Tuesday, June 29, 2010

ఆత్మస్తుతి

కొరియా గాళ్ళకు, జపానోళ్ళకు మాయరోగమొకటుందట. కొంతకాలం (ఓ పాతికేళ్ళు వేసుకోండి) కోకాకోలా లాంటిదేదైనా వాళ్ళ దేశంలో స్థిరపడిపోతే, కోకాకోలా మాదనేస్తారట వాళ్ళు. అఫ్కోర్సు, మన పెద్దలూ, "అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష" అంటుంటారు. అయితే ఒక తేడా ఏటంటే, మన వాళ్ళు మన ప్రాచీనత్వాన్ని చూసుకుని మురిసి పోతే, ఆళ్ళు ఎవడిదాన్నో తమ సొంతం చేసుకుని మిడిసిపడుతుంటారు.

పై విషయం నాకు ఈ మధ్య కొన్ని సార్లు కొట్టొచ్చినట్టు కనిపించింది. మా కచేరీ ప్రధాన కార్యాలయం నుండీ ఓ అతిపెద్ద తలగాడొచ్చాడు మొన్నామధ్య. వాడు కఛేరీలో కొంతమందిని సభికులను ఉద్దేశించి ప్రసంగించాడు. ఆ అవకాశం దక్కిన అరుదైన దురదృష్టవంతుల్లో నేనొకణ్ణి. మాటల మధ్యలో వాడు మేనేజిమెంటు గురించి మాట్లాడుతూ, స్వోత్కర్ష మొదలెట్టాడు. అదేదో కర్మ మేనేజిమెంటుట. అది నేర్చుకొమ్మని తను అందరికీ సలహాయిస్తుంటాడట. దాని గురించి అర్ధనిమీలిత నేత్రాలతో చెబుతూ అన్నాడు.

"మనం చేసిన పని ఫలితం గురించి ఆలోచించరాదు. అలాగని నిస్పృహ కూడా చెందరాదు. చేసే పని చేస్తూనే ఉండాలి...." వగైరా వగైరా. మధ్యలో చెప్పడం ఆపి రియాక్షన్ ఎలా ఉందో చూశాడు. ముత్యాలముగ్గులోలా కనబడేట్టు భజంత్రీలు మోగకపోయినా, సభికుల కళ్ళలో భక్తి, ఆసక్తి కనిపెట్టాడు. ఇంకాస్త ముందుకెళ్ళి, "కర్మ" అంటే ఏమిటో తెలుసా? అడిగాడు. I think it is Indian word..అన్నాడు ఏదో ఊహిస్తూ...ఇలా ఆ సెషను ముగిసింది. కర్మ గురించి భారతీయులకు నేర్పడం!! ఆహా!!! అనిపించింది నాకు.

జపానోళ్ళ ’చాయ్’ కథ కూడా అలాంటిదే. తేయాకు అరబ్బు దేశాల నుండీ వచ్చిందని చాలమందికి ఎఱుకే. అయితే అది మాదేనంటారు వీళ్ళు. అందుకో కథ కూడా. వేల యేళ్ళ క్రితం భారద్దేశం నుండీ బోధిధర్ముడనే బౌద్ధ భిక్కువొకతను చైనా, అక్కడ నుండి జపాను వెళ్ళాడట. అతను తన కనురెప్పలు రెండూ కత్తిరించేసుకుని ’చ’అనే ఓ కొండ మీద తపస్సు చేశాడుట. ఆ కత్తిరించిన కనురెప్పలు తేయాకులుగా మారినై. వాటితో ’చాయ్’కాచుకుని తాగేరట. అందుకే చాయ్ తాగితే నిద్దర రాదట. జపానులో టీ ఫెస్టివలు కూడా ఉంది. టీ ఎలా ఒంపాలో దానికి పద్ధతులున్నాయి. (చూడుడు: మెమోయిర్స్ ఆఫ్ గీషా)
 
కథ బావుంది కదూ!

బ్లూ ఓషన్ స్ట్రాటెజీ గురించి ఓ మారు ఓ సభకు కెళ్ళవలసి వచ్చింది నాకు. బ్లూ ఓషన్ అంటే, ఉన్న మార్కెట్ లో స్పర్ధలతో కొట్టుచు ఛావడం కాకుండా (అలా కొట్టుకు ఛావడం రెడ్ ఓషను కిందికి వస్తుంది) కొత్త మార్కెట్ సృష్టించుకోవడం. ఏపిల్ ఐఫోను, అదేదో బీరు కంపెనీ, భారతదేశంలో నీళ్ళు అమ్మడం ఇవన్నీ దానికి ఉదాహరణలు. ఈ స్ట్రాటెజీ గురించి పరిశోధించి సిద్ధాంతీకరించిన వాడు ఓ కొరియన్ అట. వాడి అనుంగు శిష్యులే వచ్చినవారు. అందులో ఒకడు చెబుతూ, ఈ స్ట్రాటెజీ భారతదేశంలోనే మొదలయ్యిందన్నాడు. డీటయిల్సు వాడికి తెలియదట, కానీ రఫ్ గా మౌర్య సామ్రాజ్యం అందుకు ఉదాహరణ అన్నట్టు ఓ క్లూ ఇచ్చాడు. నాకు తర్వాత ఊహిస్తే అనిపించింది. చాణక్యుడు దేశాన్ని సంఘటిత పరచి, భేదోపాయంతో నందులను నాశనం చేసి, యవనులనరికట్టడానికి మహాసమ్రాజ్యం స్థాపించడం ఓ బ్లూ ఓషన్ స్ట్రాటెజీ అని. ఏమో ఈ ఊహ కరెక్టో కాదో.

మరోసారి కొరియాలో ఓ బౌద్ధ మందిరమెళ్ళాను మిత్రులతో కలిసి. అక్కడ ఫుటోలు తీసుకుంటున్నాం మిత్రులం. కాసేపటికి అక్కడికి ఓ మధ్యవయసు యువతి దాదాపు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఫుటోలు తీయొద్దంది. మందిరం బయట తీసుకుంటామన్నా వద్దంది. (అప్పటికే ఫుటోలు తీశేశామనుకోండి) నేను కాస్త చొరవచేసి, మేము మీకు బుద్ధుణ్ణే ఇచ్చాం కదా, మాకు ఆయన ఫుటోలు కూడా మీరు తిరిగివ్వరా అని నవ్వుతూ అడిగేను. ఆవిడ కాస్త కోపంగా (అనుకుంటాను) వచ్చీ రాని భాషలో అంది. బుద్ధ - గాడ్, బుద్ధ - చైనా, నో ఇందో సరమ్....నో ఫోటో...రాంగ్...

అంతా మాదే అనే ఈ రోగం తెల్లదొరలకూ ఉంది కాబోలు. దీన్ని ముద్దుగా కొలోనియల్ కాన్షియస్ నెస్స్ అంటారని యేడాది క్రితం మలక్ పేట రౌడీ బ్లాగులో వచ్చిన సిరీస్ చదివితే తెలిసింది. వాళ్ళు వక్రీకరించిన చరిత్ర గురించి ఈ మధ్యే కొన్ని పుస్తకాలు చదువుతుంటే తెలిసింది. వాటి గురించి మరెప్పుడైనా మాట్లాడుకుందాం.

7 comments:

 1. ఏమీ అనుకోకండీ, బట్ మీరు రాసిన టాపిక్ కీ హెడింగ్ కీ ఏమీ సంబంధం ఉన్నట్టు నాకు తోచడం లేదు. :-(

  ReplyDelete
 2. కొరియా వాళ్ళంటే గుర్తుకొచ్చింది. చికాగోలో అప్పుడెప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం పని చేస్తున్నప్పుడు, జూలీ వాంగ్ అని మా టీము లీడు ఒకావిడ అచ్చంగా మీరు చెప్పిన మాయరోగాన్ని మెళ్ళో మాలలా వేసుకుని తిరుగుతూ ఉండేది.

  ఒకానొక చలికాలంలో, సున్నా డిగ్రీలో ఒక రెండు బ్లాకుల దూరంలోని "సబ్ వే"కు (ట్రెయిను స్టేషను కాదు, మెక్కే కొట్టు) కు వెడుతూండగా ఆవిడ మాయాభరణం కంఠాన్ని వదిలి గాలిలోకి తేలే పని పెట్టుకోగా - "యోగా" అను ప్రక్రియ కొరియా వాళ్ళు కనిపెట్టిందని చెప్పేటప్పటికి అంత చలిలోనూ తట్టుకోలేని వేడి పుట్టుకొచ్చింది.

  అప్పటికి సబ్ వే లో టోష్టు మొదలుకాలేదనుకుంటా. మొదలయ్యి ఉంటే, ఆ కొట్టోవాడికి చెప్పేవాడిని, అబ్బీ - టోష్టు చెయ్యనక్కరలా, ఆ బ్రెడ్డు ముక్కలు ఇలా తగలెయ్యి - చెరో కర్ణానికి తగిలించుకుంటానని!!

  ReplyDelete
 3. జపాన్ కధ బాగుందండి... కాని ఒక డౌట్.. తపస్సు చేసుకోడానికి కనురెప్పలు కత్తిరించు కోవటం ఎందుకు?? కళ్ళు మూసుకుంటే సరి పోతుంది కదా.. :) :)

  Nice Post..:) :)

  ReplyDelete
 4. బాగుంది. సున్నాని కనిపెట్టింది ఇస్లామిక్ నాగరికతే అని ఓ పుస్తకంలో చదివి నవ్వుకున్నాను. సున్నాని కనిపెట్టింది మనవాళ్ళే అని అందరూ అంగీకరించే విషయమే.

  ReplyDelete
 5. అవును అన్నీ అంటే అన్నీ భారతదేశంలోనే పుట్టాయి :D

  దీనినే cultural egoism (పేరు సరిగా గుర్తుకురావట్లేదు) అనో ఎదో అంటారని కొత్తగా ఉద్యోగంలో చేరినప్డు టిసియస్ లో చెప్పారు।

  మనం అన్నీ వేదాల్లో వున్నాయంటే, తెల్లవాళ్ళు ఆర్యుల దండయాత్ర అని చెప్పి వేదాల్ని అపహరించారు :D Super idea కద।

  అన్నట్టు కొరియను లిపి, మంగోలుల నుండి ఎత్తుకోబడ్డది, మంగోలుల లిపి తిబెత్తి నుండి ఎత్తుకోబడ్డది, తిబెత్తి లిపి ఎక్కడినుండి ఎత్తుకోబడ్డదో తెలిసిందే।
  వివరాలకు వికీపీడియా చూడండి।

  ReplyDelete
 6. http://en.wikipedia.org/wiki/Ethnocentrism

  ReplyDelete
 7. @DG: May be. శీర్షిక ఏది పెట్టాలో తోచలేదు.

  @వంశీ గారు: ఇంకొన్నాళ్ళకు అది నిజమై కూర్చుంటుంది. అలాంటోళ్ళ మాటలు నిజమవుతాయి. తదనంతర టపా వీలయితే చదవంటి.

  @వేణూరాం: అదో టైపు ధ్యానమట.

  @నాగమురళి: ఖచ్చితంగా ఇది కాదు కానీ, దీనికి సంబంధించినదేదో వేమూరి వెంకటేశ్వర్రావు గారి బ్లాగులోనో మరెక్కడో చూశాను.

  @రాకేశ్: jingoism?

  కొరియా లిపి సృష్టించిన వాడి విగ్రహం ముందు ఫోటో దిగాను నేను. :-)

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.