Wednesday, June 9, 2010

కిత్తెమొ కిత్తెమొ ఒనాజి కెవొ

మొన్నామధ్య బీహారీ బాసురుడు కంపెనీకెవడో హెడ్డాపీసు నుండి వస్తే, వాడితో నానాబాధలు పడి "యే క్యా హరాకిరీ హై" అంటూ వాపోయాడు. హరాకిరీ - ఆ మాట వినగానే ఒకప్పుడు నేను వెలగబెట్టిన జపనీసు గుర్తొచ్చింది.

"హరాకిరీ" అనేది జపనీసు మాట. హరా అంటే బొడ్డు (navel), ఇంకో అర్థం పువ్వు. కిరిమాసు అంటే కత్తిరించటం, కోయటం లేదా పొడవటం. జపనీసు క్రియాపదాలన్నీ విడిగా అయితే మాసుగా ’మాసు’తో ముగుస్తాయి. మనకు ’ట’ తో ముగుస్తాయిగా అలాగన్నమాట. (ఉదా: లేయుట, మింగుట, పరుండుట ) జపనీసులో అయితే, ’ఇకిమాసు, కిమాసు, హజిమెమాసు ఇలా. నామవాచకంతో కలిసినప్పుడు మాసు లుప్తమవుతుంది.

ఈ హరాకిరీ అన్నమాట ఎలా వచ్చిందంటే సమురాయ్ ల గురించి తెలియాలి. సమురాయిలు జపాను యోధులని మనకు తెలుసు. ఈ రాలుగాయిలు యుద్ధంలో ఓడిపోతే, ఏదో ఓడాంలే అని ఊరుకోక, ఫీలయిపోయి, తమ షోగన్నులతో (షోగన్ను అంటే షో గన్ను కాదు, పొడుగాటి కత్తి. సుజుకి షోగన్ అనేదదే) తమే పొడుచుకు ఛస్తారు. అదియొక చమత్కారము! బతికుంటే బలుసాకు తినచ్చులే అనుకోక ఇలా ఛావడమేమిటో మరి. వెధవ ఫిలాసఫీలు, వెధవ పీడ!

పై విషయం మనం ’లాస్ట్ సమురాయ్’ సినిమాలో చూస్తాం(శాం). ఆ చచ్చే ప్రాసెస్ పేరు ఈ హరాకిరీ. ఈ పదం ఇంత దూరం వచ్చి, మన దేశంలో ఎలా తిష్టవేసుక్కూచుందో తెలిసి ఛావట్లేదు. ఇలాంటిదే మరొక మాట, కిరికిరి. దీనర్థమేంటో, దీని వెనక యే కథుందో ఏమో నాకు తెలీదు.

వాళ్ళమాట మనకు వచ్చి చేరినట్టు, మన మాటొకటి అక్కడ చేరుకుంది. అది ’సేవ’. అవును సేవ అనేపదం, జపాను భాష (నిహోంగొ) లో అదే అర్థంలో ఉన్నది. ఇప్పుడు ఆ పదాన్ని వాక్యంలో ప్రయోగించి మీ సహనాన్ని కొద్దిగా పరీక్షిస్తాను, ఏమనుకోకండి.

"ఇరోఇరోయిన ఓ-సేవాని నరిమాషిత. అరిగతో గొజైమాసు" (రకరకాల సేవలను పొందాను.కృతజ్ఞతలు).

మీరు కాస్త పట్టిచూస్తే ఇరోఇరోయి=రకరకాల ఒకేరకంగా ఉన్నాయని గ్రహిస్తారు. చెప్పొచ్చేదేమంటే, వాళ్ళభాష structure తెలుగుకు కాస్త దగ్గర.

లాస్ట్ సమురాయ్ సినిమా గురించి కాస్త మాట్లాడుకుందాం. అందులో టామ్ క్రూయిసు గాడు యుద్ధంలో గాయపడి జపానోళ్ళ ఇంట్లో వచ్చి పడతాడు, తంతే బూరెలగంపలో పడ్డట్టు. వాడికి తను పూర్వాశ్రమంలో రెడ్ ఇండియన్ పిల్లవాణ్ణొకణ్ణి చంపినట్టు గుర్తొస్తూ ఉంటుంది. ఆ చచ్చిన పిల్లాడి పేరు సాకే. టామ్ క్రూయిస్ సాకే, సాకే అని పలవరిస్తుంటాడు. సాకే అంటే జపనీసులో వరితో చేసిన సారాయం. వీడి కలవరింతను అక్కడవాళ్ళు అలా ఇంటర్ ప్రెట్ చేసుకుని వాడికి సారా తెచ్చి పోస్తుంటారు.

ఆ సాకేను కొరియాలో సోజు గా పిలుస్తారు. నేను దాన్ని ఓ గుటక వేశాను. బాగా వేడిచేసిన ఓ చిన్న నిప్పుగోళాన్ని మింగినట్టు అనిపించింది. కంపు వాసన దాని అడిషనల్ క్వాలిటీ.

ఆ సాకే తయారు చేసే వారు పురాతన జపానులో ఓ పల్లె వద్ద నివసించేవారు. ఆ పల్లె ఇప్పుడో పెద్ద పట్టణం. దానిపేరు ఒసాకా. ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒకాయన, 1947 లో ఓ సంస్థ నెలకొల్పాడు. అదే ఇప్పటి సోనీ.

జపాను వారి పేర్లన్నీ ప్రకృతికి సంబంధించినవై ఉంటాయి. నాకో పెన్ గర్ల్ ఫ్రెండు ఉండేది. ఆ అమ్మాయి పేరు చిహారు అని ఏదో వస్తుంది. దానర్థం - వేయి వసంతాలు అనట. ఆమే చెప్పింది.

ఇంతకూ టైటిలు సంగతేమంటారా? అదేమంటే - జపాను వారి ఓ క్యాండీ ఉంది. చాక్పీసులా ఉంటుంది. దాన్ని ఏ భాగంలో అడ్డుగా కోసినా, కనబడే గుండ్రటి తలంలో, మనిషి ముఖం ఉంటుంది. కిత్తెమొ కిత్తెమొ ఒనాజి కెవొ అంటే, ఎక్కడ కోసినా, ఒకే ముఖం అని. (కెవొ - ముఖం, కిత్తెమొ - కోసినా). ఈ మధ్య ఓ జపానెళ్ళిన ఫ్రెండొకడు ఆ క్యాండీ తెచ్చాడు. అది చూడగానే దానికి సంబంధించిన కథ, ఏదో చదివినట్టు లీలగా అనిపించింది. ఇదుగో ఇప్పుడు గుర్తొచ్చిందది.

ఇప్పుడో మణిప్రవాళ కందం. (బొత్తిగా సంకరం అంటే బావుండదు, అందుకని ఆ పేరు)

లత్తుక జపాను భాషను
’కిత్తెమొ కిత్తెమొ ఒనాజి కెవొ’ అని అంటే
కత్తెర వేసిన చోటుల
తిత్తెరి! కనబడిన ముఖమె తిరిగి కనపడే.

లత్తుక జపాను ఎందుకంటే ఎర్రని సూర్యుడి చిహ్నం కాబట్టి.

అన్నట్టు జపనీసులో అమ్మానాన్నలను ’చిచి’, ’హహ’ అంటారు. తల్లిగారు, తండ్రిగార్లను ’ఒకాసాన్’, ’ఒతోసాన్’ అంటారు.

జపాను వార్తలు ఇప్పటికి సమాప్తం. ఇంకొన్ని మళ్ళీ ఎప్పుడైనా.
ఒ యాసుమి నాసాయ్. (ఇదేదో నాశనమైపో అన్న తిట్టు కాదండి. ప్యూర్ ట్రాన్సిలేషన్- సుఖ నిద్రాప్రాప్తిరస్తు)
సయోనర.

13 comments:

 1. రావుగోపాల్రావు ఫేమస్ డవిలాగు "ఓరోరి తస్సారవులో బొడ్డు" గుర్తొచ్చింది మీ టపా చదువుతూంటే. దానిక్కూడా ఏమన్నా కథుందేమో.

  మీ ప్రశ్న కిరికిరి వెనక కథ గురించి ఆలోచిస్తే "కిరికిరిభిక్కిరిభిక్" నుండి వచ్చి ఉండచ్చేమో అనిపిస్తోంది.. ? ఎమో ?

  ఇంతకీ కొరియా, జపనీసు, చైనీసు, సంస్కృతం, తెలుగు, కన్నడం (కొద్దో గొప్పో తమిళం కూడా ఉందేమో).. అన్నీ చూస్తూంటే

  ReplyDelete
 2. రావుగోపాల్రావు ఫేమస్ డవిలాగు "ఓరోరి తస్సారవులో బొడ్డు" గుర్తొచ్చింది మీ టపా చదువుతూంటే. దానిక్కూడా ఏమన్నా కథుందేమో.

  మీ ప్రశ్న కిరికిరి వెనక కథ గురించి ఆలోచిస్తే "కిరికిరిభిక్కిరిభిక్" నుండి వచ్చి ఉండచ్చేమో అనిపిస్తోంది.. ? ఎమో ?

  ఇంతకీ కొరియా, జపనీసు, చైనీసు, సంస్కృతం, తెలుగు, కన్నడం (కొద్దో గొప్పో తమిళం కూడా ఉందేమో).. అన్నీ చూస్తూంటే సాగర సంగమం లో కమల్ హాసన్ గురించి జయప్రద అన్నట్టు పం.బం.బం అని పిలవాలేమో మిమ్మల్ని కూడా

  ReplyDelete
 3. మీ టపా చదివాక నాకూ జపనీసొచ్చేసిందోచ్చ్.......ఇలా మీరు టపాకో క్లాసు తీసుకోకూడదూ, మేమూ మీలాగా భాషాప్రవీణులయిపోతాం. కందం మాత్ర కేక....తెగ నచ్చింది.
  కిత్తెమొ కిత్తెమొ ఒనాజి కెవొ....ఎక్కడ చూసిన ఒకటే మొహం..."పండగనాడు కూడా పాచి మొగుడేనా" అన్న సామెత గుర్తొచ్చింది నాకు :)

  ReplyDelete
 4. శీర్షిక చూసి పాపాయి గారి ముద్దుమాటల కబుర్లేమన్నా చెప్తున్నారేమో అని వచ్చా!

  ఇంటరెస్టింగ్ గా ఉంది జపాన్ భాష వివరాలు చదువుతుంటే! మాదాపూర్లో skill guru అని ఒక రకాల విదేసీ భాషలు నేర్పే సంస్థ ఉంది.వాళ్ళు భాషతోపాటు ఆయా దేశాల సంస్కృతి కూడా నేర్పిస్తారు.ఆ భాషా సినిమాలు చూపించడం, (బలవంతంగా) ఆయాదేశాల ఆహారం వడ్డించడం,బట్టలు తెచ్చి చూపించడం(ఇంకా నయం వేసుకోని తిరగమన్నారు కాదు).జపనీస్ నేర్చుకుంటే సాకే తాగించి, సుషీ తినిపిస్తారేమో మరి!

  సాకే కంపు వాసన కారణమేమిటనుకున్నారు.....అన్నం (లేక నానబెట్టిన బియ్యమో) పులియబెట్టి తయారు చేస్తారట దాన్ని...!(తరవాణి కి అడ్వాన్స్డ్ స్టేజీ)

  ReplyDelete
 5. బావుంది మీ జపనీసు పాండిత్యం.హరాకిరి అంటే ఖడ్గంతో పొడుచుకొని ఆత్మహత్య చేసుకోవడమా?

  మరి బాబూమోహన్ ఊతపదం మాకి కిరికిరి కి అర్థం ఏంటి :-)

  ReplyDelete
 6. Ravi-san:

  Two Years back, I've attended a "Sathsang" held by Sadhguru Jaggi Vasudev, in Chennai. During that Satsang he mentioned about "Harakiri". All I understand from his speech is:"It's a simple & yogic way of suicide".

  ReplyDelete
 7. బాగున్నాయి జపనీస్ కబుర్లు. హరాకిరీ గురించి ఇదివరకు చదివేను. మన పురాణాల్లో కూడా ప్రతిజ్ఞలు చెయ్యడం, వాటిని తీర్చుకోలేకపోతే ప్రాణాలు వదలడం కనిపిస్తూనే ఉంటుందిగా. హరాకిరీ కూడా అలాంటిదే అనిపించింది.

  సూసైడ్ బాంబింగ్ కి ఇంచుమించుగా ఆద్యులు జపనీసు వాళ్ళని చెప్పుకోవచ్చు. రెండో ప్రపంచయుద్ధంలో వాళ్ళ యుద్ధవిమానాలు అమెరికన్ వార్ షిప్పులమీద పడి హరాకిరీ చేసుకునేవి.

  ఈమధ్య కిల్ బిల్ సినిమాలు చూశాను. అందులో జపనీస్ డైలాగులు భలే అనిపించాయి - ఏమీ అర్థం కాకపోయినా. జపనీయుల ఇంగ్లీష్ ఏక్సెంట్ చాలా ఘోరంగా ఉంటుంది అనుకుంటాను.

  ReplyDelete
 8. ఇది చదువుతుంటే నాకొక జోక్ గుర్తొచ్చింది. జాపనీయులు, తమిళులూ కలిసిన ఒక ఇంజినీర్ల బృందం ఒక పే...ద్ద కట్టడం కట్టి, దానికేం పేరు పెట్టలా అని ఆలోచిస్తున్నారు. తమిళ ఇంజినీర్లు "నిక్కుమో నిక్కాదో" అనే పేరు సూచించారు. జాపనీయులు ఆనందంగా వెళ్ళి పోయారు.
  ఇంతకీ తమిళం లో "నిక్కుమో నిక్కాదో" అంటే "నిలబడుతుందో, నిలబడదో" అని అర్ధం :)
  శారద

  ReplyDelete
 9. కిత్తెమొ కిత్తెమొ ఒనాజి కెవొ: ఈ క్యాండీ లాంటిది కొరియాలో కూడా ఉన్నట్లుంది.. దాని పేరు తెలియదు కానీ, చాక్‌పీస్ లానే ఉంటుంది, ఎలా కట్ చేసినా మనిషి ముఖం కనిపిస్తుంది.. కొరియా వంటకాలు మాత్రం ఒక్కసారి కూడా ప్రయత్నించే ధైర్యం చేయలేదు.. :)

  ReplyDelete
 10. నాకు ఇంతకు ముందు ఒక జపనీస్ ఒక ముక్కొచ్చు అది "సయోనరా" (సినిమా ప్రభావం ). ఇప్పుడు "హరాకిరీ" అని రెండో ముక్క నేరుచుకున్నా (బ్లాగుల ప్రభావం) . బాగున్నాయండి మీరు చెప్పిన విషయాలు . BTW జననీస్ లిపి చాలా కష్టమంటారు ఇది నిజమేనా ?

  ReplyDelete
 11. @సనత్ : ’ఓరోరి తస్సారవులో బొడ్డు’ - బావుంది. :-) సినిమా గుర్తురావట్లేదు కానీ విన్నా. గిరిగిరిభిక్ కదా, కిరికిరిభిక్ అనేశారేమిటి?:-)

  @సౌమ్య: మీకో నిజం చెప్పాలి. నాకు జపనీసు రాదు. చిన్న పరిచయం మాత్రమే.

  @సుజాత: నేను భాగ్యనగరంలోనే ఓ మూడునెల్ల కోర్స్ చేశాన్లెండి. (skill guru లోకాదు). మొఖం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని చట్టిముక్కు, చిన్న కళ్ళు గా మార్చుకోమన్నా అంటారు.

  @శ్రీకాంత్ : బాబూమోహన్ మాటలు అతడికే అర్థమవాలండి.

  @గణేశ్ సాన్: ఇదేదో కొత్త కాన్సెప్టు. అయితే ఓషో అనే ఆయన ఈ రకం ఆత్మహత్య ను ఏకాడు. న్యూరోసిస్ అంటాడతను.

  @నాగమురళి: భారతయుద్ధంలో సంశప్తకులు కూడా అలాంటి వారే కదా.

  లాస్ట్ సమురాయ్ చూడండి. అందులో కాస్త అర్థమవచ్చు. ఈ హరాకిరీ అన్న మాట కూడా ఆ సినిమాలో ఒకడంటాడు.

  @శారద గారు: :-) బావుంది. ఇలాంటిదే సినారె గారు రష్యావాళ్ళ గురించి చెప్పారు. ఓ తెలుగోడు రష్యాలో, ఓ గోతిలో పడి ’అమ్మోవ్, నాయనోవ్, చచ్చాన్రోవ్’ అనరిస్తే, ముగ్గురొచ్చి బయటకు లాగారు. వాళ్ళ పేర్లూ అవేనట.

  @మేధ: చిలగడదుంప ఉడికించి ఓ కూర చేస్తారు. అది చాలా బావుంటుంది. ప్రయత్నించండి.

  @శ్రావ్య: అవును వాళ్ళకు 3 లిపులు (హీరాగానా, కాతాకానా, కాంజి). మూడువేలకు పైగా అక్షరాలు.

  ReplyDelete
 12. హ హ (అంటే "నాన్న" అనుకునేరు) - అది నవ్వుకు సంకేతంగా వాడాను. బాగుంది మీ వ్యాసం.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.