Saturday, April 24, 2010

పద్యాలతో నా కసరత్తు!

పొద్దు వారి ఉగాది కవిసమ్మేళనానికి రమ్మని కొత్తపాళీ గారి పిలుపు రూపంలో పొరబాటున నాకో వేగొచ్చింది. నాకు ఏదీ రాకపోయినా (అది నేను చెబుతున్నా), ప్రజలు కొన్ని ఊహల్లో జీవిస్తున్నారని నాకు అ(క)నిపిస్తూనే ఉంటుంది. సరే, భరించే వాళ్ళున్నారు కదాని కొన్ని పూరణలు ప్రయత్నించేను. దాదాపు అన్నీ తప్పులతడకలే. వాటినన్నిటినీ పుల్లెల శ్యాం గారు ఓపికగా సరిదిద్దారు. అలానే కొత్తపాళీ గారు, ఆయన , బిగుసుకు పోవద్దని కొత్త ధైర్యాన్నిచ్చారు. వీరందరి ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో నేను ప్రయత్నించిన పద్యాలు ఇక్కడ. (ఇవి పొద్దులో ప్రచురింపబడలేదు).

నపుంసకమితి ఙ్ఞాత్వా ప్రియాయై ప్రేషితం మన:
తత్తు తత్రైవ రమతే హతా: పాణినా వయం ||

ఆ పద్య తాత్పర్యం : సంస్కృతంలో ’మనస్’ శబ్దం నపుంసకలింగం. నపుంసకం కదా అని మనస్సును ప్రియురాల వద్దకు పంపితే అది అక్కడే చిక్కుకుని ఆనందిస్తోంది. పాణినీ, నీ(వ్యాకరణం)చేత హతులయ్యామే!

అనువాదం:
షండమది ఉలుకదటంచు సంతసమున
పంపితి మనమును పొలతి పంచకునది
ఇంపుగ యచటే చిక్కి రమింపు రీతి
హన్త! పాణిని నన్ను నిహతుని జేసె!

("హన్త" వెనుక చిన్న కథ. హన్త (హర్షే2నుకమ్పాయాం వాక్యారంభ విషాదయోః) అని అమరం. సంతోషానికి, దయకు, దుఃఖానికి ఈ పదప్రయోగం చేస్తారట. వాక్యారంభంలో చేయాలిట. ఈ పూరణ వేగులో చూసినప్పుడు రాఘవ గారు కాస్త నవ్వుకున్నట్టు గుర్తు)

పొద్దున లెగచిన మొదలు యెద్దుల వలె
పని సలుపుచు వేళకు ఇంత తిని యెరుగని
శుష్క నగరపు జీవులు సుంత పంచ
దారను విడనాడ సుఖము తథ్యమగును

ధీటగు హీరో ’చిరు’కున్
నోటిచ్చు బాబుకునసలు నోనో అంటూ
ధాటిగ హస్తము కేలన
ఓటది నా ఇష్టమనుచు ఓటరు పలికెన్

భాసురమౌ రుక్మిణి భా
మా, సురపతికిం, గుమరుడు మదనుండు సునా
యాసముగ యుద్ధమున బా
ణాసురుఁ గేళీ విధమున నాశము జేసెన్!

ఐసు (eyes) వైడు జేసి ఐప్యాడుఁ గొనిదెచ్చి
ముదము మీర దాని ముందు జేరి
సరస సల్లపనము నెరపంగ, హతవిధీ!
పేరు గొప్ప కాని ఊరు దిబ్బ.

వసతిగ పెళ్ళిఁ చేసుకుని వాసిగ శోభనరాత్రి వేళలో
కుసుమములెల్ల జిత్తమున కోరికలై మురిపాలు గ్రోలగా
కిసలయ సౌకుమార్యమున క్రీగనులన్ నళినాక్షి చూడగా
ముసలము బుట్టదే మదిని? పూశరుఁ బాణము వాడియే సుమీ!

విధేయుడు,
రవి.

8 comments:

 1. భలే బాగా భావం ఒలికించేస్తారండీ మీరు.
  అందంగా ఉన్నాయి మీ పద్యాలు.

  ReplyDelete
 2. హ హ.. చాలా బాగా రాశారు. :)

  ReplyDelete
 3. రవి గారు, మీ బ్లాగ్‌లలో వాడుతున్న అక్షరాల ఫాంట్ ఏంటి..? నా బ్లాగ్ లో ఎంత ప్రయత్నించినా మీ బ్లాగ్‌లలో ఉన్న తెలుగు ఫాంట్ రావట్లేదు దయచేసిచెప్పగలరు..!

  ReplyDelete
 4. @కమల్:నేను వాడుతున్న మూసకు డీఫాల్టుగా ఈ ఫాంటు వుందండీ. ఏదో నాకూ తెలియట్లేదు.

  @మందాకిని గారు, @విజయ్ శర్మ గారు: నెనర్లు. విజయ్ గారు చిరకాల దర్శనం.

  ReplyDelete
 5. హ హ హ, ఐపాడు గురించి భలే చెప్పారండి, మిగతా పద్యాలు కూడా చక్కగా ఉన్నాయి.

  ReplyDelete
 6. రవి గారూ...,పొద్దు వారి ఉగాది కవిసమ్మేళనానికి రమ్మని కొత్తపాళీ గారి పిలుపు రూపంలో పొరబాటున నాకో వేగొచ్చింది. నాకు ఏదీ రాకపోయినా (అది నేను చెబుతున్నా), ప్రజలు కొన్ని ఊహల్లో జీవిస్తున్నారని నాకు అ(క)నిపిస్తూనే ఉంట_____________________ఈ రోజు నుంచి నేను బ్లాగుల్లో అధమపక్షం కనీసం వందకు తగ్గకుండా కామెంట్లు వ్రాయాలనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ మధ్య తీరికలేక నేను కామెంట్లు వ్రాయడం మానేసాను. అందుకని ఈ రో

  ReplyDelete
 7. సంతోషమండీ,
  మీ పద్యం జూసి "వసతి పెళ్ళి - వాసి శోభనం" పేరుతో ఎవైనా సినిమా తీస్తారేమో :)
  ఈ సందర్భం లో ముసలము ప్రయోగం ఉచితమేనంటారా.

  ఎందుకనో పూశరు( ప్రయోగం నాకు నచ్చెలేదండి..

  మీ నుంచి మరిన్ని పద్యాలకోసం చూస్తూ
  భవదీయుడు

  ReplyDelete
 8. @రామకృష్ణగారు: :-)...ముసలం అన్నది కాస్త బావోలేదు, కానీ వ్యావహారికంగా వాడొచ్చనిపించి అలా ఉంచేను.

  పూశరుడు - తెలుగు సంస్కృతాల దుష్ట సమాసం అనుకుంటాను. అందువల్లేనేమో కాస్త ఎబ్బెట్టుగా ఉంది. అయితే కొందరు కవులు ఇలాంటివి వాడినట్టు కనిపిస్తోందండి. వెతికిపట్టి చూడాలి.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.