటే, మేము మధ్యలో ఆగా, ఓగో (తమిళంలో అలానే అంటారు) లతో రాత్రి పదిన్నర వరకు పరవశించాము.

ఆ న్యూసును నేను కాకిలా నా ఇంకో వృత్తం (సర్కిలు) మిత్రుల దగ్గరకు మోశాను. ఆ పరమసత్యాన్ని వాళ్ళూ ధృవీకరించారు. ఎందుకంటే, కమల్ నటించిన ’హే రామ్’ సినిమా ఆడియో ఫంక్షను ఉందని వాళ్ళకు అభిజ్ఞవర్గాల భోగట్టా దొరికింది. హేరామ్ సినిమాలో హీరోవిను కొత్తామె. ఆ డీటైల్ కూడా కణ్ణన్ న్యూస్ తో సరిపోతూంది. బిగ్రేడు... కాదు బ్రిగేడు రోడ్డులో అదేదో కాసెట్ల దుకాణంలో ఆ ఫంక్షను.

మరుసటి రోజు - నా దగ్గరున్న రూముతాళం పోగొట్టుకో(బడ)డంతో, విండ్సర్ మేనర్ హోటల్ కు నేనూ, ఇంకొకడూ ముందుగా ఫోను చేసి వెళ్ళాం. కమలూ, కొత్తమ్మాయి కనిపిస్తారేమోనన్న ఆశతో ఓ అరగంట పైగా చూశాం, కణ్ణన్ వెళ్ళిపొమ్మని, తనకు అడ్డవుతుందని బతిమాలుతున్నా వినకుండా. ఊహూ. అన్ సక్సెస్. తర్వాత శనివారం - ఒకానొక వాకిన్ ఇంటర్వ్యూలో హెచ్ ఆర్ వారి ద్వారా ’గెట్ బాక్ టు యు’ అని గెంటించుకుని, బిగ్రేడు రోడ్డుకు దారితీసింది మా మిత్రబృందం. అక్కడ హేరాం ఆడియో రిలీజు. అదుగో అక్కడ వసుంధరాదాస్ అనబడే ఆ అమ్మాయి దర్శనం విజయవంతంగా ముగించాం. అప్పుడావిడ జీన్సుపాంటు వేసుకుంది. సినిమాలో చూస్తే ఆమేనా అనిపించింది.

రోజులిలా గడుస్తుంటే, నా దగ్గర డబ్బులైపోయాయ్. అప్పుడో రోజు కణ్ణన్ ను అడిగేన్నేను - నాకు ఓ చిన్న ఉద్యోగం దొరుకుతుందా అని? ఏ కళనున్నాడో - బ్రదర్ నువ్వు బాగా చదువుకున్నావు. అట్ల చదువుకుంటే ఉద్యోగాలివ్వరు. టెన్త్ వరకు మాత్రమే చదివానని చెప్పు. నేను ప్రయత్నిస్తానన్నాడు. అలా రెండువారాలు గడిచాయ్. కణ్ణనూ ఎవరినో పట్టాలని చూస్తున్నాడు, ఆ వ్యక్తి దొరకలేదు.

సరిగ్గా అప్పుడే - నాకు సాఫ్టువేరు ఉద్యోగం వచ్చింది. హాయిగా విండ్సర్ మేనర్ లో రకరకాల హీరో, హీరోవిన్లను చూసే అదృష్టం పోయింది. సరే, ఉద్యోగంలో చేరాను, కానీ ఆ నెల గడవడానికి డబ్బు లేదుగా. అందుకు కణ్ణన్ దగ్గర ఆరొందలు అప్పుచేశాను. నెల తిరిగిన తర్వాత కణ్ణన్ కు ఆరొందలతో బాటు, వేయించిన వేరుశనగలు, ముంతపప్పు, వాటికి కాంట్రంస్టింగ్ సరుకు, వగైరాలతో ఓ చిన్నసైజు హోటల్లో ఘనమైన పార్టీ కూడా ఇచ్చా. ఆ తర్వాత కొన్ని రోజులకే మకాం మార్చాను. తర్వాత కణ్ణన్ కనిపించలేదు. ఇప్పుడెక్కడున్నాడో?

************************************************************

ఆ తర్వాత నాకూ రెండేళ్ళక్రితం ’ఇంటర్ కాంటినెంటల్ మిడ్ ప్లాజా’ అనబడే ఐదుచుక్కల పూటకూళ్ళ ఇంట్లో, తొమ్మిదవ అంతస్తులో, జకార్తా అనబడే ఓ నగరంలో ఓ నెలరోజులు గడిపే అవకాశం వచ్చింది.

************************************************************

ఈ రోజు పుష్పక్ సినిమా లాప్ టాపులో చూస్తుంటే గుర్తొస్తున్నాడు. ఈ సినిమా షూటింగు విండ్సర్ మేనర్ లో జరిగిందని తెలిస్తే ఎలా ఎక్సైట్ అయేవాడో!

************************************************************

16 comments:

 1. చాలా బాగా రాశారండీ. జ్ఞాపకాలు ఆర్ద్రంగా ఉన్నాయి.

  ReplyDelete
 2. "డబ్బా న్యూసు (అదేనండి బాక్స్ ఐటమ్)" - హహహ! భలే అనువాదం!

  మీకు ఆత్మకథ రాయడానికి సరిపడా జీవితానుభవాలు, రాయగల నేర్పూ ఉన్నాయని మరో సారి రుజువయ్యింది. మీరింకా "పెద్ద"య్యాక తప్పక ఆత్మకథ రాసి, అందులో నాకొక పేజీ కేటాయిస్తే చదివి ఆనందించాలని చాలా ఆశగా ఉంది. :-)

  ReplyDelete
 3. కామేశ్వరరావు గారి వ్యాఖ్యతో ఏకీభవిస్తాను
  మీ ఆత్మకథలో నాకు పేజీ కాకపోయినా ఒక లైనైనా కేటాయించాలని మనవి :)

  ReplyDelete
 4. చాలా బాగుంది రవిగారు. ప్రతి లైన్, ప్రతి పేరా నచ్చింది నాకు.. చాలా కాలానికి నా మట్టిబుర్ర కి అర్ధమయ్యే టపా రాసారు..:) :) మీ బ్లాగ్ లో పేరడి పాటలు, కామెడీ పోస్ట్లు పడి చాలా కాలం అయ్యింది కదండీ..! :) :).

  నిజంగా మీ జ్ఞాపకాలు ఆర్ద్రంగా ఉన్నాయి

  ReplyDelete
 5. హ్మ్ అనుభవించేప్పుడు కాస్త కష్టంగా అనిపించినా ఇలాంటివి మరిచిపోలేని అనుభూతులు రవిగారు. టపా బాగుంది ఇపుడర్జంట్ గా ఈ సినిమా చూడాలనిపిస్తుంది. ఆ బిచ్చగాడు చనిపోయిన తర్వాత దృశ్యం కూడా మనసును కదిలిస్తుంది.

  ReplyDelete
 6. చాలా బాగా రాసారు రవిగారు.....
  very nice.

  ReplyDelete
 7. రవి గారు సూపర్బ్ !

  ReplyDelete
 8. అయినా ఇదేం బాగాలేదు రవీ! ఎంత మృదులాంత్ర ఉద్యోగం వస్తే మాత్రం కష్టాల్లో ఉన్నప్పుడు తోడున్న మిత్రున్ని మరచిపోవడమే!సాప్టువేర్ల మనస్సు హార్డువేరంటూ అంటూ ఉంటారు అది నిజమేనా!
  సరదాకన్నానుగానీ మనసులో పెట్టుకోకే!

  ReplyDelete
 9. "ఒకానొక వాకిన్ ఇంటర్వ్యూలో హెచ్ ఆర్ వారి ద్వారా ’గెట్ బాక్ టు యు’ అని గెంటించుకుని"

  Haha! చాలా బాగుంది :)

  ReplyDelete
 10. టపా చదువుతున్నట్లు లేదు. ఏదో ఒక సినిమా చూస్తున్నట్లు అనిపించింది.విజువలైజ్ చేసుకుంటూ చదవడం వల్ల కావొచ్చు! ఇంతకీ కణ్ణన్ ఎక్కడున్నాడో ఇప్పటికీ తెలీలేదా? అంత మంచి ఫ్రెండ్ కాంటాక్ట్ వివరాలు తీసుకోకుండా ఎలా వదిలేస్తారండీ అసలు?

  ReplyDelete
 11. వసుందరా దాస్ ని చూసారా..hmm మీ కణ్ణన్ మళ్ళీ తప్పక కలుస్తాడు రవిగారు ..చాలా బాగారాసారు

  ReplyDelete
 12. @మురళి గారు: హాస్యంగా రాద్దామనుకున్నాను. ఆర్ద్రంగా వచ్చింది. :-)
  @కామేశ్వర రావు గారు, సుబ్రహ్మణ్యం గారు: ఓ అగ్రిమెంటు పెట్టుకుందాం. మనం ముగ్గురం ఆత్మ కథలు ’రాసు’ కుందాం. ఎవరి కథలో వాళ్ళు ఇతరుల గురించి రాస్తారు. ఇది మన ఒప్పందం. సరేనా? :))
  @వేణూరాం: ఇంకా చాలా లిస్టు ఉందండి. ఓ రకంగా రానారె స్ఫూర్తి. ఇవి రాసుకోడానికి.ఎబ్బెట్టుగా అనిపించినా రాస్తున్నాను. బాగుందనడం మీ సౌజన్యం మాత్రమే.
  @sujata: Thank you.
  @వేణూశ్రీకాంత్: అవును. నిజం చెప్పారు. పుష్పక విమానం తప్పక ఉండవలసిన కలెక్షన్.
  @మంచు, @శ్రావ్య: Thank you.
  @విజయమోహన్ గారు: సరదాకు చెప్పినా, నిజమే చెప్పారు.సాఫ్టువేరు సంగతేమో కానీ, నేను కాస్త మెటీరియలిస్టునే.
  @కొత్తపాళీ: Its mysterious, if we imagine sometimes.
  @RK: Till today, I don't why they say 'get back to you' if their intention is opposite. :))
  @సుజాత గారు: మీరు, విజయమోహన్ గారు మామూలుగా అన్నా, అది ఒక మంచి సబ్జెక్ట్. ఎంతకాలం గుర్తుంచుకోగలుగుతాం? గుర్తుండడం, గుర్తుంచుకోవడం రెండూ వేరని నా ఉద్దేశ్యం. మళ్ళెప్పుడైనా తీరిగ్గా మాట్లాడుకుందాం.
  @నేస్తం: జెలసీ ఫీలవుతున్నారా? :))

  ReplyDelete
 13. చాలా బాగా రాశారండీ. జ్ఞాపకాలు ఆర్ద్రంగా ఉన్నాయి.
  డబ్బా న్యూసు (అదేనండి బాక్స్ ఐటమ్)" - హహహ! భలే అనువాదం!
  చాలా బాగా రాసారు రవిగారు.....
  రవి గారు సూపర్బ్ !

  ReplyDelete
 14. వేయించిన వేరుశనగలు, ముంతపప్పు, వాటికి కాంట్రంస్టింగ్ సరుకు, వగైరాలతో ఓ చిన్నసైజు హోటల్లో ఘనమైన పార్టీ కూడా ఇచ్చా.

  chaalaa baagundi mee sveeyanubhava varnana.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.