Thursday, July 15, 2010

జ్ఞానార్జన

ఆచార్యాత్ పదమాదత్తే పాదం శిష్యః స్వమేధయా |
పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చ ||

గురువు నుండి ఒక పాలు, స్వమేధతో ఒక పాలు, ఇతరుల వల్ల ఒకపాలు, కాలక్రమేణా ఒక పాలు. శిష్యుడు ఈ విధంగా జ్ఞానం స్వీకరిస్తాడు.

***********************************************************

ఓ వారం పది రోజుల క్రితం తమ్మి (రెండేళ్ళకు ఓ నెల తక్కువ వయసున్న మా పాప) పలక, చాక్ పీసు పట్టుకుని దగ్గరకొచ్చింది. తను అలా నా దగ్గరకు రావడం, నేను గుర్రం బొమ్మ వేస్తే చూసి గాడిదని, ఏనుగేస్తే పందని అనడం మామూలే. నేను రూటు మార్చి పందులు, కుక్కల బొమ్మలెయ్య్డడం అనే అడ్వాన్సు స్టేజు కూడా వచ్చింది. అయితే ఈ రోజు తను వచ్చింది వేరే విషయమై.

"ఏం చేత్తున్నావు?" అడిగేను పాపను.
"ఏ రాతినా" అంటూ పలక చూపించింది. అవును పలక మీద అది "A" రాసింది.
మొదట ఆశ్చర్యమేసింది.
"ఏదీ, మళ్లీ రాయి" అడిగాను.
"తలే" అని A ఎడమవైపు కొస నుండి మొదలెట్టి, పైకి తీసుకెళ్ళి, అట్నుంచి కిందికి తీసుకొచ్చి, అడ్డగీత కంటికి కనిపించనంత వేగంతో గీసింది. (షాడో అలంకారం)

ఎలా నేర్చుకుందబ్బా ఆలోచించాను. అర్థమయింది. మా ఆవిడ పిన్నిగారు పిల్లలకు ట్యూషన్ చెబుతుంటారు. ఆ పిల్లల దగ్గర చేరి వెలగబెట్టిన నిర్వాకం ఇది. సో, పైన శ్లోకంలో మొదటి పాదం (గురువు నుండి నేర్చుట) బైపాస్ అయిపోయి మూడవపాదంలోకి (ఇతరులనుండి నేర్చుట) అడుగుపెట్టింది.

మా పాప మొదటి సారి "అమ్మ" అనే ప్రయత్నం చేసినప్పుడు -
Baby joy
Baby joy.mp4
Hosted by eSnips


మొదటిసారి గోడవారగా నుంచున్నప్పుడు -


మొదటిసారి చెంగావి రంగు చీర కట్టినప్పుడు

మొదటి సారి పాక్కుంటూ  ఇంటి వరండా దాటిన సందర్భంలో ఇంట్లో కుడుములు చేసినప్పుడు -
మొదటి సారి కుర్చీ ఎక్కడం నేర్చుకున్నప్పుడు -
మొదటి సారి నడిచినప్పుడు -
మొదటి సారి ’నాన్న" అన్నప్పుడు -

ఏదో లోకంలో ఉన్నట్టు బానే గడిచింది కానీ పలక మీద A రాయడం మొదట్లో బానే అనిపించినా తర్వాత "అ" రాయకుండానే A రాయడం కొంత మింగుడుపడలేదు. అయితే ఎవరూ నేర్పించకుండా తనే నేర్చుకుంది కాబట్టి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. అయితే "తెలుగు", మాతృభాష, ఇంకాస్త గీర్వాణ భాష ఫీలింగులు ఉన్న నేను పాప విషయంలో ఓ హిపోక్రైట్ గా మారే రోజు దగ్గరలో ఉందని చూచాయగా అనిపిస్తోంది.

***********************************************************

సమయం వచ్చింది కాబట్టి నాకు అక్షరాలు నేర్పించిన గురువును కూడా స్మరిస్తాను. నాకు "అ" దిద్దించిన అయ్యవారి పేరు శంకరయ్య గారు. మా అమ్మా నాన్నా, నన్ను బడిలో "వేయ"డానికి యమ యాతన పడ్డారుట. బలవంతంగా ఆయనకు ఒప్పగించారుట. బడిలో పెద్దబెల్లు కొట్టేవరకూ ఇంటికి రావద్దంటే, కాసేపటికే పరిగెత్తుకొచ్చానట. "ఏరా ఇంతలోపే వచ్చావు" అనడిగితే, "ఆ శంకరయ్య, బెల్లే కొట్టి ఛావడు, అందుకని నేనే వచ్చేశా" అని చెప్పానట. బడిలో బెల్లు కొట్టే గుమాస్తా పేరు కూడా శంకరయ్యే.

ప్యూను శంకరయ్య ఏవో కారణాల వల్ల స్కూలు ఉద్యోగం మానేసి, ఓ సైకిలు షాపు, సోడాల షాపు నడుపుకుని కొన్నేళ్ళ క్రితం చనిపోయాడు.

శంకరయ్య మాస్టారు గురించి. ఆయన లింగాయతులు. మాట కర్కశం. మనసు వెన్న. ఆయన కోదండం వేస్తానని బెదిరించడం నాకు బాగా జ్ఞాపకం. ఒకటవ తరగతి నుండి పదవతరగతి వరకూ ఒకే స్కూల్లో చదివి, వీడుతున్నప్పుడు చివరగా ఆయన్ను కలిశాను. తను పెంచిన మొక్క సొంతంగా ఎదుగుతుందన్నట్టుగా ఆయన చూపు. అదే నాకు దొరికిన ఆఖరు చూపు కూడాను. కొన్నేళ్ళ తర్వాత ఆయన చాక్ పీసుల తాలూకు ధూళి ఊపిరితిత్తుల్లో చేరుకుని, శ్వాస తీసుకోవడం కష్టమై స్వర్గస్తులయ్యారు. ఆయనకు ముగ్గురు కొడుకులు. చివరి అబ్బాయి పేరు కూడా రవి. వాళ్ళు అందరూ బానే ఉన్నారని విన్నాను.

***********************************************************

మళ్ళీ శ్లోకానికి. శ్లోకం కాస్త పరిశీలిస్తే నాకో విషయం అనిపిస్తున్నది. స్వమేధతోనూ, కాలక్రమేణా ఒకరి బుద్ధి వికసిస్తుంది. గురువు వల్ల, ఇతరులను చూసి హృదయం వికసించాలి. అప్పుడే చదువు సంపూర్ణమవుతుంది అని నేను భావిస్తాను.

10 comments:

 1. అదరహా...చిన్నమ్మి "తమ్మి"ని మా ఇంటికి పంపిస్తే - పనిలో పనిగా అదే చేత్తో అంతే స్పీడుతో అరబ్బీ రాతలు కూడా రాసవతల పారేసే అలవాటు చేయించేస్తుంది మా అమ్మాయి వైష్ణవి.....మీదే ఆలస్యం.....ఆలస్యం అమృతం - ఘటంలోని ఘృతం.....చివరి రెండు ఫోటోలు సూపరు..

  ReplyDelete
 2. చివరి రెండు ఫోటోలు సూపరు.. చూస్తూ ఉండండి త్వరలోనే బ్లాగురాతలు కూడా మిమ్మల్ని చూసి....

  ReplyDelete
 3. తమ్మి గోడవార గా నుంచున్నంది ఎంత బాగుందో.. అప్పుడే అమ్మాయి కళ్ళలో A, B లు నేర్చుకునే జిజ్నాస కనపడింది మీరు గమనించారా లేదో.. మరి అదే అగ్ని కి ఆజ్యం పోయటం అంటే అంటారా.. :-)
  చిన్ని సవరణ తల్లి తండ్రుల ప్రోత్సాహం తోను స్వమేధ తోనూ బుద్ధి వికసిస్తుంది అనాలేమో..

  ReplyDelete
 4. చాలా బాగుంది టపా. ఏ విద్య అయినా నేర్చుకోవాలంటే శ్లోకంలో చెప్పిన నాలుగూ జరగాల్సిందే. అవన్నీ ఒకే సమయంలో జరుగుతూ ఉంటాయి కూడా. మీ బంగారుతల్లి గురించి మీరు ముందు ముందు ‘ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాః’ అనుకోక తప్పదు. ఫొటోలు చాలా బాగున్నాయి.

  ఇంక మీబాధే నా బాధాను. మా అమ్మాయి నర్సరీకి వెళ్తోంది. అక్కడ టీచర్ల దగ్గర తెలుగులో ఏదేదో మాట్లాడేస్తోందిట. వాళ్ళేమో మీ ఇంట్లో ఒక్కళ్ళైనా అమ్మాయితో ఇంగ్లీషులో మాట్లాడండీ, తొందరగా వస్తుంది అని మా శ్రీమతి దగ్గర కంప్లయింటు. పైగా, మాతృభాష వద్దన్నా వస్తుంది అంటున్నార్ట. ఆవిడేమో ఇంట్లో నన్ను ఇంగ్లీషులో మాట్లాడమని అడుగుతోంది. హతవిధీ! నా బాధ ఏమని చెప్పను!!

  ReplyDelete
 5. మా అమ్మగారు సామెత చెప్తూ ఉంటారు.. "విత్తు ఒకటి వేస్తే, మొక్క ఇంకోటి వస్తుందా?" అని.

  మీ మేథస్సే "తమ్మి" కి వచ్చింది. అందుకే అంత తొందరగా రాసేస్తోంది. చీరలో ఫోటోస్ బాగున్నాయి.

  ReplyDelete
 6. భల్లె.. భాగుంది మీ చిన్నది... మీ టపా..

  ReplyDelete
 7. రవీ

  మీకున్న విషయాసక్తి మీద నాకున్న అభిప్రాయంతో చెబుతున్నదీ - ఈ టపాతో సంబంధం లేదు కాబట్టీ - :)

  వీలుంటే, దొరికితే (దొరకబుచ్చుకోగలిగితే!) శతావధాని శ్రీ వేలూరి శివరామశాస్త్రి గారి పుస్తకాలు చదవండి

  ఈ వారాంతం టెక్కే మీదున్న భోషాణం తియ్యగానే ఈ క్రింది రెండూ నన్ను చదువు, నన్ను చదువు అని పోరగా, చదివేసిన ఆనందంలో మీరు గుర్తుకొచ్చి ఇటేపు వచ్చానన్నమాట -
  1)శ్రీ వేలూరి శివరామశాస్త్రి గారి "వ్యాసవాణి" పుస్తకం (సాహిత్య అకాడెమీ ప్రచురణ)
  2) విద్వాన్ విశ్వంగారి "అథర్వవేద సంహిత" (ఇవి మొత్తం మూడో - నాలుగు పుస్తకాలనుకుంటా!, నా దగ్గర రెండే వున్నాయి - 1200 పేజీలు ) చదవండి...

  ఒక వ్యక్తి ఎంత శక్తివంతంగా ఆలోచించగలడూ, అంత శక్తివంతమైన ఆలోచనను కాగితం మీద అందంగా ఎలా పెట్టగలడు అన్నదానికి సజీవ సాక్ష్యాలు ఈ పై ఇద్దరు మహానుభావులు...

  ReplyDelete
 8. @వంశీ: వేలూరి వారి అవధానాలు నా వద్ద ఉన్నాయి. వ్యాసవాణి గురించి ఇప్పుడే వింటున్నాను. తప్పక సంపాదించి చదువుతానండి.

  ReplyDelete
 9. రవిగారు, చాలా బాగుందండి మీ టప. జ్ఞానం, విజ్ఞానం, హాస్యం, అభిమానం, ముద్దు - అన్నీఎ కనబడ్డాయి మీ టపలో.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.