Wednesday, March 24, 2010

ప్రపంచం చాలా చిన్నది

కొన్నేళ్ళ క్రితం, నా జీవితంలో వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన ఓ రెండు సంఘటనలు.

మొదటిది.

ఓ ప్రాజెక్టు నిమిత్తమై ఇండోనేషియా కు వెళ్ళాను. అక్కడ నా పనిలో భాగంగా ఓ కొరియన్ మార్కెటింగు మేనేజరుతో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. ఉంటుందా, ఊడుతుందా అన్న ప్రాజెక్టు అదృష్టవశాత్తూ, అనుకున్నదానికన్నా బాగా వచ్చి, విజయవంతమయింది. ఆ మానేజరు మాతో చాలా ఆప్యాయంగా వ్యవహరించేవాడు. (కొరియా వాళ్ళు పని తప్ప మిగిలిన విషయాలు మామూలుగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నా, వారి ప్రవర్తనలో diplomacy తప్ప అప్యాయత ఉండదు) చివరి రోజు ఆ కొరియా ఆయన మాకు ఓ పార్టీ ఇచ్చాడు. పార్టీలో ముచ్చటిస్తూ, ఆయన ఓ వింత కథ చెప్పాడు. ఆ విషయం కొరియా సంస్కృతికి సంబంధించిన చిన్న అంశం.


వందల సంవత్సరాల క్రితం భారతదేశం, అయోధ్యానగరానికి చెందిన ఓ రాకుమారి, పడవలో సువర్ణద్వీపానికి బయలుదేరింది. ప్రయాణం మధ్యలో తుఫాను రావడంతో, పడవ తలక్రిందులయింది. ఆమె దొరికిన ఓ చెక్కముక్కను పట్టుకుని ఎలాగోలా ప్రాణాలు దక్కించుకుంది. అలా ఆమె ఓ తీరం చేరుకుంది. అది కొరియా దేశంలోని తీరం. అక్కడ ఆమెను ఎవరో రక్షించి, రాజు గారికి తెలిపారు. రాజు ఆమెను చేరదీసి, ఆమెకు ఏ లోటు రానివ్వకుండా, ఘనంగా చూసుకున్నాడు. ఆ రాజుకు, ఆ దేశ ప్రజల అభిమానానికి మెచ్చి, ఆ రాకుమారి, అతణ్ణే పెళ్ళాడి, అక్కడే స్థిరపడిపోయింది. ఆమెకు, ఆ రాజుకు పుట్టిన వంశం "కిమ్" అన్న పేరుతో పిలువబడ్డారు. (కొరియాలో అడుగుకు ఓ పదిమంది "కిమ్" లు, ఓ ఐదు మంది "లీ" లు, మరో మూడు మంది "పార్క్" లు తారసపడతారు. అయితే అందరు "కిమ్" లు ఆ రాకుమారి వంశస్థులు కారు. ఏదో ఒక్క "కిమ్" వారు మాత్రమే ఆ రాకుమారి వారసులు). రాకుమారి, ఆ దేశపు రాణి గారు కదా! రాణి గారిది భారతదేశం కాబట్టి, భారతీయులను "cousins" అన్నదమ్ముల్లా భావించమని రాజు ఆజ్ఞ జారీచేశారు. అప్పటి కథ ప్రకారం కొరియనులు, భారతీయులు, సహోదరులు అని ఓ భావన.


మాకు పార్టీ ఇచ్చినాయన పేరు మీరు ఊహించగలరనుకుంటాను.

ఇంతా చెప్పి, ఆయన ఓ చిన్న ట్విస్టు ఇచ్చాడు. అయోధ్య అనే నగరం ఒకటి థాయిలాండులో ఉన్నదట. ఆ రాకుమారి థాయిలాండు దేశానికి కూడా చెందినది అయి ఉండవచ్చు అని ఓ మెలిక పెట్టాడు. అయితే మాపట్ల అతడి ప్రవర్తన, అతడిమనసును మాకు చెప్పకనే చెప్పేది

*******************************************************************

ఇంకో కథ.


ఈ సారి మరో ప్రాజెక్టు, మరో దేశం, యెమెన్.

ఈ సారి మార్కెటింగ్ అధికారి పేరు అహ్మద్. ఆ దేశస్థుడే. యువకుడు, అందగాడు, పనిరాక్షసుడు, పనిలో ఏ చిన్న పొరబాటూ సహించనివాడూ. ఈతడితో కలిసి పనిచేసేప్పుడు ఆసక్తికరమైన విషయాలు చెప్పేవాడు.

నేను యెమెన్ లో ఉన్నప్పుడు మా ఆవిడకు నాలుగో నెల.


ఈ యెమెన్ లో తిండి విషయంలో మాకు ఏ లోటూ రాలేదు. నేనూ, నా మిత్రుడూ, శాకాహారులమైనా, అక్కడ మాకు మంచి రుచికరమైన చపాతీలు, రోటీలు (భట్టీలో గోడలకు తాపించి తయారు చేసినవి), కూర (ముషక్కల్ ఆధి (అరబ్బీ) - శాకాహారపు కూర) దొరికేది. బయట కిరాణా కొట్లలో కూడా చపాతీలు దొరికేవి. ఒక చపాతీ భారతదేశ రూపాయల్లో ఒక రూపాయి. ఓ రోజెందుకో మా ఆవిడ యెమెన్ నుండీ వస్తూ ఆ చపాతీలు పట్టుకు రమ్మని చెప్పింది. ఈ విషయం నేను అహ్మద్ కు మాటవరసకు చెబితే, తనన్నాడు. గర్భవతుల కోరిక ఎటువంటిదైనా నెరవేర్చాలి. అతడికో చెల్లి. ఆమె చూలాలుగా ఉన్నప్పుడు, ఓ రోజు పుచ్చకాయ (కళింగడి) తినాలనుందని కోరిందట, అహ్మద్ ను. అప్పుడు ఆ ఫలాల సీజన్ కాదు. అయినప్పటికీ ఈ అబ్బాయి ఎక్కడెక్కడో వెతికి ఏవో తిప్పలు పడి ప్రయత్నాలు చేశాడుట. చివరికి పుచ్చకాయ దొరకలేదట. ఆ తర్వాత అహ్మద్ చెల్లెలికి ఓ పాపాయి పుట్టిందట. ఆ పాపాయి కడుపు మీద కాస్త ముదురు రంగు చార, ఆ చార మీద అక్కడక్కడా నల్లటి చుక్కలు. (పుచ్చకాయ రూపులో) ఈ ఉదంతం చెప్పి, చివర్లో అహ్మద్ "గర్భవతులకు రెండు హృదయాలు ఉంటాయి. ఒకటి తనది, రెండవది కడుపులో పెరుగుతున్న పాపాయిది" అంటూ ముక్తాయించాడు.


ఆ తర్వాత కొన్ని నెలలకు రఘువంశకావ్యం చదువుతుంటే, అందులో "దౌహృదా" అన్న ప్రయోగం చూశాను. దిలీపుడి భార్య సుదక్షిణా దేవి గర్భవతి అయినప్పటి సన్నివేశంలో. "దౌహృదా" అంటే - రెండు హృదయాలు కలది అని అర్థం.

ఎక్కడి అరబ్బు? ఎక్కడి భారతదేశం?


(ఇంతకూ నా విషయం ఏమైందంటే, నేను ఆ చపాతీలు పట్టుకు రాలేదు, మా ఆవిడకోసం. మా పాపాయికి చారలవీ రాలేదు కానీ.....ఈ క్రింద బొమ్మ చూడండి.
.....అదీ కథ. దానికి చపాతీల పీట, అప్పడాలకర్ర చూస్తే, ఆవేశం ఆగదు.)

ఓ చిన్న విషయం చెప్పి ముక్తాయిస్తాను. ప్రపంచంలో మనిషికి మనిషికి మధ్య, భాష, సంస్కృతి, సంప్రదాయము, రంగు, మతం ఇలాంటివాటికి అతీతంగా ఏదో రకమైన అనుబంధం ఉందని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటూంది. (It may sound sentimental & romantic, but it gets revealed to us few times magically) దీనికి దృష్టాంతాలు మనం వెతికి చూస్తే కనబడుతూనే ఉంటాయి.

28 comments:

 1. రవి గారూ ! బాగుందండోయ్ మీ టపా !!

  ఇంతకీ మీ అమ్మాయికి అప్పడాల కర్ర మీద 'అంత ' మోజు పెరగటానికి కధలో విషయం మాత్రమే కారణం అంటారా? "గిన్నీస్ బుక్కంటే మాటలా" - కాదా?

  సనత్ కుమార్

  ReplyDelete
 2. హృద్యంగా రాశారు. మీకు గుర్తుందా, పంచతంత్రంలో ముంగిస కథ వేల్సులోని బెడ్గెలర్ట్ గ్రామంలో కుక్క కథా ఒకేలా ఉంటాయని ఒకసారి బ్లాగులో రాశాను! (http://nagamurali.wordpress.com/2009/02/12/%E0%B0%88-%E0%B0%95%E0%B0%A5-%E0%B0%8E%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%A1%E0%B1%8B-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE/)

  పరుచూరిగారన్నట్టు ’subject of cultural transmission(s)’ చాలా పెద్ద పరిశోధనాంశం.

  దౌహృదా అన్న పదానికి అర్థం ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది. అద్భుతమైన టపా. ఈసారి మనం కలిసినప్పుడు మీ చిట్టితల్లి చేత చపాతీలు వేయించుకోవాలి.

  ReplyDelete
 3. మొత్తానికి మీ పాపాయి ఘటికురాలే, పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్టు, అప్పుడే అప్పడాల కఱ్ఱ ప్రాశస్త్యాన్ని గ్రహించింది. :-)

  "ప్రపంచంలో మనిషికి మనిషికి మధ్య, భాష, సంస్కృతి, సంప్రదాయము, రంగు, మతం ఇలాంటివాటికి అతీతంగా ఏదో రకమైన అనుబంధం ఉందని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటూంది."

  నిస్సందేహంగా ఉంది! ఎంత ఎక్కువ ప్రపంచాన్ని చూడగలిస్తే అంతగా అది స్పష్టపడుతుంది.

  ReplyDelete
 4. అద్భుతం. చదవడం ముగిసేప్పటికి కంటిలో చిన్న తడి .. ఎంత సున్నితమైన విషయాన్ని ఎంత చక్కగా రాశారు!

  బైదవే, నేను వివిలో చదువుకునేప్పుడు, నా ప్రయోగశాల్లో తోటి పరిశోధకుడు (ఇంకో కిం) ఇదే కొరియన్ కథ చెప్పాడు నాక్కూడా. బైదవే, ఆ రాజకుమారి రాజచిహ్నం రెండు చేపలు అని కూడా చెప్పాడు, అయోధ్య సంగతి చెప్పలేదు. పాండ్యుల ఆడబడుచేమో ననుకున్నాను నేను.

  ReplyDelete
 5. మన పెళ్ళిళ్ళ లో అక్షిమ్థలకి(రైస్) కి ఎంత ప్రాముఖ్యము ఉన్నదో క్రిస్తియనులకు పెళ్ళిళ్ళ లో అంతే ప్రాముఖ్యము. మన సంప్రదాయం లో ఒడుగు కి ఎంత ప్రాముఖ్యమో జూఇష్ వాళ్లకి అటువంటిదే 'బార్మిశ్వ' ఉంది.
  ఎక్కడ మానవులు ఉన్నా వాళ్ళు ఒకవిధం గానే ఆలో చిస్తారేమో. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

  ReplyDelete
 6. కొరియా వాళ్ళకి సంబంధించిన కధ నేను విన్నాను.. అయితే కొన్ని మార్పులు.. ఆ రాకుమారిది తమిళనాడు.. ఆవిడని పెళ్ళి చేసుకోవడం వల్ల, కొరియన్ భాషలో కొన్ని తమిళ పదాలు కూడా చేరాయి.. ఇది మా Manager చెప్పారు..


  దౌహృదా గురించి ఇప్పుడే వినడం.. మీ పాప చపాతీలు చేయడం మాత్రం సూపర్!

  ReplyDelete
 7. చాలా బాగా రాసారు. Touching

  ReplyDelete
 8. వసుధైవ కుటుంబం భావన కనిపిస్తుంది ఈ టపాలో...

  ReplyDelete
 9. >>>
  ప్రపంచంలో మనిషికి మనిషికి మధ్య, భాష, సంస్కృతి, సంప్రదాయము, రంగు, మతం ఇలాంటివాటికి అతీతంగా ఏదో రకమైన అనుబంధం ఉందని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటూంది.
  >>>

  Agreed

  ReplyDelete
 10. చక్కగా రాశారు.
  నేను చేస్తున్న చపాతీలను తినాల్సిందే ,తినకపోతే నా ప్రక్కనే ఓ ఆయుధముంది చూడండి.

  ReplyDelete
 11. ప్రస్తుత వాతావరణంలో ఈ టపా చదూతూంటే ఎంతో హాయిగా ఉంది. చుట్టూ ఎర్రటి ఎండ.. మీ టపా చల్లటి నీడనిచ్చే పెద్ద చెట్టు. ఎండనపడొచ్చి, చెట్టునీడన కూర్చున్నట్టుంది.

  పైగా, చపాతీలు చేసిపెట్టేందుకు పూటకూళ్ళమ్మ కూడా ఉంది.

  ReplyDelete
 12. How precious ?

  చాలా నచ్చింది !! నాలాంటి పాషాణ హృదయ కూడా మా బుల్లెమ్మ వచ్చాకా, ప్రతీ భావనా అపురూపం, అబ్బురం అంటూ అనుభూతిస్తున్న సమయంలో, ఈ టపా ! మీ బుజ్జెమ్మ ఫోటో చూసి, అక్కడ మా బుల్లెమ్మ ని కూడా వీక్షించి, ఆనందంతో వొళ్ళు పులకరించింది. ధన్య హో బ్లాగాగ్ని గారు.

  ReplyDelete
 13. వావ్ ! నాకు చాల నచ్చిందండి మీ టపా .

  ReplyDelete
 14. @సనత్ గారు: ధన్యవాదాలు. :-). కారణం భవిష్యత్తులో తెలుస్తుంది లెండి.

  @మురళి గారు: అవును. ఆ కథ చదివాను. మీరు వ్రాసిన కొన్ని రోజులకే ఎక్కడో అదే విషయం గురించి ఏదో చదివాను. ఇప్పుడు నా అయోమయం బుర్రకు ఎంత తన్నుకున్నా, ఏం చదివానో గుర్తు రావట్లేదు. ఇలాంటివి పరిశోధిస్తారని, పరిచూరి వారు చెప్తేనే తెలుస్తూంది.

  @కామేష్: పువ్వు "పరిమళిస్తే" మంచిదే. పువ్వు "ఆయుధం" మీద మోజు పడితే ప్రమాదం. :-). ఈ కాన్సెప్టు ఏదైనా సమస్యాపూరణకు పనికి వచ్చేరకంగా కనిపిస్తోంది.

  @కొత్తపాళీ గారు, @మేధ గారు: కొవ్వలి సత్యసాయి మాస్టారు గారు ఈ విషయం చెప్పారా అని డవుటొస్తోంది. ఆ రాకుమారి పాండ్యుల ఆడబడుచే అయి ఉండాలి. అయితే కిమ్ మాకు థాయిలాండ్ అయోధ్య గురించి ఏదో చెప్పినట్టు గుర్తు. నిజానికి పుస్తకం లో తమ్మినేని యదుకులభూషణ్ గారు ఈ థాయిలాండ్ అయోధ్య గురించి చెబితే నాకు ఈ టపాలో విషయాలు గుర్తొచ్చాయి.

  @రాణి, @లక్కరాజు, @మంచుపల్లకీ,@రవిచంద్ర,@లక్ష్మినారాయణ @శ్రావ్య, @తృష్ణ గారలు : ధన్యవాదాలండి.

  @విజయమోహన్ గారు: ఆయుధ ప్రయోగము, ఉపసంహారము రెండు చెప్పాలండి. :-)

  @చదువరి గారు: ధన్యోస్మి. మీ ఒక్క వ్యాఖ్య ఎంతో చెప్పింది. నీళ్ళకఱువు సీమ వాణ్ణండి. ఎండలో నీడ, చలివేంద్రం విలువ నాకు బాగా తెలుసు.

  ReplyDelete
 15. Ravi
  Good one.. really liked it

  ReplyDelete
 16. చాలా బాగా రాశారు రవి గారు. అధ్బుతమైన టపా. చివరిపేరాలో చెప్పిన మనిషికి మనిషికి మధ్య అన్నిటికీ అతీతంగా తెలియని బంధం ఏదో ఉంటుంది అన్నది చాలా నిజం. ఇది అనుభవిస్తే కానీ అర్ధం కాదు. టపా కదిలించివేసింది.

  ReplyDelete
 17. Excellente! చివరి రెండు వాక్యాలు అనిర్వచనీయమైన అనుభూతికి గురు చేశాయి. ఏ విషయమైనా కులం, మతం, భాష, రంగు ప్రస్తావన లేకుండా మాట్లాడలేని ఈ రోజుల్లో ఇలాంటి విషయాలను పట్టి చూపిస్తూన్న మీకు నా అభినందనలు.

  ReplyDelete
 18. చాల బాగా రాసారు అండి

  ReplyDelete
 19. రవి గారూ!

  పిడకలవేట అనుకోకపోతే అట్లకర్ర అంటే అప్పడాల కర్రేనా? నాకు అట్లకాడ తెలుసు కానీ అట్లకర్ర తెలీదు.

  నా దృష్టిలో అట్టును తిరగేసేది అట్లకర్రో/ అట్లకాడో గానీ చపాతీ ఏ రకంగా అట్లగ్రూపులోకి రా గల్గుతుంది?

  ప్రపంచం చిన్నదే గానీ నా ఈ సందేహం చాల పెద్దగా కనిపిస్తోందేమిటి చెప్మా??

  సనత్

  ReplyDelete
 20. @సనత్ గారు: ఇది forced error. మా ఆవిడ అట్లకర్ర అని పిలుస్తుంటే, నాకు ఇదే అనుమానం వచ్చింది. ఆమెను అడగలేదనుకోండి. :-)

  ఇక్కడ ప్రయోగించి చూస్తే, నిజానిజాలు తెలిసిపోతాయికదా అని ఇక్కడ ప్రయోగించాను ఇలా. ఎవరైనా దీనిగురించి చెబుతారేమో అనుకున్నాను. మీరు చెప్పారు. అది అప్పడాలకఱ్ఱే. మారుస్తున్నాను.

  @బాబా గారు, @సుజాత గారు, @హారిక గారు, @Ganesh, @వేణూశ్రీకాంత్: ధన్యవాదాలు.

  ReplyDelete
 21. నువ్వెవరైనా నేనెవరైనా
  నీ నా నవ్వుల రంగొకటే,
  ఊరేదైనా పేరేదైనా
  మన ఊపిరిగీతం ఒకటే
  అలలన్నిటికీ కడలొకటే,
  నదులన్నిటికీ నీరొకటే,
  మనసు తడిస్తే
  నీ నా చెంపల తడిమే
  వెచ్చని కన్నీరొకటే...

  నువ్వెవరైనా, నేనెవరైనా...

  ReplyDelete
 22. ఒకరికొకరు అతి దూరంలో ఉండి, కలుసుకోవడానికి ఏ మాత్రం అవకాశం లేని రోజుల్లో (రాతి యుగం ముందు నుంచే) కూడా, వివిధ ప్రాంతాల మనుష్యులు ఎన్నో సామ్యతలు ప్రదర్శిస్తూ వచ్చారు.The authority on this subject is considered to be Claude Lévi-Strauss, who recently passed away at the ripe age of 100. You can check him out through this link.

  -మురళి

  ReplyDelete
 23. మీ బ్లాగ్ అదిరింది...
  ముఖ్యంగా తెలుగు లో ఈ విధంగా మీ అభిప్రాయములు వ్యక్త పరచాటము చాలా బాగుంది...

  ReplyDelete
 24. Superb!చాలా హృద్యంగా, చక్కగా రాశారు.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.