Monday, May 24, 2010

తీరం లేని సముద్రప్రయాణం


గు - అనే అక్షరం అంధకారాన్ని,
రు - తన్నిరోధకత్వాన్ని వెరసి గురు అన్న శబ్దం అంధకార నిరోధకత్వాన్ని సూచిస్తుందట. భారతదేశ చారిత్రక యవనిక పైన అనేక మంది గురువులు మనకు కనిపిస్తారు. వీరు మానవాళికి వారి ప్రబోధాల ద్వారా, జ్ఞానం పంచటం ద్వారా దిశానిర్దేశం, మార్గనిర్దేశకత్వం చేశారు.

నూటికో కోటికో గురువులు కాని గురువులు పుడుతుంటారు. వీరు గురువులని ఒప్పుకోరు.

నువ్వో చీకటిగదిలో కూర్చున్నావు. గది తలుపు ఫలానా దిశలో ఉందని ఒకరు నీకు చెబుతారు. అంతే. ఆతడి పని ముగిసింది. ఇకపై కూర్చున్నచోటునుండీ లేవవలసినది నీవు. నడవవలసినది నీవు. నడవటంలో ఒడిదుడుకులను అనుభవించేది నీవు. ద్వారాన్ని చేరేది, బయటకు అడుగుపెట్టేది అన్నీ నీవే. ఇదెలా అంటే - ఊరిబయట కూడలి వద్ద ఒకడు "సానెన్" ఊరికి దారెటు అనడిగాడు. ఇంకొకడు, "ఇదిగో ఇలా" అని చెప్పాడు. ఆ మాత్రం దానికి, మొదటివ్యక్తి, "ఆహా, నువ్వు నా గురువువి. నీకిదే పూలమాల" అంటూ అనడం హాస్యాస్పదం. గురువు అన్న పదానికి సంప్రదాయ నిర్వచనం చెప్పుకోవడం చిన్నపిల్లల వ్యవహారం.

అంటూ తేల్చేస్తారు.

ఒకానొక జెన్ సూత్రం ప్రకారం గురువంటే, "హృదయానికి దర్పణం". రకమైన గురువు దిశానిర్దేశాలవీ చేయడు. నిన్ను నీకు ఉన్నదున్నట్లుగా పరిచయం చేస్తాడు. జిడ్డు కృష్ణమూర్తి కూడా కోవకు చెందిన గురువు కాని గురువు. జిడ్డు కృష్ణమూర్తి పుస్తకం చదవడమంటే, మనలను మనం చదవటం. లేదా, మన హృదయాన్ని అద్దంలో చూసుకోవడం. అంతే.

అయితే అది అత్యంత ప్రమాదకరం. నిజమైన గురువు కొత్తగా ఏదీ నేర్పడు. పైగా నేర్చుకున్న విషయాన్ని ప్రశ్నిస్తాడు. (Unlearning) జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలను ఆస్తికుడు చదివితే నాస్తికత్వం, నాస్తికుడు చదివితే హేతువాదం, హేతువాది చదివితే, హేతువాదానికి మెట్టుపైనున్న సుప్రాలాజిక్, సంప్రదాయవాది చదివితే ఆధునికత, ఆధునికుడు చదివితే ఆధునికత లోని లోటుపాట్లూ..ఇలా వేటికవి భిన్నధృవాలుగా కనిపిస్తాయి. ద్వైధీభావాలు చదివే వారివే తప్ప కృష్ణమూర్తివి కాదు. కృష్ణమూర్తి వాదీ కాడు. విభజనకూ అందడు.

ధ్యానం అంటే - ఒకానొక ఏకాంతప్రదేశంలో అన్ని మానసిక వ్యాపారాలను బహిష్కరించి, ఏకాగ్రంగా ఒక విషయంపై దృష్టినిలుపటం కాదు. మనిషి మెదడులో నిరంతరాయంగా జరుగుతున్న ఆలోచనావ్యాపారాలను, నిరుద్దేశ్యపూర్వకంగా, (passive observation) ఎఱుకతో గమనించటం మాత్రమే అని కృష్ణమూర్తి చెబుతారు. ధ్యానం ఎప్పుడైనా, ఎక్కడైనా, చివరికి రోడ్డు మీదైనా జరుగవచ్చు. ప్రపంచంలో ప్రతివ్యక్తి, ఇతరుల సహాయం లేకుండా, తనకు తానుగా మాత్రమే నేర్వదగిన, నేర్చుకోవలసిన ఏకైక విద్య ధ్యానం మాత్రమేనని అంటారు కృష్ణాజీ.

కృష్ణమూర్తి పుస్తకాలను అత్యంత ఆసక్తితో కొన్నిసార్లు చదువుతున్నప్పుడు ధ్యానం అనుభవానికి రావడం నాకు స్వయంగా తటస్థించింది. అదొక సౌందర్య స్థితి. నీనుంచీ నీవు దూరంగా జరిగి, నిన్ను నువ్వే గమనించడం. ఇటువంటి ధ్యానపూర్వక అనుభవాలు మనందరికీ కలుగుతుంటాయి. భగవంతుని ధ్యానించేప్పుడు, ఏకాంతంలో ప్రభాత కుసుమాన్ని చూసినప్పుడో, అనిర్వచనీయమైన సూర్యాస్తమయాన్ని గమనించినప్పుడో, క్షణం కోల్పోయి, మారుగా చెప్పలేని సౌందర్యానుభూతిని సొంతం చేసుకుంటాం మనం.

సత్యం అన్నది రకమైన పదజాలానికి లొంగనిది. దానిభాష మౌనం. దాని అస్తిత్వం శూన్యం. నిర్వాణం పొందిన వ్యక్తి మానసిక వ్యాపారెలెలా ఉంటాయి? వ్యక్తి చూడగలిగే సత్యం ఏమిటి? విషయాలను జ్ఞానీ ఇదివరకు చెప్పలేదు. ఒకవేళ చెప్పినా అది సాధారణ ప్రజలస్థాయికి అందనిది. అలాంటి ప్రయత్నం కృష్ణమూర్తి చేశారు. (ఎంతో సంకోచంతోనే). Krishnamurti's Notebook అన్న పుస్తకం అద్భుతం. అయితే ఇది "చదివే" పుస్తకం కాదు. అలా చదివితే బోరుకొట్టటం సహజం. ఇదొక ధ్యానం. పుస్తకం చదవటం ద్వారా ఎవరైనా ఏదైనా ఆశించే ప్రయత్నం చేస్తే, వారు పుస్తకాన్ని చదవకపోవటమే మంచిది.

పుస్తకం అలా ఉంచితే, సాధారణంగా, జీవితంలో ఎదురయ్యే సంఘటనలూ, కృష్ణమూర్తి ఎందరినో కలుసుకుని జరిపిన చర్చలు, ధనం, సౌందర్యం, జీవితం, పిల్లలు, సంసారం, మతం, ఇలా అనేక విషయాలపై వ్రాసిన పుస్తకాలు "Commentaries on Living". పేరిట మూడుభాగాలుగా వచ్చాయి. అనిర్వచనీయమైన సౌందర్యం తొణికిసలాడుతుంది రచనల్లో.

కృష్ణమూర్తి పుస్తకాలు చదవటమంటే, తీరంలేని సముద్రంలో ప్రయాణానికి ఒడిగట్టటమే. ఇందులో ప్రయాణం మాత్రమే ఉంటుంది. గమ్యం ఉండదు. ప్రయాణంలో జరిగే రసస్వాదన గమ్యాన్ని మరిపింపజేస్తుంది. ఇది నిజం.

వైశాఖమాసంలో ఎందరో కళాకారులు, మహా తాత్వికులు జన్మించారు.

కృష్ణమూర్తి తాత్వికుడు.
కృష్ణమూర్తి కళాకారుడు.
కృష్ణమూర్తి కళాకారుడైన తాత్వికుడు. ఊహూ...

కృష్ణమూర్తి ఎవరూ కాదు. కృష్ణమూర్తి కృష్ణమూర్తే.

(మే పదవతేదీ కృష్ణమూర్తి జయంతి. ఈ వ్యాసం వ్రాయటం ఇన్ని రోజులకు కుదిరింది.)

13 comments:

 1. అద్భుతమైన వ్యాసం.

  ReplyDelete
 2. బాగుంది, చాలా సార్లు అనుకున్నాను కానీ ఈయన పుస్తకాలు ఏవీ నేను చదవలేదు.

  ReplyDelete
 3. చాలా చక్కటి పరిచయం చేశారు రవి గారూ..

  ReplyDelete
 4. యుక్తవయసులో ఉండగా ఒకట్రెండు పుస్తకాలు ప్రయత్నించి నావల్ల కాక వొదిలేశాను. మీ పరిచయం నోరూరించేలా ఉంది. చాలా బాగా రాశారు.

  ReplyDelete
 5. నా చిన్నప్పుడు మా నాన్నగారి గదిలో ఎదురుగ్గా జిడ్డు క్రిష్ణమూర్తి గారి పెద్ద ఫోటో వుంటుండేది. అలా చిన్నప్పటి నుండీ వీరంటే అభిమానమే కానీ కొత్తపాళీ గారి లాంటిదే నా పరిస్థితీను.

  ReplyDelete
 6. కృష్ణముర్తి రచనలు చదివి మీరు చెప్పిన ద్వైధీభావంలో ఊగిసలాడిన బాపతే నేనూ. (మూస పధ్ధతికి అలావాటు పడిపోయిన కారణం చేతనో ఏమో ఎందుకో గానీ ఓషోనీ, జిడ్డు కృష్ణముర్తిని సరిగా అర్ధం చేసుకోలేదేమో అని నా భావన). ఆయన ఆలోచనలతో నేను మనస్ఫూర్తి గా (సహేతుకం గా) విభేదించిన సన్నివేశాలూ ఉన్నాయి. మనకున్న కన్ఫ్యూజన్ కి మరింత జటిలమైన పధ్ధతెందుకు? జిహ్వకో రుచి అన్నట్టు నా జీవలక్షణాలకి సరిపడే వారి రచనలు చదువుతే మంచిది కదా అని ఆతర్వాత వాటి జోలికి పోవటం తగ్గించా...

  ReplyDelete
 7. సనత్, నీ కామెంటు చూశాకా ఇది రాయాలనిపించింది. నీకూ, నాకూ తెలిసిన సంగతే - కృష్ణమూర్తిగారితోనూ, ఆయన బోధనలతోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి - కొంత/చాలా మందికి. ఆయనతో కొంతకాలం క్లోజ్ గా తిరిగిన ఒక ఇంగ్లీషావిడ నాకు మంచి స్నేహితురాలు. అలాగే కృష్ణమూర్తిగారి తత్త్వానికున్న కొన్ని పరిమితుల్ని యూజీ గట్టిగానే చూపిస్తారు.

  నన్ను కృష్ణమూర్తిగారూ, ఓషో ఎప్పుడూ పెద్దగా ఆకర్షించలేదు. కాబట్టి వాళ్ళ పుస్తకాలు చాలా కొద్దిగానే చదివాను. అయినా, భౌతికవాదం దగ్గరనుంచీ, అద్వైతం దాకా, ఇంకా మధ్యలో నానారకాల ఫిలాసఫీలతో పాడు చేసుకున్న బుర్ర కదా నాది. కాబట్టి ఇది మాత్రం కొంచం గట్టిగానే చెప్పగలను. నాకు తెలిసినంతవరకు ఏది పట్టుకున్నా చివరికి 'సారాంశం' ఒక్కవైపే చూపిస్తుంది. సీసాలు మారొచ్చు కానీ 'సారా' ఒకటే.

  కానీ ఇక్కడ చాలామందికి తెలిసిన సీక్రెట్ ఏంటంటే, నిజానికి సారా సీసాలో ఉండదు. మన్లోనే ఉంటుంది. సీసాలో ఉందనుకుని తాగడానికి ప్రయత్నం చెయ్యాలి. కృష్ణమూర్తి గారు మాత్రం, సీసాలో లేదురా సీసానవతల పారెయ్యంటారు. కాబట్టి అది కొంతమందికి కొత్తగా, రివొల్యూషనరీగా అనిపిస్తుంది. పైగా కష్టంగా ఉంటుంది కూడాను - మనసుకీ, ఆచరించడానికీ కూడా.

  నువ్వన్నట్టుగా మన జీవలక్షణాన్ని బట్టి పోవడమే మంచిది, సులభమైనది. స్వధర్మే నిధనం శ్రేయః!!

  ReplyDelete
 8. @వేణూ శ్రీకాంత్, @రవిచంద్ర,@వీరుభొట్ల, @కొత్తపాళీ,@శరత్ : కృష్ణమూర్తి రచనలు చదవడం ప్రమాదకరం. అయితే, విపరీతమైన ఆసక్తి ఉంటే మాత్రం, commentaries on living రెండవభాగం, లేదా Krishnamurthy to himself అన్న ఓ చిన్న పుస్తకం ద్వారా కొంచెం కొంచెం మొదలెట్టచ్చు. But, read at your own risk.

  @సనత్, @నాగమురళి: నాగమురళి గారు బాగా చెప్పారు. మనం ఓ పుస్తకం చదివేప్పుడు "ఏదో’ ఆశిస్తాం. అది ఏదైనా కానీ, "entertainment, information, some formula, or consolation..anything". ఏదీ లేకుండా అలా ఓ పుస్తకమేదైనా చదవొచ్చా? ఎలానో, నాకు చిన్నప్పటి నుంచి ఈ అలవాటు ఏదో మూలన ఉంది. కృష్ణమూర్తులు, ఓషోలు ఈ mode లో ఉన్నవాళ్ళకు కాస్త సూట్ అవచ్చు అని నేననుకుంటున్నాను. Those books are end to themselves, like meditation. (meditation is an end to itself) మనకు దొరికే మత గ్రంథాల్లో కృష్ణమూర్తి తత్వానికి దగ్గరగా ఉన్నవి దాదాపు లేవు. అష్టావక్ర గీత - is an only exception. బహుశా అందుకనేమో, అనేకులకు వీరి మాటలు నప్పవు.

  ReplyDelete
 9. చాలా మంచి వ్యాసం. నేను చాలా సార్లు చాలా పుస్తకాలు చదివేను కృష్ణమూర్తి గారివి. అర్ధం అయినట్లే వుంటాయి, ఏదో చెప్పలేని ఆకర్షణ ఆ పుస్తకాలలో, కాని పూర్తి గా అర్ధం కాదు నాకు.. ఒక పేరా చదివి ఆపి చాలా సేపు ఆలోచన లో పడి పోతాను దానితో ఒక 10 పేజ్ లు చదివే సరికి చాలా టైం ఐపోతుంది. చాలా బాగా వివరణ ఇచ్చారు... చాలా చక్కగా వివరించారు మనసులోని భావ పరంపరను.

  ReplyDelete
 10. ఒకో సందర్భంలో కొన్ని మాటలు మన దిశనే మార్చి వేస్తాయి. అదే జరిగినది. మా స్నేహితుల మధ్య కృష్ణమూర్తి గారంటే గగుర్పాటు కలిగించే మంచి తత్వవేత్త అనే అభిప్రాయం స్థిరపడిపోయింది.
  ఆ కారణంగా నేను ఆయన రచనకు జాగ్రత్తతో దూరమయ్యా నని ఈ వ్యాసం చదివాక తెలుస్తోంది.

  ReplyDelete
 11. నాగమురళి .. ఉన్న కాంప్లికేషన్లు చాలక మీరు సారా, సీసా ఉపమానాలు తెస్తే నా బోటి వాడు సారా సీసాకోసం వెతుక్కునేందుకు పోతాడు. వెనకటికి తేగంటి బిడ్డమ్మా అంటే, నాకు తెగపెడతావా ఛస్తావా అని ఏడిచిందిట.
  All in a lighter vein.

  ReplyDelete
 12. మీరు చెప్పింది బావుంది కాని, ఒకసారి మీలాంటి ఒక శ్రేయోభిలాషి మాట విని జిడ్డు కృష్ణమూర్తి వ్యాసాలు అని ఉన్న పుస్తకం కొన్నా.
  పుస్తకం తెలుగు లోనే ఉన్నా, మహాప్రభో!! ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు. అసలు నేను చదువుతోంది తెలుగా కాదా అన్నా అనుమానం కూడా వచ్చింది. నేనేదో మామూలు నేలబారు పాటకుడిని కదా, ఎవరన్నా జ్ఞానులకిచ్చి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందామని, నేను జ్ఞాని అని నిర్ణయించిన ఒక వ్యక్తి కి ఇచ్చా. వాడు రెండు రోజుల్లో పుస్తకం తిరిగి ఇచ్చి నాకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. నేను కృష్ణ మూర్తి గారినేమి తప్పు పట్టడం లేదు. నాలాంటి నేలబారు పాటకుడికి అర్థం అయ్యే పుస్తకం ఎమన్నా ఉంటే చెప్పి నన్ను ధన్యుడిని చేయ ప్రార్థన.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.