Tuesday, July 6, 2010

చెఱువు

నా వయసు 700 యేళ్ళ పైమాటే.  ఆ కాలంలో అక్క, బుక్కలనే ఇద్దరన్నదమ్ములు శృంగేరీ స్వాముల వారి సహాయంతో ఈ నేలలో ఒక సామ్రాజ్యాన్ని ఏర్ప్తాటు చేశారు. ఆ అక్క, బుక్కలలో చిన్నతను బుక్కరాయలు మా నాయన. మా అమ్మ పేరు అనంతమ్మ. నా పేరేమిటో తెలీదు కానీ, మా నాన్నపేరు (బుక్కరాయసముద్రం)తోనే నన్నూ పిలుస్తారు. మా పెదనాయన, చిన్నాయన నా లాంటి ఎందరికో జన్మనిచ్చారు. మా తాతయ్య పడమటి దిక్కునేలే మారాజు (వరుణుడు). న్యాయం ధర్మం సక్రమంగా నడిచే ఆ రోజుల్లో తాత నన్ను చూట్టానికి నెలకు మూడు సార్లు దిగివచ్చేవాడు. తాతయ్య మాట ఎంత గంభీరమో మనసంత చల్లన. ఆయనంటే పిల్లలకు చాలా ఇష్టం. ఆయన వచ్చి నన్ను పలుకరించి వెళ్ళగానే మనసు నిండిపోయేది.

మా అమ్మా, నాయనా గుర్తొస్తే, నాకో పాఠం గుర్తొస్తుంది.

"శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభిః |
పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్ ||"

అంటే - కోటి గ్రంథాలలో చెప్పేమాట అర్ధ శ్లోకంలో చెబుతాను. పరోపకారం పుణ్యానికి, పరపీడన పాపానికి. అని అర్థం. ఆయన నేర్పిన ఈ సూక్తిని నా మనఃసాక్షిగా పాటిస్తున్నాను.

నేను కాస్త పెరిగి పెద్దవాడవుతుండగా, క్రమంగా నా చుట్టూ ఓ జనపదం ఏర్పడ సాగింది. ఆ జనపదాన్ని నా పేరుతోనే పిలిచే వారు. కొంత దూరంలో మా అమ్మ పేరుతో అనంతమ్మపురం అని ఓ పట్టణం నెలకొంది. అమాయకమైన పల్లె జనాలు పాపం నా పంచనే బతికే వారు. నా సహాయంతో పంటలు పండించుకునే వాళ్ళు. దప్పిగొంటే నా వద్దకే వచ్చే వాళ్ళు. ఇలా ఎన్ని వేల ప్రాణాలకు నేను ఓ దిక్కూ, మొక్కూ కల్పించానో తలుచుకుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. గర్వమూ కలుగుతుంది. అసలు నా ప్రాణం అయిన నీటి మీద పూర్వీకులకు ఎంత భక్తిభావం ఉందో, నా మీద ఎంతటి చక్కటి కవితలు అల్లారో, ఎలా పూజించారో, పూజిస్తున్నారో, ఈ భావనలు ఎన్ని వేల యేళ్ళ నాటివో తలుచుకుంటే అద్భుతంగా ఉంటుంది.

"ఆపోవా ఇధగుం సర్వం
విశ్వాభూతాన్యాపః
ప్రాణావా ఆపః
పశవ ఆపో అన్నమాపో అమృతమాపః
సమ్రాడాపో విరాడాపః
స్వరాడాపశ్చందాగుంశ్యాపో జ్యోతిగుంశాపో
యజుగుంశ్యాపః
సత్యమాపః సర్వదేవతా ఆపో భూర్భువః సువరాప ఓం"

ఇదంతా జలమే. సర్వభూతాలు జలమే. ప్రాణం జలమే. పశువులు, అన్నమూ, అమృతమూ అన్నీ జలమే. సమ్రాట్టు, విరాట్టు జలమే. స్వరాట్టు, ప్రమాణాలు, వెలుగునిచ్చేవీ, వేద సూత్రాలు, సత్యము, సర్వదేవతలు, భూ, భువః, సువః అనే ముజ్జగాలు అన్నీ జలమే. వీటన్నిటికి మూలం ఓం అనే ప్రణవం...

********************************************

ఒకసారి నాకో పుండు వచ్చింది. గట్టు తెగి ప్రజల ప్రాణాల మీదకు వచ్చిందట. నాకు ఓ ముసలమ్మ మందేసింది. కానీ పాపం ఆమె మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఆ ముసలమ్మకో కట్ట కట్టి పూజించుకున్నారు పల్లెప్రజలు. తర్వాత్తర్వాత ఓ కవి ముసలమ్మ ఉదంతాన్ని ఓ కావ్యంగా చెప్పాడు.

నా కట్టమీద అనంతమ్మ పురవాసులు రకరకాల గుళ్ళను కట్టుకున్నారు. పక్కన కొండమీద కూడా తోకరాయుని గుడి ఒకటి కట్టారు.

కాలం మారింది. మా తాతయ్య ఎంచేతో పలుకరించడం మానేశాడు. మా రతనాల సీమ ఇప్పుడు రాళ్ళసీమ గా మారింది.  దానికి తోడు మెల్లిగా నా శరీరాన్ని కబళిస్తూ కాలనీలు పుట్టుకొచ్చాయి. నా మీద అనేక ముళ్ళచెట్లూ, రకరకాల పిచ్చి మొక్కలూ మొలిచాయి. నన్ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఒకవేళ తిరిగి నాకు కళ వచ్చినా ప్రజలు నన్ను అప్యాయంగా పలుకరిస్తారన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఈ కాలం ప్రజలు మహాబుద్ధిశాలురు. తెలివైన వారు. వీరికి నీటిని "కొని" త్రాగటం అలవాటవుతూంది. కల్మషాలను ప్రకృతిసిద్ధంగా వదిలించుకునే పద్ధతులు వీళ్ళు నమ్మరు. నాలో కల్మషాలను వదిలించడానికి ఇంటింటా ప్రత్యేక పరికరాలను అమర్చుకుంటారు. ఇన్ని వందల యేళ్ళు వేలమంది ప్రజలు నన్ను, నా సహాయంతో పండించుకున్న పంటలనూ అనుకూలంగా వీరు విస్మరిస్తారు. చివరికి ఓ రోజు, "నా గుండె చెఱువయ్యింది" అన్న మాట కూడా చాదస్తంగా మారిపోవచ్చు.

మనిషి మెదడు, హృదయాన్ని కబళించడమనేది ఓ వ్రణం. బయటి వ్యాధిని పసిగట్టటం తేలికే కానీ, పండులోపలి పురుగును గుర్తించటం బహుకష్టం. అది మిక్కిలిప్రమాదకరమైనది. ఈ వ్రణం ముదిరితే నా మిత్రుల గాథలు నాలాంటి మోడు గాథలే అవుతాయి.

8 comments:

 1. ఈ కాలం ప్రజలు మహాబుద్ధిశాలురు,తెలివైన వారు!
  hmm....

  ReplyDelete
 2. నిజంగానే గుండె చెరువైపోతుంది దాన్ని చుస్తె.
  నాన్న గట్టున కూర్చొని చదివిన విరాట పర్వం ,ఆ సంవత్సరం నిండడం ఇప్పటికీ నాకు జ్ఞాపకం 88-89ల్లొ అనుకుంటాను.
  ఒకటి రెండు సార్లు చూసాను అది నిండి పండించిన వరిపైలను.అంతే తర్వాత ముల్ల చెట్లు మాత్రమె కనిపిన్స్తున్నయి.

  ReplyDelete
 3. అయ్యో నిజం గానే అలా అయ్యిందా అంత పెద్ద చెరువు కు? :-( ఒక పక్క నీటి మట్టం పెరిగి ప్రపంచమే మునిగి పోతుంది అంటారు, ఇంకో వైపు తాగు నీటి కే విల విల. ప్చ్...

  ReplyDelete
 4. రవీ!తాడిపత్రినుంచి అనంతపురంకు వచ్చేటప్పుడు ఈ చెరువును చూస్తూ నా మనసులో కూడా ఇలాంటి వేదనే.

  ReplyDelete
 5. "cheruvu" poyi "karuvu" vacche dom! dom! dom!
  "polam" poyi "colony" vacche dom! dom! dom!

  ReplyDelete
 6. ఒక్క సారి మా(మన)ఊరి చెరువు గురించి చాలాబాగా గుర్తు చేసారు రవి గారు. మొన్న 2008 లో అనంతపురం వెళ్ళినప్పుడు చెరువుకట్ట కింద చూస్తే ఆ పొలాలు అన్నీ కాలనీలు గా కనిపించినాయి. చాలా బాధ పడ్డాను.
  Seshu
  (Proud to from Anantapur)

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.