Friday, July 23, 2010

మత్తేభ ఘీంకారము

సిరికిం జెప్పడు;శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీరడభ్రగపతింబన్నింపడాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్కనొత్తడు వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సా హియై.

ఆ పద్యం చదివి వెనకటికి శ్రీనాథుడు పోతనతో అలా ఎలా వస్తాడు? అసంబద్ధం అని లాజించితే, పోతన ఓ రాయిని పెరటి బావిలోకి విసిరి శ్రీనాథునితో, "అయ్యా! మీ అబ్బాయి బావిలో పడ్డాడు" అని చెప్పి, తను పరిగెత్తితే, "ఇదుగో ఇలానే శ్రీవారు కూడా వెళ్ళారండి!" అని జవాబిచ్చాడట.

ఇప్పటి ఐదవతరం హైటెక్ కూలీలకు మాత్రం బాసురుడు పిలిస్తే ఆఫీసుకు పరిగెట్టటం అలవాటే.అలాంటి ఓ మందభాగ్యుని ఉదంతం ఈ పేరడీ.

సతికిం జెప్పడు; పెన్ను పర్సుయుగమున్ షర్టందు సంధింపడే
గతిఁ తిండిన్ తిననేరడద్దముఁ వెసన్ కాంక్షింప డాకర్ణికా
వృత ధమ్మిల్లముఁ జక్కనొత్తడు సుసంప్రీతిన్ విహారాదులన్
మతిఁ గోరండల చేరి బాసురవరున్ మానావనోత్సాహియై

తెరవెనుక:

నాకు మత్తేభం ఎలా వ్రాయాలో తెలియడం లేదు. జాలంలో మత్తేభం అని వెతికితే "సిరికిం జెప్పడు" అని వస్తూంది. నేను మత్తేభం నేర్చుకునే వరకు ఇలాంటి దారుణమైన ఆలోచనలు ఆగకపోవచ్చు. పోతన మీద ఇదివరకే ఒకాయన కలం చేసుకున్నారు. ఇక్కడ చదవండి.

ఆకర్ణికాంతర ధమ్మిల్లము 
శ్రీకుచో పరిచేలాంచలము - వీటి అర్థాలు తెలపవలసిందని కోరుతున్నాను.

12 comments:

 1. బాగుంది. మీరడిగిన అర్థాలు: చెవులదాకా వ్యాపించి ఉన్న జుట్టు. లక్ష్మీదేవి యొక్క పైటకొంగు.

  ReplyDelete
 2. వివాద ప్రోత్థిత - ఆయన అమ్మవారితో ఏదో వాదిస్తున్నాడుట (దెబ్బలాడుతున్నాడు). అందులో భాగంగా సరసంగా ఆవిడ కొంగు పట్టుకున్నాడు. ఆ విధంగా పట్టుకున్న చేలాంచలం అన్నమాట.

  ReplyDelete
 3. బావుంది.
  అర్థం తెలీక అడిగారంటే నమ్మగలమా!

  ReplyDelete
 4. మానావనోత్సాహియై అంటే ఏమిటో ముందు మీరు చెప్పండి మేష్టారూ

  ReplyDelete
 5. మాన = అభిమానమును
  అవన = రక్షించుకొనుటయందు
  ఉత్సాహియై = ఉత్సహించినవాడనై
  అంతే కదండీ అర్థం.

  ReplyDelete
 6. చాలా బాగుంది!
  మత్తేభం ఎలా రాయాలో తెలియక పోతే యతులు కచ్చితంగా కుదిరేలా అలా ఎలా పేరడించ గలిగేరు?!
  ఈ ఏడు మీ అప్ప్రైసల్ బాగా జరిగినట్టుంది. "బాసాసురుడు" కాస్తా బా"సురుడు", బా"సురవరు"డు కూడా అయ్యాడు! :-)

  ReplyDelete
 7. @నాగమురళి గారు: ఆకర్ణాంతము - అంటే చెవివరకు.
  ఆకర్ణికాంతరము - కర్ణిక అంటే కూడా చెవియేనా? చెవికి సంబంధించిన భాగమా? అంతము కాకుండా అంతరము అని ఎందుకన్నాడు? :-)

  @నరసింహ గారు: @వూకదంపుడు గారి ప్రశ్నకు జవాబిచ్చి నా మానావనం చేశారు. :-)

  @మందాకిని గారు: నమ్మాలి. :-) సరే వ్యుత్పత్తి తెలీదనుకోండి.

  @కామేశ్వర రావు గారు: సొంతంగా రాయటం రావట్లేదు. అందుకని "సిరికిం జెప్పడు" టెంప్లేటులో యతులు కిట్టించాను.

  మీ ఊహ కొంతవరకూ కరెక్టే.

  ReplyDelete
 8. రవిగారూ, నా ఊహ చెప్తున్నా, పెద్దలెవరైనా సరిచెయ్యాలి. కర్ణిక అంటే చెవికి సంబంధించినది అని అర్థం. అచ్చతెలుగులో దుద్దు అని కూడా ఈ పదానికి అర్థం ఉంది. కాబట్టి ఇక్కడ కర్ణిక అంటే కుండలం అన్నమాట. ధమ్మిల్లమంటే జడలు వేసుకుని తలమీద చుట్టుకునే కొప్పు అని అర్థం చూశాను.

  ఆకర్ణికా అంతర ధమ్మిల్లము అంటే - చెవుల దుద్దులవరకు మధ్యలో ఉన్న జుట్టు - అంటే ఆయన కొప్పు జారిపోయి చెవులవరకు వేల్లాడుతోంది అన్నమాట. దాన్ని సరిచేసుకోకుండా పరిగెట్టాడు. మామూలుగా అయితే మళ్ళీ దాన్ని తలపైకి చుట్టుకుని దానిమీద కిరీటం పెట్టుకోవాలి. గజప్రాణావనోత్సాహంలో ఇవన్నీ పట్టించుకోలేదు.

  ఇదీ నా ఊహ. ఇంకా బాగా తెలిసినవాళ్ళెవర్నైనా సరిచెయ్యమని ప్రార్థన.

  ReplyDelete
 9. ఇంకా ఎవరో ఎందుకండీ? చక్కగా వివరించారు.
  దృశ్యం కళ్ళకు కట్టింది.

  ReplyDelete
 10. అసలు మీరు ధమ్మిల్లం, చేలాంచలాల గురించి అడిగినపుడే ఇక్కడేదో పితలాటకం ఉందని అనుకున్నాను. మీకు నాగమురళి గారికీ నెనరులు.

  అయితే, మీరు ధమ్మిల్లమ్మీద ఎంత ఫోకసు చేసినప్పటికీ, మీ బాసురునిపై పెరిగిన మీ అభిమానాన్ని మా ఫోకసునుంచి దాటిపోనీకుండా చేసినందుకు కామేశ్వరరావు గారికి కూడా నెనరులు. :)

  ReplyDelete
 11. మఱొక చక్కని హాస్యభరితమైన టప వ్రాశారండి :)

  ReplyDelete
 12. శబాసో! ఇంకా తెలివిగా ఏవేవో విట్టీగా కామెంటుదామనుకున్నా, కానీ విజ్ఞులు అనుభవజ్ఞులు ఆల్రెడీ అన్నీ చెప్పేశారు. అందుకని మరొక్కసారి శబాసో!

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.