Sunday, June 13, 2010

ఇంకొంచెం జపాను

హలో
నమస్తే

నమస్కార

వణక్కం

రాం రాం

కోన్నిచివా

పలుకరింపులెన్నైనా హృదయమొక్కటే. కోన్నిచివా అనేది జపనీసు భాషలో పలుకరింపు.


********************************************
*******************

బెంగళూరు వచ్చిన మొదటి రోజులు. పెన్ గర్ల్ ఫ్రెండు (ఇదివరకటి టపాలో ఆవిడ కాదు) ఓ రోజిలా అంది. "మీ బెంగళూరులో ---- బుద్ధ ట్రస్ట్ అని ఒక జపాను వారి మందిరం ఉంది. మీరక్కడికి నా మిత్రుడని చెప్పి వెళ్ళండి. మీకో జెన్ గురువు పరిచయం కాగలడు. అక్కడ ఉన్న వారి ద్వారా జపాను సంస్కృతి, సంప్రదాయాలు మీక్కాస్త తెలియవచ్చు".

సరే, అప్పుడు బ్రహ్మచారిని కాబట్టి ఓ శనివారం ఎగేసుకుంటూ బీటీఎమ్ లే అవుట్, విప్రో ఆఫీసు వెనుకవైపు అడ్రసు వెతుక్కుంటూ జపాను మందిరం చేరుకున్నాను.


అదో అపార్టుమెంటు!

తలుపు బజ్జర్ నొక్కగానే ఓ జపాను ఆంటీ వచ్చి తలుపు తీసింది. "?" ఇలా నా వైపు చూసింది. నేను ఫలానా అమ్మాయి ఫ్రెండునని ప్రవర చెప్పుకున్నాను. ఆమె "?", "!" గా మారింది. లోనికి ఆహ్వానించింది. అక్కడ సూటు బూటు వేసుకుని ఒకాయన సోఫాలో కూర్చుని ఉన్నాడు. ఆయన, ఈ ఆంటీ ఏదో మాట్లాడుకున్నారు. సూటుబూటాయన కూడా "!" తో, "దోజో, సువత్తే కుదాసాయ్ నే" (తిట్లు కాదండి- ఇంద, రండి కూర్చోండి- అని అర్థం) అంటూ నాకు స్వాగతం పలికేడు. ఆ సూటుబూటాయన్ను"ఈయనే గురూజి మకెయ్ సాన్" అంటూ ఆంటీ నాకు పరిచయం చేసింది. ఈ సారి "?+!" నా వంతైంది.

నిడుపాటి గడ్డం, జడలు కట్టిన జుత్తూ, దండకమండలాలూ - ఇవి లేకపోయినా మానె. ఓ కిమోనో తగలెట్టుకుని ఉండవచ్చు కదా జపనీసు గురువు అని నాకు అనిపించింది. అయితే ఆయన మాట, మంతీ మహా సున్నితంగా ఉన్నాయి. (Unlike the traditional zen masters!) పైపెచ్చు ఆయన అమాయకుడిలా కనబడ్డాడు నాకు. (ఎందుకో మీకు తెలుస్తుంది)


కాసేపు తర్వాత అందరూ నార్మల్ స్టేట్ కొచ్చాము. ఆ గది పరికించి చూస్తే - ఎదురుగా ఓ పెద్ద బల్లపై బుద్ధుడి ప్రతిమ, దానికింద అగరొత్తులూ, బిస్కెట్లు, కుకీస్ వంటి ప్రసాదాలు, పూలు -ఏదో పూజ జరిగినట్టు సూచిస్తున్నాయి. ఓ మూల నిలువెత్తు గుఱ్ఱం బొమ్మ, మరో మూల పిల్లి బొమ్మ, కుండీలలో చెట్లు (బోన్సాయ్) అనుకుంటాను.అలా ఉంది. ఇంతలో ఆ జపాన్ ఆంటీ టీ, బిస్కట్లు తెచ్చి పెట్టింది. ఆ టీ - కషాయానికి చెల్లి మన టీ కి అక్క. టీ తో బాటు బిస్కట్లు ఎందుకు పెడతారో నాకు తెలిచి వచ్చిన క్షణమది. కాసేపు మాట్లాడిన తర్వాత ఆవిడ ఇదుగో ప్రసాదం అంటూ దాదాపు పావుకిలో పరిమాణంలో రెండు తగరపు పాకేజీలిచ్చింది. బయటపడి హాస్టలుకొచ్చి, ఆ పాకేజీలిప్పాను. అందులో - కమ్మటి పులిహోర, చక్కెరపొంగలి! అవి వారికెలా దొరికాయి, అదీ అని వచ్చిన ఆలోచనను, వాటి పరిమళాలు మింగేసినయ్. రూము గడివేసి, ఒక్కణ్ణె ఆ రెండు డబ్బాలూ లాగించేను. (ఇలాంటివి దొరికినప్పుడు హాస్టల్లో గడి వేసుకుని తినడం స్ట్రిక్టుగా నేను పాటించే ఓ నియమం).


తర్వాతి వారం.

జపనీసు ’సంప్రదాయాన్ని’ ఇంకా తెలుసుకుందామని అక్కడికి వెళ్ళాను. ఈ సారి తలుపు ఓ అమ్మాయి తీసింది. ఆ అమ్మాయి అచ్చం ఇలా ఉంది.


ఈ సారి, "?", "!", ఇవేవీ నన్ను బాధించలేదు. లాస్ట్ సమురాయ్ సినిమాలో ఓ పిల్లవాడు టామ్ క్రూయిస్ తో "నువ్వు బుద్ధి ఉపయోగించి యుద్ధం చేస్తున్నావు. ఏవీ ఆలోచించక యుద్ధం చెయ్" అంటాడు. (అశొచ్యానన్వశోచస్త్వం ..టైపు). జెన్ ప్రిన్సిపుల్ అది. నేనూ ఆ అమ్మాయిని చూసి నేను ఓ క్షణం ఏవీ ఆలోచించలేదు.

తేరుకున్నాక అమ్మాయికి నేను ఇందాకటి ప్రవర చెప్పుకున్నాను. ఆమె చిన్నికళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయాయి. నన్ను ఆమె నవ్వుతూ ఆహ్వానించింది.ఆమెకు నేను ఇదివరకే నా పెన్ ఫ్రెండు ద్వారా తెలుసట. ఎంచేతో ఆ అమ్మాయి తెగ ఆశ్చర్యపడిపోతున్నట్టు అనిపించింది నాకు. మాటిమాటికి జపాను పద్ధతిలో దణ్ణం పెడుతూ ఉందామె. అలా ఎందుకు దణ్ణం పెడుతున్నావని అడిగేశానామెను. అది దణ్ణం కాదని, వినయమని, కుడి చేయి పిడికిలి, ఎడమ అరచేతిలో బిగించే ముద్ర, కడుపులో పాపాయిని సూచిస్తుందనీ - ఇలా ఏవో చెప్పిందా అమ్మాయి. ఈ సారి ఆంటీని, గురూజీని నేనెక్కువగా మాట్లాడించలేదు. వారు ఏదో పనుల్లో ఉండి అంతగా పట్టించుకోలేదు. టీ, బిస్కట్లు మామూలే. ఈ సారి జపాను ’సంప్రదాయం’ దొరకలేదు.


******************************************** **********************

నా రూములో ఏదో గూడుపుఠానీ జరుగుతున్నట్టు హాస్టల్లో ఒకరిద్దరు కనిబెట్టారు. దాంతో విషయం కొంత బయటకు పొక్కింది. తర్వాతి వారం నేను, పక్క రూమువాడు వాడి బండిలో బయల్దేరాము. అక్కడికెళ్ళిన తర్వాత మరో ముగ్గురు చేరారు. నేను సైన్యాధ్యక్షుడిలా కోటవైపు అడుగుపెట్టాను.

ఈ సారి మళ్ళీ ఆంటీ. నా ఫేసు ( @_@ ) లా అయ్యింది. cherry blossoms కోసం నా కళ్ళు గాలించేయ్. దొరకలేదు. ఊరెళ్ళిందట ఆ అమ్మాయి, నాతో మాటవరసకైనా చెప్పకుండా. ఇంతలో ఓ బృందం వచ్చిందక్కడికి. అందరూ హడావుడిగా ఓ ఫంక్షన్ కోసం ప్రిపేరు అవసాగారు.
ఆ రోజో జపాను పండుగట.

ఆంటీ అక్కడ చేరిన వారితో ఒక్కొక్కరితో నూరు రూపాయలు (నాతో ఐదొందలు, నా మిత్రులందరివీ కలిపి) ఇప్పించుకుంది. మకెయ్ సాన్ వచ్చారు. మమ్మల్నందరిని వరుసలలో నిలబెట్టారు. ఏవో మంత్రాలు చదువసాగారు మకెయ్ సాన్. ఆయన పక్క ఓ ఇండియన్ అమ్మాయి, ఆయన ఆజ్ఞల ప్రకారం మమ్మల్ను అప్పుడప్పుడూ నేలపై సాగిలపడమని, పంచప్రతిష్టితం (kneel down) చేయమని అంటూంది. మా ఫ్రెండ్సందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఈ ప్రహసనం ముగియగానే ఆవిడ - "మీరందరు ఇక నిర్వాణానికి (enlightenment) అర్హులు. అభినందనలు" అంటూ విశాలంగా నవ్వింది. ఇంకో ముక్క చెప్పింది. జీవితంలో ఏదైనా కొట్టుకుపోయే సమస్య వచ్చినప్పుడు, "మితాయ్ బుత్సు మొరొకొ" అనుకోవాలిట. అప్పుడా సమస్య సమిసిపోతుందట. అయితే ఈ ఆఫర్ ను జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకోవాలిట.

(నేను ఓ పదిహేను సార్లు ఆ మంత్రం వాడుకున్నానని లీలగా గుర్తు. ఓ సీక్రెట్ కూడా తెలిసింది. ఆ మంత్రం ఒక్కసారికంటే ఎక్కువసార్లు కూడా పనిచేస్తుంది!)


అయితే ఆ జపనీసు ’సంస్కృతి’,’సంప్రదాయాల’ వల్ల మా హాస్టల్లో నాకు ఏదీ ఒరగకపోగా, నన్ను చూసి కొన్ని రోజులు నవ్వుకున్నారు.
ఆ తర్వాత నాకు ఆ విషయాలపై ఆసక్తి తగ్గిపోయింది.

7 comments:

 1. రవి గారు. మీ పొస్ట్ చలా బాగుందండి.. లాస్ట్ టపా కన్న ఇది చాల నచ్చింది నాకు...
  "మితాయ్ బుత్సు మొరొ " ఈ మంత్రం నిజం గా పని చేస్తుందా?? మాకు చెప్పినందుకు థాంక్స్.. దానర్ధం చెప్పారు కాదు.. :) :)

  Venuram

  ReplyDelete
 2. ఇప్పుడర్థమైంది జపాన్/భాషతో మీకున్న అనుబంధానికి కారణం. :-) :-)

  పరాయి భాష ఏదైనా సరే బాగా రావాలంటే ఏం చెయ్యాలో ఒకాయన నాకు చెప్పాడు - ఒక స్లీపింగ్ డిక్షనరీ ని సంపాదించుకోవాలిట.

  పాపం మీకూ ఓ డిక్షనరీ కనబడి, చిక్కకుండానే మాయమైపోయినట్టుందే... :-(

  ReplyDelete
 3. >>మితాయ్ బుత్సు మొరొకొ
  మంత్రం అనుకుంటే సరిపోతుందా లేక ఇంకేమైనా కూడా చేయాలా..?! ;)

  ReplyDelete
 4. @వేణూ రాం, @మేధ: మిరొకొ అంటే మైత్రేయుడి పేరనుకుంటాను. బుత్సు అంటే బుద్ధత్వం అని నా ఊహ. అర్థం తెలీదు. ఆ మంత్రం వాడిచూసి మీరే చెప్పాలి. :-)మేధ గారు, నేనయితే మామూలుగానే వాడాను మరి. :-)

  @మురళి: హ్మ్, నిజమేనండి. :-). మా రేవంతో సాన్ అలానే ట్రై చేశాడు, ఏకంగా జపాన్ అమ్మాయిని ప్రేమించి. ఇంట్లో ఝాడించేసరికి తిరిగి మామూలయ్యాడు.

  ReplyDelete
 5. మీ టపా, నాగమురళి గారి వ్యాఖ్యా - రెండూ అదిరాయ్!

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.