Tuesday, August 31, 2010

సవర్ణదీర్ఘ సంధి for dummies!

తెలుగులో మౌలికాంశం ఒకటి తెలీకండానే ఇన్నిరోజులు బతికేశానని నిన్న తెలిసింది. అదీ సంస్కృత వ్యాకరణం చదువుతుంటే. ఈ కథాకమామీషు ఇది.

చిన్నప్పుడెపుడో తెలుగు టీచరమ్మ సవర్ణదీర్ఘసంధి చెబితే ఊకొట్టాం, ఆ సూత్రం నిర్వచనం ఇలా ఉంటుంది.

అ - ఇ - ఉ - ఋ లకు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును. (ఈ సూత్రం వికీపీడియాలో కొట్టుకురాబడినది)

బానే ఉంది, సవర్ణాలంటే? దీనివెనుక ఓ పెద్ద కథ. ఆ కథ కోసం సంస్కృతానికెళ్ళాలి.

**********************************************************************************

సూత్రము: తుల్యాస్య ప్రయత్నం సవర్ణమ్. (౧-౧-౯)

స్థానము, (అభ్యంతర) ప్రయత్నము ఈ రెండునూ ఏ వర్ణమునకు మరే వర్ణముతో తుల్యముగా నుండునో అవి రెండును ఒకదానికొకటి సవర్ణములనబడును.

స్థానము: అర్థమును చెప్పాలన్న బుద్ధి మనస్సును చేరుతుంది. ఆ మనస్సు శరీరంలో అగ్నిని (energy) ని ప్రజ్వలింపజేస్తుంది. ఆ అగ్ని వాయువును ప్రేరేపిస్తే, ఆ వాయువు తగిన ముఖావయవానికి తాకడంతో ధ్వని ఉత్పన్నమవుతుంది. ఏయే స్థానంలో వాయువు తాకితే ఏ శబ్దం వస్తుందో ఈ లంకెలో వివరంగా చెప్పారు.

ప్రయత్నం: కేవలం ఆకాంక్ష ఉంటే సరిపోదుగా, ప్రయత్నం కూడా కావాలి. అంటే "ప" అనే అక్షరం పలుకాలంటే రెండు పెదవులు కలువడం, విడివడడం అన్న క్రియాజాతము జరుగాలి. దాన్నే యత్నము అంటారు. అధికమైన యత్నం - ప్రయత్నం. ఇవి రెండు రకాలు. అభ్యంతర ప్రయత్నం, బాహ్య ప్రయత్నం. బాహ్య ప్రయత్నం ప్రసక్తి సవర్ణనిర్ణయంలో లేదు.

అభ్యంతర ప్రయత్నం, స్పృష్టము (పూర్తిగా స్పర్శించుట),ఈషత్ స్పృష్టము (కొంచెము స్పర్శించుట),వివృతము (విడివడుట), ఈషద్వివృతము (కొంచెము విడివడుట), సంవృతము అని ఐదు రకాలు.

స్థానము, ప్రయత్నము రెండూ కలిసిన వర్ణాలే సవర్ణాలు. స్థానమొక్కటీ, లేదా ప్రయత్నమొక్కటీ కలిస్తే లాభం లేదు. ఉదా: "ప", "ఫ" సవర్ణాలు.

**********************************************************************************

ఇప్పుడు మళ్ళీ సంధికొద్దాం.

అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమగుచో - అంటున్నాడు. మనం "అ" ఒక్కటి తీసుకుని సూత్రం ప్రతిక్షేపిద్దాం. "అ" కు సవర్ణాలు వెతకాలి.

"అ" కు సవర్ణం అంటే,
౧. "అ" అనే ధ్వని ఎక్కడ పుడుతుందో, అక్కడే సదరు సవర్ణమూ పుట్టి ఉండాలి.
౨. ఆ ధ్వని పుట్టడానికి జరిగిన ప్రయత్నం సవర్ణానికి కూడా వర్తించాలి.

"అ" అనే ధ్వని కంఠంలో పుడుతుంది. (అకుహ విసర్జనీయానాం కణ్ఠః)

ఇంకా కంఠంలో పుట్టేవి, "అ","ఆ", "హ", "హా", మరియు "క" . వీటిని రెండవ సూత్రంలో ప్రతిక్షేపిద్దాం.
(అంత అవసరం లేదు నిజానికి. ఎందుకంటే, సవర్ణదీర్ఘసంధి అచ్చులకు మాత్రమే అని చెప్పబడియున్నది. కానీ కొంత సరదా కూడా తీర్చుకుందాం.)

ఈ క్రింది పట్టిక చూడుడి.
వర్ణము - అభ్యంతర ప్రయత్నము
అ - వివృతము
ఆ - వివృతము
హ - ఈషద్వివృతము
హా - ఈషద్వివృతము
క - స్పృష్టము

అంటే "హ" కు "అ", "ఆ" లకు అభ్యంతర ప్రయత్నం తేడా ఉంది కాబట్టి, సవర్ణం అనే పొత్తు కుదరదు. అంచేత "అ", కు "అ", "ఆ" మాత్రమే సవర్ణాలు.

ఉదా:
దైత్యారి = దైత్య+అరి
విశ్వాత్మ = విశ్వ + ఆత్మ
చంద్రాస్య = చంద్ర + ఆస్య

ఇలానే మిగిలిన అచ్చులకూ సవర్ణాలు తెలుసుకోవచ్చు.

ఏ ధ్వని ఏ స్థానంలో పుట్టిందో గుర్తుపెట్టుకోడానికో శ్లోకం పాణిని చెప్పారు.

అకుహ విసర్జనీయానాం కణ్ఠః
ఇచుయశానాం తాలుః
ఋటురషాణాం మూర్ధా
ఌతులసానాం దన్తాః
ఉపూప్ధ్మానీయా నామోష్టౌ
ఞ మ ఙ ణ నానాం నాసికాచ
ఏదైతో కణ్ఠతాలుః
ఓదౌతోః కణ్ఠోష్టం
వకారస్య దంతోష్టం
జిహ్వమూలీయస్య జిహ్వమూలమ్
నాసికా2నుస్వరస్య.


ఇక అభ్యంతర ప్రయత్నాలను చూద్దాం

అ, ఇ, ఉ, ఋ, ఌ, ౡ, ఏ, ఓ, ఐ, ఔ - వివృతము
క వర్గము, చ వర్గము, ట వర్గము, త వర్గము, ప వర్గము - స్పృష్టము
య,ర,ల,వ - ఈషత్పృష్టము
శ,ష,స,హ,ః,ం - ఈషద్వివృతము

ఈ సవర్ణ కథలో చివరి ట్విష్టు ఏమంటే - ఋ వర్గము, ఌ వర్గము ఒకదానికొకటి (అంటే "ఋ" కు "ఌ") పై సూత్రం ప్రకారం సవర్ణాలు కాకపోయినప్పటికీ, వీటికి ప్రత్యేక కోటా కింద "ఋ" ను "ఌ" కు సవర్ణంగా చేర్చారుట. ఋ, ఌ లను ప్రయోగించి, సవర్ణదీర్ఘసంధి చేసుకోవచ్చా అనేది తెలియకుండా ఉంది. అలాంటి ప్రయోగం ఎక్కడైనా ఉందేమో పెద్దలెవరైనా చెబితే బావుణ్ణు.

**********************************************************************************

Disclaimer: పైన చెప్పిన వివరాలు ఓ పుస్తకంలో నాకు అర్థమైన పరిధిలో తెలుసుకుని వ్రాసినవి. తప్పులుండవచ్చు. సరిదిద్దితే సంతోషం.

కృతజ్ఞత - పాణిని లఘుకౌముది మార్గదర్శిని , ఆచార్య శలాక రఘునాథశర్మ.

15 comments:

 1. సవర్ణదీర్ఘ సంధి for దుమ్మీస్ లా లేదండి సవర్ణదీర్ఘ సంధి in a nutshell లా ఉంది :)

  ReplyDelete
 2. అ - ఇ - ఉ - ఋ లకు అ - ఇ - ఉ - ఋ లు పరమగునేని దీర్ఘము వచ్చును. ఇది సవర్ణ దీర్ఘ సంధి. నేను బట్టీ పట్టిన తెలుగు సవర్ణ దీర్ఘ సంధి ఇది.

  ఇన్నేళ్ళ తర్వాత మీరు అది కాదు అని సంస్కృతములో చెబితే నాకు చాలా బాధగా ఉంది.

  ReplyDelete
 3. మీరు చెప్పినదంతా లంకెలతో సహా రెండు మూడు సార్లు చదవాలి. కానీ, బుర్రపైనించి తీస్తే (from the top of my head :-) ),

  సవర్ణదీర్ఘసంధి గురించిన టపాలో ’అకః సవర్ణే దీర్ఘః’ అన్న సూత్రాన్ని మీరు ఉటంకించనే లేదేమిటి చెప్మా??

  ఋకారంతో సవర్ణదీర్ఘసంధికి నాకు గుర్తున్న ఉదాహరణ:

  పితృ+ఋణము - పితౄణము

  తీరిగ్గా చదివాకా మళ్ళీ కామెంటుతా...

  ReplyDelete
 4. బహుశా ఇది చదివాకా dummyలౌతారు అని మీ ఉద్దేశ్యమేమో :)

  ఏదో ఉదాహరణలు అర్ధమవుతున్నాయికాబట్టి సరిపెత్తూకొన్నాం ఆ రోజుల్లో

  ReplyDelete
 5. Good one, I didn't know that this much of history is there for this, just managed to remember the formula :)

  ReplyDelete
 6. రవీ సోదాహరణం వివరించటం భేష్.

  ReplyDelete
 7. @శ్రావ్య గారు: అలానే అనుకోండి. :-)

  @లక్కరాజు గారు: బాధపడకండి. కొంచెం మార్చుకుంటే చాలు. :-)

  @నాగమురళి గారు: అకస్సవర్ణే దీర్ఘః - సూత్రానికి వ్యాఖ్యానం కాస్త పెద్దగా ఉంది, పూర్తిగా అర్థమవలేదు. అందుకే రాయలేదు. హోతౄకారః అన్నది మరో ఉదాహరణ.

  @సూర్యుడు గారు: నాకు కూడా నిన్నటివరకూ తెలీదు.

  @సనత్ : బజ్జులో ముక్కని టపాగా రాయమని పురిగొల్పిన కామేశ్వర్రావు గారికి సగం చెందుతుంది.:-)

  ReplyDelete
 8. రవీ, నా కోరిక మన్నించి టపా పెట్టినందుకు నెనరులు. ఋ, ౠ సవర్ణాలెందుకు కావనుకున్నారు? వాటికి స్థానం, ప్రయత్నం ఒకటే కదా?
  ఈ సూత్రాలని బట్టి చూస్తే హ్రస్వాలకి వాటి దీర్ఘాలు తప్ప వేరేవీ సవర్ణాలయ్యే అవకాశం కనిపించడం లేదు. అయినా దీన్ని జెనరలైజ్ చేసి "సవర్ణ" పదం చేర్చడం వెనకాల ప్రత్యేకమైన కారణమేమైనా ఉన్నదేమో ఆలోచించాలి.

  ReplyDelete
 9. @కామేశ్వర రావు గారు: ఋ, ౠ, సవర్ణాలే. టపాలో పొరబాటుగా ధ్వనించిందా?

  ఋ, ఌ లు ఒకదానికొకటి సవర్ణాలట, స్థానము, ప్రయత్నమూ ఏకం కాకపోయినప్పటికీ. ఇది వార్ధికమట. వార్ధికమంటే Exception అనుకుంటాను, సరిగ్గా తెలియదు.

  ReplyDelete
 10. ఓ! మీరు ఋ, ఌ సవర్ణాలన్నారా. మీ టపా, నాగమురళిగారి వ్యాఖ్య చూసి మీరు ఋ, ఌ లకు (వాటి దీర్ఘాలతో) సవర్ణదీర్ఘసంధి ఉదాహరణ అడిగారని భ్రమపడ్డాను.
  "ఌ"కే ఉదాహరణ తెలియదు, ఇంక ఋ, ఌ లకి కలిపి ఎక్కడనుంచి వస్తుంది! :-)

  నాగమురళిగారూ, మీరు తీరిగ్గా చదివి కామెంటేటప్పుడు నా పై వ్యాఖ్యలోని సందేహాన్ని గురించి కూడా ఏమైనా తెలిస్తే చెప్పండి ("సవర్ణదీర్ఘ సంధి", "దీర్ఘ" సంధికాకుండా "సవర్ణ" ఎందుకు చేరింది అన్నది).

  ReplyDelete
 11. :-) అవును, నాగమురళి గారు, ఈ పాణిని వ్యవహారాల్లో మీరు మీ పాణి (చెయ్యి) వేసి, ఏ "సమాన" దీర్ఘ సంధి గానో పేరుపెట్టకుండా, "సవర్ణ"మంటూ ఎందుకు కుట్ర పన్నారో చెప్పాలి. కాస్తో కూస్తో మీరే సమర్థులు ఇందుకు.

  @Indian Minerva: ఇదివరకు మీకు సమాధానం చెప్పడం మరిచాను. నాకూ నిన్నే తెలిసిందండి. నేనూ డమ్మీనే. :-)

  ReplyDelete
 12. రవిగారూ, కామేశ్వరరావు గారూ,

  ఓరి నాయనోయ్, ఋ ఌ లకి సంధా? బాబూ, నేను గ్రామరు మహావీకు (ఏదో రామాయణంలో గ్రామరంటే బుకాయించగల్ను గానీ, నిజం గ్రామరు చెప్పమంటే ఎలాగండీ.... :-D :-D)

  ఇహ మీరడిగిన ‘దీర్ఘసంధి ఎందుక్కాదు’ అన్న ప్రశ్న గురించి -

  ఇది కొంచం గహనమైన ప్రశ్నే కావచ్చును కానీ, నాకు తెలిసిన సరళమైన సమాధానం-

  అక్ = అ ఇ ఉణ్ + ఋ ఌ క్
  + గుర్తు తో వేరు చేయబడిన ఈ అక్షర సమూహాలు మాహేశ్వర సూత్రాలు అని మీకు తెలిసిందే కదా. అక్ అనేది x లాగా రెండు అక్షరాల సమూహానికీ కలిపి ఇచ్చిన ఒక పేరు. మొదట సూత్రంలో మొదటి అక్షరం, రెండో సూత్రంలో ఆఖరి అక్షరం కలిసి అక్ అయింది.

  ఈ అక్ లో ఉన్న అక్షరాలకి మాత్రమే ఇప్పుడు చెప్పుకుంటున్న సంధి వర్తిస్తుంది. ఈ అక్షరాల్లో సవర్ణమైన అక్షరాలు ఒకదానితో ఒకటి కలిస్తేనే దీర్ఘం రావాలి అని ఆ సంధి యొక్క రూలు. ఈ రూలుని బట్టి చేసే సంధిని ఒట్టి ‘దీర్ఘసంధి’ అంటే ఎలా కుదుర్తుంది? సవర్ణాక్షరాలకే దీర్ఘం అని స్పష్టంగా తెలియాలి కదా. కాబట్టే సవర్ణదీర్ఘ సంధి అని పేరు.

  ఇహ ఇప్పుడు చిక్కంతా ‘సవర్ణాలు’ అంటే ఏమిటి అని. ఈ టపా అంతా సవర్ణాల గురించేగా. నిజానికి ఇది చదివేంతవరకూ నాకు సవర్ణాల వెనకాల ఇంత గొడవ ఉందని తెలీదు.

  ఇంకా ముందుకెళ్ళి అసలు సవర్ణాలకి దీర్ఘం ఎందుకు రావాలి అని ప్రశ్నిస్తే, సౌలభ్యం కోసం అని చెప్పక తప్పదు. ఆ సౌలభ్యం ఏమిటో వ్యాకరణ ’శాస్త్రవేత్తలు’ పరిశోధించి కనిపెట్టి, సూత్రాన్ని ఏర్పరిచారు కాబట్టి మనం చచ్చినట్టు ఒప్పుకుని తీరాల్సిందే.

  ReplyDelete
 13. అకస్సవర్ణే దీర్ఘః అంటే ఇదన్నమాట. బావుందండి.

  ఇప్పుడే అందిన ఓ వార్త. "ఋ", "ఌ " లకు సంధి ఇది.
  హోతృ + ఌ కారః = హోతౄకారః

  - ఆ సంధిని ఈ నెల (sept) "ఋషిపీఠం" మాసపత్రికలో వేశారు.

  ఈ టపా ఇంకాస్త పొడిగించి, రెండవభాగం రాయాలి.

  ReplyDelete
 14. "ఌ" అన్న అక్షరాన్ని ఉత్పత్తి చెయ్యడానికి యే transliterator వాడారో తెలియచేస్తారా?

  ReplyDelete
  Replies
  1. ఎక్కడో కొట్టుకొచ్చానండి. గుర్తులేదిప్పుడు.

   Delete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.