Sunday, August 1, 2010

మరియొక ఆంగ్ల చిత్రరాజము

ఆంగ్ల చిత్రమును జూచి అనేక దినములు గడచినవి. అందులకై ఇంచుక సేద దీరుటకై ఈ దినమున నొక్క ఆంగ్ల చిత్రరాజమును గంటిని. ఆ చిత్రరాజము యొక్క నామము inception.

చిత్రము చూచుచున్నంత సేపునూ, ఏదియోనొక్క ఊహాలోకమున మదీయమానససారసము విహరించుచునే యున్నది. ఏమని జెప్పవలె? అదియొక్క అద్భుత లోకము! అనితరసాధ్యమయిన ప్రపంచము! ఈ చిత్రమునకు కథ చెప్పుట అత్యంయ క్లిష్టతరమైనయట్టిది. అయిననూ నా శక్తికొలది ప్రయత్నింతును.

కథ:

ఈ కథలో ముఖ్యపాత్రధారి పేరు కోబు. ఈతని వద్ద కొందరు వ్యక్తులు పనిచేయుచుందురు. ఈ కోబ్ అనునాతడు ఓ పరికరము సహాయమున ఎదుటి వ్యక్తి మనమున కలలను కలుగజేసి, ఆ కలలో అతని మెదడున ఒక ఊహను స్థాపించి, ఆ ఊహ పరిణామమును తమకనుకూలముగా మలుచుకొనును. ఎంత క్లుప్తతమముగా జెప్పిననూ ఎంత జటిలముగానున్నదో గమనించితిరి కదా!

ఇక కలలు నిక్షిప్తపరుచుటకు కొన్ని నియమములు గలవు. కలలో తమ అనుభవములను పొందుపరుచరాదు. కలలో పదిగంటలు జరుగు ప్రక్రియ, చేతనా ప్రపంచమున పదినిముషములే గావచ్చును. కలమధ్యలో అధికముగా మెదడు శ్రమకు గురయినచో సదరు కలగనునాతని మెదడు విపత్కరమగు పరిస్థితిలో చిక్కుకొనును. తను ఉన్నది కలయందా కాదా అని ఎరుగుటకు, ఓ చిన్న సంజ్ఞాసూచకము అవసరమగును. కోబు తనవద్ద ఓ బొంగరమును సంజ్ఞాసూచకముగా వాడుచుండును.

ఈ బృందము జపాను దేశమందు ఒక వాణిజ్య ప్రముఖుని ప్రత్యర్థిని వశపర్చుకుని, తన ద్వారా, తన వ్యాపారమునే కూల్చుటకు ప్రేరేపించెడి లాగున ఓ పథకమునల్లుదురు. అందులో భాగముగా, కలలు సృష్టించుట, కలయందు మరియొక కల, అందు మరొకటి, ఇవ్విధముగా ఊహాప్రపంచమున గొనిపోవుదురు. 

మధ్యలో కోబు యొక్క భార్యామణి తారసపడును. ఆమె కలల ప్రపంచమునబడి తననుతాను పోగొట్టుకొనినయట్టి ఒక అభాగిని.

ఈ చిత్రరాజమునందు పోరాట దృశ్యములు శూన్యగురుత్వాకర్షణ యున్న యొక కల్పిత స్థలమున చిత్రీకరింపబడి ఉత్కంఠగొలుపును.

ఇక కొన్ని దృశ్యములలో ప్రపంచము మూసికొని పోవుట, ఊహాలోకమున అనేక భవనములు కంటి యెదురుగ ప్రత్యక్షమగుట వంటి ఉత్కంఠభరితమైన దృశ్యములు గలవు.

ఈ చిత్రరాజమును చూచుటకు మిక్కుటమైన ఏకాగ్రత అవసరము. అయిననూ ఓ రెండు గంటలపర్యంతము ఊహాలోకమున విహరించుట తథ్యము.

లియొనార్డో డీకాప్రియో నను ప్రముఖ నటుడు కోబు పాత్ర పోషించెను.

7 comments:

 1. మా అమ్మాయికి (లూసిడ్) డ్రీమింగ్ అంటే ఇష్టం కాబట్టి ఈ సినిమా హైదరాబాదులో ఐమాక్సులో వుంటే ఐమాక్సులో తప్పకుండా చూడమనిచెప్పాను. ఉత్తమ అభిరుచి కలిగిన మా అక్కయ్య కొడుకుకి ఈ సినిమా గురించి చెప్పి మా వాళ్ళందరినీ తీసుకువెళ్ళమని చెప్పాను. చూసారో లేదో ఇంకా తెలియదు. హైద్బాద్ ఐమాక్సులో ఈ సినిమా ఆడుతోందా?

  ReplyDelete
 2. @శరత్: తెలీదండి. నేను బెంగళూరులో చూశాను.

  ReplyDelete
 3. బాగుందండి మీ రివ్యూ మాకు వచ్చేది పొడుగాటి వారంతం కాబట్టి చూసి మీరు రాసింది ఎంతవరకు నిజమో తెలుసుకుంటా :)

  ReplyDelete
 4. బాగు బాగు బహుచక్కగా పరిచయము చేసితిరి. ఈ కలలు మనకు కలగ బోవు నిజజీవిత సంఘఠనలకు సూచకములు. :)
  శ్రీశార్వరి రచించిన "పరావిద్య" అను పొత్తము స్వప్నముల గురించిన చాలా రహస్యములను తెలియచేయుచున్నది. ఆధ్యాత్మిక అభిలాషులకు వెంట్రుకలు నిక్కపొడుచుకునే అనుభూతులు కలుగుతాయి.

  ReplyDelete
 5. నాకునూనచ్చినది. అందులకే నేను రెండు మారులు చూచితిని.

  ReplyDelete
 6. sorry, out of context comment

  కొత్తపాళీ గారి బ్లాగులో రాసిన మీ కామెంటు చదివాను.
  ఓహ్ ఆర్య చాణక్య వేదుల సత్యనారాయణ శర్మ గారు రాసారా!
  తెలియజెప్పినందుకు ధన్యవాదములు రవి గారూ.
  మీరు పుస్తక.నెట్ లో సమీక్ష రాసానన్నారు? లింక్ ఇవ్వగలరా?

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.