Thursday, May 27, 2010

ఒక పద్యము, కొన్ని పైత్యాలూ

మొదట వేటూరికి నివాళి.

’ఆరేసుకోబోయి పారేసుకున్నాను
యని చిలిపి తలపుల నల రేపు!
’తాంబూలమరుణమందారమనెడుతేనె
లొలికెడి మాటల కలిత బాపు!
’అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి
పదమల్లు కైతల పయిడి కాపు!
’గాలినై పోతాను గగనాని కి’దెయని
మలయానిలమయి మయిని మరపు!

పాటలకు పెనిమిటి తేటతేనెకు పాటి
మధురభావపు పదబంధములకు
వేరెవరట సాటి? వేటూరి సుందర
రామ మూర్తి - సుమ మరంద పేటి.

ఇక పైత్యాలు.

రంజుగ సాగెడి ప్రాజెక్ట్.
స్ట్రింజెన్టు క్లయింటు గాడు చెప్పెనిలా! ’వెం
టం జేయి డెలివరి.’ అకట!
కుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్

మొన్నను విన్మొబయిలనిరి
నిన్నను కొత్తగ దిగినది నేర్వుడిదె లిమో!
మిన్నగ ఆండ్రాయిడట
ఎన్నగ నేడొచ్చె. రేపు ఇంకే దొచ్చో?

మోడగు మా టీమునకు
మాడరనుగ బ్యూటిజేరె. పండగ ఇకపై
మా డామేజరుకు సి! పూ
బోడికి బోడికిని పొత్తు పొసగెన్వసుధన్

త్రోవలెరుంగకం జవిరి తూరిచి గూర్చిన క్లైంటు స్పెక్సులుం
జేవలుఁ జచ్చిపోయిన డిజేనును అండగ జేసుకొన్న నా
జావలు గారుకోడుయది సాఫ్ట్ వెరు నెల్లెడలందు బొక్కలున్.
బావుర నేడ్చె కష్టమరు ఫైనలు వర్షను జూచి బాధతో!

సృజనతొ వర్కు సేయుడి అసాధ్యము సాధ్యము జేయగానిలన్
అజులయి మీరు నూతన సహాయ మెథడ్సులజైలు లాదిగా
ప్రజలకు తృప్తి గూర్చగ నపారముగన్ యని జేత్రు బోధనల్.
వజనము లేని మాటలివి.వంచన జేయుచునెన్నడున్మహా
భజనలు సేయు వారలకె పై పదవుల్.ఇది నిక్కమెల్లెడల్.

స్పర్ధకు వోయి స్వస్థితిని సైతము జూడకసైనుమెంటునున్
మూర్ధమునందు యెత్తికొనె మూర్ఖశిఖామణి బాసురుండటన్
వర్ధిల జేతుమంచు నట వచ్చిరి యిద్దరు టెక్నికల్ ఫెలోస్.
అర్ధనిశీధమందు అలయంధుడు గాంచెను సూర్యచంద్రులన్

నాతుల గుంపు జేరెనట దారిన, వీధి కొళాయి చెంతకున్
చేతులఁ దిప్పుచున్నొకరు, జిహ్వల వాటము జూపి కొందరున్,
చేతుల బిందెలం గొనుచు చేటగు మాటల పోరు హెచ్చగన్
బూతుకు బూతు బూతునకు బూతుకు బూతుకు బూతు బూతుకున్

తాష్ట్రులు వచ్చిచేరిరిట నాటికి చేటుగ ఉగ్రవాదులై
రాష్ట్రము దోచుచుం జనుల రక్తము పీల్పగ మావొయిష్టులై
త్వష్ట్రము జూపి యా దుడుకు దైత్యుల పాలిటి కాలరూపుడై
రాష్ట్రమునేలగా నొక విరాధుడు రావలె రక్తపాయియై

(గత కొన్ని రోజులుగా ఆరోగ్యం కూసింత చెడగొట్టుకుని, పొద్దుపోక వెలగబెట్టిన పైత్యాలు. వూకదంపుడు గారి ఓ పాతటపా నుంచి కొన్ని సమస్యలు , మరో అవధానం పుస్తకంలో ఇంకొన్ని సమస్యలు ఏరాను. తప్పులుంటే కొంచెం పెద్దమనసు చేసుకుని సూచించి క్షమించండి ప్లీజ్!)

15 comments:

 1. వేటురికి నివాళి, ఆఫీసులో మీ జీవిత కష్టాలు, ఆణిముత్యాలు...
  అదుర్సూ, అదుర్సో అదుర్సు....

  ReplyDelete
 2. చాలా బావున్నై.

  వేటూరికి నివాళిలో
  "మాటల కలిత బాపు!" = ??

  ReplyDelete
 3. బాగున్నాయండీ మీ పద్యాలూ పైత్యాలూ..

  ReplyDelete
 4. హహహ...మీ బాసురుడు తెలుగువాడైతే చెప్పండి, ఈ పద్యాలతనికి పంపిస్తాను :-)

  కందాలు వృత్తాలు కూడా చాల చక్కగా వచ్చాయి. పడీపడీ మానసారా నవ్వుకున్నాను (ప్రస్తుతం నేను డెలివరీ గ్రూపులోలేను కాబట్టి ఇలా మనసారా నవ్వుకోగలిగాను. లేకపోతే ఏడవలేక నవ్వుకోవాల్సి వచ్చేదనుకోండి!).

  "మాటల కలిత బాపు!" ?? - ఇది "మాటల గలత బాపు" అని ఉండాలనుకుంటాను.

  ReplyDelete
 5. పూబోడికి బోడికిని పొత్తు పొసగెన్వసుధన్
  -- ha ha ha

  అర్ధనిశీధమందు అలయంధుడు గాంచెను సూర్యచంద్రులన్
  -- ha ha ha

  బూతుకు బూతు బూతునకు బూతుకు బూతుకు బూతు బూతుకున్
  -- lol

  రాష్ట్రమునేలగా నొక విరాధుడు రావలె రక్తపాయియై
  -- aayanE unTE mangali endukani :)

  ReplyDelete
 6. పద్యమూ బాగుంది,పైత్యాలూ బాగున్నాయి రవీ!

  ReplyDelete
 7. పద్యాలు రమణీయంగానూ , కమనీయంగానూ కూడా ఉన్నాయి రవి గారూ.

  ReplyDelete
 8. ’మాటల కలిత బాపు’ -

  మాటల - మాటలను
  కలిత - కూడుకొనిన లేదా పొందిన
  బాపు - హిందీ బాపు అంటే తండ్రి,
  బాపు - O Dear!
  వెరసి మాటలకు తండ్రివంటి వాడు అని ఒకర్థంలో,
  మాటలను పొందిన ఓ ప్రియమైన వాడా! అనే అర్థంలోనూ ఊహించాను. (ఇవి కుదిరాయంటారా? :-))


  కామేశ్వర్రావు గారన్నట్లు ’మాటల కలతఁ బాపు’ - అని తట్టింది, కానీ కొత్తపదబంధంపై చపలత్వం ఆ ప్రయోగం చేయించింది.

  ReplyDelete
 9. బావున్నాయండి, అర్ధనిశీధి .. కెవ్వు కేక... అజులు-యజైలు -అదరహో
  మీగో, మోబ్లిన్ ల మీద పద్యాలెపుడొ మరి!!!
  భవదీయుడు
  ఊకదంపుడు

  ReplyDelete
 10. @మలక్, @సనత్, @ప్రణీత స్వాతి గారు, @విజయమోహన్ గారు, @మూర్తి గారు : :-), నెనరులు.

  @కొత్తపాళీ : Thank u, I need it. :-)

  @కామేశ్వర్రావు గారు: ఛాన్స్ లేదు. బాసుడు బీహారీ. :-)

  @సందీప్ గారు: అవి అవధానాల్లో ఉపయోగించిన సమస్యలే.

  @ఊకదంపుడు: అర్ధనిశీధి అంధుడి అవతారం నేనూ అప్పుడప్పుడు ఎత్తుతుంటాను లెండి. అయితే ఇప్పటివరకూ భయంకరమైన సమస్యల్లో ఇరుక్కోక తప్పించుకుంటూ వస్తున్నాను. :-)

  ReplyDelete
 11. మోడగు మా టీమునకు
  మాడరనుగ బ్యూటిజేరె. పండగ ఇకపై
  మా డామేజరుకు సి! పూ
  బోడికి బోడికిని పొత్తు పొసగెన్వసుధన్

  idi sooper...

  ReplyDelete
 12. మోడగు మా టీమునకు
  మాడరనుగ బ్యూటిజేరె.
  - భలే ఉందండి.

  నాతుల గుంపు జేరెనట దారిన, వీధి కొళాయి చెంతకున్......
  -వీధి కొళాయి ఘట్టం కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు.

  మొత్తానికి మీ పైత్యాలు చాలా చాలా బాగుంది.

  ReplyDelete
 13. చాలా బావున్నాయండి. office humour ని ఈ రకంగా కూడా అందించచ్చు అనేది చాలా కొత్త ఆలోచన :)

  ReplyDelete
 14. telugu blogulu baagunnay, kaani oka chinna vinnapoam..padyalaku krinda taatparyam kuda wraste mee pada prayogam emito artham avutundi..lekapote konchen kashtam ga undi artham chesukovadam....

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.