Friday, February 12, 2010

భోళాతనపు ధవళవర్ణమూర్తి, మాయలమారి శ్యామసుందరుడూ!


ముందుగా కొన్నాళ్ళక్రితం గొడవ , వ్యాఖ్యలతో చదివి రండి.

మహాశివరాత్రి సందర్భంగా ఏదైనా చక్కటి పద్యమో, శ్లోకమో గుర్తు తెచ్చుకుని బ్లాగులో రాసుకుందామనుకుంటే, ఒక్క పద్యమైనా, కనీసం హలోట్యూనయినా గుర్తొస్తేనా? అదే ఆయన కాంపిటీటరు, ఆయన తాలూకు పోలీమార్ఫిక్ అవతారాల మీదయితే బోల్డన్ని పద్యాలు, ఉపమానాలూ, ఈ అమాయకపు దేముడి మీద అనవసర అభాండాలూ, దీర్ఘాలున్నూ.

అసలేమైనా అంటే అన్నామంటారు గానీ, ఈయనకు నిలువ నీడ ఉందా? ఏదో అత్తవారిచ్చిన కాస్తంత ఎడం లో ఫ్యామిలీ, ప్రమధగణాలు అందరూ సర్దుకుని ఉంటున్నారు. కట్టుకోడానికి ఓ నాలుగు జతలు బట్టలున్నాయా పోనీ ? పుట్టినరోజు పండక్కన్నా కొత్తబట్టలు పెట్టేవాళ్ళున్నారా? రెండు పూట్లా ప్లేటు మీల్స్ అయినా తింటున్నాడా? అసలు కూగూగు అన్న బేసిక్ అవసరాలే తీరకున్నా పెళ్ళాం బిడ్డల్ని ఏదోలా పోషించుకుంటూ గమ్మునుండాడే.ఈయన మీదనాండి మీ అభాండాలు?

ఓ రకంగా దేవతల్లో సమైక్య వాది గా శివయ్యనే చెప్పుకోవాలి. ఎందుకంటే చెడ్డోళ్ళూ, మంచోళ్ళని చూడకుండా, ఎగేసుకుంటూ వెళ్ళి వరాలిచ్చేదీయనే కదా. వెనకటికి రావణుడనే ఆయన అంత లావున తపస్సు చేసి, కొంపకెసరు పెట్టి, చివరికి పేగులవీ తెంపుకుని వీణ వాయించి మరీ వరాలు తెచ్చుకుంటే, నల్లటాయనేమో ఓ అవతారమెత్తి, అంతోటి వాణ్ణీ మర్డర్ చేశాడు. అదీ దేనికిట, తన పెళ్ళాన్ని ఆ పదితలకాయల రావణుడు కిడ్నాప్ చేశాడు కాబట్టి. తన పర్సనల్ ప్రాబ్లెం సాల్వ్ చేసుకోటం కోసం ఆ రావణుడంతోణ్ణి చంపి, ఆ ఘనకార్యంతోటి తన అవతారానికి అంత మార్కెటింగు తెచ్చుకున్నాడే. ఆ జాణతనాన్నేమనాలి? ఇంతా చేసి ఏమయ్యా అంటే, ఆయనకు పెళ్ళాం వెతికి పెట్టడానికి ఈయన హనుమంతుడి అవతారమెత్తవలసి వచ్చింది. తెరవెనుక సాంకేతిక సహాయం మాదీనూ, తెరవెనుక హీరో రోలూ మీదీనూ.

భృగువు అని మునులందరికీ ఓ కన్వీనర్. ఈయనా ముక్కంటే. కాబోతే ఈయన మూడో కన్ను అరికాల్లో ఉంది. (మనలో కొందరికి తలలు మోకాళ్ళలో ఉన్నట్టుగా కాబోలు) ఈ పార్టీ దేవుళ్ళలో టాప్ సీడ్ ఎవరు అని ఎంట్రన్స్ ఎక్జాం కండక్ట్ చేశాడుట ఓసారి. నాలాగ ముక్కంటే కదా అని కన్సెషన్ కూడా ఇవ్వలేదీయన శివయ్యకు. సరే వదిలేద్దాం. ఈ భృగు ఆ నల్లటాయన దగ్గరకెళ్ళి కాలితో తాపు తంతే, ఆయన చాలా తెలివిగా "మీ కాళ్ళు నా వక్షస్థలం మీద తగిలి మీకేమైనా అయింటుంది" అంటూ ఓవరాక్షన్ చేసి, ఆయన కాలుమధ్య కంటిని వత్తేశాడు. అది మామూలు కుట్రగాదండి. ఫ్యూచర్ లో భృగువు "నేను ముక్కంటే, నీవు ముక్కంటే" అని పాట పాడేసుకుంటూ వెళ్ళి ఎక్కడ శివయ్యకు మిస్టర్ యూనివర్స్ టైటిల్ ఇస్తాడేమో అన్జెప్పి, దానినడ్డుకోడానికి జరిగిన చేసిన పన్నాగం.

కథ అంతటితో పూర్తవలేదండి. ఆ కోన్ కిస్కా (క్షమించాలి) నేనున్న ప్లేసును తంతాడా అని అమ్మవారు అలిగి ఇండియాకు ఆన్సైటు కొచ్చింది. దానికా జగన్నాటక సూత్రధారి (పెళ్ళాం ఊరిళితే మొగుళ్ళు ఎలా ఫీలవుతారన్నది జగమెరిగిన సత్యం) ఫీలయినట్లు నటించి, దిగొచ్చేసి, ఆ వంకతో కాస్ట్లీయెస్ట్ దేవుడిగా స్థిరపడిపోయాడు! ఒకే దెబ్బకు నాలుగు పిట్టలు! (ఒకే దెబ్బకు ఏడు తాడిచెట్లను కొట్టినాయనకిదేం లెక్క లెండి)

వద్దులెండి, ఆ పురాణ కథలొద్దు. నేలపైకొద్దాం. ఓ నెల ముందు ధనుర్మాసం లో గుళ్ళో పూజ చేయిస్తే, కమ్మటి చక్రపొంగలి, పులిహోరా పెట్టారు అయ్యవారు. శివరాత్రికో? శివరాత్రి పేరు మీద అంటూ ఓ కమ్మటి వంటకం అయినా ఉందా? అసలు కర్ణాటకలో కన్నడ రాజ్యోత్సవ లాగా కంపల్సరీ హాలిడే అయినా ఉందా ఈ పండక్కు?

వెనకటికి అతనెవరో దొంగట. దొంగతనాలవీ చేసి, పట్టుకోడానికి జనాలెంటబడితే, మారేడు చెట్టెక్కి, తెల్లార్లూ మేల్కొని, పొద్దు గడవడం కోసం ఆకులవీ తెంపుతూ, నమిలి కిందనున్న లింగం మీద ఊస్తూ గడిపాడుట. బర్త్ డే రోజు ఈ ట్రీట్ మెంట్ దొరికినా ఏమనుకోకుండా, ఆ భక్తుడిని అనుగ్రహించాడంటే ఎంత పిచ్చి మాలోకమనుకోవాలీయన్ని? తిన్నడనే అనే ఇంకొకాయన మాంసమదీ పెట్టి, ఎంగిలి నీళ్ళతో అభిషేకం చేసి, కాళ్ళతో లింగాన్ని ముడితే, ఆతణ్ణీ ఈయన నెత్తిన పెట్టుకున్నాడు కదా. హవ్వ, హవ్వ, హవ్వ!

ఈశ్వరుడి మీద వర్ణన అంటే కాళిదాసు శ్లోకం

"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే
జగతః పితరౌ వన్దే పార్వతీపరమేశ్వరౌ"

అంతోటి శ్లోకం ఉంది కదా అంటారు కొంతమంది. జాగ్రత్తగా గమనించండి. రఘువంశం అనే ౨౩ సర్గల ప్రో-విష్ణుమూర్తి కావ్యం రచిస్తూ, మొదట ఒకేఒక శ్లోకం శివుడికి కేటాయించాడా పెద్దమనిషి. ఆ శ్లోకంలోనూ దణ్ణం పెట్టాడు కానీ, "చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ" అనే రేంజులో పొగడ్డం లేదు. ఇంకా మాట్లాడితే శ్లోకంలో మళ్ళీ అర్ధం క్రెడిట్ పార్వతికి వెళుతుంది.(ఎంతైనా "కాళి"దాసు కదా). అదే వరుసలో రెండో శ్లోకంకెళ్ళండి, "క్వ సూర్యప్రభవో వంశః క్వచాల్ప విషయామతిః" (రఘువంశమెక్కడ? అల్పబుద్ధి నేనెక్కడ) అంటూ ఓ పొగడ్త!

అంతచేసి, కుమారసంభవంలో ఈయన్ని వర్ణించకుండా, "అస్త్యుత్తరస్యాం దిశి " అంటూ హిమాలయాలతో మొదలెడతాడు కావ్యాన్ని.ఏమనుకోవాలి? శివుణ్ణి టేకిట్ ఫర్ గ్రాంటెడ్ అనుకోడం గాదా?

తెలుగుకొద్దాం. ఆయనెవరో శ్రీనాథుడట. నాపేరు పెట్టుకుని, హరవిలాసం అంటూ ఇంకొకళ్ళ కావ్యం రాస్తావా అని ఆయన్ని బొడ్డుపల్లి మాన్యాలు (శంకరగిరి లో శంకరుడున్నాడు కాబట్టి, ఆ ఊరి మాన్యాలు ఒగ్గేశాడు) పట్టించాడుగా నల్లాయన.

అలాగెలాగ? "తిరిపెమునకిద్దరాండ్రా! పరమేశా గంగ విడుము పార్వతి చాలున్" అన్నందుకు శివయ్యే
ఆయనకు శిక్ష వేశాడు అంటారా? అప్పుడయినా మన పార్టీ వాడని ఏమాత్రం పక్షపాతం లేకండా శిక్షించినందుకు శివయ్యే గ్రేటు.

తను స్మార్టు కాకపోయినా తనలను కొలిచే వాళ్ళు స్మార్తులుగా అనుగ్రహించిన ఆ భోళా శంకరుడిని ఓ చిన్న శ్లోకం ద్వారా గుర్తు చేసుకుంటున్నాను.

పాతువో నీలకంఠస్య కంఠః శ్యామాంబుదోపమః
గౌరీభుజలతా యత్ర విద్యుల్లేఖేవ రాజతే !

యత్ర - ఏ చోట
గౌరీ భుజలతా - పార్వతీదేవి యొక్క లతవంటి బాహువు
విద్యుల్లేఖా ఇవ - మెరుపు తీగ వలె
రాజతే - విరాజిల్లుతోందో
(అట్టి)నీలకంఠస్య - నీలకంఠుని యొక్క
శ్యామ+అంబుద+ఉపమః - నీలిమేఘము వంటి
కంఠః - గళసీమ
వః - మమ్ములను
పాతు - రక్షించుగాక!

చిన్న శ్లోకం అయినా కొన్ని చక్కటి చమత్కారాలున్నాయిట. శివుడు ధవళవర్ణుడు. ఆయన కంఠం మాత్రం ముదురు నీలి రంగులో ఉంది. ఆ కంఠం చుట్టూ గౌరీ (గౌరవర్ణం - పసుపు ముద్ద రంగు)దేవి తాలూకు భుజలత పెనవేసుకుంది. (కౌగిలించి ఉంది).

తెల్లటి దేహమూ, నీలిరంగు గళమూ, దాన్ని చుట్టిన పసుపు రంగు తీవెలాంటి బాహువు!

నీలకంఠుని కంఠం నీలిమేఘంలా ఉంటే, అమ్మవారి బాహులత గౌరవర్ణం లా ఉందట.

నీలకంఠుని కంఠము - శ్యామాంబుదోపమ
గౌరీభుజలత - విద్యుల్లత

ఒక ఉపమాలంకారానికి, మరో ఉపమాలంకారం - ఉపమ అవుతోంది. అదీ రెండు సార్లు.

(నెనర్లు - మృచ్ఛకటికం - బేతవోలు రామబ్రహ్మం గారు)

17 comments:

 1. పాపం ఉండటానికి ఓ మంచి కొంపైనా లేక ఎండకెండి వానకుతడుస్తున్నాడు మీ ఇంట్లో ఓగదిప్పించకపోయారూ!
  కనీసం మీ మనసులో ఇంతచోటిచ్చినా చాలు సర్దుకుంటాడు

  ReplyDelete
 2. రవీ !! అదుర్స్ !!

  హాన్నా... మాట్లాడే వాడే లేకపోతే ఈ మార్కెటింగు జిమ్ముక్కుల్లో 'మనవాణ్ణి'ఇల్లానే అంతా పక్కనపెట్టయ్యరూ....

  ఇంతకీ "తెరవెనుక సాంకేతిక సహాయం మాదీనూ, తెరమీద హీరో రోలూ మీదీనూ." కదూ...
  లైట్లూ, కెమరాలూ మనకైతే జనాలూ, నీరాజనాలూ వాళ్ళవి.. ఎంతన్న్యాయం?

  మొత్తానికి మన వాదాన్ని కూడా సమర్ధవంతంగా వినిపించారు. చెప్పండి, ఒకటీ అరా ఏమైనా తక్కువైతే ఆదిశంకరుడని మనవాడే, భాష్యాలూ, స్త్రోత్రాలూ చాలానే తెల్సు, పట్టుకొద్దాం... "చూసుకుందాం నీపెతాపమో నాపెతామో" అని ఆయన స్టైల్లో ఆయనే చెబ్తాడు.


  అదిరింది :-)
  సనత్ కుమార్

  ReplyDelete
 3. చాలా బావుంది.
  నక్కీరన్నీ తిన్నడినీ కంఫ్యూజయినట్టున్నారు. నక్కీరన్ మదుర రాజాస్థానంలో పండితుడు, శివుడి కవిత్వంలో తప్పులు పట్టినవాడు.

  ReplyDelete
 4. ఆయన బోళా తనంతో వరాలిచ్చేస్తే వరగర్వంతో మిడిసి పడిపోయే రాకాసులందర్నీ మట్టుపెట్టడానికి ఎన్నెన్ని కష్టాలు పడ్డాడో ఆ నల్లనయ్య... ఆయని ఆడిపోసుకోవడం భావ్యమా? :-)

  ReplyDelete
 5. వరాలిచ్చి మీరేమో హీరో అవ్వాలి,ఆ వరాలతో వాళ్ళు అందరినీ తిప్పలు పెడుతుంటే చూడలేక మేము తిప్పలు పడుతూ వాళ్ళను శిక్షించి మేము విలన్లు కావడమేగాకుండా మళ్ళీ మాకు అపవాదులా? హమ్మా!

  ReplyDelete
 6. @కొత్తపాళీ గారు: అవును, కన్ఫ్యూజన్ కాదు ఓవర్ కాన్ఫిడెన్స్. తప్పు సరిదిద్దినందుకు కృతజ్ఞతలు.

  ReplyDelete
 7. :-) :-) చాలా బాగుంది అండి. మరేం అస్సలు లెక్కలేదు పాపం పెద్దాయన అంటే పైగా నిందలు వూరికే కోపం వస్తుంది జాగర్త గా పూజ చెయ్యక పోతే అని.

  ReplyDelete
 8. This comment has been removed by the author.

  ReplyDelete
 9. హహ! నేర్పుగా హరిహర మూర్తిని బొమ్మలో పెట్టేసి మా విష్ణువుని అన్‌పాపులర్ చేసే పనిలో పడ్డారన్నమాట:) పడ్డవారెప్పుడూ చెడ్డవారు కారులెండి (శ్లేష ఉద్దేశ్యపూర్వకమే!).

  పాలిమోర్ఫిక్ అవతారాలు, అసలెన్ని అవతారాలెందుకు ఎత్తాల్సివచ్చిందంటారు? శివుడి తికమక పనులను సరిచేయడానిక్కాదూ?! అడ్డమైన రాక్షసులకూ పిలిస్తే వెళ్ళిపోయి పేద్ద పేద్ద వరాలిచ్చేసి తాపీగా "తాంబూలాలిచ్చేశాను... తన్నుకు ఛావండి" అన్నట్లు కూర్చుంటే దేవతల, మానవుల కష్టాలు చూస్తూ ఊరుకోలేక కాదూ అన్ని అవతారాలెత్తి కష్టపడింది! భస్మాసురునికి వరమిచ్చేసి ప్రాణం మీదికి తెచ్చుకొంటే మా విష్ణువు కాదూ మోహిని అవతారం ఎత్తి కాపాడింది. చేసిన నిర్వాకానికి సిగ్గులేకుండా తగుదునమ్మా అని మళ్ళీ మోహిని వెంట పడడం... అబ్బే మీరెన్నయినా చెప్పండి - విష్ణువు హుందాతనం శివయ్యకెప్పుడొస్తుంది? శివయ్య సమైక్య వాది కాడు. అటు దేవదేవుడిగా పూజలందుకుంటూ, ఇటు భూతనాధుడిగా సేవలందుకుంటూ, దేవతలకు అభయమిస్తూ, రాక్షసులకు వరాలిస్తూ... చివరివరకూ తను ఎటువైపో తేల్చని గడుసు వాది:) . విష్ణువుకు అంత గడుసుదనం ఎక్కడిది? తను ఎవరి పక్షమో బయటపడిపోతుంటాడు. వారి ప్రార్థనమేరకే రాక్షసులను సంహరించినా వాళ్ళ వాళ్ళ దృష్టిలో విలన్ ఐపోతుంటాడు.

  ఇదంతా వ్రాస్తుంటే నాకో పిట్ట కథ గుర్తొస్తోంది:

  శైవ వైష్ణవ బేధాలు చాలా బలంగా ఉన్న కాలంలో ఒక శైవుడైన బాటసారి దారి ప్రక్కన సత్రంలో తలదాచుకొన్నాడట. ఊరికే ఉండడం ఎందుకని సత్రం గోడపై 'సోఽహం' అని వ్రాశాడట. కాస్సేపటికి ఒక వైష్ణవుడు అక్కడికి వచ్చి అది చూసి, దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన్ను పట్టుకొని నువ్వే నేనంటాడా అని నొచ్చుకొని 'సో' ప్రక్కన 'దా' అని వ్రాశాడట. అప్పుడది 'దాసోఽహం' అయిపోయింది. శివభక్తుడది చూసి పదంముందు 'స' వ్రాసి దాన్ని 'సదా సోఽహం' చేశాడట. వైష్ణవుడు ఇంకో 'దా' చేర్చి 'దాసదాసోఽహం' చేశాడట. ఇలా ఇద్దరూ పోటీ పడి ఒకరు 'స' అనీ మరొకరు 'దా' అని వ్రాసుకుంటూ రాత్రంతా గడిపేసి, గోడను కూడా ఖరాబు చేసి, ప్రొద్దున సత్రం అధికారితో చివాట్లు తిన్నారట!

  ReplyDelete
 10. 'శివా'రెడ్డి జిందాబాద్!
  చిన్నప్పటి నుంచీ చూస్తున్నా ఎక్కడ చూసినా మా శివన్నను కించపరుస్తూ ఆ 'కేశవ'రెడ్డే పెద్ద మొనగాడన్నట్టు రాతలూ-కోతలూ!శివుడంటే నాకు ఎంత ఇష్టం అన్నదానికి తార్కాణం-'శివుడు, శివుడు, శివుడు' సినిమా చూసి చిరంజీవి ఫ్యాన్ అయిపోవడం అంత! రెండో కలాసులో నా గోల్- "తపస్సు తో మెప్పించి ఆ శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడం"

  Jokes apart- I have read in a esteemed journal from way back in 1920s that the మూలవిరాట్టు in Tirumala Hills is that of 'Shiva' and the proof for that is 'Nagabharana' on the deity.లోగుట్టు పెరుమాళ్ల కెఱుక!

  ReplyDelete
 11. @దుర్గేశ్వర గారు: దిక్కులే అంబరాలుగా కలిగినవాడు. ఆయనకేమి ఇచ్చేది?

  @సనత్ శ్రీపతి గారు: హా, చూడండి మరి. శంకరభాష్యం మొన్న ఓ పుస్తకాల షాపులో చూశాను. కాస్త భయమేసింది. మీరు కాస్త చెప్పకూడదూ?

  @రవిచంద్ర, @విజయమోహన్ గార్లు: నేనొప్పుకోను.

  @ప్రవీణ్, @భావన, @రమణ గారలు : ధన్యవాదాలు.

  @చంద్రమోహన్: :-), :-).
  పిట్టకథ బావుంది.

  ఇలాంటి డిఫరెన్సులు వద్దనేనేమో రోజువారీ కర్మలో "శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోః విష్ణుశ్చ హృదయం శివః" అనే డిస్క్లైమరు పెట్టినట్టున్నారు!

  @రాయల వారు: రాయల వారికి శివన్న మీద అంత ఇదా? :-) ’రామ రామ’.

  తిరుపతిలో ఉన్నది ఏదో అమ్మవారని నేనూ ఎక్కడో చదివినట్టు గుర్తు.

  ReplyDelete
 12. అంటే మీ బ్లాగు చదివినవారు మిత్రులు మిగిలినవారు శత్రువులనా? ఇదేమి యమోషనల్ బ్లాకుమెయిలు? నేను వచ్చిచాలాకాలమయ్యింది। మేజర్ వావర్ హఉల్ అనుకుంటే।
  ముందుగా మీ ౪౦౦౦వ మిత్రునినుండి అభినందనలు। నాకున్నంతమంది చదువరులను చేరుకోవడానికి మీకించా చాలా కాలం పడుతుంది కానీ ఇలానే కొనసాగిస్తే పర్వాలేదు।

  ఇప్పుడు టపా చదవనీయండి॥

  ReplyDelete
 13. శివ దేవుడి గురించి మీ బాధ బాగుంది. మనం ఇలా అనుకోవడమే గాని అబ్బో వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు మహా ఇదైన వాళ్ళు. రామ నామ చదివితే శివయ్య మురిసిపోతాడు, పంచాక్షరీ చదివితే రామయ్య మురిసిపోతాడు. ఒకరికి తెలియకుండా ఒకరు ఏమి చేయరండోయ్.

  ReplyDelete
 14. me writing style naku baga nachindandi..., baga humourous ga rasaru... meeku pustakalante pichani..., puranala meda itihasala meda manchi pattu undani kuda ardamoutundi..., thanks ani chala rojula taruvatha baga navvukunnanu.., idi pogadtha kadu, abhinandana matrame....

  ReplyDelete
 15. మొదటగా, రవి గారి మంచి ప్రయత్నానికి అభినందనలు.

  ఇక పోతే @ఇస్మాయిల్ & @రవి:
  Both of your points are in vogue of some people.
  1. విగ్రహం - శక్థి పీటం/అమ్మ వారు. (most famous one).
  2. విగ్రహం - కుమార (సుబ్రహ్మణ్య) స్వామి.

  From Andhrabhoomi weekly (discussion over 2 issues. Year 2002-2003. I didn't remember the exact date)
  ఇది తప్పు. శైవ మతం peakలో ఉన్న కాలంలో వారు చాలా వైష్ణవ ఆలయాలను శైవ ఆలయాలుగా convert చేయటం జరిగింది. ఈ క్రమంలో శైవ మతస్తుడైన "గణపతి దేవులు" కాకతీయ రాజ్యాన్ని (by implication 'తిరుమల ' ని) పరిపాలిస్తున్న సమయంలో దీన్ని అదునుగా తీసుకొని తిరుమలను శైవ ఆలయంగా మార్చడానికి కొందరు శైవులు ప్రయత్నించారు. But గణపతి దేవులు sensible గా ప్రవర్తించి went for a public discussion by experts. ఈ discussion లో తిరుమల పండితులు success అయ్యారు అని వేరే చెప్పనవసరం లేదనుకుంటా.

  మీకో విషయం తెలుసా: తిరుమలలో నేటికీ "ఆది శంకారాచార్యులు" నిర్ణయించిన పద్దతిలో పూజలు జరుగుచున్నాయి.
  ----

  BTW, రవి గారు, ఆర్టికల్లో బొమ్మను ఎలా create చేశారో చెబుతారా?

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.