Wednesday, June 30, 2010

చరిత్రా? చట్టుబండలా?

చరిత్ర అంటే ఏమిటి?
ఊహాగానమా?
కొందరు పరిశోధకుల పొంతన లేని అభిప్రాయాలకు ఊతం ఇచ్చే సబ్జెక్టా?
కోర్టులోలా circumstantial evidence ఉంటే తప్ప పరిగణనలోకి తీసుకోజాలని ఓ వ్యాజ్యమా?
తమతమ అభిజాత్యాలకు ఆటపట్టుగా మార్చుకోవడానికి తేరగా దొరికిన ఓ అవకాశమా?
వ్యక్తి వ్యక్తికీ, కాలకాలానికి మారిపోతూ ఉండేదా?

ఓ దేశపు చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మొదట అక్కడి సంస్కృతినీ, సాంప్రదాయాల్ని, సాహిత్యాన్ని వినమ్రతతో పరిశీలించాలి. అందులో సొంత అభిప్రాయాలకు, అభిజాత్యాలకు తావు ఉండరాదు. అధ్యయనం వ్యక్తిగత పేరు ప్రతిష్టల సమరం కారాదు. అది జాతికి చేస్తున్న సహాయం కానేరదు.

విమర్శ అనే ప్రక్రియకర్థం తెగడటం కాదు, పరిశీలించటం, నిష్పాక్షికంగా ఆధారాలను సేకరించటం, ఆధారాలను బట్టి సమన్వయం సాధించటం విమర్శ. సమన్వయం కుదరని పక్షంలో ఊహాగానాలకు చోటివ్వక, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఉంచి, తరువాతి తరానికి ఆ విషయాలను పరిశీలించడానికి సహాయం కల్పించటం కూడా సద్విమర్శలో భాగమే. చరిత్ర అన్నది ఒక శాస్త్రం కాదు. శాస్త్రానికి అధారం విశ్లేషణ. కళకు ఆధారం సంశ్లేషణ. శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం అంటే, కంటికి కనిపించే ప్రత్యక్ష ఋజువులకోసం పాకులాట అనేది సంకుచితమైన అర్థం. 

చరిత్రాధ్యయనం ఒక కళ. ప్రాంతీయ సాహిత్యానికి, వారి దైనందిన జీవితంలో అంతర్భాగమైన అలవాట్లకు, వారి సంస్కృతి మూలాలకు, సాంప్రదాయ విషయాలకు సమన్వయం సాధించగలిగడం ఈ ప్రక్రియలో భాగం.ఇందులో పొఱబాట్లకు తావులేదు. సహానుభూతి అభిప్రాయాలకు పరిమితం కావాలి, ప్రమాణాలకు కాదు. అభిప్రాయాలకు అందరికీ అవకాశం ఉంది. అయితే అభిప్రాయం ప్రమాణం చేసే ప్రయత్నం నిర్ద్వంద్వంగా ఖండించదగింది. దురదృష్టవశాత్తూ, ఆంగ్లేయులచేత ఈ రోజు పాఠ్యాంశాలలో చేర్చబడి విద్యార్థులు చదువుతున్న భారతదేశ చరిత్ర చాలావరకు ఊహాజనితం. ఒక ఊహ నిజంగా మలచబడి, దానిపై మరొక కల్పన సృష్టింపబడి, మరిన్ని ఊహాగానాల అల్లిక,వాటికి ఋజువుల వెతుకులాట.. ఇలా చెల్లాచెదరై ఉంది.మనం చదువుకునే మన దేశచరిత్ర మొత్తం అస్తవ్యస్తం, అకటావికటం.

ఉదాహరణ: హిందువులు సాధారణంగా వాడే పంచాంగంలో ఉటంకింపబడే శాలివాహన శకం ప్రకారం ఈ యేడు 1932 వ వర్షం. యే శకమైనా ఎలా మొదలవుతుంది? ఓ మహాత్ముడితోనో, మహానుభావుడి పేరు మీదో, ఏదైనా గొప్ప సంఘటన వలనో మొదలవాలి. కలిశకం, యుధిష్టిర శకం, విక్రమ శకం, క్రీస్తు శకం ఇవన్నీ దానికి ఉదాహరణాలు. అలా శాలివాహన శకం క్రీ.శ. 78 నుండి మొదలయింది. వేల యేళ్ళుగా ఆనవాయితీగా, పంచాంగ రూపకర్తలు దీనిని ఉటంకిస్తూ వస్తున్నారు. శాలివాహన మహారాజు గురించి భారతీయ లౌకిక సాహిత్యంలో కథలున్నవి. ఎంతో ఎందుకు? ప్రాకృతభాషలో గాథాసప్తశతి - శాలివాహన సంకలితం ఉన్నది.  కాగా, శాలివాహనుడనే రాజు లేనే లేడని, ఎక్కడినుండో వచ్చిన కుషాణ వంశపు కనిష్కుడనే రాజు పుట్టుక ఆధారంగా ఈ శకం మొదలయ్యిందని కొందరు ఆంగ్లపండితుల ఊహ. పురాణాలన్నీ పుక్కిటివయ్యాయి. ఊహాగానాలు నిజమయి కూర్చున్నాయి. ఊహ చరిత్ర గా మారింది. మన పాఠ్యపుస్తకాల్లో ఎక్కింది. ఎవరో చేసిన ఊహాగానం చరిత్ర పేరిట మనం చదువుకుంటున్నాము. అగ్ని వంశపు రాజుల గురించి చెప్పిన మత్స్య, అగ్నిపురాణాది అనేక పురాణాలు, వేలయేళ్ళుగా వచ్చే సంప్రదాయం, లౌకిక సాహిత్యం, ప్రతీ రోజు చేసే సంధ్యావందనంలోనూ, హిందువనే ప్రతివాడు ఏదో ఒక సందర్భంలో పూజలో సంకల్పం చెప్పుకునే వరుసలో వచ్చే "శాలివాహకే..హరిహర గురుసన్నిధౌ, అస్మిన్ వర్తమానే..." వరుసా, ఇవన్నీ ప్రమాణాలుగా తోసివేయబడ్డాయి!

ఇక మహాభారతం విషయానికి వద్దాం.

కలియుగం ఫిబ్రవరి 20, 3102 B.C, 2-27'-30''గంటలకు,మొదలయ్యిందని ప్రపంచ వ్యాప్తంగా, ఇండాలజిస్టులు ఒప్పుకున్న విషయం. మహాభారతంలో స్త్రీపర్వం, అనుశాసనిక పర్వం,మహాప్రస్థానిక పర్వాది కొన్ని పర్వాలలో శ్రీకృష్ణుని మరణం, పరీక్షిత్తు జననం, కలియుగాగమనం ఒకేసారి జరుగుతాయని ఉటంకించబడి ఉన్నది. గాంధారి కృష్ణునికి శాపం ఇస్తూ, సరిగ్గా 36 యేళ్ళకు యాదవకులంలో ముసలంపుట్టి వంశనాశనం జరుగుతుందని చెబుతుంది.అంటే, భారతయుద్ధకాలం క్రీ.పూ. 3138. అంటే భారత కాలం అంతకుముందే కావాలి. దేవీభాగవతం, ఇంకా కొన్ని పురాణాలలోనూ ఒకేవిధమైన సమయం ఉటంకింపబడి మహాభారత కాలానికి సమన్వయం కుదురుతున్నది. కాగా, మహాభారత సమయం క్రీ.పూ. 1200 కు మించదని, ఎందువల్లనంటే iron age అప్పుడే మొదలయ్యిందని కొందరి ఊహ అయితే, జాకోబీ, వెబర్,మాక్డోవెల్ పండితుల ప్రకారం మహాభారతం క్రీ.పూ.మూడవ శతాబ్దానికి చెందినది. వీరి ఊహకు కల్పించిన ఆధారం అలెక్జాండరు దండయాత్ర క్రీ.పూ.మూడవ శతాబ్దంలో జరిగింది. భారతంలో యవన శబ్దం ఉంది కాబట్టి, భారతం ఆ సమయంలోనే జరిగిందన్న వాదన! మరి రామాయణంలోనూ యవన శబ్దం ఉంది కదా అంటే, అది ప్రక్షిప్తం అనేశారు. సరే, అలెక్జాండర్ కంటే ముందే డేరియస్ అనే గ్రీకు రాజు ఉత్తరభారతానికి వచ్చినట్టు ఓ చరిత్రకారుడు వ్రాశాడు కదా, క్రీ.పూ.ఏడవ శతాబ్దంలో శకటాయనుడు కూడా ఆ శబ్దం ఉపయోగించాడు కదా అన్న ప్రశ్నకు సరైన జవాబు లేదు. భారత కాలం స్పష్టంగా నిర్ణయించడానికి, ఋజువులు దొరకలేదని ఘోషణ! అంతర్గత ఋజువులు (internal evidences) దొరికినప్పుడు వాటిని వీలయినంత పక్కన పెట్టటం, లేదా వక్రీకరించటం జరిగింది.

శంకరాచార్యుల కాలం గురించి కూడా, ఆయనచేత స్థాపించబడ్డ పీఠాలలో దృష్టాంతాలు వెతక్కుండా, ఏదో తలాతోకా లేని శ్లోకం ద్వారా ఊహించి,దాన్నే ప్రమాణం చేయడానికి సాధ్యమైనంత ప్రయత్నాలు జరిగాయి.చేశారు కూడాను. ఇప్పుడు జనశ్రుతి ప్రకారం, క్రీ.పూ. జన్మించిన శంకరుడు క్రీ.శ. పదకొండవ శతాబ్దపు వ్యక్తి!!

మహాభారత కాలం గురించి, బుద్ధుడి కాలం గురించి, ఇంకా అగ్నివంశపు రాజుల గురించి, జంబూద్వీపం అంటే ఏమిటి? భరతవర్షం, భరతఖండం, తెలుగువారెవ్వరు, ఆర్యులెవ్వరు తదితర విషయాలపై కీ.శే.కోట వెంకటాచలం గారు కొన్ని గ్రంథాలు వ్రాశారు. మహాభారతంలోని సమయ సంబంధిత శ్లోకాలను అర్థసహితం తెలుపటమే కాక, ప్రత్యక్ష జ్యోతిష్య ప్రమాణాలను, సప్తర్షిమండలం ఏ రాశిలో ఉన్నది వంటి అనేక విషయాలను కూలంకషంగా ఆయన చర్చించారు. ఇంకా ఆంగ్ల చారిత్రకులు గ్రీకు గ్రంథాలలో ఉటంకింపబడ్డ జాండ్రేమ్సు,శాండ్రొకొట్టసు,శాండ్రోసిప్టసు ఎవరు? మౌర్యులకాలం ఎప్పటిది? వాటి ఆధారంగా నిర్ణయింపబడ్డ పొఱబాట్లను, ఆంగ్లచారిత్రకుల ఉటంకింపుల ద్వారనే ఆయన వెలికి తీసి ఋజువులు చూపించారు.

ఆర్య, ద్రవిడ సిద్ధాంతాలు వంటివి colonial consciousness కు ప్రతీకలుగా ఋజువులు దొరుకుతున్న ఈ రోజుల్లో ఓ సాధారణ పండితుడు వ్రాసిన గ్రంథాలు ఆయా ఋజువులకు దగ్గరగా ఉండటం పరిశీలించదగింది. ఇవి కొన్ని తెలుగులో ఉన్నవి. మహాభారతం, బుద్ధుడి కాలం గురించిన గ్రంథాలు ఆంగ్లంలోనూ DLI లో దొరుకుతున్నవి.భారతదేశ చరిత్ర మీద ఆసక్తి, ఇష్టం ఉన్నవారు తప్పక చదవవలసిన విషయాలివి.నిజమైన చరిత్ర బయటపడుతూ, అర్థం లేని సిద్ధాంతాలు ఊహాజనితమని ఋజువవుతున్న ఈ రోజుల్లో భారతదేశంలోని మారుమూల ఓ పండితుడు వ్రాసిన గ్రంథాలు నిజమైన చరిత్రకు దగ్గరగా ఉండటం గమనార్హం.

- అగ్నివంశపు రాజులు
- ఆంధ్రులెవరు?
- కలిశకవిజ్ఞానం
- Time of mahabhaarata
- Buddha's time
కోట వెంకటాచలం 
- సంస్కృత సారస్వత చరిత్ర

19 comments:

 1. ఈ విషయాల గుఱించి అంతర్గతంగా మథనపడి కొద్ది సంవత్సరాల క్రితం నేను నా బ్లాగులో ఒక టపాల పరంపరని ప్రచురించాను. దాని వహణీయ పత్ర సంప్రకార (PDF) రూపాన్ని ఈ క్రింది లంకెలో చూడవచ్చు.

  http://www.scribd.com/doc/6512881/-

  --తాడేపల్లి

  ReplyDelete
 2. ఒక చిఱుసూచన. ఆ పత్రాన్ని ఆ సైటులో చదవడం సాధ్యం కాదు. దించుకుంటేనే చదవడం సాధ్యపడుతుందని గమనిక.

  --తాడేపల్లి

  ReplyDelete
 3. చాలా ఆసక్తికరమైన అంశాలు. తీరిక చేసుకుని ఈ పుస్తకాలొకసారి చదవాలి.

  ReplyDelete
 4. This comment has been removed by the author.

  ReplyDelete
 5. >>శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం అంటే, కంటికి కనిపించే ప్రత్యక్ష ఋజువులకోసం పాకులాట అనేది సంకుచితమైన అర్థం.>> Very true!

  Thanks for an enlightening post.

  ReplyDelete
 6. chaalaa chakkati vivarana sodaaharanamgaa vraasaaru dhanyavaadamulu .

  ReplyDelete
 7. @తాడేపల్లి గారు: నెనర్లు. మీ వ్యాసం చాలా ఆసక్తికరంగా ఉంది. ఎంచేతో భారతీయులకు ఆత్మగౌరవం చాలా కొఱవడినట్టు అనిపిస్తున్నది. ఈ విషయంపై ఇంకా ఆలోచించాలి.

  @నాగమురళి గారు: మీరు తప్పక చదవండి. సంస్కృత వాఙ్మయ చరిత్ర - మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారి రచన కూడా కోట వారి రచన కనీసం ఒకటైనా చదివిన తర్వాత చదివి చూడండి.

  @Enimidi: నెనర్లు

  @దుర్గేశ్వర గారు: నెనర్లు.

  ReplyDelete
 8. చాలా అద్భుతమైన వ్యాసం. ఈమధ్యకాలంలో, బ్లాగుల్లోనే కాదు పత్రికల్లో కూడా ఇంత చక్కని వ్యాసం చదవలేదు.

  ReplyDelete
 9. //గాంధారి కృష్ణునికి శాపం ఇస్తూ, సరిగ్గా 36 యేళ్ళకు //
  శాపాలు, శాపనార్థాలు, ఆశీర్వచనాలు అంత ఖచ్చింతంగా ఫలించినా చరిత్ర రాసేందుకు అది ఆధారం కాజాలదు కదా? ఇంకేమైనా ఆధారాలు ఋజువులు చూడాల్సిందే అనుకుంటాను.

  ఒక డౌటు, గాంధారి 36 ఏళ్ళ తరువాత అనే ఎందుకంది? 100 మంది కొడుకులను కోల్పోయిన తల్లి తక్ష్ణమే తల వేయివక్కలవ్వాలని శపిస్తుంది గాని!

  ReplyDelete
 10. @snkr: అయ్యా, మీరు వ్యాసం సరిగ్గా చదివారా? కలియుగం ఎన్నడు మొదలయ్యిందన్న పరామర్శలో భాగంగా, గాంధారి చెప్పిన మాటను ఉటంకించడం జరిగింది. కలియుగం భారతయుద్ధానికి సరిగ్గా 36 యేళ్ళతర్వాత జరిగిందని మహాభారత కర్త గాంధారి పాత్రతో చెప్పించాడు. అంతే తప్ప శాపనార్థం ఫలించడం వల్ల కలియుగం గణించండి అనలేదు. ఇలాంటి ఆధారం పనికిరాదు, circumstantial evidence దొరక్క పోతే ఒప్పుకోము అంటే, ఆ విషయం సందిగ్ధంగా ఉన్నదని ఒప్పుకొని, సదరు evidence దొరికే వరకు అలానే ఉంచాలి తప్ప, చరిత్రను ఊహాగానం చేయరాదు.

  మరో విషయం ఏమంటే, సాక్షాత్తూ మహాభారత కర్త, "అయ్యా కలియుగం ముందే భారతం జరిగింది" అని మొత్తుకుంటుంటే పెడచెవిన బెట్టి, కల్హణుడి రాజతరంగిణి (లో ఒకానొక శ్లోకం) ఆధారంగా మహాభారతం క్రీ.పూ.ఆరవ శతాబ్దం అని నమ్మించటమేమిటన్నది ప్రశ్న. అదే రాజతరంగిణిలో గౌతముడు 1800 కు పూర్వుడంటే నమ్మకపోవడమేమిటని మరో ప్రశ్న.

  ఇక గాంధారి ఎందుకలా అంది? ఇది antilogic. మీరే ఆలోచించుకోండి.

  ReplyDelete
 11. గాంధారి శాపం దగ్గర లంకె కుదరక ఆగిపోయాను. తక్కిన మీ అభిప్రాయాలు సబబుగా వున్నాయి.

  ఇంతకీ గాంధారి 36 ఏళ్ళ టైం ఫ్రేం ఎందుకు పెట్టిందో , అందులోని తర్క వితర్కములు మీరే చెప్పేయండి.

  ReplyDelete
 12. @Sankar: ముందుగా కొంచెం మన్నించాలి మీరు. మీరు వాదనకొచ్చారేమోనని ఇందాక కాస్త దురుసు సమాధానం చెప్పినట్టున్నాను.

  గాంధారి విషయం. యే మల్లాది చంద్రశేఖరుల వారినో అడగాలి. :-) అయితే శాపం అన్నది, మున్ముందు కాలంలో జరుగబోయే సంఘటనలు యాదృచ్చికంగా సత్యనిష్టాతత్పరులైన వారి నోట వస్తుంది అని ఓ అనుకోలు. ఈ విషయం గురించి ఇదివరకు ఇదే బ్లాగులో చర్చ జరిగింది. మీకు ఆసక్తి ఉంటే పరిశీలించండి.

  ReplyDelete
 13. బ్లాగు టైటిల్ చూసి మీరేదో కామెడీ మనుషులనుకున్నా...పప్పు లో కాలేసానని ఈ టపా చదివాకే తెలిసింది. మన దేశ చరిత్ర లోని నిజానిజాలు పర దేశస్తుల ద్వారా వక్రీకరించబడడం, అవి మన నిజాలనుకొని చదివేసుకోవడం నిజంగా బాధాకరమైన విషయం.

  శంకర్ అనుమానమే నాదీను. గాంధారి 36 ఏళ్ళ టైం ఫ్రేం ఎందుకు పెట్టింది చెప్మా????

  ReplyDelete
 14. ఈ వ్యాసం రాయడానికి మీరు ఎంత పరిశొధన చేసివుంటారొ .. ఎంత సొంత సమయం (అంటే ఉద్యొగం లొ పార్ట్ కానిది) వెచ్చింది వుంటారొ తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.. మీకు ఒపికకి హేట్స్ ఆఫ్...

  ఒకసారి చదివితే నాకు అర్ధం కాలేదు.. మళ్ళీ చదవాలి :-(

  ReplyDelete
 15. చాల మంచి పోస్ట్. నిజమే ఈ కాల నిర్ణయాలు విచిత్రం గా అభిజాత్యాల ఆధిపత్యాల పోరు లో తీరు మార్చుకుంటూ వుంటుంది.

  ReplyDelete
 16. ఇంత సమయం వెచ్చించి పరిశోధన చేసి రాసినందుకు మీకు అభినందనలు. కొంతమంది తర్జుమా రచయితలు మీరు రాసినది చూసి ఉద్వేగం అణచుకోలేక
  హి హి .... అని అప్పుడే జుట్టు పీకుంట్టున్నారు.

  *ఓ దేశపు చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మొదట అక్కడి సంస్కృతినీ, సాంప్రదాయాల్ని, సాహిత్యాన్ని వినమ్రతతో పరిశీలించాలి. *
  * ఎంచేతో భారతీయులకు ఆత్మగౌరవం చాలా కొఱవడినట్టు అనిపిస్తున్నది.*

  అందరి భారతీయులకు ఆత్మగౌరవం కొరవడలేదు కాని ఆత్మగౌరవం లేని కొందరు యునివర్సిటిల లో చేరి పి.జి.లు తరువాత పి.హెచ్.డి.లు టైంపాస్ కొరకు చేస్తూ కాపి పేస్ట్లకు అలవాటు పడ్డారు. వీరికి ఉన్న అజ్ఞాన్ని చూసి వీరె మురిసి పోతునంటారు. నేను చదివిన యునివర్సిటి నంబర్ వన్ అని. నిజం చేప్పాలంటె ఒక ఐ.ఐ.టి.లో చదివిన ఇంజనిరీంగ్ విధ్యార్థి లాంటి తెలివిగల వాడు ఇటువంటి వాటి మీద (హ్యుమానిటిస్, రాజకీయ,సామజిక శాస్త్రల మీద )"ఒక్కడు" సిరియస్ గా తీసుకుంటె ఇప్పటి వరకు వీరు చేసిన/రాసిన రీసర్చ్ కుప్ప తోటి లోకి తోయవచ్చు. అది పెద్ద గొప్ప విషయం కాదు. దానికి సమయం త్వరలో వస్తున్నాది. ప్రభుత్వం విదేశి యునివర్సిటిలను అనుమతినిస్తె ఉస్మానియా, సెంట్రల్, జే.యన్.యు. లాంటి యునివర్సిటిలు తమ ప్రాభవం కోల్పోతాయి. అప్పుడు తెలుస్తుంది ఈ యునివర్సిటిలోని ఆచార్యుల సత్తా అప్పటి వరకు వారు చేసిన పరిశొధనల సత్తా. ఇన్ని రోజులు ఈ యునివర్సిటిల లో ఒక ముఠా తయారయ్యి చరిత్రను వక్రికరిస్తూ రాసిన పుస్తకాలు రానున్న రోజూలలో వచ్చె వీధిలోకి విసిరిపారేస్తారు. ఇప్పుడే ఈ యునివర్సిటిలలొ ఉన్న వారిని చూసి జనం నవ్వుకుంట్టున్నారు. అప్పుడు ప్రజలు వీరు చేసిన ఇన్ని రోజుల ఉపయోగం లేని పరిశొధన ను చూసి చీదరించు కొంట్టారు.
  రామచంద్రన్ తెల్ల వాళ్ళాని వాళ్ళ అజ్ఞాన్ని వారి మొహాన్నె చెప్పి భారతీయ కళల యొక్క గొప్పతన్నాని చాటి చెప్పాడు. వారిలో ఒక్కరు కూడ కుయ్ కయ్ అననలేదు. నోరు మూసుకొని అతను చెపేది విని అభినందించి వేళ్లారు.
  Neurology of Hindu Art - Vilayanur S. Ramachandran
  http://www.youtube.com/watch?v=7ZTvHqM-_jE

  ReplyDelete
 17. ఇంత సమయం వెచ్చించి పరిశోధన చేసి రాసినందుకు మీకు అభినందనలు. కొంతమంది తర్జుమా రచయితలు మీరు రాసినది చూసి ఉద్వేగం అణచుకోలేక
  హి హి .... అని అప్పుడే జుట్టు పీకుంట్టున్నారు.

  *ఓ దేశపు చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మొదట అక్కడి సంస్కృతినీ, సాంప్రదాయాల్ని, సాహిత్యాన్ని వినమ్రతతో పరిశీలించాలి. *
  * ఎంచేతో భారతీయులకు ఆత్మగౌరవం చాలా కొఱవడినట్టు అనిపిస్తున్నది.*

  అందరి భారతీయులకు ఆత్మగౌరవం కొరవడలేదు కాని ఆత్మగౌరవం లేని కొందరు యునివర్సిటిల లో చేరి పి.జి.లు తరువాత పి.హెచ్.డి.లు టైంపాస్ కొరకు చేస్తూ కాపి పేస్ట్లకు అలవాటు పడ్డారు. వీరికి ఉన్న అజ్ఞాన్ని చూసి వీరె మురిసి పోతునంటారు. నేను చదివిన యునివర్సిటి నంబర్ వన్ అని. నిజం చేప్పాలంటె ఒక ఐ.ఐ.టి.లో చదివిన ఇంజనిరీంగ్ విధ్యార్థి లాంటి తెలివిగల వాడు ఇటువంటి వాటి మీద (హ్యుమానిటిస్, రాజకీయ,సామజిక శాస్త్రల మీద )"ఒక్కడు" సిరియస్ గా తీసుకుంటె ఇప్పటి వరకు వీరు చేసిన/రాసిన రీసర్చ్ కుప్ప తోటి లోకి తోయవచ్చు. అది పెద్ద గొప్ప విషయం కాదు. దానికి సమయం త్వరలో వస్తున్నాది. ప్రభుత్వం విదేశి యునివర్సిటిలను అనుమతినిస్తె ఉస్మానియా, సెంట్రల్, జే.యన్.యు. లాంటి యునివర్సిటిలు తమ ప్రాభవం కోల్పోతాయి. అప్పుడు తెలుస్తుంది ఈ యునివర్సిటిలోని ఆచార్యుల సత్తా అప్పటి వరకు వారు చేసిన పరిశొధనల సత్తా. ఇన్ని రోజులు ఈ యునివర్సిటిల లో ఒక ముఠా తయారయ్యి చరిత్రను వక్రికరిస్తూ రాసిన పుస్తకాలు రానున్న రోజూలలో వచ్చె వీధిలోకి విసిరిపారేస్తారు. ఇప్పుడే ఈ యునివర్సిటిలలొ ఉన్న వారిని చూసి జనం నవ్వుకుంట్టున్నారు. అప్పుడు ప్రజలు వీరు చేసిన ఇన్ని రోజుల ఉపయోగం లేని పరిశొధన ను చూసి చీదరించు కొంట్టారు.
  రామచంద్రన్ తెల్ల వాళ్ళాని వాళ్ళ అజ్ఞాన్ని వారి మొహాన్నె చెప్పి భారతీయ కళల యొక్క గొప్పతన్నాని చాటి చెప్పాడు. వారిలో ఒక్కరు కూడ కుయ్ కయ్ అననలేదు. నోరు మూసుకొని అతను చెపేది విని అభినందించి వేళ్లారు.
  Aesthetic Universals and the Neurology of Hindu Art - Vilayanur S. Ramachandran
  http://www.youtube.com/watch?v=7ZTvHqM-_jE

  ReplyDelete
 18. చాలా ముఖ్యమైన విషయాన్ని చక్కగా చెప్పారు. ఇంకా మంచి వ్యాసాలు వ్రాస్తారని ఆశిస్తున్నాను.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.