Wednesday, June 16, 2010

బన్ జాయ్ (షాడో స్పై అడ్వెంచర్)

"వేళకు వస్తానన్న పెద్దమనిషి గంటైనా సిస్టం దగ్గర నుండీ లేవకపోతే కోపం వస్తుందా రాదా నువ్వే చెప్పు" కాకా అంగడి యజమానిని అడిగేడు గంగారాం. టూ టవును లో ఓ సినిమాహాలు వద్ద ఉన్న కాకా టిఫిన్ సెంటర్లో గంటన్నర నుండీ వెయిట్ చేస్తున్నాడతను. ఓ వారం రోజులుగా తల హూనమయేట్టు ప్రాజెక్టుపని చేసి, శుక్రవారం సాయంత్రం డెలివరీ చేసివస్తున్నాడు. డేమేజరుకు రిపోర్ట్ ఇచ్చేసి ఇదుగో ఇప్పుడే వచ్చేస్తానని, ఈవెనింగ్ షో కు తనకూ టికెట్లు తీసుంచమని చెప్పాడు ప్రాజెక్టు లీడరు షాడో తనకు.

ఏమీ సమాధానం చెప్పలేదు కాకా. అప్పటికే రెండు ప్లేట్ల పూరీకూర్మా, ఓ మూడు చాయ్ లు లాగించిన కస్టమరునెలా వదులుకుంటాడు?

"మరో చాయ్ తెప్పించమంటారా?" రాగయుక్తంగా అడిగాడు టీబంకు యజమాని.అడగడమే కాదు, పొగలు వెలువరిస్తున్న స్పెషల్ అల్లం టీని తనే స్వయంగా తీసుకొచ్చి గంగారాంకందించాడు.

ఆ టీతో బాటు బరో బన్నును లాగించి, త్రేనుస్తూ లేచాడు గంగారాం. బిల్లుకు మరో రెండునోట్లను కలిపి టీ బంకు యజమానికి అందించాడు. ముఖమంతా నవ్వులమయం అయిపోతుండగా, భక్తితో అందుకున్నాడు టీబంకు కాకా.

అలా చల్లగాలికి మరికాసేపు తిరిగి చీకట్లో ఓ మూల సందులో లఘుశంక తీర్చుకోవడం కోసం వెళ్ళాడు.

"అగ్గిపెట్టుందా బ్రదర్?" రెండు గొలుసులు ఒకదాన్నొకటి రాచుకుంటున్నట్టున ఓ గొంతు పక్కన వినబడింది గంగారాంకు. ఉలికిపాటును నేర్పుగా కప్పిపుచ్చుకుంటూ పక్కకు చూశాడు. ఎవరికోసమో వెయిట్ చేస్తున్నట్టు నిలబడి ఉన్నాడో ధృఢకాయుడు అక్కడ.

"లేదు" అంటూ పక్కకు జరిగి మెయిన్ రోడ్డుకు వెళ్ళబోయాడు.

"ఎక్కడికి బే?" అంటూ రఫ్ గా భుజం చరుస్తూ ముందుకు వచ్చారు మరో ఇద్దరు ధృఢకాయులు పక్కనుంచి.

లాగిపెట్టి వాళ్ళ ముఖం మీద చరిచి రోడ్డువైపు పరిగెత్తాడు గంగారాం. ఓ నాలుగడుగులు వేయగానే అతణ్ణి మరో నలుగురు ధృఢకాయులు కమ్ముకున్నారు. లాగిపెట్టి భుజం మీద తన్నాడు అందులో ఒకడు, గంగారాం ను.


అంతటితో సహనం నశించింది గంగారాంకు.

"ఈ గంగారాం మీదే చెయ్యి వేస్తార్రా, అమ్మా కలకత్తా కాళీ వీళ్ళందరినీ ఐదు నిముషాల్లో పడగొడితే నీకో వేటపుంజు బలి గ్యారంటీ" అంటూ వాళ్ళ మధ్య తిరుగుతూ, దొరికిన వాణ్ణి దొరికినట్టు విరగదీయడం ఆరంభించాడు. "ఫట్ ఫట్" మంటూ వినవస్తున్నాయి ధ్వనులు. సరిగ్గా ఐదు నిముషాల్లో గుంపును విరగదీసి పక్కకు వచ్చాడు. అప్పుడు సరిగ్గా, తల మీద బాణాకర్రతో దెబ్బ పడింది. వెనక్కి తిరిగి చూసే లోపల మరో దెబ్బపడింది. వెచ్చటి రక్తం బుగ్గలమీదుగా జాలువారింది. కళ్ళముందు నల్లటి పరదాలు క్రియేట్ అవుతుండగా, అలాగే వెనక్కి విరుచుకుపడిపోయేడు.

********

పిశాచం లాంటి ఆకారమొకటి తన గొంతు నులుముతున్నట్టు దారుణమైన కలగన్నాడు షాడో. శుక్రవారం సాయంత్రం ప్రాజెక్టు డెలివరీ ఇవ్వగానే, డేమేజరుకు చెప్పి తనూ బయల్దేరాలనుకున్నాడు. అంత తొందరగా ఇంటికి పంపుతే డామేజరెలా అవుతాడు?

"క్లయింటు వద్ద నుండీ సేనిటీ రిపోర్టు అందగానే వెళ్ళు" అంటూ వెకిలినవ్వులు చిందిస్తూ తనను అక్కడే నిలిపేశాడు డేమేజరు. దాంతో రాత్రంతా అక్కడే కుర్చీలో కూర్చుని కునికిపాట్లు పడ్డాడు తను. మాగన్నుగా నిద్రపట్టగానే కలగన్నాడు.

వాచీ శనివారం పొద్దున తొమ్మిది అని చూపిస్తోంది. విసుగ్గా లేచికూర్చుని బాత్ రూం వైపు అడుగులేశాడు. ముఖం కడుక్కుని, చాయ్ కలుపుకుని తన సీటు వద్దకు వచ్చి డేమేజరు కోసం ఎదురుచూడనారంభించాడు. ఓ గంటకు షాడో ఎదురుచూపులు ఫలించాయి.

డేమేజరు రాగానే, "ఇంతవరకూ ఏ సమస్యా లేదని", ఇక ఇంటికి వెళతానని అడిగాడు షాడో.

"ఇంకా పని ఉంది బే. రిపోర్టు పూర్తిగా వచ్చే వరకు ఇక్కడే ఉండు" క్రూరంగా నవ్వుతూ చెప్పాడు డేమేజరు.

"ఒక్క మూడు గంటలు సమయమివ్వండి. డెవలపర్ గంగారాం ఏమయ్యాడో, ఎక్కడున్నాడో చూసొస్తాను" వదలకుండా ప్రాధేయపడ్డాడు షాడో.

షాడో మాటలు వినబడనట్టు నటిస్తూ తన కేబిన్ వైపు అడుగు వేయబోతున్నాడు డేమేజరు. అంతటితో షాడో సహనం నశించింది. కంఠం నుండీ దారుణమైన కుంగ్ ఫూ షౌట్ వెలువరిస్తూ, ఫెడీ మని తన్నాడు డేమేజరు గుండెల మీద.

మామూలు వ్యక్తి అయితే ఓ పదడుగులు వెనక్కి విరుచుకు పడి ఉండేవాడు ఆ దెబ్బకు. డేమేజరు మాత్రం ఓ రెండడుగులు వెనక్కి వేసి నిలద్రొక్కుకున్నాడు. విచిత్రంగా నవ్వుతూ "నీ పై అధికారిని గౌరవించమని హెచ్చార్ వారు చెప్పిన నీతి సందేశాన్ని పెడచెవిన బెట్టావు. సాఫ్ట్ వేర్ పీఠం నియమాలను ఉల్లంఘించినందుకు నీకు తగిన శాస్తి చేస్తాను" అంటూ కంటికి కనిపించనంతవేగంతో చేయిని విసిరాడు షాడోమీదకు. రెండు చేతులూ అడ్డు పెట్టి ఆ దెబ్బ కాచుకున్నాడు షాడో. అయినప్పటికీ భుజానికి తగలనే తగిలింది. భుజం విరిగిపోయినట్టుగా ఫీలవుతూ పక్కకు జంప్ చేశాడు.

అవధులు మించిన ఆగ్రహంతో ముందుకు వచ్చాడు డేమేజర్. ముందుకు జరిగి ఫ్రంట్ కిక్ వెలువరించ బోయాడు. అక్కడే పాదం మెలికపడింది. డెస్క్ టాప్ ఎల్ సీడీమీద పడి తల బద్దలు కొట్టుకోకముందే పక్కకు లాగేశాడతణ్ణి షాడో. అతి ప్రయత్నం మీద భుజం మీద ఎత్తుకుని సోఫాలో కుదేశాడు.

డేమేజరు తిరిగి లేవకముందే వెనక్కి తిరిగి జంప్ చేసి మూడే మూడంగల్లో అక్కడ నుండీ అదృశ్యమయాడు.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


చటుక్కున మెలకువ వచ్చింది. పక్కనే బంజాయ్ - షాడో నవల సగం చదివినట్టి సగానికి మూసి ఉంది. పన్నెండింటికి ఆఫీసునుండీ వచ్చి పడుకుంటే రెండుకు నిద్రపట్టింది. ఇప్పుడు నాలుగ్గంటలయ్యింది. కాసిన్ని మంచినీళ్ళు తాగి మళ్ళీ ముసుగుతన్నాను.

13 comments:

 1. नमस्ते,

  आपका बलोग पढकर अच्चा लगा । आपके चिट्ठों को इंडलि में शामिल करने से अन्य कयी चिट्ठाकारों के सम्पर्क में आने की सम्भावना ज़्यादा हैं । एक बार इंडलि देखने से आपको भी यकीन हो जायेगा ।

  ReplyDelete
 2. కేక పెట్టించారుగా. సూపర్. నేనెప్పుడూ షాడో నవల్లు చదవలేదుగానీ, మీ కామెడీ అసలుని మించిపోయినట్టే ఉంది. తెగ నవ్వుకున్నాను, మళ్ళీ మళ్ళీ చదువుకోవాల్సిన టపా.

  ReplyDelete
 3. నవ్వించారు!

  ReplyDelete
 4. చక్కటి పద్యాలే కాదు..మంచి కధలు కూడా రాస్తారన్నమాట. చాలా బాగుందండీ. మీ ఇంద్రచాపం ఇంకా చాలా బాగుందండీ నాకు.

  ReplyDelete
 5. రవిగారూ చిన్న సందేహం..మీరు ఏ ఏ గ్రంధాలు చదివారు?

  ReplyDelete
 6. హ్హహ్హ... సూపర్!!
  నిన్నే చదివా ఈ నవల.. ఈ రోజు చూస్తే మీ టపా :)

  ReplyDelete
 7. రవిగారూ బాగున్నదండీ మీ కథనం.. ఇంతకీ గంగారాం ని అట్టా మధ్యలో వదిలేసారేం?

  ReplyDelete
 8. ధృఢకాయుడు

  ఎక్కడికి బే

  పొగలు వెలువరిస్తున్న స్పెషల్ అల్లం టీని తనే స్వయంగా తీసుకొచ్చి గంగారాంకందించాడు

  లాగిపెట్టి వాళ్ళ ముఖం మీద చరిచి రోడ్డువైపు పరిగెత్తాడు గంగారాం

  ఫట్ ఫట్" మంటూ వినవస్తున్నాయి ధ్వనులు

  అలాగే వెనక్కి విరుచుకుపడిపోయేడు

  క్రూరంగా నవ్వుతూ చెప్పాడు డేమేజరు

  దారుణమైన కుంగ్ ఫూ షౌట్ వెలువరిస్తూ, ఫెడీ మని తన్నాడు డేమేజరు గుండెల మీద.

  మామూలు వ్యక్తి అయితే ఓ పదడుగులు వెనక్కి విరుచుకు పడి ఉండేవాడు ఆ దెబ్బకు. డేమేజరు మాత్రం ఓ రెండడుగులు వెనక్కి వేసి నిలద్రొక్కుకున్నాడు

  Super asalu… pichekincharu…

  Ademitandi.. shado cheta cigarette tagincha ledu…??? Cigarette taga lanna korikanu balavantam ga aapukunnadaa?? :) :)

  meeru chaduvu tunnadi rudrani navala. am i correct??

  ReplyDelete
 9. @మురళి గారు: షాడో అంటే షర్టు, ప్యాంటు వేసుకున్న జానపద కథానాయకుడే. ఈ ముక్కే ఆసక్తికరంగా ఉంటే, ఓసారి నవల చదివి చూడండి. మధుబాబు పుస్తకాలిప్పుడు ఆన్లైనులో ఉన్నవి. సుజాత గారి లేటెస్టు టపా చూడండి. మధుబాబు గారి సైటులో భోలాశంకర్ గానీ, షాడో షాడో గానీ చదవండి.

  @శ్రీనివాస్ గారు, @విజయమోహన్ గారు: :-)

  @ప్రణీతస్వాతి గారు: నేను jack of all, master of none అండి. నాకు ఏ విషయంపైనా లోతైన అవగాహన లేదు. ఏ గ్రంథమూ పూర్తిగా చదవలేదు.

  @మేధ గారు: Wav, Happy reading. Both the book, and post. :-)

  @సనత్ శ్రీపతి గారు: రాసుకుంటూ పోతే నవలయిపోతుంది. :-) లేకపోతే, తేటగీతి బ్లాగులోలా సీరియల్ రాయాలి. నాకు అంత ఓపిక లేదండి.

  @వేణూరాం గారు:

  రాగయుక్తంగా అడగడం, కలకత్తా కాళి, ఇవి కూడా ఉన్నాయి. :-)

  ReplyDelete
 10. రవి గారూ..

  ఇంత చక్కటి పద్యాలు రాస్తూ(శంకరయ్య గారి సమస్యా పూరణం-15 బస్సు నీటఁ దేలె పడవ వోలె )..ముక్కు తిమ్మన లాంటి మహానుభావుల రచనల్లోని అర్ధాలు వివరిస్తూ.."నేను jack of all master of non" అంటారేంటండీ..

  నిండు కుండ తొణకదు అనే మాట ఎందుకొచ్చివుంటుందో ఇప్పుడర్ధమైంది.

  ఇంద్రచాపం లో కూడా రాయండి రవిగారూ..

  ReplyDelete
 11. చిన్నప్పుడు షాడో నవలలు తెగ చదివే వాడిని. మిగత స్పై/డిటెక్టివ్ నవలల్లో ఉన్న అపరిమిత శృంగారం వీటిలో కనిపించదు. టైంపాస్ కావడానికి బాగా ఉపయోగపడుతాయి. (నాకు తెలిసి బంజాయ్, మధుబాబు పబ్లికేషన్స్ వారి మొదటి ప్రచురణ.)

  రవి గారు, ప్యారడీ అదరగొట్టారు!

  ReplyDelete
 12. ఇంత చక్కగా ప్యారడీ రాయడం మీకే సాధ్యం, రవి గారు!

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.