Saturday, April 17, 2010

మా మంచి మాస్టారు

కృష్ణారావు మాస్టారికి ఆగ్రహమొచ్చినా, అనుగ్రహమొచ్చినా అలవి గాదు. ఆయన మాకు ఏడవ తరగతిలో ఇంగ్లీషు టీచరు. మాధ్వుడు, కన్నడ యాస. మాటల్లో కస్తూరి కన్నడ సౌరభాలు గుప్పుమనేవి. తెలుగు సామెతలూ అలవోకగా జాలువారేవి. ఘంటకొట్టినట్టు పాఠం చెప్పేవారు. ఒజిమాండియస్ పాఠం, I lay in sorrow, deep distressed..అని ఆయన కంఠం ఇన్నేళ్ళ తర్వాత కూడా నా గుండెల్లో మారుమ్రోగుతోంది.

మొదటి పీరియడే ఆయనది. ఠీవిగా మడతనలగని షర్టు, నేరో ప్యాంటులోకి టక్ చేసి, కళ్ళజోడు సవరించుకుంటూ ఆయన దూరంనుంచీ వస్తూంటే, తరగతి మొత్తం కిమ్మనకుండా ఎదురుచూసేది. ఏ చిన్న తప్పూ సహించేవాడు కాదాయన. వెరీ డిసిప్లిన్డ్. తెలుగులో చెప్పాలంటే, పాషాణపాకప్రభువు.

ఆరోజు - ఇంగ్లీషు నోట్సు ఎవరెవరు రాస్తున్నారో చూస్తున్నారు మాస్టారు. ఒక్కొక్కరినీ చూపించమంటున్నారు. ఎవరైనా అంతా రాసి, కాస్త మిగులబెడితే వారిని క్షమించేస్తున్నారు, మళ్ళీ రాసి తీసుకుని వచ్చి సబ్మిట్ చేయమంటున్నారు.

నా వంతు వచ్చింది. లేచి నిలబడి, "లాస్టు పాఠం మిగిలుంది సా. అదొకట్రాసేసి, రేఫు చూయిస్తా" నన్నాను. సరే అనబోతు కాసేపు పరీక్షగా నా ముఖం చూశారు. నాలో దొంగ ఆయనకు దొరికిపోయాడు. నోట్సు ఒక్కసారి తీసుకురమ్మన్నారు. తీసుకువెళ్ళాను, ఇక తప్పదన్నట్టు.

మొదటి పాఠం కొక్కిరి గీతలతో బానే ఉంది. రెండవ పాఠమూ పర్లేదు. మూడవ పాఠం సగమే ఉంది. ఆ తర్వాత మొత్తం శూన్యం. అత్త అన్నందుక్కాదు, ఆడబిడ్డ నవ్వినందుక్కోపం వచ్చిందన్నట్టు, నోట్సు రాయనందుక్కాదు, అబద్దం చెప్పినందుకాయన హర్టయ్యారు.

"తెలుగు పాఠమైతే అంత అందంగా రాస్తావోయ్? ఇంగ్లీషయితే అంత తీటా? ఒక్కసారి జవిరితే ఇంగ్లీషు మొత్తం వచ్చేస్తుంది". అన్నారు. అన్నంతపనీ చేశారు. (నా తెలుగు దస్తూరీ అప్పట్లో గుండ్రంగా బావుండేది. బోర్డు మీద తరగతి, తేదీ, పాఠం మొదలైనవి ఏవైనా రాయాలంటే నాతో వ్రాయించే వారు అందరయ్యవార్లూ). ఆయన చేతికి పని కల్పించారు. నా చెంపకు ఆయన చేయి పరమైంది. కంటికి నీరు ఆదేశంగా వచ్చింది.

అదుగో. అప్పుడు నాలో అగ్గిరాజుకుంది. తరగతిలో అందరిపైకీ ఇంగ్లీషు దస్తూరీ అందంగా ఉన్న ఒకబ్బాయితో నోట్సు అడిగేను. వాడివ్వనంటే, వాడికి జీళ్ళూ, కమ్మరకట్టలూ లంచంగా పెట్టి ఇప్పించుకున్నాను. అతడి దస్తూరీని అనుకరిస్తూ పాఠం మొదలెట్టాను. మొత్తం పది పాఠాలు పూర్తయ్యేసరికి వాడి దస్తూరీ, నా దస్తూరీ, ఒకేలా ఉంది. నా దస్తూరే ఓ పిసరు మెఱుగేమో. మూడ్రోజుల తర్వాత అయ్యవారికి నోట్సు చూపెట్టాను. ఆయన నా నోట్సు చూశారు. ఆ ఇంకో అబ్బాయి దస్తూరీ ఆయనకెఱుకే. మొత్తం చూసి సంతకం చేశారు. ఆయన పెదవి చివర ఓ చిన్న చిఱునవ్వు నేను గమనించకపోలేదు.

అక్కడితో నా పంతం ఆగలేదు. ఈ సారి మాస్టారు గొంతును, ఆయన యాసను అనుకరించడం మొదలెట్టాను. తోటి పిల్లలదగ్గర ఆయనను అనుకరిస్తూ, (గేలి చేస్తూ) కసి తీర్చుకునే వాణ్ణి. ఇది అలా పాకి, స్కూల్లో అందరికీ తెలిసిపోయింది. కృష్ణారావు మాస్టారికీ తెలిసొచ్చింది.

బడివదిలిన తర్వాత నేను ఒకచోట ట్యూషనుకు వెళ్ళేవాణ్ణి. ఆయనా మా మాస్టారే, కన్నడిగుడే. ఆయనా కృష్ణారావు మాస్టారు, మిత్రులు, బంధువులు కూడానూ. ఓ రోజు సాయంత్రం కృష్ణారావు మాస్టారు అక్కడ ట్యూషన్ లో ప్రత్యక్షమయ్యారు. ట్యూషన్ గది కాక, లోపలి గదికి నన్ను పిలిచారు. అక్కడ ఇద్దరు మాస్టార్లు, గురుపత్నులు, మరో అయ్యవారు ఉన్నారు. నన్ను కూర్చోమని, నాకు కొన్ని వేరుశనగ విత్తనాలు, ఉప్మా పెట్టారు. భయంకరమైన మొహమాటంతో రగిలిపోతున్నాను నేను. ఉన్నట్టుండి బాంబు పేల్చారు మాస్టారు.

"వీడు స్కూల్లో, నన్ను చాలా బాగా ఇమిటేట్ చేస్తాడు. ఇదో ఇప్పుడు చెయ్యరా. ఊ.." అన్నారు. నా పరిస్థితి వర్ణనాతీతం. మరికొన్ని శనగ విత్తనాలు తీసుకొచ్చి పెట్టారు గురుపత్ని.

ఇక తప్పదని, మొదలెట్టాను. మొదలెట్టాక అలా లీనమయి, ఆయన గొంతూ, హావభావాలు, ఆయన వాడే తెలుగు, కన్నడ పదాలు అన్నీ కలగలిపి చెప్పేశాను. ఓ పది నిముషాల తర్వాత ఆగింది నా ప్రవాహం. ఫెళ్ళున నవ్వు, అక్కడ మా అయ్యవార్లే కాక, వారి ఇంట్లో వాళ్ళూ, గుమ్మం పక్కన ఆసక్తిగా చూస్తున్న ఒకరిద్దరు ట్యూషన్ పిల్లవాళ్ళూ, అందరి ముఖాల్లో నవ్వు. మాస్టారు చివర్లో నాకో జామెట్రీ బాక్సనుకుంటాను, బహుమతి ఇచ్చినట్టు గుర్తు.

ఆ తర్వాత నేను మాస్టారు గారిని అనుకరించినా అందులో ఆయనను గేలి చేసే ఉద్దేశ్యం ఉండేది కాదని నాకే స్పష్టంగా తెలిసేది. ఆయన చేతిలో తన్నులు కూడా నేను తిన్నట్టు గుర్తులేదు.

**********

చాలా యేళ్ళ (20 యేళ్ళపైమాటే) తర్వాత ఓ రోజు. మా అమ్మగారి ఆబ్ధికం రోజు శ్రాద్ధకర్మలు జరుపడం కోసం, నేనూ, అన్నయ్యా మా ఊళ్ళో వ్యాసరాయరి మఠానికి వెళ్ళాము. మాతో కర్మ చేయించడానికి అయ్యవారు రాకముందే, మేము స్నానం చేసి ఎదురుచూస్తున్నాము. పురోహితులు సైకిల్లో వచ్చి, ఓ చిన్న సంచీతో దిగారు. లోతుకు పోయిన బుగ్గలూ, దళసరి కళ్ళజోడు, చిక్కి, వంగిపోయిన శరీరం. పంచెకట్టూ, పైనొక తువాలు. భుజం నుంచీ వ్రేలాడుతున్న ఉపవీతం. ఇంకెవరూ, కృష్ణారావు మాస్టారే. ఆయనా మా అన్నదమ్ములను గుర్తుపట్టారు. అప్యాయత వెనుక సంకోచం, అత్మీయత వెనుక కించిత్తడబాటూ. శ్రద్ధగా తంతు జరిపించేరు.

మాస్టారు స్కూలునుంచీ రిటయిరయ్యారు.ఇద్దరు అమ్మాయిలకు వివాహాలు చేశారు. ఆ తర్వాత జీవికకు పౌరోహిత్యం చేసేవారనుకుంటాను.

**********

మాస్టారి జవురు ఈ రోజు పొద్దునే చేమకూరి వెంకటకవి, "విజయవిలాసం" చదువుతుంటే గుర్తొచ్చింది. ఆ వెంటనే ఆయన జ్ఞాపకాలూ పరుగులెత్తాయి. జవరడమంటే, ఈడ్చి, చెంపకు ఒక్కటిచ్చుకోవడం. అమ్మణ్ణి పెదవి అందం, చివురుటాకును ఈడ్చితంతోందట.

నువ్వుఁ బువ్వు నవ్వు జవ్వని నాసిక
చివురు సవురు జవురు నువిద మోవి
మబ్బు నుబ్బు గెబ్బు బిబ్బోకవతి వేణి
మెఱపు నొఱపు బఱపుఁ దెఱవ మేను.

31 comments:

 1. touching experience

  ~sUryuDu

  ReplyDelete
 2. Ravi, Nostalgic journey through memory lines.. Thank you.

  ReplyDelete
 3. బాగా వ్రాసారు మీ జ్ఞాపకాలను.ఇప్పుడు తలుచుకుంటే ఎంతటి మధురమైన రోజులు.

  నేను స్కూళ్ళల్లో 1963 నుంచి 1972 వరకు చదివాను ఆ తరువాత కాలేజీలో. అప్పటి ఆ మాష్టార్లు కనపడితే ఇప్పుడు!!! పాండురంగ మహత్యంలో ఘంటసాల ఒక పాట పాడతారు ఎంతో ఆర్తిగా, "కనపడితే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతా నాన్నా" అని, ఆ మాష్టార్లు ఇప్పుడు కనపడితే, కలలో అయినా సరే చాలు కన్నీళ్ళతో వారి కాళ్ళు కడగాలి అనిపిస్తుంది.

  ReplyDelete
 4. This comment has been removed by the author.

  ReplyDelete
 5. ఎంత బాగా రాసారండీ
  మనసుకు హత్తుకొనేలా రాసారు
  excellent

  ReplyDelete
 6. నా చెంపకు ఆయన చేయి పరమైంది. కంటికి నీరు ఆదేశంగా వచ్చింది.
  మెము స్కూల్ లొ చదివెయ్ రొజుల్లొ ఈ వాక్యం బాగా వాడుకలొ వు0డెది.
  ఈ ఫంక్తి ఛదివాక మళ్లి ఆ రొజులు మదిలొ మెదిలాయి..........

  ReplyDelete
 7. మీ దగ్గర జ్ఞాపకాల తేనపట్టే ఉన్నట్టుంది! మొదట క్లాసుకు వచ్చే మీ మాస్టారి వేషం, ఆ తర్వాత పురోహితునిగా వచ్చినప్పుడు వారి వేషం మధ్య బాగా కాంట్రాస్టు చూపించారు.
  జవురు అన్న పదం మీ సీమ ప్రాంతంలో ఎక్కువ వాడుకలో ఉందనుకుంటాను. ఈ మధ్యనే తిరుమల రామచంద్రగారి "మన లిపి పుట్టుపోర్వోత్తరాలు" చదుతూ ఉంటే, అందులోనూ ఈ పదం తగిలింది. తిరుమలలో సంకీర్తన భాండాగారంలోంచి వేటూరి వారి శిష్యులు "చేతికి దొరికిందల్ల జవురుకొని బయటపడేశారు" అని.

  ReplyDelete
 8. @సూర్యుడు గారు, @సనత్ శ్రీపతి గారు, @శ్రావ్య గారు, @వేణూ రాం గారు, @హరేకృష్ణ గారు, @ప్రదీప్ గారు : వ్యాఖ్యలకు ధన్యవాదాలండి.

  @శివరామప్రసాద్ గారు : మీరు చదివే రోజులకు నేను పుట్టనేలేదు. :-). మా ఇంట చాలారోజులకు రాక. స్వాగతం, ధన్యవాదాలు.మీ వ్యాఖ్యలో ఆర్తి తాకుతోంది.

  @కామేశ్వర్రావుగారు : "జవురు" అన్న పదం వాడకం కాస్త ఎక్కువే. ముఖ్యంగా కన్నడ, తెలుగు కలిసి ఉన్న ప్రాంతాల్లో. మా మాస్టారి ఊతపదం అది.

  మీరో నిజం కనుక్కున్నారు. నాకే బోరుకొడుతోంది కానీ, నా జ్ఞాపకాలు అనేకం మెదులుతూనే ఉన్నాయి.ఓ పదిహేను శాతం కూడా రాసిఉండను ఇంతవరకూ.

  ReplyDelete
 9. హృద్యంగా రాసారు. నా చిన్ననాటి సంగతులూ రాసుకోవాలన్న ఆకాంక్షను మళ్ళీ రగిలించారు.

  ఈ జవురు అనే మాటను మరో సందర్భంలో వాడగా చదివిన గుర్తు.. "సంచీని చేతిలోకి జవురుకున్నాడు" ఖచ్చితంగా ఇదే కాదుగానీ, ఇలాంటిదే చదివిన గుర్తు. మీరు, ఇతర పెద్దలు చెప్పాలి.

  ReplyDelete
 10. ఎప్పుడైనా ఒకసారి ... మీ మాస్టారి ని మీరు మళ్ళీ కలిసి మాట్లాడాలని నా కోరిక .

  ReplyDelete
 11. ఆటోగ్రాఫ్...స్వీట్ మెమొరీస్!

  ReplyDelete
 12. మంచి జ్ఞాపకాలు రవి గారూ..
  >>పాషాణపాకప్రభువు
  ఇది మాత్రం బాగుంది.

  ReplyDelete
 13. చాలా బాగా రాశారు రవిగారు :-)

  ReplyDelete
 14. Fantastic - both your master's story and the poem at the end.

  ReplyDelete
 15. @చదువరి గారు: "జవురు" అంటే, "సేకరించు" అనే అర్థంలో కూడా వాడుతుంటారనుకుంటాను. సరిగ్గా తెలియదు.

  @గిరీష్ గారు, @విజయమోహన్ గారు,డాక్టర్ గారు, @రాజు గారు, @మురళి గారు, @కొత్తపాళీ గారు, @వేణూశ్రీకాంత్ గారు: ధన్యవాదాలు.

  @what to say about me: అవును. మాట్లాడాలి. చాలా మంది మా మాస్టార్లు నా పెళ్ళికి వచ్చారు. అప్పుడప్పుడూ ఇంటికి వస్తుంటారు, ఎందుకంటే, మా అత్త గారి సోదరులు (నాకు బాబాయ్ వరస) కూడా మా లెక్కల మాస్టారే.

  ReplyDelete
 16. చాలా టచింగ్ గా రాసారు..

  ReplyDelete
 17. రవి గారూ...భలే రాశారు..ఒక్కసారి నా మనసు మా స్కూలు మాస్టార్లందరి చుట్టూ తిరిగొచ్చింది...కళ్ళకొలుకుల్లో నీళ్ళు నిలిచాయ్..

  ReplyDelete
 18. అద్భుతం రవిగారు.. మీలో మంచి కథకుడు ఉన్నాడు. మీరు మరింత తరుచుగా రాయాలి మా కోసం.

  ReplyDelete
 19. రవి గారూ, ఈ టపా ఇంతవరకు చూడనేలేదు సుమండీ. ఎంత బాగా రాశారు! కళ్ళు చెమ్మగిల్లాయి. మీరు రాసే టపాలన్నిటిలోనూ మీ జ్ఞాపకాల టపాలే మిగతా అన్నిటికన్నా హత్తుకునేలా ఉంటాయి. మీరు అర్జంటుగా మీ చిన్ననాటి సంగతులన్నీ రాయడం మొదలుపెట్టాల్సిందే. అవి పుస్తకరూపంలో కూడా రావాలని నా ఆకాంక్ష. నాలాంటి పాషాణహృదయులకి అవి Chicken soup for the soul లాగా పనికొస్తాయి.

  ReplyDelete
 20. చాలా బాగా రాసారు రవి గారూ!!

  ReplyDelete
 21. kammara kattalu ante entandi ... sorry i was brought up in hyd ...dont know what it is ??!!

  ReplyDelete
 22. కమ్మరకట్ట అంటే బెల్లపు పాకం తో చేసిన ఒక చిన్న ఉండ. ఎలా చేస్తారో నాకు తెలీదు కానీ, ఎర్రగా ఉండేది. ఇప్పుడవి దోరకవనుకుంటాను.

  ReplyDelete
 23. కమ్మరకట్ - జీడి ఒకటే అనుకుంటా
  జవురు - పెన్సిల్ కొన చెక్కడాన్ని అంటారనుకుంటా

  అనంతపురంలో మీదే వూరో తెలుసుకోవచ్చా?

  ReplyDelete
 24. మేముండేది అనంతపురం పట్టణమేనండి.

  ReplyDelete
 25. కళ్ళు చెమర్చాయి.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.