Sunday, March 21, 2010

సంస్కృత సాహిత్యంలో పేరడీలుసరస్వతి అమ్మవారు బంతి ఆడుతున్నారు. ఆ తల్లి బంతి ఆడుతున్న తీరు ముగ్గురు ఉద్దండులైన సంస్కృతకవులిలా వర్ణిస్తున్నారు(ట).

దండి:

ఏకో2పి త్రయ ఇవ భాతి కందుకో2యం కాన్తాయాః కరతలరాగరక్తరక్తః |
భూమౌ తచ్చరణనఖాంశుగౌరగౌరః స్వస్థః తన్నయనమరీచినీలనీలః ||

అయం కన్దుకః = ఆ బంతి (సరస్వతి చేత ఆడబడుతున్నయట్టిది)
కరతలరాగరక్తరక్తః = (ఆమె) కరతలము యొక్క శోణవర్ణం చేత శోణవర్ణం దాల్చినదై
భూమౌ = భూమి యందు (భూమి దిశగా వెళ్ళినప్పుడు)
తచ్చరణనఖాంశుగౌరగౌరః = (ఆమె) పాదం గోరు తాలూకు ధవళవర్ణం చేత ధవళ వర్ణం సంతరించుకున్నదై
స్వస్థః = పైకి ఎగసినపుడు
తన్నయనమరీచినీలనీలః = (ఆమె) కనులనబడే ఇంద్రనీలమణుల నీలము చేత నీలము కాబడి
ఏకః అపి = ఒకటి అయిననూ (ఒక్క బంతే)
త్రయ ఇవ = మూడు (బంతుల) వలే
భాతి = ప్రకాశించుచున్నది.

భవభూతి:

విదితం నము కన్దుక తే హృదయం దయితాధరసంగమలుబ్ధ ఇవ |
వనితాకరతామరసాభిహతః పతితఃపతితః పునరుత్పతసి ||

కన్దుక = ఓ బంతీ!
తే హృదయం = నీ హృదయము
దయితాధరసంగమలుబ్ధః ఇవ = వనితాధరచుంబన మోహిత అని
విదితం నము = తెలుసుకున్నానోయి.
(అందుకనే)
వనితాకరతామరసాభిహతః = పద్మముల వంటి వనిత కరముల చేత కొట్టబడి
పతితః పతితః (అపి) = మాటి మాటికి క్రిందపడుచున్ననూ
పునరుత్పతసి = తిరిగి ఎగురుచున్నావు!

కాళిదాసు:

పయోధరాకారధరో హి కన్దుకః కరేణ రోషాదభిహన్యతే ముహుః |
ఇతీవ నేత్రాకృతిభీతముత్పలం స్త్రియాః ప్రసాదాయ పపాత పాదయోః ||

(ఈ శ్లోకం నాకు ఖచ్చితంగా అర్థం కాలేదు. అయితే నాకు అర్థమైనది వ్రాస్తున్నాను. భావం ముందుగా: సరస్వతి అమ్మవారు పయోధరాకారంలో ఉన్న బంతిని రోషంతో నేలకు కొడుతున్నారు. ఆ అదటుకు ఆమె తలలో తామర పువ్వు జారి ఆమె పాదాలపై బడి శరణు వేడింది. భయం ఎందుకంటే ఆమె పద్మనయనాలలో రోషం తనను కొడుతున్నట్టు ఉంది కాబట్టి.)

పయోధరాకారధరః హి కన్దుకః = చనుగుబ్బల ఆకారము దాల్చిన బంతి
కరేణ = చేతితో
ముహుః = మాటిమాటికీ
రోషాదభిహన్యతే = రోషంగా కొట్టబడుచున్నది.
నేత్రాకృతిభీతముత్పలం = ఆమె కనుల ఆకారంలో ఉన్న (ఆమె జడలోని) తామర
స్త్రియాః ప్రసాదాయ + ఆమె శరణు కొరకు
పాదయోః పపాత ఇవ = పాదద్వయమందు పడినది.

పైన వర్ణించబడ్ద శ్లోకాలు ఆయా కవులకు పేరడీలు. ఈ శ్లోకాలకు కర్త ఎవరో తెలియదు. (భోజప్రబంధం వ్రాసిన బల్లాలుడు అని ఊహ.)

చైత్రశుద్ధ పంచమి పర్వదినం సందర్భంగా, సరస్వతి అమ్మవారి దయకు ఎల్లరూ పాత్రులవుదురు గాక! శుభమ్.

4 comments:

 1. రవి గారూ,
  ఆఖరి శ్లోకం భావం నాకర్థమైనంతవరకు ఇది:
  పయోధరంతో పోలిక ఉన్నందువలననే బంతి మాటిమాటికీ చేతుల్తో కొట్టబడుతోందన ఆ పద్మం భావించింది. మరి తానో, తాను కూడా కన్నులని పోలి ఉంది కదా. మరి తనకేం గతిపడుతుందో అని భయంతో పాదాలమీద పడింది అని ఊహ (ఉత్ర్పేక్ష).

  ఈ శ్లోకం నాకేమీ నచ్చలేదు. భావం ఔచిత్యవంతంగా లేదు. పయోధరాలకి జరిగిన సత్కారమే కన్నులకీ జరగాలని లేదు కదా! :-D

  ReplyDelete
 2. రవి గారు,

  మొదటి శ్లోకం బాగుంది గానీ, మిగిలిన రెండూ నాకు గొప్పగా అనిపించలేదు. ముఖ్యంగా భవభూతి, కాళిదాసుల సమీపానికైనా వచ్చినట్లనిపించలేదు. వారిరువురూ పారడీ కవులకు చిక్కుతారనుకోను.

  ReplyDelete
 3. :-) :-)..

  @చంద్రమోహన్ గారు:

  ఆ పేరడీ కవి, ఆయా కవుల శైలిని కాక, వారి వారి బిరుదులను బట్టి వెళ్ళాడేమో అనిపిస్తున్నది. (దండినః పదలాలిత్యం, ఉపమా కాళిదాసః). ఆ మాత్రం సాహసానికైనా ఒడిగట్టాడు కదా ఆయనెవరో. పోతే ఈ శ్లోకాలను (ఇంకొన్ని ఇలాంటివాటిని) అడ్డుపెట్టుకుని ఒకాయనెవరో ఈ ముగ్గురు సమకాలికులని వాదం లేవదీశాడుట.

  @మురళిగారు: ఆ శ్లోకం ఔచిత్యవంతంగా లేదు మీరన్నట్టు. పయోధరం పోలికతో బంతి ఉన్నంతమాత్రాన, దాన్ని చూసి రోషం రావలసిన అవసరం ఎందుకో అర్థం కాలేదు.

  ReplyDelete
 4. నాది కూడా చంద్రమోహన్, నాగమురళిగార్ల మాటే. మొదటి శ్లోకం చాలా బాగుంది. మూడవ శ్లోకంలో వేరే అంతరార్థమేమైనా ఉందేమో అని మాత్రం చిన్న అనుమానం (ఆశ) :-)
  సంస్కృతంలో పేరడీ శ్లోకాల గురించి ఇప్పుడే వింటున్నాను. నిజానికి ఆయా కవుల పేర్లతో ప్రసిద్ధమైన చాటువులు కూడా పేరడీలనే అనుకోవచ్చునేమో!

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.